సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
ఆముక్తమాల్యద 
 
తనకు బ్రహ్మరాక్షసుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వినాలని ఉన్నది అని అన్న మాలదాసరికి తన పూర్వజన్మ కథను చెబుతున్నాడు బ్రహ్మరాక్షసుడు.ఈ కథను సాకుగా చేసుకుని ధర్మ భ్రష్టులు, వర్ణ భ్రష్టులు ఐనవారిని, వారి అధర్మమార్గ అనుసరణను విమర్శిస్తున్నాడు రాయలవారు. బ్రహ్మరాక్షసుడు మధురా నగరంలో తన జీవన విధానాన్ని వర్ణిస్తున్నాడు.

ఇ ట్టొనగూర్చి వైశ్యునకు నిచ్చి చన న్మఱి పుచ్చి చౌకము 
ల్వెట్టుచు  వడ్డి లెక్క లటు వెత్తుచు ధారణ వాసికి కొదల్ 
పెట్టుచు వాఁడు రేఁగి మఱి పెట్టుదుఁ బెట్ట ననంగ మిట్టఁ గూ
వెట్టుదు నిట్టు పోరఁ గనిపెట్టుక యొక్కరుఁ డుండి వెండియున్

యిలా నానా గడ్డీ కరిచి సంపాదించి కూడబెట్టిన డబ్బును కోమటికి వడ్డీకిచ్చి,నేను సంపాదించిన బియ్యము మొదలైన వాటిని అమ్మి వాటికి మంచి ధరను ఇమ్మని, చిల్లర వడ్డీకోసమని పోరేవాడిని. వాడు ఇస్తానని యివ్వనని గొడవచేస్తే రచ్చకెక్కి రచ్చరచ్చ చేసేవాడిని. యిదంతా దొంగ ఒకడు కనిపెట్టి అవకాశంకోసం ఎదురు చూడడం మొదలెట్టాడు.వెలివాడఁ బనిక్రొత్త మలక వాల్గొని నూనె / యిడి తంగెడాకుగ  గట్టెడు తహతహ కూర్చంబు గొరిగించుకొని యుష్ణ తోయంబు / టంగడిఁ దలయంటు కాడి తడవు టపూఁటింటి కెప్పంటికంటెను బాలు / పెరుఁగు నే కూర లంపెడు తెగువలు సంబెళ విదలించి తాంబూలదళ పూగా / నివహంబుఁ జాలంగ నించు నుబ్బు 

బ్రహ్మచారిభుజంబు మాత్రకు సడింపుఁ 
బ్రాలు నాలికి మేలుచీరలు గొనియెడు 
సంభ్రమంబును బెఱపాంథజనులఁ బయన
మడుగు ప్రశ్నంబులను మత్ప్రయాణమెఱిఁగి 

చండాల వాటికలో మంచి పనితనముగల కొత్త పాదరక్షలను ఖరీదు చేసి, మంచిగా నూనెతో మెరుగు పెట్టించి, వాటికి తంగేడు ఆకును కట్టి జోడును తగిలించి)త్వరపడుతూ, కనుబొమలను అందంగా సన్నగా గొరిగించుకుని, వేడినీళ్ళు అమ్మే అంగడిలో తలంటు స్నానము చేసి, ఆలస్యమవుతున్నది అని తొందరపడుతూ ప్రయాణ సన్నాహం చేశాను. పూటకూళ్ళ ఇంటికి వెళ్లి పాలు, పెరుగు, నేయి, కూరలు 
పంపే ఔదార్యాన్ని పొగడుతూ, పోకచెక్కల పెట్టెను తెరిచి తమలపాకులు, వక్కలను బాగా సరిపోయేట్లు నింపుకున్నాను. శిష్యుడి భుజానికి దంపుడు బియ్యపు సంచిని తగిలించాను. భార్యకోసం మంచి చీరలు కొన్నాను. యితర ప్రయాణీకులను(తోడుగా మందితో గుంపులుగా దూరప్రయాణాలు చేసే రోజులు) ప్రయాణం ఎప్పుడు అని ప్రశ్నలతో త్వరపెట్టాను. యిలా హడావిడి చేస్తున్న నా సన్నాహాలను గమనించి 
నా ప్రయాణం గురించి తెలుసుకున్నాడు, మొదటినుండీ నన్ను గమనిస్తున్న 

దొంగవాడొకడు. 
హత్తుకొని యొక్క కొందఱ 
నత్తెరువుం గట్టఁ బనిచి యందఱ క్రియఁ దాఁ
దిత్తియొకటి గొని తే మఱి 
యుత్తర ముత్తర మటంచు నొక ప్రొద్దుకడన్

ఆ దొంగ కొందరిని తన వెంటనుంచుకుని, మరి కొందరిని ఆ ప్రయాణమార్గాన్ని కనిపెట్టి అడ్డగించడానికి పంపి, అందరు ప్రయాణీకులలానే ఏమీ ఎరుగనట్లు ఒక తోలు తిత్తిని(మార్గంలో మంచి నీరు త్రాగడంకోసం) పట్టుకుని, ప్రయాణం సాగిస్తూ  ఒక ప్రొద్దున మనము ఉత్తరదిశకు వెళ్ళాలి, ఉత్తర దిశకు అని త్వరపెడుతూ అందరినీ దారిమళ్ళించాడు.

లేచి పోవంగఁ దత్తఱ మేచి తోడి 
వారు సన నేను ముడిమోపు వటునకెత్తి 
పోవ వాఁ డిందు రం డని త్రోవ యడవిఁ 
బెట్టి యొకవాఁగు డిగ నీల వెట్టుటయును 

ఒక ఉదయాన లేచి, ఆ దొంగ ప్రయాణీకుడు 'ఉత్తరానికి వెళ్ళాలి, ఉత్తరానికి' అని అందరినీ తొందర పెట్టడంతో అందరూ లేచి అలాగే లేచి బయలుదేరి పోవడంతో నేను కూడా త్వరపడుతూ, మూటను శిష్యుడి భుజానికి ఎత్తి బయల్దేరాను. యిటు రండి, యిటు అంటూ వాడు అందరినీ తెలివిగా ఒక అడవి దోవకు మళ్ళించాడు.ఒక వంక దిగగానే వాడు ఈల వేశాడు! 

అఱచేతి వ్రాలు గనున
త్తఱిఁ బడె నొకయంపకట్టె దానికి నిలువం 
బిఱుబిఱ్ఱున ఱాలు వడెం
దెఱపియుఁ గనలేక సాతు దిరుగంబడియెన్ 

అరచేతిలోని గీతలు చూసేంత సమయంలో(అంత అల్పవ్యవధిలో)ఉన్నట్టుండి బాణం వచ్చిపడ్డది. దాంతో అందరూ ఆగిపోయారు. యింతలో బిర్రుబిర్రున రాళ్ళు వచ్చిపడ్డాయి. ప్రయాణీకుల సమూహం ముందుకు వెళ్ళే తెరపి లేక వెనుదిరిగింది.అంతే! ప్రళయకాలం వచ్చినట్లు, జంతువుల ప్రాణాలను కబళించే ఆకలిగొన్నట్లు,ముక్కంటి ప్రక్కల నడిచే పిశాచాల సమూహాలలాగా, ఉల్కలతో కూడిన గ్రహాలలాగా,
సూర్యుడు కూడా భయపడే రాహువులలాగా, కాలకూటంలాగా నల్లని కాంతులను వెలువరించే ఆయుధాలను ధరించి, పదునైన బాణాలను వేస్తూ, పొడవండి! నరకండి! అని అరుస్తూ కిరాతులు చండాలురు గుంపులు గుంపులుగా వచ్చి నాలుగుప్రక్కలా కమ్ముకున్నారు మమ్ములను, పథికులను.

(కొనసాగింపు తరువాయి సంచికలో)
***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు