సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద (గత సంచిక తరువాయి)

తనను కనికరించి, తన భయంకర రూపాన్ని  తొలగించడానికి ఆ నాటి సంకీర్తనా ఫలితాన్ని తనకు ధారపోయాలని మాలదాసరిని కోరాడు  బ్రహ్మరాక్షసుడు. ' అదేమీ కుదరదు, మర్యాదగా  నన్ను తినేసి నీ దారి నువ్వు చూసుకో. నీకు నా శరీరాన్ని తిండిగా యిస్తానని వాగ్దానం చేశాను కానీ నా పుణ్య ఫలితాన్ని ధారపోస్తానని కాదు' అన్నాడు మాలదాసరి.

మాలదాసరి పలుకులకు ఆ 'సాలకటంకట' వంశములో జన్మించిన బ్రహ్మరాక్షసుడు 'కట కటా! ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావయ్యా' అని వాపోయాడు. కైటభాంతకూడైన శ్రీహరి దాసులు పరమదయాళువులు కావలదా? అని నిలదీశాడు. యిదివరకు విశిష్టాద్వైత మతస్థాపకుడు అయిన రామానుజాచార్యులు 'పరమ రహస్యములు, జాగ్రత్త సుమా, ఎవరికి పడితే వారికి ఉపదేశింపవద్దు' అని తనకు తన గురువులు ఉపదేశించిన గీతాచరమశ్లోకమును శ్రీరంగ దేవాలయ గాలిగోపురాన్ని ఎక్కి బిగ్గరగా అరచి అందరికీ ఉపదేశించిన సంగతిని గుర్తుచేశాడు. నీకు నరకం సంప్రాప్తిస్తుంది అని గురువు అంటే 'పర్లేదు, నేను నరకంలో పడినా ఏమిటి? తిరుమంత్రములను చరమశ్లోకమును  పొందిన భాగవతులు మోక్షాన్ని పొందితే నాకు చాలు, నాకు ఏమైనా పర్లేదు' అని  రామానుజులు ఉపదేశము చేసిన సంగతిని కీర్తించాడు. ఆ రామానుజులే తన మఠానికి పాలు, నేయి, పెరుగులను తెచ్చిన గొల్లలకు డబ్బులు యివ్వ జూపితే, వారు వలదు అంటే, పరమపదాన్ని ప్రసాదించిన సంగతిని ఉదహరించాడు. ఆ రామానుజ యతీంద్రుడే 'రమ్యజామాత్రుమునియై' అర్చిరాది మార్గముద్వారా ముక్తి పదానికి  వెళ్ళడం గురించి ఎల్లరికీ బోధించిన విషయాన్ని గుర్తుచేశాడు. యింకా రానున్న కాలములో ఎన్నెన్ని రూపాలలో ఎన్నెన్ని నామాలతో ఎన్నెన్ని దివ్యదేశాలలో తన ఆధ్యాత్మిక బోధనా సందేశాలతో, శ్రీహరి పాదసేవామార్గచారులు కమ్మనే ఆదేశాలతో సకల మానవాళినీ కరుణించనున్నదీ తేటతెల్లము చేశాడు. జరిగినదీ, జరుగుతున్నదీ,జరుగనున్నదీ అంతా 'మా' జాతివారికి సులభముగా తెలిసిపోతుంది కనుక ఈ విషయములను గురించి తెలుపగలుగుతున్నాను. మాకు తపస్సు, శమ దమాదులచే సంపాదించుకున్న పుణ్యం దుర్లభం. కనుక ఈ దుర్మార్గవర్తనకు రక్తిని గొలిపే వికృత రూపాన్ని దూరము చేసి నన్ను కరుణింపకుంటే నీ భాగవత కులానికే తీరని మచ్చ అవుతుంది అన్నాడు. 

ఈనాటి సంకీర్తనా ఫలితంలో పాతిక పాలైనా నాకు యిచ్చి నన్ను కురుణింపుమని మాలదాసరి పాదాలమీద పడ్డాడు బ్రహ్మరాక్షసుడు. ససేమిరా వీలుకాదు అన్నాడు మాలదాసరి. మరింతగా విలపిస్తూ మాలదాసరి పాదాలను పట్టుకుని వదలకుండా ' ఈ నాడు నీవు పాడిన ఆఖరి కీర్తనా ఫలితాన్నైనా నాకు ధారబోయా'లని పైకి లేవకుండా మొండిపట్టు పట్టాడు బ్రహ్మరాక్షసుడు. యిక చేసేది లేక, కాదనలేక,  అలాగేలే, ఈనాడు నేను చేసిన సంకీర్తనలో ఆఖరిగా పాడిన కీర్తనను నీకు ధారబోస్తానులే, లెమ్మని బ్రహ్మరాక్షసుడిని లేవనెత్తి, ఆతనికి ఆ భయంకర రూపం ఎలా వచ్చిందో వినాలని ఉన్నది అన్నాడు మాలదాసరి. అలాగే తన కథను చెప్పడం  మొదలెట్టాడు బ్రహ్మరాక్షసుడు. ఉండుదుఁ
 

జోళభూమి నొకయూర గళల్పదునాల్గు నేర్చి వా
క్చండిమఁ జర్చ గెల్తు ఘటశాసుల శ్రౌతులఁ దప్పు వట్టుదున్ 
ఖండల ముష్టి విప్పఁ గని నవ్వుదు వెండి ప్రయోక్తల న్సుధీ
మండలిగ్రాంథికత్వ మవమానము సేయుదు జల్పవాదినై 

చోళ దేశంలో ఒక ఊరిలో ఉండేవాడిని. పదునాలుగు కళలలో(విద్యలలో) నేర్పరిని. నాలుగు వేదాలు, శిక్ష, వ్యాకరణము, కల్పం, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అనే) ఆరు వేదాంగాలు, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మ శాస్త్రము అనే నాలుగు, మొత్తము కలిపి పదునాలుగు, ఈ పదునాలుగు విద్యాస్థానాలు అని పిలువబడుతాయి. ఈ పదునాలుగు విద్యలనూ నేర్చినవాడిని అని చెప్పుకుంటున్నాడు. తర్కములో తార్కికులను నా ప్రచండమైన వాక్పటిమతో గెలిచేవాడిని. శ్రౌత కర్మలను చేసేవారి స్ఖాలిత్యాలను, అపభ్రంశాలను ఎత్తి చూపించేవాడిని. షోడశ కర్మలకు అధికారులైన వారిని, కారికలు, వార్తికాలు మొదలైన సంచులను విప్పెవారిని, శాస్త్రాలు చెప్పేవారిని, విద్వాంసుల రచనా నైపుణ్యాన్ని గేలిచేసేవాడిని. యిలా పెద్దలందరినీ అవమానించేవాడిని. చులకనగా మాట్లాడేవాడిని. అందరినీ పరాభవించాలి అనుకునేవాడిని.

ఈ విధముగా మదించిన ఏనుగులాగా మత్తెక్కి కన్నూ మిన్నూ కానక, నాకు తెలిసినదే  బ్రహ్మవిద్య, నాకు తెలియనిది ఏమున్నది, మిథ్య, అని అహంకరించి తిరిగేవాడిని. విద్యలో, వయసులో పెద్దలయినవారిని 'గెలికి' వారితో వాదానికి దిగి, నేనే గెలిచాను  అని అదరగొట్టేవాడిని. నీతో సమానంగా నిలిచాను అని గప్పాలు పలికి అబధ్ధాలు చెప్పేవాడిని. చిన్నా చితకా రాజులను సంపన్నులను యిలా నన్ను మించిన  విద్వాంసుడు లేదు అని భ్రమింపజేసేవాడిని. యిలా విశృంఖలంగా తిరుగుతున్న నాకు ఉన్నట్టుండి యజ్ఞయాగాదులు చేస్తున్న మహానుభావులను చూసి నేను కూడా వారిలాగా యజ్ఞం చేయాలనే కోరిక పుట్టింది. ఆ యజ్ఞానికి కావలసిన ద్రవ్యాన్ని  సమకూర్చుకొనడంకోసం మధురాపట్టణం వెళ్లాను నేను. బహివడ్డద్విజున కల్పఁపు బాచితంబిడి / పసిఁడికై తా వాని బంతి గుడిచి 

కలసి వణిక్పురోథల తోడఁ బుణ్యాహ / ముల బియ్యములకు నై మొత్తులాడి 
శశి రవి గ్రహ జపస్నానాదికము లెల్ల / దొరల వాకిండ్లకే దొద్ద యిచ్చి
 
పచ్చిఱ్రి తో ల్బఱ్ఱె చుచ్చాల మెట్లంది / కొనఁ దాన యూరెల్ల గుత్తవట్టి 

దర్భపోటులఁ దిని లేని తరుల మైత్రి 
నంటి పితృశేషముల భుజించి యదియు నెడల 
నక్కవాడల నరకూళ్ళు మెక్కి మీఁద
వీనిశేఖర మొకతులార్త్విజ్యము కొని 

మధురా పట్టణానికి వెళ్లి డబ్బుకోసం ఏమేం చేశాడో చెప్తున్నాడు బ్రహ్మరాక్షసుడు. అలా చేసేవారందరూ 'బ్రహ్మ' పదవాచ్యులైన 'బ్రహ్మరాక్షసులే' అని నిలువునా విమర్శ చేస్తున్నాడు. రాయలవారికి ఎంత లోకపరిచయమున్నది, ఎంత పరిశీలనా శక్తి ఉన్నదీ తెలిపే పద్యాలలో ఇదొకటి.తప్పుడు ద్రోవలు తొక్కి వెలివేయబడ్డ బ్రాహ్మడికి సూక్ష్మంలో మోక్షంగా ఏదో అవకతవక  ప్రాయశ్చిత్తం చేసి, వాడిచ్చే బంగారం కోసం వాడి పంక్తిన భుజించేవాడిని. షావుకార్ల యింటి బ్రాహ్మణులతో కలిసి పుణ్యాః వాచనలు చెప్పి, తూతూ మంత్రాల దక్షిణకోసం, ఆ పుణ్యాఃవాచన బియ్యంకోసం ఆ షావుకార్ల పురోహితులతో తగాదాలు పడేవాడిని. చంద్ర సూర్య గ్రహణాల సందర్భాలలో చేయాల్సిన జపతప స్నానాలన్నీ దొరల వాకిళ్ళకే ధారబోశాను. అంటే దొరల వాకిళ్ళకు పడిగాపులు గాసి వారి దయకోసం ప్రాకులాడాను, లేదూ, ఆ జపతపాల ఫలాన్ని వారికి ధారపోసి వారి డబ్బుకు కక్కుర్తిపడ్డాను. నువ్వు (మాలదాసరి) చెప్పినట్టు కప్పురాన్ని యిచ్చి ఉప్పుకు కక్కుర్తిపడ్డాను! జింకల పచ్చి తోలును, బఱ్ఱెలను, మేకలను దానం పుచ్చుకోడానికి ఊరు ఊరంతా నేనే గుత్తకు తీసుకున్నాను, వేరే ఎవరినీ నెగలనీయలేదు,అంతా నాదే, నాకే అన్నాను!

బ్రాహ్మణార్ధాలకు వెళ్లి మెక్కాను. అదీ లేనప్పుడు స్నేహాన్ని అడ్డుపెట్టుకుని, దొరికిన చోటల్లా ప్రేమ తెచ్చిపెట్టుకుని తద్దినాల భోజనాలు చేశాను. అవీ లేనప్పుడు పూటకూళ్ళ ఇళ్ళల్లో తిన్నాను. యిక ఆ పైన, వీటన్నిటికీ శిఖరాయమానంగా, ఋత్విక్కుగా అవతరించి, చేసిన పాపాలన్నీ కడిగేసుకోవాలనుకున్న వెధవల తులాభార దానాలను పట్టాను. యిలా కాసుకోసం ఏ దరిద్రపు దారినీ తొక్కకుండా, కడుపు కక్కుర్తితో ఏ ఒక్కచోటా మెక్కకుండా విడిచిపెట్టలేదు. ఎంత ఎగబడి అయినా సరే ఒక్క పైసా కూడా వేరేవాడికి దక్కకుండా చేయడానికి ఏ బొంకూ, వంకా, నీచమూ విడిచిపెట్టలేదు అని మధురాపట్టణంలో తన జీవన విధానాన్ని చెబుతున్నాడు బ్రహ్మరాక్షసుడు. 

బ్రాహ్మణుడు అయినవాడు ఏవి చేయకూడదో అవన్నీ ఎగబడి, తెగబడి చేశాను అని బ్రహ్మరాక్షసుడు చెబుతున్నాడు. అలా చేసిన, చేస్తున్న వారిని విమర్శిస్తున్నాడు రాయలవారు. 

(కొనసాగింపు తరువాయి సంచికలో)
***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు