వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

అందమైన ట్రావెర్స్ సిటీ 

అమెరికాలో మిచిగన్ రాష్ట్రంలోని ట్రావెర్స్ సిటీ చాలా అందమైన సిటీగా పేరుపొందింది.  నార్తరన్ మిచిగాన్ లో ఇది పెద్ద సిటీ.  అంతేకాదు.  యునైటెడ్ స్టేట్స్ లో చెర్రీస్ ఎక్కువగా పండించే ప్రదేశం ఇది.  ప్రతి సంవత్సరం జులై మొదటి వారంలో వారం రోజులపాటు ఇక్కడ చెర్రీ ఫెస్టివల్ జరుగుతుంది.  ఆ ఫెస్టివల్కి సుమారు 5 లక్షలమంది వస్తారుట.  ఇదే కాదు.  సందర్శకులను ఆకర్షించటానికి ఇక్కడ ఇంకా అనేక ఫెస్టివల్స్ జరుగుతూంటాయి.

చుట్టుపక్కల ద్రాక్ష కూడా బాగా పండిస్తారు.  అందుకే ఇక్కడ వైన్ తయారీ కూడా జరుగుతుంది.  అంతే కాదండోయ.  ఇక్కడ రకరకాల వైన్ లని ఫ్రీగా టేస్ట్ చెయ్యచ్చు.  అలవాటున్నవాళ్కి భలే ఛాన్సలే...కదా....మరి మనలాంటి వాళ్ళం ...  ఏం పర్వాలేదు.

ఇది చాలా సుందరమైన ప్రదేశమని ముందే చెప్పానుకదా.  ఇక్కడ హాయిగా గడపటానికి అనేక సుందర ప్రదేశాలున్నాయి.  ఫ్రెష్ వాటర్ బీచెస్, ద్రాక్ష తోటలు,  అడవులు, వీటన్నింటితో ఈ ప్రదేశం సందర్శకులను బాగా ఆకర్షిస్తుంది.  పైగా అమెరికాలో విశ్రాంతిగా గడపదగ్గ పది ప్రదేశాలలో ఇది ఒకటిగా గుర్తింపబడింది.  అమెరికాలోనివారికి వారాంతం సెలవల్లో సరదాగా గడపటం ఇష్టం.  వారంలో 5 రోజులు కష్టపడ్డవాళ్ళు సాధారణంగా శని, ఆదివారాలలో ఇలాంటి ప్రదేశాలలో అన్నీ మరచి హాయిగా గడుపుతారు.  అలాంటి వారికి స్వర్గధామం ఈ ఊరు. 

మేము  ఉదయం 7-45కి మిచిగాన్ లోని లేన్సింగ్ లో బయల్దేరి కారులో ట్రావెర్స్ సిటీ కి వచ్చేసరికి మధ్యాహ్నం 12 గం.లయింది.  అక్కడికి మా చెల్లెలుగారమ్మాయి హిమబిందు ఫామిలీ కూడా వచ్చారు.  రెండు రోజులు అందరం కలిసి తిరిగాం.  ముందుగా 13 కి.మీ.ల దూరంలో వున్న లైట్ హౌస్ కి వెళ్ళాం.  దోవలో ఒక బీచ్.  ఇంకా  చెర్రీ చెట్లు చాలా కనబడ్డాయి చెట్లనిండా పళ్ళతో.  పళ్ళు ఆరెంజ్ కలర్ లో వున్నాయి.  ఇంకా పండలేదు.  బీచ్ లో ఆడుకోవటానికి కూడా ఏర్పాట్లు వున్నాయి.

లైట్ హౌస్ దగ్గరగా ఒక చెక్క ఇల్లు.  ఈ ఇల్లు 1854-56 మధ్య మేరీ,  జోసఫ్ హెస్ లర్ అనే దంపతులచే కట్టబడింది.  వీరు ఆ సమయంలో పెనిన్సిలా దక్షిణ ప్రాంతానికి వచ్చిన సెట్ లర్స్.  పెద్ద పెద్ద పైన్ చెట్ల దుంగలను నరికి వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి గోడలు నిర్మించారు.  ఈ నిర్మాణానికి మేకులు వగైరా వాడలేదు.  ఈ కేబిన్ ని ప్రజలు సందర్శించి తమ పూర్వీకులు ఎలా నివసించారో తెలుసుకోవటానికి వీలుగా ఈ కేబిన్ ని 1992-97 మధ్య ఇక్కడికి తీసుకు వచ్చి పెట్టారు.  అప్పుడే అవసరమైన మరమ్మత్తులు చేసి, ఆ సమయంలో వారు వాడినటువంటి వస్తువులలాంటివి కొన్ని ఇక్కడ పెట్టారు.  అక్కడినుంచి లంచ్ కి వెళ్ళాము.

మధ్యాహ్నం లంచ్ చేసి ఒక వైనరీకి వెళ్ళాము.  అక్కడ ప్రొడక్షన్ లేదు.  కానీ, వాళ్ళు తయారు చేసినవాటిని టేస్ట్ చేసేవారు చెయ్యవచ్చు.  తర్వాత కొనుక్కోవచ్చు కూడా అనుకుంటా.  అక్కడ మనకి పని లేదుకదా.  అందుకే మళ్ళీ బీచ్ కి వెళ్ళాము.  అక్కడ ఆడుకోవటానికి, ఉయ్యాలలూగటానికి వీలుగా వున్నది.  వాటన్నింటినీ ఒక చూపు చూసి (అంటే వుట్టిగా చూసి కాదండీ, ఆడుకుని) అక్కడనుంచీ డౌన్ టౌన్ కి వెళ్ళాము.  ప్రతి ఊరికీ డౌన్ టౌన్ వుంటుంది.  ఇది ప్రధాన వ్యాపార కూడలి.  మనదంతా విండో షాపింగే.  ఒక షాప్ షో కేస్ లో పెట్టిన చెస్ బోర్డు పావులన్నీ సైన్యం ఆకారాలలో ఆకర్షణీయంగా కనబడింది.  అంతే..చేతిలో కెమేరా క్లిక్ మన్నది.

డౌన్ టౌన్ లో కొంచెంసేపు తిరిగాక రాత్రి భోజనం చేశాక మళ్ళీ హోటల్ కి దగ్గరలోనే వున్న లేక్ దగ్గరకి వెళ్ళాము.  చాలా అందమైన ప్రదేశం.  ఎంతసేపు వున్నా తనివి తీరదు.  కానీ విపరీతమైన చలి, పైగా మర్నాడు ఉదయం సల్వర్ లేక్ సేండ్ డ్యూన్స్ ప్రోగ్రాం వున్నది.  అందుకే ఇంక ఆ రోజుకు రెస్టు.

మరిన్ని వ్యాసాలు