అవీ - ఇవీ - భమిడిపాటిఫణిబాబు

 

 మా చిన్నప్పుడు, అంటే చదువుకునే రోజుల్లో అన్నమాట, “ పెద్దయిన తరువాత ఏమౌదామని ఉందిరా.. “ అంటే, ఏదో లోకాన్ని ఉధ్ధరించే  చదువేదో చదువుదామని, పెద్ద పెద్ద ఊహలూ, ఆలోచనలూ ఉండేవి కావు. కారణం ఆరోజుల్లో, మనకి తెలిసిన ప్రపంచమల్లా, మన ఊరూ, మన పుట్టిపెరిగిన పరిసరాలూ, మన స్నేహితులూ.. మన అమ్మా నాన్నలూనూ.. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. కానీ ఆరోజుల్లో అసలు మనకి తెలిసినదెంతంటారూ?  ఏదో రేడియోల్లోనో వినో, పుస్తకాలు చదివో తెలిసికున్నదేదో రెలిసేది. ప్రపంచం ఇంతే కాబోసు అనుకునేవాళ్ళం.. ఏదో నూటికీ,కోటికీ ఎవరో విదేశాలకి వెళ్ళేవారు. చాలామంది, వీలైనంతవరకూ, ఉన్న ఊళ్ళోనే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు. అవికూడా, ఏ టీచర్ ట్రైనింగయి తను చదువుకున్న స్కూల్లోనే. అలాగే కాలేజీ చదువులూ, ఓ డిగ్రీ సంపాదించేసి, ఏ ట్యూటరు గానో చేరిపోవడం.  ఊరు వదిలి పరాయి ఊరుకి, అదీ తమ జిల్లాలోనే, మహ అయితే బదిలీమీద వెళ్ళేవారు. ఇంక పెళ్ళిళ్ళంటారా, సాధ్యమైనంత వరకూ, దగ్గర సంబంధాలకే మొగ్గు చూపేవారు.

చదువుకునే రోజుల్లో, సినిమాహాల్లో టిక్కెట్లు చింపే గేట్ కీపరు ఓ హీరోలా కనిపించేవాడు. ఎలాగైనా సరే, పెద్దయిన తరువాత ఇలాటి ఉద్యోగం వస్తే చాలనుకునే భావంలోనే పెద్దయారు. అలాగే బస్సులో టిక్కెట్లిచ్చే కండక్టరు ఓ పెద్ద హీరోలా కనిపించేవాడు. దానికి సాయం, బాగా చదవకపోతే, ఇంట్లో పెద్దవారు.. “ సరీగ్గా చదవకపోతే, పశువులు కాచుకుని పాలేరులా అవుతావు.. “ అనే వారు.. కొంతమంది మేధావులకి ఓహో ఇదో ఆప్షనన్నమాట అనుకునేవారు. చెప్పొచ్చేదేమిటంటే, పరాయి రాష్ట్రం మాట దేవుడెరుగు, ఉన్న ఊరే వదలడానికి ఇష్టం ఉండేది కాదు. మహా అయితే, సెక్రటేరియట్ లో ఏ గుమాస్తాగానో చేయడానికి, ఏ హైదరాబాదో వెళ్ళేవారు. అలాగని తెలివితేటలకి లోటా అంటే అదీ కాదు… అభద్రతా భావం. అంతంత దూరాలు వెళ్ళి ఉద్యోగాలు చేయాలా ఏమిటీ.. బిడ్డ టైముకి తిండి తింటాడో లేదో అని అమ్మ,  హాయిగా స్వంత ఇంట్లో ఉండి, ఉన్న ఊళ్ళో ఉద్యోగం చేయడంలో ఉన్న ఆర్ధిక చిటుకులూ, మొత్తానికి ఆరోజుల్లో విరివిగా కనిపించేది. ఏ కారణం చేతైనా పరాయి రాష్ట్రానికి ఉద్యోగానికి వెళ్ళాడంటే, ఓ పెద్ద హీరోగా భావించేవారు.

రోజులన్నీ ఓలాగే ఉండవుగా.. కాలంతో పాటు మనుషులూ మారారు.   కొత్త్ర నీరొచ్చి, పాతనీరు కొట్టుకుపోయింది. ఇప్పుడు “ ప్రపంచం నీ గుప్పెట్లో..” అని ఏ ముహూర్తాన్న ఆ ధీరూభాయ్ అంబానీ గారు అన్నాడో కానీ, నిజంగా ప్రపంచం మన గుప్పెట్లోకి వచ్చేసింది.  ఒకానొకప్పుడు, కాశీయాత్ర చేయని బతుకూ ఓ బతుకేనా అనేవారు. మనిషిగా పుట్టినందుకు, జన్మలో ఒక్కసారైనా కాశీ యాత్ర చేయాలనుకునేవారు. అదే పధ్ధతిలో, పాస్ పోర్టు మీద కనీసం ఒక్క వెదేశీ  శ్టాంపైనా లేని జీవితం వేస్టు అనే భావనలో ఉన్నారు. వాడితల వీడికీ, వీడి తల వాడికీ పెట్టైనా సరే, ఎవడి కాళ్ళు పట్టుకునైనా సరే, ఒక్కటంటే ఒక్క Onsite project  కి వెళ్ళాలే.  ఓ రెండుమూడు సార్లు వెళ్ళగలిగి నాలుగు డబ్బులు కూడబెడితే చాలదండీ… మహరాజ భోగాలు అనుభవించొచ్చు.

ఓ ఫ్లాట్టూ, ఓ కారూ క్షణాల్లో వచ్చేస్తాయ. అలాగని విదేశాలకి వెళ్తున్నవారందరూ చెడ్డవారని కాదు నేను చెప్తుంట.. మనుషుల స్వభావాల్లో ఎంత మార్పు వచ్చిందో అని చెప్పడానికి. ఇదివరకటి రోజుల్లోలాగ కాకుండా, ఈరోజుల్లో ఏ పిల్లాడినీ, పిల్లనీ అడిగినా ఒకటేమాట… ఐఐటి. పైచదువులకని విదేశాలకి వెళ్ళడమే ధ్యేయం. అందరూ పల్లకీ ఎక్కేవాళ్ళే అయితే, ఇంక మోసేదెవరుంటారు? పైచదువులకి వెళ్ళడం వరకూ మంచిదే. కానీ, ఆ చదువేదో పూర్తి చేసి, తిరిగి స్వదేశానికి వచ్చి, ఆ చేసేదేదో మనదేశానికే చేయొచ్చుగా.  దానికి మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు.  అదే అర్ధం అవదు. బహుశా  విదేశాల్లో వారి చదువుకి గుర్తింపు ఉండడం ఓ ముఖ్య కారణం అయుండొచ్చు. అదీ నిజమేగా, మన దేశంలో ఓ డాక్టరీ చదివిన తరువాత, ఏ ఎండీ ఐనా చేయాలంటే, సీటు దొరకడానికి నానా పాట్లూ పడాలి. అలాగే  ఏ పోస్టు గ్రాడ్యుఏషనో చేసిన తరువాత పోనీ ఏ ప్రభుత్వ రంగ ఉద్యోగంలోనో చేరాడా, సర్వీసుని బట్టీ, తెలివితేటలని బట్టీ ఉద్యోగాలూ రావూ, అధవా వచ్చినా, ప్రమోషన్లూ రావూ.. ఈ గొడవలన్నీ భరించలేక, హాయిగా విదేశాలకే వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. చదువనేది పొట్టకూటికేగా, ఎక్కడైతేనేమిటి.

సర్వేజనా సుఖినోభవంతూ….

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి