రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( నాల్గవ భాగం) - కర్రా నాగలక్ష్మి

beauty of rajastan   4th part

బావి నుయ్యి అని పిలుస్తూ  తాతగారింటి పెరట్లో వుండి , ఇంటికి కావలసిన నీళ్లు అందించడం  మా కాలం వారికి తెలుసు కాని యిప్పటివారికి " బోర్ బావు "లే తెలుసు అలాంటి బావులలో మెట్ల బావులగురించి విన్నారా ? రాజస్థాన్ లో తప్ప మనకిప్రపంచం లో యెక్కడా మెట్లబావులు కనిపించవు .  అందులో ప్రపంచంలోనే అతి పెద్దదిగానూ అతి లోతైన బావిగా చెప్పబడే బావి గురించి చెప్పుకుందాం . రాజస్థాన్  లో దౌసా జిల్లాలో జైపూర్  ఆగ్రా రోడ్డుమీద జైపూర్ కి 95 కిలో మీటర్ల దూరంలో వున్న చాంద్ బౌరి లేక చాంద్ బావ్డి అని పిలువ బడే బావి అతి పెద్దదిగా గానూ అతి లోతైనదిగానూ ప్రసిద్ధి చెందింది . 

ఈ బావి అభనేరి పట్టణంలో క్రీస్తు శకం 800 - 900 కాలానికి మధ్యలో నికుంభ వంశానికి చెందిన చాంద్ రాజు కట్టించి నట్లుగా చరిత్రకారులు చెప్తారు . అభనేరి పట్టణం ఆభానగరి గా పిలువబడేది . ఆభ అంటే ప్రకాశవంతమైన అని అర్ధం , కాలక్రమేణా ఆభనగరి అభనేరిగా వ్యవహరింపబడ సాగింది . పల్లెలలో చెరువులను పోలి వుంటాయి ఈ మెట్ల బావులు .  అయితే వీటిని చెరువులు అని యెందుకు అనకూడదు అనే అనుమానం కలగొచ్చు . వీటిని మొదటిసారి చూసినపుడు నాకు యీ అనుమానం కలిగింది  .  చెరువులు కూడా మెట్లు కలిగివుంటాయి . ఇవి పూర్వకాలంలో వర్షపునీటిని  నిలువచేసేందుకు కట్టిన నీటి తొట్టెలు అని చెప్పుకోవచ్చు . చెరువుల లోతు సాధారణంగా పది పన్నెండు అడుగులకు మించదు . కాని బావి అంటే భూగర్భ జలాలు వచ్చేంతవరకు అంటే పాతిక అడుగులు లేకఅంతకు మించి లోతు వరకు తవ్వుతారు     బావి చూడ్డానికి వెళ్తున్నాం అంటే నవ్వు వచ్చింది కాని అక్కడకి చేరుకున్నాకా బావి అంటే యిలాకూడా వుంటుందా అని అనిపించింది . మెట్ల ని చెక్కిన పనితనం , ఆ మెట్లు , పదమూడు అంతస్తులుగా కట్టిన కట్టడం ఒక్కో అంతస్తూ దిగుతూ కిందకుచేరుతూ వుంటే కింద అంతస్తులలో కట్టిన గదులు ,  చాలా బాగుంది . బావి చూడడం యేమిటి అని వెళ్లక పోయుంటే ఒక అద్భుతాన్ని చూడలేకపోయుండే వాళ్లమి . మెట్లు దిగుతూ ఒక్కో అంతస్తు కిందకి చేరేకొలదీ వుష్ణోగ్రతలలో మార్పు తెలియసాగింది .  నీళ్లదగ్గరకి చేరేసరికి సుమారు అయిదు ఆరు డిగ్రీల తేడా తెలిసింది . 

రాజస్థాన్ లో యెండలు చాలా తీక్షణం గా వుంటాయని , నీటి యెద్దడిని  ప్రదేశమని మనకు తెలుసు . అప్పటి రాజులు నీటి యెద్దడిని తట్టుకనేందుకు భూగర్భ జలాలను ఒకే చోట కేంద్రీకరించి కొన్ని గ్రామాలకు ఒకటి చొప్పున యిలా పెద్ద పెద్ద బావులుకట్టించేవారు . యెండాకాలంలో వేసవి వేడికి తట్టుకొని సేద తీరేందుకు  ప్రజల కోసం కట్టించిన పెద్ద పెద్ద వరండాలు , గదులు , రాజ పరివారంకోసం కట్టించిన గదులు చూస్తే రాజులు ప్రజలకోసం యెంత శ్రద్ధ తీసుకొనేవారో తెలుస్తుంది . బావి మెట్లు , గదులకు వున్నపనితనం అంతా రాజస్థానీ శిల్పకళ ను గుర్తు చేస్తూ వుంటుంది . ఈ చాంద్ బావిడి 3500 మెట్లు , 30 మీటర్ల లోతు , పదమూడు అంతస్తులు కలిగి ప్రపంచంలోని అతి విశాలమైన , అతిలోతైన బావిగా పేరుపొందింది .

ఈ బావికి యెదురుగా హర్షతమాతా మందిరం వుంటుంది . చాంద్ రాజు ఈ బావి ని నిర్మించి యీ దేవికి సమర్పించేడని అంటారు . ఈ దేవి ని పూజిస్తే భక్తులు హర్షోల్లాసాలతో వుంటారని స్థానికుల నమ్మకం .     ప్రస్తుతం యీ వూరు పాడు పడిపోయింది , ఈ బావి విదేశాలల కూడా పేరుపొందింది కాబట్టి విదేశీ యాత్రీకులు రావడం తో రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేక శ్రధ్ద వహించి  యీ అద్భుత కట్టడాన్ని రక్షిస్తున్నారు .    సుమారు రానూ పోనూ 150 కిలో మీటర్లు యెక్కు ప్రయాణించినా ఒక అద్భుతాన్ని చూసిన తృప్తితో అజ్మేర్ వైపు ప్రయాణం సాగించేము . 

పుష్కర్ ---

జైపూర్ నుంచి అజ్మేర్ సుమారు 130 కిలోమీటర్లు ణ్-8 పై వెళ్లొచ్చు . ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లే రోడ్డు చాలా విశాలంగా కట్టిన రోడ్డు కాబట్టి ప్రయాణం చాలా బాగా సాగుతుంది  . అజ్మేరు నగరానికి సుమారు 14 కిలో మీటర్ల దూరంలో వున్న గ్రామం పుష్కర్ . ఇది హిందువులకు పరమపవిత్రమైన ప్రదేశాలలో ఒకటి .

శివ పురాణం ప్రకారం సతీ దేవి వియోగానికి తట్టుకోలేకపోయిన శివుడు రుద్రతాండవమాడుతూ  దుఃఖించేడుట , ఆ కన్నీరు నేల పై పడి ఆ నీటితో పెద్ద సరస్సు యేర్పడింది . అలా శివుని ఒక కంటి నుంచి పడ్డ నీటితో పుష్కర సరస్సు యేర్పడగా రెండవదిపాకిస్థాన్ లో వున్న కేతాస్ రాజ్ . కేతాస్ రాజ్ అనే పదం సంసృత పదమైన ' కేతాక్షి ' నుండి వచ్చిందని పండితుల అభిప్రాయం . కేతాక్షి అంటే ' వర్షించే కళ్లు ' అని అర్ధం . శివుని కళ్లనుండి వర్షించిన  నీరు పడ్డ ప్రదేశం కాబట్టి వీటిని పాకిస్థాన్ లో వున్న సరస్సు కేతాక్షి రాజ్  అని అజ్మేర్ లో వున్న సరస్స తీర్థరాజ్  గా పిలువబడుతున్నాయి . ఒక సర్వే ప్రకారం దేశం లో యెక్కువ విదేశీ యాత్రీకులను ఆకర్షించే ముఖ్య పర్యాటక స్థలంగా పుష్కర్ గుర్తించబడింది . సత్యయుగంలో బ్రహ్మ దేవుడు యాగం చెయ్యాలని అనువైన ప్రదేశం కొరకు వెతుకుతూ తన చేత నున్న నీలి కలువను భూమి పైకి జారవిడిచి  ఆ పుష్పం పడ్డ ప్రదేశంలో యాగం చెయ్య నిశ్చయించుకుంటాడు . పుష్కర అంటే పుష్పం + కరం అంటే చెయ్యి , బ్రహ్మ దేవుని చేతి నుంచి తామర పుష్పం జారిపడిన ప్రదేశం కాబట్టి పుష్కర గా పేరు వచ్చింది అనేది ఒక కథ . పుష్కరం పక్కన యేర్పడ్డ  గ్రామం కావడంతో ఈ గ్రామం కూడా పుష్కర్ గా పిలువబడుతోంది . ఈ పుష్కర్ సత్య యుగానికి చెందినది అయినా యిక్కడ వున్న మందిరాలు చాలా కొత్తగా వున్నాయి .

మొఘల్ రాజుల ఆగ్రహానికి బలైన చాలా మందిరాలలో యివి కొన్ని . చాలా మందిరాలను ఈ శతాబ్దం లో నిర్మించడం జరిగింది . పుష్కర్ లో వున్న ఘాట్లు బ్రహ్మ కోవెల , గాయత్రీదేవి మాత మందిరం లాంటి చాలా మందిరాలు మూలవిరాట్టును అలాగే వుంచి మిగతా ప్రదేశమంతా కొత్తగా అంటే సుమారు 1985 తరువాత కట్టబడ్డవి . యెందకంటే ఆ ప్రాంతాలలో మేము వెళ్లినప్పుడుయింత పెద్ద మందిరాలు  లేవు . అలాగే పుష్కర్ సరస్సు ఒకటి రెండు ఘాట్స్ తో కలుషితమైన నీటితో వుండేది . ఇప్పుడు గవర్నమెంటు నీటిని తరచుగా శుభ్రపరచి భక్తులు నీటిలో విడిచే పూలను ప్రసాదాలను సరస్సునుంచి బయటకు తీయటం తో తేడా బాగాతెలుస్తోంది . ప్రస్తుతం పాలరాతి తో మెట్లు కట్టి , టికెట్టు తీసుకున్న భక్తులకు వారి అభీష్టం ప్రకారం విధులను  పూజారులు నిర్వహించే సౌలభ్యం కలుగజేసేరు . ఈ సరస్సులో మధ్యన బ్రహ్మ చతుర్ముఖునిగా వున్న విగ్రహం వుంది . యెక్కడైతే బ్రహ్మ విగ్రహం వుందోఅక్కడ సర్వ మంత్ర మాతృమూర్తి అయిన గాయత్రీదేవి వుధ్బవించిన ప్రదేశం . ఈ సరస్సుకు నాలుగు వైపులా మొత్తం 52 ఘాట్స్ నిర్మించేరు .


పుష్కర్ సరస్సుకు సంబంధించిన మరోకథ యిలా చెప్తారు . ఈ సరస్సు  పుష్కరుడు నివసించే ప్రదేశం . ఈ పుష్కరుడు యెవరు అంటే యితను వరుణుని కుమారుడు , బ్రహ్మ గురించి తపస్సుచేసి సర్వ నదులూ భక్తుల పాపప్రక్షాళన వలన పోగొట్టుకున్నపవిత్రతను ఆ నదులకు తిరిగి కలుగజేసేరు వరం పొందుతాడు . గరుగ్రహం రాశిమారినపుడు ఆయా నదులలో ప్రవేశంచి వాటికి పవిత్రతను కలుగ జేస్తాడు . ప్రతి రోజూ ప్రాతఃకాలములో అన్ని పుణ్యక్షేత్రాల దగ్గరవున్న తటాకాలలోను వుండి పాప విముక్తులనుచేస్తూ వుంటాడు , మరి మిగతా సమయాలలో ఈ పుష్కరుడు యెక్కడ వుంటాడు అంటే యీ పుష్కర్ రాజ్ లో వుంటాడు . అందుకే యిది పుష్కర్ అని పిలువ బడుతోంది 

గాయత్రీదేవి పుట్టుకకి సంభందించిన పురాణ గాథ యీవిధంగా చెప్తారు . యాగం చెయ్యదలచిన బ్రహ్మ పవిత్ర స్థలం కొరకు వెతుకుతూ తన వాహనమైన హంసకు నీలికమలాన్ని యిచ్చి తగు ప్రదేశంలో నీలీ కమలాన్ని జారవిడివమని చెప్తాడు . పూవు నేలను తాకిన తాకిడికి రేకులు మూడు ప్రదేశాలలో వెదజల్లబడతాయి , వీటినిజేష్ట పుష్కర్ , మధ్యపుష్కర్ , కనిష్ట పుష్కర్ అని పిలుస్తారు . ఆ పూవు పడ్డ ప్రదేశానికి వచ్చి చూడగా ఆ ప్రదేశంలో వజ్రాశనుడు లేక వజ్రనాభుడు అని పిలువ బడే రాక్షసుడు ప్రజలను నాన్నా హింసలకు గురి చెయ్యడం చూసిన బ్రహ్మ మంత్రించినకలువపువ్వు తో రాక్షసుని సంహరించి , యాగ ప్రదేశమును దుష్ట శక్తుల నుంచి రక్షించుటకు నాలుగువైపులా నాలుగు పర్వతాలను కాపలాగా పెడతాడు . అవి వుత్తరాన నీలగిరి , దక్షిణాన రత్నగరి , తూర్పున సూర్యగిరి , పడమటన సంచూరా అనిపిలువబడుతున్నాయి . ఆ ప్రదేశంలో యాగం నిర్వహిస్తాడు .

యాగానంతరం పూర్ణాహుతిని శాస్త్ర ప్రకారం భార్యాసమేతుడై నిర్వహించాలి , పూర్ణాహుతి కొరకు బ్రహ్మ భార్య అయిన సావిత్రీ దేవికి పిలుపును పంపగా స్త్రీ సహజమైన అలంకరాశక్తితో అలంకరణకు  అధిక సమయం వెచ్చించ సాగింది . ఋత్విక్కులుసమయము మించిపోవుచున్నదనే హెచ్చరికతో సమీపమున సంచరించుచున్న గరిజన కన్యను గడ్డితో కలిపి కామధేనువుకు తినిపించి మలద్వారము ద్వారా  బయటకు తీసి , యిలా ముమ్మారు చేసి శుద్ధి పరచి బ్రహ్మ తో వివాహము చేసి పూర్ణాహుతినినిర్వహిస్తారు . గోవుతో శుధ్ది చేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నాలుగు వేదాలూ నాలుగు ముఖాలుగా  , బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు వారి ఆయుధాలను యివ్వగా , లక్ష్మి , పార్వతీ , సరస్వతులు తమతమ శక్తులను ప్రసాధించగా బ్రహ్మవాహనమైన తెల్లని హంసను వాహనముగా పొంది , యెనిమిది కన్నులతో యెనిమిది దిక్కులూ చూస్తూ తన నిజముఖానికి గల కన్నులతో ఆకాశమును  , పాతాళములను వీక్షిస్తూ బ్రహ్మకు సృష్టి కార్యంలో తోడ్పడుటకు కావలసిన జ్ఞానమును బ్రహ్మ నుండిపొందుతుంది . సర్వమంత్రాలకు , సర్వతంత్రాలకు మాతృమూర్తి ని చేస్తారు . గాయత్రి ని వేదమాతగా స్తుతిస్తారు . యాగానంతరము సావిత్రి వచ్చి బ్రహ్మ ప్రక్కన కూర్చొని దేవతల అశీస్సులు పొందుతున్న గాయత్రి ని చూచి జరిగిన విషయం యెరిగినదై బ్రహ్మ పై కోపగించుకొని బ్రహ్మ కు భూలోకంలో పూజర్హత లేకుండునట్లు నట్టు , విష్ణు మూర్తి కి భార్యా వియోగంకలగాలని , ఇంద్రుడు యధ్దములలో యెప్పుడూ పరాజయం పొందాలని , ఆహుతి స్వీకరించిన అగ్ని యెప్పుడూ ఆకలితో వుండాలని , యాగం చేయించిన ఋత్వికులు దారిద్ర్యం తో బాధ పడాలని శపించి కోపముతో రత్నగరి పర్వతము పై నివసించసాగింది .

సర్వ మంత్రమాత అయిన గాయత్రి బ్రహ్మ కు పుష్కర్ లో జరిగే పూజలకు అర్హుడుగానూ , ఇంద్రుడు యుధ్దంలో వోడినా కూడా స్వర్గవాసము నందే వుండునట్లు , విష్ణుమూర్తి కి రామావతారములో మాత్రమే భార్యా వియోగములు కలుగునట్లు ,ఋత్వికులకు  సర్వశాస్త్ర పారంగత , అఖండ జ్ఞానం వుండేటట్టుగా శాపములను మార్చి వేస్తుంది . 

పుష్కర్ లో చూడతగ్గ మరికొన్ని మందిరాలు 

1) జగత్పిత బ్రహ్మ కోవెల
2) పాప విమోచన గాయత్రి
3) మహదేవ్ కోవెల
4) వరాహ కోవెల
5) సావిత్రి దేవి మందిరం
6) ఆత్పతేశ్వర్ మహదేవ్ మందిరం
7) పుష్కర్ పశువుల సంత

1) జగత్పిత బ్రహ్మ కోవెల ---

ఈ కోవెల మొత్తం పాలరాయితో నిర్మించ బడింది . పూర్వం నుంచి వున్న మందిరం యెర్రరాతి కట్టడానికి పాలరాతి కట్టడం చేర్చి విశాలంగా ఈ మధ్యకాలంలో అంటే సుమారు 1990 ప్రాంతాలలో కట్టేరు . పాలరాతి తో పెద్ద పెద్ద మెట్లు యెక్కి పైకి వెళితేవిశాలమైన వరండా అక్కడ రాజస్థాన్ శిల్పకళ తో కట్టిన కట్టడాలు , ఒకవైపున నల్లచలువరాతి యేనుగుపై కుబేరుడు మరో ప్రక్కన తెల్ల చలువరాతి యేనుగుపై బృహస్పతి వున్న విగ్రహాలు జీవకణ వుట్టిపడుతూ వుంటాయి . అక్కడే గరుత్మంతుడి విగ్రహంవుంటుంది . విశాలమైన ప్రాంగణం దాటుకొని లోపలి గర్భగుడిలోకి వెళితే అక్కడ కాలుమడిచి కూర్చొని వున్న సృష్టి కర్త విశ్వకర్మ రూపంలో ఆదిశంకరులచే పూజింపబడ్డ విగ్రహం వుంటుంది . కోవెల శిఖరం బ్రహ్మదేవుని వాహనమైన హంసకు ప్రతీక , మధ్య నుండేమూల విరాట్టు నాలుగు ముఖాలు , నాలుగు చేతులు కలిగి వున్న నిలువెత్తు బ్రహ్మ విగ్రహం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తుంది . నాలుగు చేతుల్లో అక్షరమాల , వేదాలు , కుశం, కమండలం ధరించి  యెడమవైపు గాయత్రి , కుడి వైపు సావిత్రి లతోహంసపై ఆశీనుడై దర్శనమిస్తాడు . గోడలపై వివిధ దేవతామూర్తులు , నెమలి , హంసల మూర్తులు చెక్కబడి వుండడాన్ని చూడొచ్చు . గర్భగుడి వెలుపల నిలువెత్తు ద్వారపాలకులను చూడొచ్చు . విష్ణుమూర్తి విగ్రహం వుంటుంది . పాలరాతి తో చెక్కినమకరతోరణాలు , నగిషీలతో వుండే కిటికీలు చూస్తే ఆ శిల్పులకు జోహార్లు చెప్పాలనిపిస్తుంది . గర్భగుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు వెనుకవైపున వున్న కిటికీలలోంచి చూస్తే సావిత్రీమాత కోవెల కనిపిస్తుంది .          బ్రహ్మ కోవెలలో " గుజ్జర్ " జాతి కి చెంది బ్రహ్మచర్యం అవలంభించిన పరాశరగోత్రీకులకు మాత్రమే మూలవిరాట్టును తాకి పూజాది కార్యక్రమాలు నిర్వహించే అర్హత వుంది . ఈ  ఆచారం బ్రహ్మ కోవెల నిర్మించినప్పటి నుంచి అమలులో వుంది .

2) పాపమోచన  గాయత్రి మందిరం..

పుష్కర్ సరస్సు కి తూర్పు వైపున మార్వార్ బస్సుస్టాండు వెనుకవైపున వుంటుందా మందిరం . పుష్కర్ గట్టుమీంచి అర కిలోమీటరు నడిచి వెడితే చేరుకోవచ్చు . మామూలుగా వుండే చిన్న మందిరం . గాయత్రీ దేవి విగ్రహం భక్తులు పిలిస్తే పలికివరాలిచ్చేంత సజీవంగా వుంటుంది . బ్రహ్మ హత్యా పాతకం నుంచి విముక్తులను గావిస్తుంది యీ గాయత్రీమాత .

3) మహదేవ్ మందిరం..

నేపాల్ లోని  పశుపతి నాథ్  విగ్రహాన్ని పోలిన పాలరాతి విగ్రహం అయిదు తలలతో వుంటుంది . కోవెలలో మరో ముఖ్యమైన ఆకర్షణ యేమిటంటే గర్భగుడిలో ప్రతిష్టించిన అష్టోత్తర శివలింగాలు .

4) వరాహ కోవెల--

హిరణ్యాక్షుని సంహరించేందుకు వరాహ అవతారంలో వెడుతున్న విష్ణుమూర్తి కాస్త సేపు యిక్కడ విశ్రమించినట్లుగా స్థలపురాణం . 12 వ శతాబ్దానికి చెందిన మందిరాన్ని ఔరంగజేబు పడగొట్టగా 1724 లో సవాయ్ జై సింగు గర్భగుడి లోపల చక్కనిశిల్పకళతో నిర్మించేడు . నిలువెత్తు జీవకళ వుట్టిపడుతున్న విగ్రహాన్ని  ప్రతిష్టించేడు .

5) సావిత్రి దేవి మందిరం ---

యజ్ఞ పూర్ణాహుతి సమయంలో తనకొరకు వేచియుండక గాయత్రీ దేవి ని వివాహ మాడిన బ్రహ్మ పై అలిగిన సావిత్రి రత్నగరి పర్వతం పైన నివసించసాగింది . పుష్కర్ వచ్చే భక్తులు ముందుగా సావిత్రి మాత మందిరం దర్శించుకొని తరువాత సరస్సునుఆ తరువాత బ్రహ్మ కోవెలను దర్శించుకోవాలి . కొండ దారిన 1.5కిలోమీటరు నడవాలి , కాస్త కష్టంగానే వుంటుంది . సావిత్రీ మాత కి గాజులు పసుపు కుంకం సమర్పిస్తే భక్తుల సౌభాగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు . ఇది చాలా చిన్నకోవెల 7వ శతాబ్దం లో బికనీరు రాజులు ఈ మందిరాన్ని నిర్మించేరు . పుష్కర్ లో కనిపించే అతి తక్కువ పురాతన మందిరాలలో యిది వొకటి    

6) ఆత్పతేశ్వర మహదేవ్ మందిరం --

బ్రహ్మ నిర్వహించే మహా యజ్ఞానికి పరమశివుని పిలవడం మరచిపోతాడు . దానికి ఆగ్రహించిన శివుడు మాంత్రికుని వేషధారణలో కపాలమును చేత ధరించి యాగ ప్రదేశమునకు వస్తాడు . శివుని అవతారము చూసిన బ్రహ్మ కోపముతో చిరాకుపడతాడు . అందుకు ఆగ్రహించిన శివుడు యాగ ప్రదేశమంతటనూ కపాలములను పడవైచి అపవిత్రము చేసి కైలాసమునకు వెడలిపోతాడు . జరిగిన పొరపాటు తెలుసుకున్న బ్రహ్మ శివుని ప్రార్ధించి ప్రసన్నుని చేసుకొంటాడు . ఆ సంఘటనకు ప్రతీకగా బ్రహ్మ తనకోవెల పక్కగా గుహలో నివాసముండి భక్తులను కటాక్షింపమని వేడుకొనగా శివుడు ఈ గుహామందిరములో ఆత్పతేశ్వరునిగా కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు . ఈ గుహలోని శివలింగం చాలా పెద్దది . రాగి పామును శివలింగానికి అలంకరిస్తారు . శివరాత్రివిశేష పూజలు నిర్వహిస్తారు . వేదమంత్రాలు పుట్టిన ప్రదేశమైన పుష్కర్ లో వేదిక పాఠశాలలు , వైదిక ధర్మశాస్త్రాల అధ్యయనానికి కావలసిన వసతులు వున్నాయి . ఈ ప్రదేశాలన్నీ దేశీయులనే కాక విదేశీయులను కూడా ఆకర్షించడం ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది .పుష్కర్ లో ని అన్ని మందిరాలలోనూ కార్తీక పున్నమి పూజలు అత్యంత భక్తి శ్రధ్దలతో నిర్వహిస్తారు .  ఆ సమయంలో నిర్వహించే పశువుల సంత ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను కట్టుకుంటోంది .

7) పుష్కర్ పశువుల సంత -----

కార్తీక పున్నమి తో మొదలై అయిదు రోజులు జరిగే పశువుల సంత యిది . ఈ సంతలో అన్ని రకాలయిన పశువుల కొనుగోలు అమ్మకాలూ జరిగినా ముఖ్యంగా ఒంటెల అమ్మకాలూ కొనుగోళ్లూయెక్కువగా జరుగుతాయి . ఈ సంతలో సుమారుగా ప్రతీ సంవత్సరం యాభైవేల ఒంటెల అమ్మకాలు కొనుగోళ్లూ జరుగుతున్నట్లుగా అంచనా . అందుకే పుష్కర్ సంత విదేశాలలో కూడా ప్రాముఖ్యతను సంతరించుకొని " పుష్కర్ కేమల్ ఫెయిర్ " గా పిలువబడుతోంది . ఒకే చోట అన్నివేల ఒంటెలను చూడ్డానికే విదేశీ పర్యాటకులు వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఈ పశువుల సంతలో వుండే మరో ఆకర్షణ యేమిటంటే పశువుల అలంకరణకు కావలసినవి పూసలు , గవ్వలు , అద్దాలు మొదలయినవివుపయోగించి  చేతితో చేసిన యెన్నో వస్తువలు విక్రయానికి వస్తాయి . వాటి పనితనం దేశ విదేశ పర్యాటకులను ఈ పశువుల సంతకు వచ్చేటట్టు చేస్తోంది అనడం లో యే మాత్రం అతిశయోక్తి లేదు .

తరవాత సంచికలో మనం అజ్మేరు దర్గా గురించి , కోట గురించి తెలుసు కుందాం అంతవరకు శలవు . 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు