సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

పొరబాటున తనకు చిక్కిన మాలదాసరిని బ్రతిమిలాడుకుంటున్నాడు బ్రహ్మరాక్షసుడు. మాలదాసరి చేసిన సంకీర్తనా ఫలితాన్ని, కనీసం  ఆ ఉదయం చేసిన సేవలోని ఆఖరి కీర్తనా ఫలితాన్ని అయినా ధారబోయమని ప్రాధేయపడిన బ్రహ్మరాక్షసుడికి అసలా రూపం ఎలా వచ్చిందో  తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు మాలదాసరి. బ్రహ్మరాక్షసుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతున్నాడు. పూర్వజన్మలో తానొక బ్రాహ్మణునిగా జన్మించి, మధురాపట్టణంలో నానాగడ్డీ కరిచి డబ్బులు సంపాదించి, తన గ్రామానికి తోటి ప్రయాణీకులతో కలిసి  ప్రయాణం చేస్తున్నపుడు బందిపోటు దొంగలు తమను ముట్టడించిన సంగతి చెబుతున్నాడు. 

పసలేదు నిలరోయి పాతకులా రని / దేవాయుధంబులు రూవువారు 
పైఁడి బాసముఁ జెట్ల బడవైచి దుడ్డుపె / ట్లకు బారుచునె  యొలె ల్వైచువారు
బరువు డించి కటారి పరుఁజించి నిల్పి యిం / దెందు వచ్చెద రని యెదురువారు
వస్త్రంబుఁ గొండు దేవర యోయి యిది చన్నఁ / బస్తని దయపుట్టఁ బలుకువారు 

కలవి మామూకఁ నిప్పింతుఁ దొలఁగుఁడొకటి
యాఁడుదానిఁ జేనంటకుఁ డనుచుఁ బెద్ద 
తనము నభిమానమును దెంపు కనఁగఁ బలికి 
నిలిపి దోఁపిచ్చువారు నై తొలఁగి రపుడు

వీళ్ళ దగ్గర పసలేదు, ఎక్కువమందిలేరు, పారిపోకండి, నిలిచి ఎదురుతిరగండి  అని తోటి ప్రయాణీకులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తూనే ' పాపిష్టి వెధవల్లారా మీరు నాశనం గానూ' అని దేవాయుధాలను అంటే శాపనార్ధాలను విసిరేవాళ్ళు  కొందరు ఆ సమయములో. కర్రల దెబ్బలకు గావుకేకలు పెడుతూనే ఒంటిమీది బంగారాన్ని తీసి చెట్లమీదికి పుట్లమీదికి విసిరేస్తూ, విలువైన బట్టలను విసిరిపారేసే  వాళ్ళు కొందరు. తమ బరువులను క్రిందపారేసి, కత్తులూ కఠార్లూ అందుకుని  ఎదురునిలిచి, ఎక్కడికిరా వస్తున్నారు అని పోరాటం చేసే వాళ్ళు కొందరు.'దీన్ని ముట్టుకోవద్దు. యిది పెరుమాళ్ళ విగ్రహంరా నాయనా! యిది పోయిందంటే పస్తే! కావాల్నంటే బట్టలు తీసుకో (ఎందుకంటే పిచ్చి అర్చకుడు, కనుక బంగారం గింగారం లేదు కనుక) అని దయ కలిగేట్లు బ్రతిమిలాడేవాళ్ళు కొందరు.మావాళ్ళ దగ్గరున్న విలువైనవన్నీ యిప్పిస్తాను. తప్పుకోండి. ఆడవాళ్ళ మీద మాత్రం చేతులేయ వద్దు అని (తన గుంపులోని వారిలో తన) పెద్దరికాన్ని, తమ ఆడవాళ్ళ మీద అభిమానము, స్వాభిమానము, నిలబడి మాట్లాడే తెంపును చూపించి, స్వచ్ఛందంగా నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళు కొందరు, యిలా తమ తమ జన్మలకు, కర్మలకు అనువుగా ప్రవర్తించే ప్రయాణికులు నాలుగు వర్ణాలవారూ కకావికలు అవుతుంటే దోచుకోడం ప్రారంభించారు ఆ బందిపోటుదొంగలు. ఎదురుతిరిగి కత్తులు కఠారూలూ విల్లంబులూ పట్టుకున్నవాళ్ళవైపుకు పోకుండా, తమకు ఎదురుపడ్డ వాళ్ళను పొడిచారు. లోభితనంతో సోమ్ములకోసం పెనుగులాడుతున్నవాళ్ళను పెద్దగా యిబ్బందిపెట్టకుండా నెత్తురు చిమ్మేట్లు పొడిచి చేతికి అందిన దాన్ని, చేతుల్లో ఉన్నదాన్ని లాక్కున్నారు.

అన్నిటికీ సిద్ధపడి,
గుంపును చీల్చుకుని పిక్కబలంతో పారిపోయేవాళ్ళను వెంటబడి తరమకుండా దొరికినవాళ్ళమీదే దృష్టి పెట్టారు, ఎందుకు సమయాన్ని పరుగుపందాలతో వృధా  చేయడం అని. చిల్లి కాసులేని వాళ్ళను, బలిసి బలంగా ఉన్నవాళ్ళను విడిచిపెట్టారు వాళ్లజోలికి పోకుండా, అనవసరమైన ప్రయాస, పోరాట కౌశలం చూపించి ఎందుకు  సమయాన్ని వృధా చేయడం అని. పొదలలో దూరి దాక్కున్నవాళ్ళను ఈటెలతో పొదలలో పొడిచి బయటకు లాగి, కట్టుబట్టలతో సహా సర్వమూ దోచుకుని జాలి గలవాళ్ళలాగా కట్టుకోడానికి గోచీలను మాత్రం యిచ్చారు. సన్నని, పదునైన  బాణాలతో చెప్పులలో గుచ్చి చీల్చి, సిగముడులు విప్పీ శోధించారు, చెప్పుల్లో కొప్పుల్లో దాచిపెట్టుకునే మేధావుల సంగతి తెలిసినవారు గనుక! యిలా విచ్చలవిడిగా  రెచ్చిపోయి నానారకాలుగా బాటసారులను దోచుకున్నారు ఆ బందిపోట్లు. ఈ సంరంభంలో, పిరుదులమీదినుండి ఎదుర్రొమ్ము దాకా నీలిరంగు దట్టీని కట్టుకున్న వాడొకడు, తన పిల్లిగడ్డం కుండలాంటి పొట్టమీదికి వ్రేలాడుతుండగా, ముఖానికి నల్లగా మడ్డిని పూసుకున్నవాడు, చేతిలో చురకత్తి బిగించి పట్టుకుని, నేను మా గ్రామానికి బయలుదేరినదగ్గరినుండీ కనిపెట్టి చూస్తున్నవాడు, 'కాక శ్మశ్రువు' అనే పేరుగలవాడు, నన్ను గుర్తుపట్టాడు. నేను పారిపోవడానికి పరుగెత్తుతుంటే చూసి, హఠాత్తుగా నామీదకు  ఉరికి, నా కాళ్ళసందులలో వాడి పొడవాటి కత్తిని అడ్డంగా దూర్చి నన్ను క్రింద పడవేశాడు. ధోవతీని పట్టుకుని ఈడ్చిపారేశాడు. నేను పెనుగులాడుతుంటే నా  వరహాలమూటను కోసి లాక్కున్నాడు. తమ్మెలదాకా నా చెవులను అంటగోసి నా  చెవిపోగులను వలుచుకున్నాడు. నా విలువైన కుళ్ళాయిని కూడా వలుచుకుని వాడు పారిపోతుంటే ఉన్నవాడిని ఊరకే ఉండకుండా నేను అరిచాను.

నోరిసని నుండ కే నో
రోరి యకట మా సమీప వూరనె మనియున్ 
దూరము వోయితివే సొ
మ్మేరీతిని నీకు దక్కునే కానీరా 

ఒరేయ్! అయ్యయ్యో! మా ఊరికి దగ్గరలోనే ఉండేవాడివి కదూ! ఎంత దూరం పోతావు? నా సొమ్ము ఎలా నీకు దక్కుతుందో అదీ చూస్తాను అని అరిచాను. 

అనిన లాఁతుగఁ గోల్పోక నతడు రడ్డి
రాజుఁ గను నని కొదయుఁ దీర్పంగ మగుడి 
యంతఁ బరియును బైప్రజ కలికి పాఱి 
పోవ వాఁడును వెడపోట్లు వొడిచి చనియె 

యిలా నేను మూర్ఖుడిలాగా అరువగానే , నేను వాడిని గుర్తుపట్టిన సంగతిని వాడు గమనించాడు.పెద్దమొత్తంలో పోగొట్టుకున్నాను కనుక, గ్రామాధికారిని(రడ్డి/పటేలు) రాజును కలిసి, వాడి సంగతి చెబుతాను అని, మిగిలిన పనిని చక్కబెట్టడానికి, ఆ ఒక్క కొరతా తీర్చడానికి, ధనము ఎలాగూ పోయింది, మిగిలిన ప్రాణాలను కూడా తీసిపారేస్తే పోతుంది అని, వెనక్కు తిరిగాడు. అందరూ తమ తమమీదికి దాడి చేస్తున్నవారిని చూసి పారిపోతున్నారు. వాడు నన్ను సమీపించి, ప్రాణాలు పోయేట్లు  అడ్డగోలుగా నన్ను పొడిచి పారిపోయాడు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు