ప్రపంచంలో మిగిలిన దేశాల విషయం, అంతగా తెలియదు కానీ, మన దేశంలో మాత్రం, దురదృష్టవశాత్తూ, చాలామందికి చట్టం అంటే అంత పెద్దగా గౌరవం ఉన్నట్టు కనిపించదు.. 70 వ దశకందాకా, పరిస్థితి మరీ అంత దిగజారిపోలేదు. ఆరోజుల్లో , అకడక్కడ తప్పించి, సాధారణంగా, పోలీసు వ్యవస్థన్నా, చట్టం అన్నా ఓరకమైన గౌరవం ఉండేది. ఆరోజుల్లో, ఎక్కడో అరా కొరా స్కూటర్లూ, బైక్కులూ ఉండేవి. చాలామందికి సైకిలే దిక్కు… సైకిలుకి, బెల్లు లేకపోయినా, రాత్రిళ్ళు లైటులేకపోయినా, సైకిలుమీద ఇద్దరు ఎక్కనా నేరం కింద పరిగణించేవారు. రోడ్డుమీద పోలీసు కనిపిస్తే చాలు, ఇద్దరు వెళ్తూంటే, ఒకరు వెంటనే దిగేసి, ఆ పోలీసు దాటిపోయిన తరువాత మళ్ళీ ఎక్కేసేవారు. అలాగే సైకిళ్ళకి, ఆర్ధిక స్థోమతున్నవాళ్ళు, ఓ డైనమో లైటూ, లేకపోతే కనీసం చేతిలో టార్చ్ లైటైనా ఉండేది. చెప్పొచ్చేదేమిటంటే, నచ్చినా , నచ్చకపోయినా పోలీసంటే భయం ఉండేది.
కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజుల్లో చూసేదేమిటీ? మొత్తం కుటుంబం అంతా భార్యా భర్తా, మధ్యలో ఓ పిల్లాడూ, ముందరో పిల్లో పిల్లాడో, వెరసి నలుగురు. పబ్లిక్కుగా రోడ్లమీద రయ్యి మని వెళ్తూ కనిపిస్తారు.పోనీ వాళ్ళేమైనా నిరక్షరాశ్యులా అంటే అదీ కాదు, శుభ్రంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూన్నవారే. అలాగే “ షేర్ ఆటోలు” – ఎక్కాల్సింది ముగ్గురయినా సరే, కనీసం అయిదుగురు ఎక్కుతారు. ఇంక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒకే టెంపోలో అయిదుగురెక్కాల్సిన చోట కనీసం ఓ పదిమంది, వేళ్ళాడుతూ కనిపిస్తారు. అలాగే, ద్విచక్రవాహనాల వాళ్ళకి హెల్మెట్ అనివార్యం అంటారు. కార్లలో వెళ్ళేటప్పుడు, సీటుబెల్టు ఉండాలీ అంటారు. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? ప్రభుత్వం చట్టాలు చేసిందీ, మనం పాటించకూడదూ అనే కానీ, ఏదైనా ప్రమాదం జరిగితే, కనీసం ప్రాణాలతో బయటపడొచ్చూ అని మాత్రం చాలామందికి తట్టదు. 18 సంవత్సరాల వయసొచ్చేవరకూ బండి నడపడానికి లైసెన్సు ఇవ్వకూడదని చట్టం ఉన్నా, దాన్ని పట్టించుకునేవారు బహు తక్కువ. పైగా చాలామంది తండ్రులు, తమ పిల్లలు ట్యూషన్లకి స్వంతంగా నడుపుకుంటూ వెళ్తారని గొప్పగా చెప్పుకుంటూంటారు.
అలా రోడ్డుమీద నడుపుకుంటూ వెళ్తూ ఏదైనా అయితే, ఆ కుర్రాడు/ కుర్రది మాటెలా ఉన్నా, పక్కవాళ్ళకు కూడా రిస్కే. అయినా ఈ విషయం ఎవరూ పట్టించుకోకపోవడం దురదృష్టం.
అమెరికాలాటి దేశాల్లో అప్పుడెప్పుడో ఉగ్రవాదులు దాడిచేసి, న్యూయార్క్ లో కలకలం సృష్టించారు. కానీ ఆ తరవాత, వారి భద్రతా వ్యవస్థ మెరుగుపరిచారు. ఆ కారణం చేతనేమో, ఆ దేశంలో మళ్ళీ అలాటి దాడి జరగలేదు. మన దేశంలో ఇప్పటిదాకా ఎన్నో ఉగ్రవాదుల దాడులు జరిగాయి. జరిగిన ప్రతీసారీ, రక్షణ వ్యవస్థని గట్టిపరుస్తున్నామని చెప్తూంటుంది. అయినా సరే ఆ దాడులు ఆగడం లేదు. అంటే ఎక్కడో ఏదో లొసుగుందన్నమాటే కదా. ఏ వి.ఐ.పీ నీ విమానాశ్రయాల్లో సోదా చేయకూడదు. ఏమీ అడక్కూడదూ, అడిగితే ఏ రాజకీయ పార్టీ పేరో చెప్పి, ఏమిటేమిటో వల్లిస్తారు. అదీ కాదంటే, కులం పేరు చెప్పికూడా హడావిడి చేయడానికి వెనుకాడరు. అంతదాకా ఎందుకూ, చేతిలో అధికారమంటూ ఉన్నా, లేదా ఆ నేరం చేసినవాడు ఏ ప్రముఖుడికో చుట్టమైనా చాలు, తప్పించుకోడానికి..
చట్టమంటే చులకనా భావం మనదేశంలో ఉన్నంత, మరే దేశంలోనూ ఉంటుందనుకోను. పోనీ ఎవరైనా చట్టానికి లోబడి ఉండాలన్నా, వారిని వేళాకోళం చేసేవారే ఎక్కువ. ఉదాహరణకి, ట్రాఫిక్కు సిగ్నల్స్ దగ్గరే తీసికోండి, ఏ పెద్ద పెద్ద మెట్రోల్లోనో తప్పించి, వాటిని అనుసరించేవాడే కనిపించడు. మరి రోడ్లమీద ప్రమాదాలు జరిగాయంటే జరగవూ? అలాగే కల్తీసారా తాగి చచ్చినవాడికి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించడం మన దేశంలోనే ఉందనుకుంటా. అసలు వాడిని తాగమన్న దెవడూ? ప్రభుత్వమే మద్యపానాన్ని సమర్ధిస్తూ, సందుకో అయిదారు సారా దుకాణాలూ, బెల్టు షాపులూ తెరుస్తూంటే, ఈ నష్ట పరిహారాలు ఉంటాయేగా?
మన నదులు కలుషితం చేయకూడదని, వేల కొద్దీ నిబంధనలు ఉన్నాయి. పైగా పర్యావరణ అనుమతులూ, సింగినాదం అంటూ, కావాల్సినన్ని నిబంధనలున్నాయి. గొప్పగొప్ప వాళ్ళు ఎంతమంది పాటిస్తున్నారు వాటిని? పైగా ఏ జుర్మానా అయినా వేసినా, “ కట్టేది లేదు..” అని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు ఆ పెద్దలు. అదేదో స్వఛ్ఛభారత్ అభియాన్ అని, వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు, ప్రముఖులందరినీ బ్రాండ్ ఎంబాసడర్లు చేశారు.. నెలకో రెండునెలలకో, చీపుళ్ళు చేతిలో పట్టుకుని ఫొటోలు తీయించుకోడంతో అయిపోయిందనుకుంటారు ఆ పెద్దలంతా..
ముందుగా ప్రతీవారిలోనూ, ఓ Self Discipline అనేదుంటేనే కదా, మనమూ, దేశమూ బాగుపడేది…
సర్వేజనా సుఖినోభవంతూ…