వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

                                                                                                 సిల్వర్ లేక్ సేండ్ డ్యూన్స్ 


డెట్రాయిట్, చికాగో, మెకనాక్ బ్రిడ్జ్ నుంచి కొద్ది గంటల డ్రైవ్ లోనే వున్నది సిల్వర్ లేక్ సేండ్ డ్యూన్స్ ఏరియా.  ఇక్కడ వున్న ఎన్నో రకాలైన ఆకర్షణలు కుటుంబ సభ్యులనందరినీ ఈ ఏరియాకి ఆకర్షిస్తూవుంటాయి.  ఈ ఆకర్షణ ఎంత గొప్పదంటే ఎన్నో ఏళ్ళుగా, తరతరాలుగా, వచ్చినవాళ్ళే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి సెలవల్లో విశ్రాంతిగా, ఉల్లాసంగా గడపటానికి వస్తూ వుంటారు.

ఈ డ్యూన్లు లేక్ మిచిగాన్, సిల్వర్ లేక్ ఒడ్డున రెండు మైళ్ళ పొడవు, ఒక మైలు వెడల్పు పరచుకున్నాయి.  ఇక్కడ సరదాగా గడపటానికి అనేక రకాల అవకాశాలు.  ఇసుకలోను, సరస్సులోని చల్లని నీళ్ళతోను ఆడుకోవటం, ఇసుక కొండలమీదకి ఎక్కటం, సైకిల్ నడపటం, లేక్ ఒడ్డున రిలేక్స్ అవటం, బోటింగ్, లైట్ హౌస్ ఎక్కి చుట్టూ ప్రదేశాలని చూడటం, కేంపింగ్, ఒకటేమిటి, కుటుంబంలోని ప్రతి వ్యక్తీ కేంపింగ్ చేసినన్ని రోజులూ రోజుకో విధంగా గడపటానికి ఎన్నో మార్గాలు.  స్వంత వాహనాలున్నవారు ఇసకలో తమ డ్రైవింగ్ నైపుణ్యాన్నికూడా పరీక్షించుకోవచ్చు.


కానీ చుట్టపు చూపుగా వెళ్ళినవాళ్ళు ఇంత లీజర్ గా గడపలేరు కదా.  అందుకే మేము లిటిల్ సేబుల్ పాయింట్  లైట్ హౌస్ కి, మెక్ వుడ్స్ డ్యూన్ రైడ్స్ కి వెళ్ళాము.

ఈ లైట్ హౌస్ 1873 లో నిర్మింప బడింది.  ఆ సమయంలో ఈ లైట్ హౌస్ కోసం నిర్ణయింపబడిన 39 ఎకరాల స్ధలం చేరుకోవటానికి ఎటువంటి సదుపాయం లేదు.  115 అడుగుల ఎత్తు వున్న ఈ లైట్ హౌస్ ఎఱ్ఱటి ఇటుకలతో నిర్మించబడింది.  పైన కేస్ట్ ఐరన్ తో వలయంగా పిట్టగోడ నిర్మించబడింది.  పైన లైటు వెలిగే ప్రదేశం చేరుకోవటానికి 139 మెట్లు ఎక్కాము.  చుట్టూ అంతా బయలు ప్రదేశం కావటంతో విపరీతమైన గాలి.

మొదట్లో ఈ లైట్ హౌస్ లో కిరోసిన్ దీపాలే వెలిగించేవారు.  దానికోసం లైట్ హౌస్  ప్రక్కనే ప్రతి రోజూ దీపం వెలిగించే వ్యక్తి కుటుంబంతో నివసించటానికి ఇల్లు, నూనె నిలవ చేసుకోవటానికి ఒక ప్రత్యేక గది కూడా నిర్మింపబడ్డాయి.   1954లో ముందు వున్న కిరోసిన్ లైట్ స్ధానంలో 250 వాట్ల విద్యుత్ దీపం పెట్టారు.

కాలక్రమంలో పక్కన కట్టిన ఇల్లు వగైరాలు పోయి, కేవలం లైట్ హౌస్ మిగిలింది.   1890లో నావికులు ఎఱ్ఱ రంగు వలన పగలు లైట్ హౌన్ ని చూడలేక పోతున్నామనటంతో దానికి తెల్ల రంగు వేశారు.  కానీ తిరిగి 1977లో ఆ తెల్ల రంగు తొలగించారు.  ప్రస్తుతం వున్న లైట్ హౌస్ 120 సంవత్సరాల క్రితం ఎలా వుండేదో అలాగే వున్నది.

తర్వాత మెక్ వుడ్ డ్యూన్స్ రైడ్ కి వెళ్ళాము.  40 ని. సేపు సాగే ఈ రైడ్ కి టికెట్ వున్నది.  పెద్ద ఓపెన్ వేన్ లో 15 – 20 మందిని ఒక గ్రూప్ గా తీసుకు వెళ్తారు.  డ్రైవరే అక్కడి విశేషాలు కామెంటరీ చెప్తాడు.  సిల్వర్ లేక్ సేండ్ డ్యూన్స్ మీద ఈ రైడ్స్ 1930 లో ప్రారంభమయినాయి.  అప్పుడు ఇక్కడ వున్న రిజార్ట్స్ యజమాని మెక్ వుడ్ తన రిజార్ట్స్ కి వచ్చినవారి ఆహ్లాదం కోసం మొదలు పెట్టిన రైడ్స్ ఇవి.  ఆయన తన అతిధులను గ్రూప్స్ గా ఈ డ్యూన్స్ కి తీలుకు వెళ్ళటం మొదలు పెట్టాడు.  అది అలా నేటికీ కొనసాగుతోంది.  ఇప్పటికి కూడా ఈ రైడ్స్ ఆయన కుటుంబ సభ్యులే నిర్వహిసల్తున్నారు.

సిల్పర్ లేక్ సేండ్ డ్యూన్స్ 2000 ఎకరాలున్నాయి.  విశేషమేమిటంటే ఈ స్ధలంలో ఇదివరకు వైట్ పైన్ ట్రీస్ అడవులుండేవి.  క్రీ.శ. 1800 లో పెరుగుతున్న అమెరికా జనాభా నివాసాలకి చాలా కలప కావాల్సి వచ్చింది.  అప్పుడు ఇక్కడ చెట్లు నరకబడి, క్రమ క్రమంగా పైన్ అడవులు కాస్తా ఇసక పర్రలు అయ్యాయి.  1871 లో చికాగోలో సంభవించిన భయంకరమైన అగ్ని ప్రమాదం తర్వాత చికాగో పునర్నిర్మాణానికి ఇక్కడనుంచి కలప రవాణా గాబడింది.  దానితో ఇక్కడ భూమి ఇలా అయిపోయింద.

మరి మన దేశంలో అయితే ఆ ఇసుకని కూడా భవన నిర్మాణాలకి వాడేసి ఆ నేలని ఎందుకూ పనికి రాకుండా చేసేవారేమో అనిపించింది.  కానీ అవి వున్నది అమెరికాలో కదండీ.  అందుకే వాళ్ళు ఈ ప్రదేశాన్ని సిల్వర్ లేక్ స్టేట్ పార్క్ గా ప్రజల ఆనందంకోసం తీర్చి దిద్దారు.

విశాలమైన ఇసుక పర్రలు కూడా ఎంత అందంగా వుంటాయో చూడాలంటే వీటిని చూడాల్సిందే మరి.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు