రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి( మూడవ భాగం) - కర్రానాగలక్ష్మి

మొదటి సంచికలోని నేను రాజస్థాన్లో ' దెయ్యాల కోటలు ' , శాపగ్రస్థ గ్రామాలు వున్నాయని మనవి చేసేను . అలాంటి ఓ కోట గురించి ఈ సంచికలో తెలుసుకుందాం .ప్రపంచంలోనే మోష్ట్ హౌంటెడ్ ఫోర్టుగా పేరుపొందిన ' భానుఘఢ్ ' కోట గురించి తెలుసుకుందాం .ఈ కోట శాపగ్రస్థ మైనది , యిప్పటికీ ఈ కోట పరిసరాలకు వెళ్లాలంటే స్థానికులు భయపడతారు . ఈ కోటను 1613 లో జోధాబాయి సహోదరుడైన మాన్ సింగ్ మనుమడైన మాధోసింగు కొరకు కట్టించబడింది . సరిస్కా  టైగర్ రిజర్వుని ఆనుకొని వున్న ఆరావళీ పర్వతప్రాంతంలో నిర్మింపబడ్డ కోట . మాన్ సింగ్ అక్బరు సైన్యాధికారిగా నియుక్తుడై ఢిల్లీ లో నివాసం యేర్పరచుకోగా అతని తమ్ముడైన మాధోసింగు భానుఘఢ్ ప్రాంతానికి రాజుగా పట్టాభిషేక్తుడై పరిపాలించసాగేడు . మాన్ సింగ్ మాధోసింగుల తాత పేరు భానుసింగ్ . మాధోసింగు తన తాతగారి పేరు మీదుగా భానుఘఢ్ కోటను నిర్మించి తన మనుమడైన మాధోసింగు -2 కి కానుకగా యిచ్చేడు . ఆరావళీ పర్వతాలకు దగ్గరగా వూరికి దూరంగా వుండేటట్లు , 1300 నివసించేందుకు వీలుగా 200 యిళ్లతో కోటను విశాలంగా నిర్మించేరు . ఆరావళీ పర్వతాలలోని సహజ జలపాతాలను నేరుగా కోటలోని జలయంత్రాలలోకి చేరేటట్టుగా  మళ్లించిచేరు . ఇప్పటికీ కొండలమీద ప్రవహిస్తున్న సెలయేళ్లు నేరుగా కోటలోని వుద్యానవనంలో వున్న కొలనులలో పడటం చూడోచ్చు . ఈ కోట యెక్కువ కాలం నివాస యోగ్యంగా వున్నట్లు కనబడదు .  ఎక్కువగా జనాలు యీ కోట చుట్టుపక్కల తిరుగాడడానికి యిఛ్చగించరు . ఎప్పుడైనా పగటిపూట ఒకరో యిద్దరో పశువులకాపర్లు గొర్రెలను కాస్తూ కనిపిస్తారు వారు కూడా పొద్దువాలక ముందు తిరిగి గ్రామానికి చేసుకుంటారు .

స్థానికుల కథనం ప్రకారం ఈ కోట లోంచి రాత్రిపూట స్త్రీ ల రోదనలు , గాజుల శబ్ధాలు , గజ్జెల మోతలు యివాల్టకి కూడా వినిపిస్తాయని అంటారు . ఇప్పటి వరకు ఈ రహస్యం చేధించడానికి ప్రయత్నించి రాత్రి యీ కోటలో గడపడానికి దేశవిదేశాల నుంచి వచ్చిన  ఔత్సాహికులు కొందరు మరణించేరని , కొందరిని స్థానికులు తెలివిలేని స్థితిలో బయటకి తీసుకు వచ్చేరని , వారిలో కొందరు మతిస్థిమితం కోల్పోయేరని చెప్తారు . ఈ కోట బయట యిది దెయ్యాల కోటని , చీకటి పడ్డ తరవాత యీ కోటలోని ప్రవేశించరాదని భారతప్రభుత్వపు హెచ్చరిక వున్న బోర్డు  వుంటుంది . 

ఈ కోట చేరుకోడానికి ఢిల్లీ నుంచి ణ్-8 మీద ప్రయాణిస్తూ  అల్వరు మీదుగా ' భానుఘఢ్ ' చేరుకోవచ్చు . అల్వరు నుంచి 45 కిలోమీటర్ల దూరం " .

సరిస్కా టైగర్ రిజర్వు మీదుగా అడవి దారంట ఆరావళీ పర్వతాల మధ్యనుంచి సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించి ' భానుఘఢ్ ' చేరుకోవచ్చు . ఈ దారి అడవి వృక్షాలను , అడవి జంతువులను , అడవి గాలిని పీలుస్తూ చేసే ప్రయాణం ఆనందాన్ని కలుగజేస్తుంది .

ఈ కోట శాపగ్రస్థ మవడానికి రెండు కథలు ప్రచారంలో వున్నాయి .

రాజకుమారి రత్నావతి అందానికి మోహితుడైన ఒక మాంత్రికుడు ఆమెను వివాహం చేసుకొమ్మని  వేధించసాగేడు . రత్నావతి అతని నుంచి తప్పించుకుంటూ వుంటుంది . ఒకనాడు రత్నావతి నగరంలో జరిగే ఉత్సవానికి తన చెలికత్తెలతో వెళుతుంది . ఆమెను అక్కడవున్న అత్తరు దుకాణం ఆకర్షించగా , అత్తరు పరీక్షించేందుకు వెళ్తుంది . ఆమెను అనుసరిస్తున్న మాంత్రికుడు అత్తరు సీసాలో మంత్రజలం నింపి  వ్యాపారి వేషంలో ఆమెకి అమ్మజూపుతాడు . ఆ మంత్ర జలానికి సమ్మోహన శక్తి వుంటుంది .విషయం గ్రహించిన రత్నావతి ఆ సీసాను బండరాయి కేసి విసిరి కొడుతుంది . సమ్మోహన శక్తి ప్రభావమువలన ఆ రాయి మాంత్రికుని అనుసరించసాగింది . శక్తి వున్నంత వరకు పరుగెత్తిన మాంత్రికుడు శక్తి అంతరించగా క్రింద పడిపోతాడు అతనినే అనుసరిస్తున్న బండ అతని మీదుగా దొర్లిపోతుంది .మరణిస్తున్న మాంత్రికుడు ఆ కోటలోని వారు అకాలమరణం పొంది దెయ్యాలుగామారాలని శపించి మరణిస్తాడు . 

కొన్నాళ్లకు భానుఘఢ్ కు అజబ్ ఘఢ్ కు జరిగిన యుద్ధంలో భానుఘఢ్ లోని వారు అంతా మరణించేరు . రత్నావతి కూడా ఆ యుధ్దం లోనే మరణించినట్లుగా చెప్తారు . యుధ్దంలో కోట చాలా వరకు దెబ్బతిన్నట్లుగా చెప్తారు . అప్పటినుంచి ఈ కోటలో యెవరూ నివసించేందుకు సాహసం చెయ్యలేదు . అప్పటి నుంచి రాత్రిపూట ఆడవారి రోదనలు , గాజుల శబ్దాలు మొదలయిన వింతవింత శబ్దాలు వస్తున్నట్లు గా స్థానికులు చెపుతున్నారు . 

రెండవకథ యిలా చెప్తారు .

బాలక్ నాథ్ అనే సాధువు యీప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకొనేవాడు . భానుఘఢ్ నిర్మిస్తున్నప్పుడు ముందుగా యితని అనుమతి అడుగగా బాలక్ నాధ్ కోట నిర్మాణమునకు అనుమతి నిస్తూ ఒక షరతు కూడా పెడతాడు . అదేమిటి అంటే యే కట్టడము యొక్క నీడ తన కుటీరము పై పడకూడదు అని . కాని రాజు ఆ షరతును మరచి కోటను నిర్మిస్తాడు . కోట నీడ బాలక్ నాధ్ కుటీరముపై పడుతుంది . దానికి ఆగ్రహించిన బాలక్ నాథ్ కోటలో నివశించేవారు నాశనమవాలని శాపం యిచ్చి వేరొక చోటికి తపస్సు చేసుకొనేందుకు వెళ్లిపోయెనని అంటారు .

కారణాలు యేమయినా అంత వ్యయ ప్రాయాసలకోర్చి కట్టిన కోట పాడుబడి పోవడం విచారించదగ్గ విషయం .

ఇప్పటికీ ఆ పాడు బడ్డ కోటలో కొండలపై ప్రవహించే జలపాతాలు ఉద్యాన వనాలలో యేర్పరచిన తటాకాలలో పడడం చూడొచ్చు . 

మేము కూడా యెక్కువ సమయం అక్కడ గడపకుండా జైపూర్ బయలుదేరేం . 

జైపూర్ ( పింక్ సిటీ )

జైపూర్ దగ్గర పడే కొలదీ మనకి పాలరాయి పలకలు , బొమ్మలు , పాలరాయిని కోసే కర్మాగారాలు యెదురుపడ సాగేయి . 

జైపూర్ హస్తకళలుకు  ప్రసిధ్ది . లక్క బొమ్మలు , లక్క తో చేసిన డెకొరేటివ్ వస్తువలు , రాగి , యిత్తడి తో చేసిన పాత్రలు , జంతువులు , వాస్ లు , గాజుతో చేసిన వస్తువలు , రకరకాలైన గాజులు , వెండి వస్తువులకు , సాంప్రదాయక బట్టలు , ఒంటె చర్మంతో చేసిన వస్తువలు కావాలంటే జైపూర్ మార్కెట్టుకి వెళ్లవలసిందే . యే వస్తువ కొన్నా ఒకటికి పదిమార్లు పరీక్షించుకొని , బాగా బేరమాడి కొనవలసినదిగా సూచన . 

జైపూర్ ని  పింక్ సిటీ గా పిలుస్తారు . 

అమేర్ ని రాజధాని చేసుకొని పరిపాలిస్తున్న రాజు రాజా జయసింగ్ -2 , 1727 సంవత్సరంలో జైపూర్ ను నిర్మించి తన రాజధానిని యిక్కడకి మార్పించేడు . జైపూర్ చుట్టూ ఆరు మీటర్ల యెత్తైన , మూడు అడుగుల వెడల్పు కలిగిన పటిష్టమైన గోడ కట్టించేడు . యెనిమిది వైపులా సూర్య పోల్ , చాంద్ పోల్ , అజ్మీరీగేటు , న్యూగేటు  , సంగనేరి గేటు , ఘాట్ గేటు , సామ్రాట్ గేటు , జారావర్ గేటు నిర్మించేడు . మహారాజా సవాయి రామ సింగ్

పరిపాలనలో విక్టోరియా రాణి, రాకుమారుడు ఎడ్వర్డ్  -7 లను స్వాగతించడానికి గోడల మధ్య నున్న అన్ని కట్టడాలను  గులాబీ రంగులో కి మార్పించి నట్లుగా చెప్తారు . అప్పటినుంచి  యీ నగరాన్ని  గులాబీ నగరంగా పిలువసాగేరు . ఇప్పటికీ పాతపట్టణంగా పిలువబడే గోడల  మధ్యనున్న ప్రతి కట్టడం గులాబీ రంగులోనే వున్నాయి . ప్రస్తుతం యిది జైపూర్ మార్కెట్ గా వ్యవహరిస్తున్నారు . ఈ మార్కెట్టులో దొరకని వస్తువ లేదు అని అంటారు . జై పూర్ లో వజ్రం తప్ప మిగిలిన నవరత్నాలను కట్ చేసే యంత్రాలు ప్రతీ యింటా దర్శనమిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు . దేశవిదేశాలనుంచి ముడి నవరత్నాలను తెచ్చి యిక్కడ కట్ చేసి వాటిని నగలలో వుపయోగించే విధంగా తీర్చి దిద్దుతారు . అలాగే యిక్కడ యిమిటేషన్ రంగురాళ్లు కూడా మార్కెట్టులో వుంటాయి కాబట్టి రంగు రాళ్లమీద అవగాహన లేని వాళ్లు వాటి జోలికి పోకపోవడమే మేలు . ప్రతీ సంవత్సరం డిసెంబరులో జరిగే జ్యూయలరీ యెగ్జిబిషన్ కి దేశ విదేశాలనుంచి అమ్మకం దారులు , కొనుగోలుదారులు వస్తారు .

జై పూర్ వూరి బయటే కొండమీద వున్న  ' అమేర్ ' కోట మనలని ఆకర్షిస్తుంది . ' అమేర్ ' కోటకి దారి ' పింక్ సిటీ ' ద్వారం పక్కనుంచి వుంటుంది . 

హవా మహల్ --

జైపూర్ అనుకోగానే మనకి గుర్తొచ్చేది ' హవామహల్ ' , దీనిని 1799 లో పూర్తి చేసేరు . పూర్తి గా మొఘల్ శిల్పకళతో కట్టిన కట్టడం . లాల్ చంద్ ఉస్తాదు , సవాయి ప్రతాప సింగ్ ఈ కట్టడానికి రూపకల్పన చేసేరు .  రాణి వాసపు స్త్రీలు బయటివారికి కనపడకుండా యిందులోంచి వీధిలో జరిగే ప్రదర్శనలను , ఉత్సవాలను తిలకించడానికి వీలుగా కట్టిన గోడను పోలిన కట్టడం . ఇది అయిదు అంతస్తులలో వున్న కట్టడం . దీని యెత్తు 15 మీటర్లు , మొత్తం 953 కిటికీలతో చూడముచ్చటగా వుంటుంది .

జల్ మహల్----

అమేర్ కోటకు వెళ్లే దారిలోనే కుడిచేతి వైపు ' జల్ మహల్ ' వుంటుంది . మానవనిర్మితమైన సరస్సులో కట్టబడిన భవంతి . వేసవి కాలంలో నీటిపైనుంచి వీచేగాలి చల్లబడి భవంతిలో వున్న వారికి వేసవితాపం తెలియకుండా వుండేటట్లు నిర్మించబడింది . రాజపరివారం యీ భవంతిని వేసవి నివాసంగా వుపయోగించేవారు . జల్ మహల్ బయటినుండి మాత్రమే చూడగలం . మేము వెళ్లి నప్పుడు ఆ భవంతిని అయిదు నక్షత్రాల హొటలుగా మారుస్తున్నట్లు తెలిసింది . ఇప్పటి పరిస్తితి యేమిటో తెలీదు . 

జలమహల్ , హవామహల్ చూసుకొని మేము అమేర్ కోటకు ప్రయాణమయేం . దీనిని అంబరుకోట అనికూడా అంటారు .

అమేర్ కోట -----

ఈ కోట సుమారు 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినది . ఈ కోటకూడా యెత్తైన కొండమీద నిర్మించేరు . చుట్టూరా యెత్తైన గోడలు కోట చుట్టూ కందకం ద్వారానికి పెద్ద పెద్ద లోహపు తలుపులతో  పటిష్ఠం గా కట్టబడిన కోట . ఈ కోటను సుమారు 1592 సం।। ప్రాంతంలో మీనా రాజులు నిర్మించేరు , తరవాత రాజా మాన్ సింగ్-1 దీనిని పరిపాలించేడు . ఈ కోట హిందూ సాంప్రదాయక పద్దతిలో కట్టబడింది . ఈ కోటకు మాతా సరస్సు నుండి నీటి సరఫరా జరిగేటట్లు గా నిర్మించేరు .

కోట ద్వారం లోంచి లోనికి ప్రవేశించగానే కుడి వైపున వున్న ద్వారాన్ని గణేష పోల్ వుంటుంది . దీనిని  పాలరాయి , యెర్రని యిసుక రాళ్లతో నిర్మించేరు . ఇందులో గణేషుడు కొలువై వుండి విఘ్నాలను కోటలోనికి రాకుండా నివారిస్తాడని నమ్మి రాజులు దీనిని నిర్మించేరు . ఇది మూడంతస్తులలో నిర్మితమైంది . మూడో అంతస్తు ని సుహగ్ మందిరం అంటారు  . ఇది చక్కని నగిషీలతో తీర్చి దిద్దిన చిన్న చిన్న కిటికీలతో చూడముచ్చటగా వుంటుంది . రాణివాసపు స్త్రీలు ఈ సుహగ్ మందిరం లో ఆసీనులై కిటికీల గుండా దివానీ- ఆమ్ లో జరిగే వుత్సవాలను తిలకించేవారట .

అక్కడే లోపలకి వెళ్లడానికి టిక్కెట్టు , యేనుగు యెక్కి కోట చుట్టూరా తిరగడానికి టిక్కెట్టు యిచ్చే ఆఫీసు వుంటుంది .

పాలరాయి పలకలు వేసిన నేల దూరంగా రెండు ఫిరంగులు , చుట్టూరా సిపాయిలు వుండేందుకు గదులు చిన్న వుద్యానవనం వుంటాయి . దూరంగా రాజ పరివారం కోసం నిర్మించబడ్డ మందిరాలు , పాడుబడ్డ యిళ్లు కనిపిస్తాయి . ఈ కోటంతా తిరగడానికి చరిత్ర అంటే యింట్రెష్టు వుండాలి , నడవడానికి ఓపిక వుండాలి . ఈ రెండూ లేకపోతే ఈ కోటలు మనకి పాడుబడ్డ చెత్త అని అనిపిస్తుంది .

రాజ ప్రాసాదం లోకి వెళితే అక్కడ దక్షిణం వైపున వున్న భవనాన్ని మాన్ సింగ్ -1 మహల్ అని అంటారు . దీనిని నిర్మించడానికి సుమారు పాతిక సంవత్సరాలు పట్టింది . ఇక్కడ వున్న భవనాలలో యిది పురాతనమైనది . మధ్యలో నున్న హాలు స్థంభాలతో నిర్మించేరు . నేలంతా రంగు రంగు పలకలతో నిర్మించేరు . 

పాలరాతి మెట్లగుండా లోపలకి వెళితే మధ్య భాగంలో మొఘల్ గార్డెన్స్ ని పోలిన వుద్యానవనం కనిపిస్తుంది . తూర్పువైపున జైమహల్ , పడమటన సుఖమహల్ వుంటాయి . జైమహల్ లో రాజపరివారం నివసించేవారట , జలయంత్రాల మీదుగా వీచేగాలి ఈ మహల్ ని చల్లపరచేట్టుగా సుఖమహల్ ని నిర్మించేరు . 

ఈ కోట నాలుగు అంతస్తులతో వుంటుంది . దివానీ - ఆమ్ , దివానీ ఖాస్ , షీశ్ మహల్ మొదలయినవి చూడదగ్గవి .

ఇక్కడ చూడతగ్గ మరో కట్టడం ' త్రిపోలియా గేటు , యిక్కడ నుంచి మూడు ముఖ్య భవంతులకి వెళ్లే మూడు గేట్లు వుంటాయి . ఒకటి ' జలేబ్ చౌక ' , రెండవది మానసింగ్ పేలస్ కి , మూడవది ' జనానా దేవిడి ' కి చేరుస్తాయి . జనానా దేవిడి అంటే రాణి వాసపు స్త్రీలు నివాసముండే భవనం .

శిలాదేవిమందిరం ---

జలేబా చౌక్ కి కుడి వైపున  వుండే శిలాదేవి మందిరం చిన్నదయినా చూడముచ్చటగా వుంటుంది . ముఖ్య మైన పర్వదినాలలో తప్ప మిగతా సమయాలలో ఈ మందిరం మూసే వుంటుంది . మందిరం  వెండి తో చెయ్యబడ్డ తలుపులు , వాటి పైన చక్కబడిన వివిధ దేవతామూర్తులను చూస్తూ వుంటే యీ దేవి అంటే రాజవంశస్థులకు గల భక్తి వ్యక్తమౌతుంది . 1604 సంవత్సరానికి ముందు రాజపుత్రులు కులదేవిగా రామఘఢ్ లో వున్న జమ్వాదేవిని పూజించేవారు . 1604 సంవత్సరంలో శిలాదేవిని కూడా కులదేవిగా ఆరాధించ సాగేరు .


శిలా దేవిని గురించిన కధ స్థానికులు యిలా చెప్తారు .

1604 సంవత్సర ప్రాంతంలో రాజా మాన్ సింగ్ కు దుర్గాదేవి కలలో కనబడి తాను ' జెస్సోరు ' రాజ్యానికి చెందిన సముద్రంలో పడి వున్నట్లు తనను అక్కడనుంచి తెచ్చి కోటలో ప్రతిష్టించి పూజలు చెయ్యమని చెప్పగా మాన్ సింగ్  ' జెస్సోరు ( ప్రస్తుతం బంగ్లాదేశ్ లో వుంది ) ' రాజ్యం పైకి దండెత్తి ఆ రాజుని వోడించి సముద్ర గర్భం లో వున్న మహిషాసుర మర్ధిని విగ్రహాన్ని తీసుకు వచ్చి తన మందిరం లో ప్రతిష్ఠించెనని చెప్తారు . ఈ దేవి గురించి ప్రచారంలో వున్న మరో కథ యేమిటంటే ఈ విగ్రహాన్ని మలిచిన రాయి కంసుడు దేవకి గర్భాన జన్మంచిన ఆరుగురు పుతృలను మరియు దేవకి గర్బమున జన్మంచిన మాయను వధించిన శిల అని , కాలాంతరాన ఆ శిల ' జెస్సోరు ' రాజు అధీనంలో వున్నట్లు తెలుసుకున్న రాజా మాన్ సింగ్ ' జెస్సోరు ' రాజుని యుధ్దంలో వోడించి ఈ శిల ను విజయ చిహ్నంగా తన రాజ్యానికి తెచ్చి ఆ శిలతో మహిషాసుర మర్ధిని విగ్రహాన్ని చెక్కించి ప్రతిష్ఠించెనని అంటారు . అమ్మవారి విగ్రహానికి ముందున్న వెండి సింహాలు , పగడం తో మలచబడ్డ వినాయకుడి విగ్రహాలు చూడముచ్చటగా వుంటాయి .

ఈ కోటలో వున్న మరో ముఖ్య ఆకర్షణ పాలరాతి ఫలకం మీద చెక్కబడ్డ మేజిక్ పువ్వు యిది చూడ్డానికి మామూలు పూలకుండీలా వున్నా ఒక పద్దతిలో ఆ చెక్కబడి వున్న పూరేకులను మూసి చూస్తే అందులో చేపతోక , తామరపుష్పం , పాముపడగ , యేనుగుతొండం , జొన్నపొత్తు , సింహం తోక , తేలు కనిపిస్తాయి . అక్కడవున్న గైడు అవన్నీ చూపించి మమ్మల్ని ఆశ్చర్యపరిచేరు .  

యునెస్కో వారు దీనిని హెరిటేజ్ కట్టడంగా గుర్తించేరు . 

అమేర్ కోట కి పక్కగా జైఘఢ్ వుంది . దాని పక్కనే 'ఛీల్ కా తీలా ( గద్దల కొండ) ' వున్నాయి . జైఘఢ్ మిలటరీ వారి అధీనంలో వుండటం తో పర్యాటకులకు ప్రవేశం లేదు . అమేర్ కోట నుంచి జైకోటకు సొరంగమార్గం వుందని అంటారు . 

అమేర్ కోటకు దగ్గరగా ' హాథీ గావ్ ' వుంది . కోటలో యేనుగు సవారీ చెయ్యడానికి చాలా పెద్ద క్యూ వుండడంతో వెనుకకి వచ్చిన మాకు అక్కడి గార్డు యీ ' హాథీ గావ్ ' గురించి చెప్పి ఒకతనిని  పరిచయం చేసేడు . అతనితో కూడా మేము ఆ 'హాథీ గావ్ ' వెళ్లేం . చిన్న గ్రామం , ప్రతీ యింటి ముందర పెద్ద పెద్ద షెడ్డులలో మూడునాలుగు  యేనుగులకు తక్కువ లేకుండా వున్నాయి .  గంటకి యింతని లేదా మనషికి యింతని పుచ్చుకొని యేనుగుమీద తిప్పుతారు . మేము అలాగే యేనుగు ముచ్చట తీర్చుకున్నాం .

జైపూర్ లో చూడతగ్గ ప్రదేశాలు బిర్లామందిరం , జంత్ర మంతర్ , సిటీ పేలస్ .

జంతర్ మంతర్ ---

1738 లో రాజా సవాయ్ జైసింగ్ కాలంలో నిర్మింపబడ్డ సూర్య కాంతి ద్వారా సమయాన్ని తెలిపే సూచిక , అలాగే గ్రహగతులను తెలియజెప్పే పరికరాన్ని ( కపాల యంత్రప్రకార ) రాయ , లోహాలతో నిర్మింపబడింది .

క్షతికి గురైన యీ కట్టడాన్ని  19 వ శతాబ్దం లో తిరిగి నిర్మించేరు . యునెస్కో వారు దీనిని హెరిటేజ్ కట్టడంగా గుర్తించేరు . ఇది సిటీ పేలస్ కి దగ్గరగా వుంటుంది .

సిటీ పేలస్ -----

1729 లో మహారాజా సవాయి జైసింగ్ -2 యూరోపియన్ , మొఘల్ శిల్పశాస్త్రాలను వుపయోగించి కట్టించడం మొదలుపెట్టి 1732 లో పూర్తయిన భవనం యిది . ప్రస్తుత రాజ సంతతి నివశిస్తున్న భవనం . కొంత భాగం మ్యూజియం గా మార్చేరు . ఇందులో రాజుల చిత్రపటాలతో పాటు వారు వాడిన ఆయుధాలు , పాత్రలు , కవచాలు , వస్త్రాలు , సింహాసనాలు లాంటివి చాలా ప్రదర్శనలో పెట్టేరు . వీటి వల్ల అప్పటి రాజుల డాబు దర్పం యెలా వుండేవో తెలుస్తుంది . చాలా అందమయిన కట్టడాలలో యిది ఒకటి . 

వచ్చే సంచికలో ప్రపంచంలో అతి పెద్ద అతిలోతైన మెట్ల బావి గురించి , గాయత్రీదేవి మాత ఉద్భవించిన సరస్సు గురించి తెలుసుకుందాం . అంతవరకు శలవు . 

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు