రాజస్థాన్ అందాలు - కర్రానాగలక్ష్మి

beautiful rajasthan

 రాజస్థాన్  అందాలు చూద్దాం రారండి  ( మొదటిభాగం)

హిమాలయాలలోని యాత్రలగురించి ( కొన్నింటి గురించి ) ఈ పత్రిక ద్వారా నా అనుభవాలు పంచుకున్నాను . ఈ సారి చారిత్రాత్మక కట్టడాల గురించి వివరిస్తాను .

చారిత్రాత్మక కట్టడాలను గురించి తలచుకోగానే మనకు గుర్తొచ్చేది రాజస్థాన్ , రాజస్థాన్ అనగానే రాజులు , రాజ్యాలు , యధ్దాలు , వారి వీరోచిత గాథలు మన కళ్లముందు నిలుస్తాయి . ఒకరా యిద్దరా యెందరో , జనరంజకంగా పరిపాలించడంతో పాటు ప్రజలరక్షణే ధ్యేయంగా విదేశీ చేతిలోకి రాజ్యం పోకుండా పోరాడి చరిత్రలో నిలిచిపోయిన రాజులు గుర్తొస్తారు .

ఒక్కొక్క కోటా ఒక్కో కథ చెప్తాయి . వందల సంవత్సరాల కిందట నిర్మించిన కోటలు యిప్పటికీ పూర్వపు వైభవాన్ని దేశవిదేశాల వరకు చాటి చెప్తున్నాయంటే ఆనిర్మాణం వెనుక నున్న పనితనం గురించి వేరేగా చెప్పనవసరంలేదు . కాలాంతరంలో చాలా కోటలు నేలమట్టమయినా చాలా కోటలు యిప్పటికీ కొత్తగా , శిల్ప కళ వుట్టిపడుతూ వున్నాయి .

రాజపుతృలు అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది మొక్కవోని ధైర్యసాహసాలు , పోరాటపటిమ . 

చరిత్ర లో యెన్ని పుటల కిందకి వెళ్లినా వారి వీరగాథలే కనిపిస్తాయి . ధైర్య సాహసాలకు , రాచపౌరుషానికి రాజులే కాదు రాణులు కూడా యేమాత్రం తీసిపోరని సమయం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూనే వున్నారు . రాజస్థాన్ అంటే మనకి గుర్తొచ్చేవి పటిష్టమైన కోటలు , ఉద్యానవనాలు , రాజుల సమాధులు .   రాజస్థాన్ అంటే కోటలే కాదు , మహారాజులకు , రాణులకు ఆపత్సమయాలలో ఆదుకున్న దేవీ దేవతల మందిరాల గురించి , శాపగ్రస్థ మైన కోటలు , శాపగ్రస్థ మైన గ్రామాలూ వున్నాయి  . వాటన్నిటి గురించి తెలుసుకుందాం . ఇవే కాక యిక్కడ సరస్సులు , వన్య జీవ సంరక్షక ప్రదేశాలు , పక్షి జాతుల సంరక్షణా కేంద్రాలు కూడా వున్నాయి . అలాగే ధార్మిక ప్రదేశాలు వున్నాయి . వాటాన్నిటి గురించి ఒక్కొక్కటిగా వివరిస్తాను .

ఈ ప్రదేశాల గురించి నేను చూసినపుడు నాకు కలిగిన అనుభూతులతో మీకు వివరిస్తాను . ఇవన్నీ  మేము ఒకసారి చేసుకున్న యాత్రలు కావు . ఒక్కొక్కసారి వీలువెంబడి ఒక్కోవైపు వెళ్లి చూసేం .

పేలస్ ఆన్ వీల్స్ -------

విదేశీపర్యాటకులను యెక్కువగా ఆకర్షించేవి ఈ రాజులకోటలే , అందుకే మన ప్రభుత్వం విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు " వీల్స్ఆన్ పేలస్ " అనే రైలు సేవ ప్రారంభించింది . ఈ సేవ సెప్టెంబరు నుంచి మార్చి వరకు వుంటుంది . ప్రతీ బుధవారం ఢిల్లీ సఫ్దర్జంగ్ స్టేషన్ లో సాయంత్రం బయలుదేరి తిరిగి బుధవారం పొద్దున్న ఢిల్లీ చేరుస్తుంది . అంటే యేడు రాత్రులు యెనిమిది పగళ్లు పర్యాటకులకు రాజోపచారాలు అందజేస్తారు , పడక , భోజనం , టీ , మొత్తం ఎంట్రీ టికెట్స్ , మొదలయిన వన్నీవారే యేర్పాటు చేస్తారు . ఈ టూరుకి సుమారు ఒక టికెట్టు ఖరీదు 3350$ .

ఈ రైలు ఢిల్లీ లో బయలుదేరి - జయపూర్ - సవాయి మాధొపూర్ - చిత్తోడాఘడ్ - ఉదయపూరు - జైసెలమేర్ - జోధ్ పూరు - భరత్ పూరు - ఆగ్రాలను చుట్టి తిరిగి ఢిల్లీ చేరుతుంది .

అతి సంపన్నులకు తప్ప మిగిలిన వారికి అందుబాటులో లేనిదాని గురించిన విషయానికి యింత కంటె వివరణ అనవసరం .

మేం ఢిల్లీ లో వున్నప్పుడు రాజస్థాన్ యాత్ర మొదలు పెట్టేం కాబట్టి ఢిల్లీ లో బయలుదేరితే వచ్చే ప్రదేశాల క్రమం లోనే వివరాలు మీకందించడానికి ప్రయత్నిస్తాను .

అల్వర్-----

ఢిల్లీ కి దక్షిణం వైపుకి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వుంది అల్వర్ .

ఢిల్లీ నుంచి జైపూర్ హైవే నం 8 మీద ప్రయాణం మంచి అనుభూతిని కలిగిస్తుంది . ఢిల్లీ కి ఆనుకొని వున్న హరియాణా ప్రాంతమంతా ఈ మధ్య కాలంలో యెన్నో పెద్ద చిన్నా పరిశ్రమలు , ఐటి కంపెనీలు రావడంతో రోడ్లు బాగుపడ్డాయనే చెప్పాలి . ఢిల్లీ హరియాణా టోల్ బూతునుంచి సుమారు పదికిలోమీటర్లు ప్రయాణంచిన తరువాత భివాడి అల్వర్ రోడ్డు మీద ప్రయాణం చేసి చేరుకోవచ్చు లేదా హైవే నం 8 మీద సుమారు 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ నుంచి అల్వర్ చేరుకోవచ్చు . అల్వరు చేరుకోడానికి 30 కిలో మీటర్లు వుందనగా ఓ శిధిలమైన కోట కనిపిస్తుంది . దాని చరిత్ర తెలసుకోడానికి ప్రయత్నించినా తెలుసుకో లేక పోయేను .

క్రీస్తుశకం 1000 సంవత్సరంలో పరిపాలించిన మహరాజు స్వరాజ్ యొక్క రెండవ కుమారుడైన ఆయుష్ రాజైన పిమ్మట ' అల్పూరు ' ను తనపేరుతో కలిపి అల్వర్ గా మార్చినట్లు చరిత్ర చెప్తోంది . పిమ్మట నికుంభులు , యదువంశస్తులు , బద్గురు వంశస్థులు , నరుక వంశస్థుల పరిపాలనలో వుంది యీ రాజ్యం .

క్రీస్తుశకం 1556 లో అక్బరు సేనలను ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించిన ఆఖరు హిందూ చక్రవర్తి ' హేము ' అల్వర్ కి చెందిన బ్రాహ్మణ కుటుంబం లో పుట్టేడు .

ఆల్వర్ కోట ని ' బాలాఖిల ' అని అంటారు . క్రీస్తుశకం 1550 లో ఆరావళీ పర్వతాలలో నిర్మింపబడ్డ అతి పటిష్ఠమైన కోటలలో ఒకటిగా లెక్కిస్తారు . దీని పొడవు 5 కిలోమీటర్ల  , 1.5 కిలో మీటర్ల వెడల్పు కలిగి , కోట గోడలమీద 15 పెద్ద , 51 చిన్న బురుజులు నిర్మింపబడ్డాయి . 

మొఘల్ చక్రవర్తులు , మరాఠీ రాజులు , ఝాఠ్ లు , కచ్వా రాజుల పాలనలో వుంది బాలాఖిలా . 1775 లో రవాణా ప్రతాప్ పరిపాలనలో కూడా వుంది . 

ప్రస్తుతం ఈ కోటలో కొన్ని ప్రభుత్వపు కార్యాలయాలు , పోలీసు వారి కార్యాలయాలు వుండి ప్రజల దర్శనానికి చాలా కొద్దిభాగమే కేటాయించేరు  . ఈ కోట చుట్టూరా ఆరావళీ పర్వతాలు వుండి పచ్చని చెట్ల మధ్య వుండడం , ఈ ఖిలా కూడా కొండ మీద వుండడం తో అక్కడ నుంచి ప్రకృతి ని తిలకించవచ్చు . గాలి మనిషిని యెగుర వేసేంత వేగం తో వీయడం ఆ గాలిలో నిలుచోడం కూడా అద్భుతం గా వుంటుంది . మేం చూసినంత మేరా కోట గత వైభవాన్ని చాటి చెప్తున్నట్టుగా వుంది .

కోట ముఖద్వారం వరకు కార్లు వెళ్లేందుకు వీలుగా తారు రోడ్డు వుంది . లోపల అంతస్తులు చేరుకోడానికి యెత్తైన రాతి మెట్టలు వున్నాయి 

సరిస్క నేషనల్ పార్క్ ------

ఓ గంట కోటలో గడిపి " సరిస్క నేషనల్ పార్క్ " కి బయలుదేరేం . అల్వర్ నుంచి సుమారు 48 కిలో మీటర్ల దూరంలో వుంది ఈ నేషనల్ పార్కు . 1978 లో దీనిని టైగర్ రిజర్వ్ గా మన ప్రభుత్వం డిక్లేర్ చేసింది . దీని విస్తీర్ణం 866 చదరపు కిలోమీటర్లు .

సరిస్క దారంతా దట్టమైన అడవి , అందుకే మాప్రయాణం అడవి గుండా సాగింది . పెద్ద పెద్ద వృక్షాలు , ఆకు పచ్చని తివాసి పరచినట్లున్న దట్టంగా మొలిచిన పచ్చగడ్డి , వింత వింత పక్షికూతలతో అహ్లాదకరం కరంగా సాగుతోంది మా ప్రయాణం . మా దారికి అడ్డంగా పరుగెడుతున్న లేళ్ళు , దుప్పులు , నీల్ఘాయీ లు కనిపించగానే కారు వేగం తగ్గింది కిటికీ అద్దాలు దించి ప్రయాణించ సాగేం . కంటికి నచ్చిన ప్రదేశాలని కెమేరాలలో బంధస్తూ ప్రయాణించసాగేం . పురుగులను ముక్కుతో పొడుచుకుతింటున్న అడవికోళ్ళు కనువిందుచేసేయి . 

గుంపుల గుంపులుగా చెట్లమీద దూకుతున్న కోతులు , యెత్తు తక్కువగా వున్న చెట్ల మీద దోబూచులాడుతున్న నెమళ్ళు కనిపించేయి మా కారు నెమ్మదిగా గేటు చేరుకుంది , రిజర్వ్ ఫారెష్టు లోకి వెళ్లాలంటే ఫారెష్టు డిపార్టుమెంటు నుంచి అనుమతి పత్రం తెచ్చుకోవాలి . ప్రస్తుతం అనుమతులను రద్దు చేసేరని తెలిసింది . మరెలాగా అని అక్కడి వుద్యోగిని అడిగితే ఆ అడవిలో హనుమాన్ మందిరం వుందని అక్కడకి వెళ్లడానికి అనుమతి అక్కరలేదని , ఆ దారిలో కూడా అడవిమృగాలు కనిపిస్తాయని సమాచారం యిచ్చేడు .అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకొని తిరిగి ప్రయాణం సాగించేము .

రోడ్డు రానురానూ కాస్త సన్నగా మారింది చాలా చోట్ల వర్షప్రవాహానికి కోతకి గురై కనిపించింది . నక్కలు , కుందేళ్ళు , బారాసింఘాలు వివిధరకాలైన పక్షులు కనిపించేయి . నేషన్ల పార్కులలో కారులోంచి దిగడం చేయకూడదు . క్రూరజంతువులు దాడి చేసే ప్రమాదం వుంటుంది . బాగా వెనకాల వృక్షాలు వున్నాయి , ముందునంతా తుమ్మ చెట్లు వున్నాయి . తుమ్మ చిగురుల తింటూ కృష్ణ జింకలు , మచ్చలజింకలు కనిపిస్తాయి . సాధారణంగా ఈ తుమ్మచెట్లే నెమళ్ళు నివాసం . తుమ్మచెట్లు దట్టమయేకొద్దీ నెమలి కూతలు దగ్గరకాసాగేయి . పదుల సంఖ్యలో నెమళ్ళు , కొన్ని నాట్యమాడుతూ కనువిందు చేసేయి . మా ప్రయాణం ముందుకు సాగుతూ వుంటే అడవి దట్టంగా మారసాగింది . కొండదారి మొదలయింది . ఓ అయిదు కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ఓ పెద్ద కొండని ఆనుకొని ఆంజనేయ స్వామి కోవెల కనిపించింది . సుమారుగా వున్న కొవెల . కారులోంచి కాలు కింద పెట్టడానికి భయం వేసింది నిలువెత్తు ఎర్రమూతి కోతులు వీటిని ఆంజనేయ కోతులని కూడా అంటారు . ఆంజనేయ కోవెల దగ్గర హానుమంతు కోతులు వేల సంఖ్యలో వుండడం కూడా వింతగా అనిపించింది . చిన్నపిల్లల చేతిని గాని మెడలో గాని యీ కోవెలలో ఎర్రతాడు కట్టించడం యిక్కడ అలవాటు . దీనివల్ల పిల్లల మీద యే చెడు దృష్టి పడదని నమ్మకం . ఈ కోవెలకి మంగళవారం , శనివారం భక్తుల రద్దీ యెక్కువగా వుంటుంది . ఆ రోజులలో సరిస్కా నేషనల్ పార్కు లోనికి ప్రవేశించానికి నిర్ణయించిన ప్రవేశరుసుం రద్దు చెయ్యబడుతుంది . 

ఈ కోవెలలోని ఆంజనేయస్వామి స్వయంభూగా వెలిసేరుట . విగ్రహానికి సింధూరం పూసి వుంటుంది . సాధారణంగా ఆంజనేయ స్వామి విగ్రహం నిలుచొని వున్నట్లుగా వుంటుంది యిక్కడ మాత్రం పడుకున్న చలిగా వుండి , పెద్ద తోకను కలిగి వుంటుంది . ఈ విగ్రహం 5000 సం... లకి పూర్వంగా అని అంటారు . ఈ ప్రదేశం చుట్టూ పర్వతాలతో చిన్న చిన్న జలపాతాలతో చాలా బాగుంటుంది . 

నిర్భయ దాస్ జీ మహరాజ్ అనే ఆంజనేయుని భక్తుడు ఈ అడవిలో తిరుగుతూ వుండగా ఈ విగ్రహం చూడడం జరిగిందట . ఈ విగ్రహాన్ని యెండవానల నుంచి కాపాడడం కోసం చిన్న కుటీరం నిర్మించి పూజలు చేసుకొనే వాడుట , ఇప్పుడు సిమెంటుతో నిర్మించిన  మామూలు కోవెల వుంది . మేం వెళ్లినప్పుడు కొంతమంది కాలినడకన కొండల మధ్యనుంచి వెళ్లడం చూసి అక్కడ యేమిటివుంది అని అడుగగా పాండుపోల్ వుంది అని అన్నారు . మేం కూడా వారి వెనుకే నడకసాగించేము . కొండల మధ్య ప్రవహిస్తున్న వాగు వొడ్డునుంచి నడక సాగుతోంది కొన్నిచోట్ల వాగులోంచి నడవవలసి వస్తోంది . రెండువైపులనుంచి జలజల మని దూకుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి . కొందరు పర్యాటకులు ఆ జలపాతాలలో స్నానాలు చేస్తున్నారు . ఆ సన్న దారంట రెండు కిలో మీటర్లు ప్రయాణించేక రెండు కొండలను కలుపుతూ పెద్దపెద్ద బండలతో ప్రాకృతికంగా యేర్పడ్డ వారధి లాంటిది కనబడింది . ఆ వారధిని పాండవులు వనవాస సమయంలో ఒక కొండమీంచి రెండవ కొండ మీదకు వెళ్లే అవకాశం లేకపోవడంతో భీముడు తన గద తో కొండను కొట్టి నిర్మించినట్ల స్థానికుల కథనం . వారధి కిందనుంచి వంద అడుగుల తరువాత నడకదారికూడాలేదు . వెనుకకి తిరగవలసిందే , అక్కడ నురగలు కక్కుతూ కిందకి వురుకులు తున్న పెద్ద జలపాతం చూసి తీరవలసిందే . కొందరు పర్యాటకులకు కొండ యెక్కి ఆ వారధి మీంచి యివతల కొండమీదకి రావడం చెయ్యసాగేరు . మాకు అంత వుత్సాహం లేదు . మేం అక్కడనుంచి వెనుతిరిగి ఆంజనేయస్వామి మందిరం చూసుకొని పూజ చేయించుకొని స్థలపురాణం పూజారిని అడుగగా అతను యిలా వివరించేరు .

పాండవులు అరణ్యవాసం లో వుండగా యీ ప్రదేశంలో కొన్నాళ్లు వున్నారట , అందుకే యీ ప్రాంతానికి పాండుపోల్ అనే పేరు వచ్చిందట . భీమునికి ఆంజనేయుడు వృద్ద మారుతి వేషంలో కనబడి తనకు తన తోకను కదిపే శక్తి లేనందున భీముని తన తోకను దారి నుండి తీసి పక్కకు పెట్టమని కోరుతాడు . మామూలు కోతి అని తలచిన భీముడు తోకను యెత్తే ప్రయత్నం చేసి విఫలుడౌతాడు . అప్పుడు ఆంజనేయుడు కోతితోకను కదపలేని నీవు కౌరవులను యేమి హతమారుస్తావు అని పరిహాసమాడుతాడు . అప్పుడు భీముడు ఆంజనేయుని గుర్తించి పూజించుకొన్న ప్రదేశమట యిది . 

తిరిగి వచ్చేటప్పుడు సాయంత్రం కావడంతో వన్యజంతువులు గుంపులు గుంపులుగా తిరగడం చూసేము . ఈ సారి బంగారు రంగు నక్కలు , అడవిపందులు కనిపించేయి . 

ఇన్ని విషయాలు చెప్పి పులుల గురించి చెప్పలేదేమిటా అనుకుంటున్నారా ? , మేం వెళ్లినప్పుడు పులులు లేవని టైగర్ సఫారి మూసివేసేరు . తరవాత బెంగాల్ పులుల జంటను తెచ్చి వాటిని యిక్కడ విడిచి పెట్టటం జరిగింది . అవి పరిసరాలకు అలవాటు పడి పులులు ఒకదానికి ఒకటి అలవాటు పడి వాటికి పిల్లలు పుట్టేంత వరకు ఆ ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించలేదు . ఆ పులుల సంఖ్య పెరిగి యిప్పుడు 13 కి చేరింది . అందులో 7 ఆడపులులు , రెండు మగపులులు , నాలుగు పులి పిల్లలు వున్నాయి . ఇప్పుడు కూడా ముందుగా టైగర్ రిజర్వ్ కి వెళ్ల డానికి ముందుగా పర్మిషన్ తీనుకొని వెళ్లాలి . మొత్తం యేడాదిలో ఒకటి రెండు నెలలు మాత్రమే అనుమతిస్తారు .                 

ఇక్కడ 1700 సం.. చెందిన ' కన్కవారి ' కోట వుంది .దట్టమైన అడవిలో యెత్తైన కొండమీద వుంది . కోట చేరు కోడానికి యెత్తైన రాతి మెట్లు వున్నాయి . ఈ కోటలో ఔరంగజేబు తన సహోదరుడైన ' దారా ' ను బంధంచి వుంచేడు . చాలా మటికి యీ కోట కూలిపోయి వుంది , కోట యెదురుగా సరస్సు రెండు వైపులా అడవి , ఒకవైపున యెత్తైన కొండలు . ఆ కోట పూర్వపు వైభవం యెలా వుండేదో కదా అని అనిపించక మానదు .సరిస్కా నుంచి తిన్నగా ణ్-8 మీదకు వచ్చి గంటన్నరలో మా యిల్లు చేరుకున్నాం. 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి