రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( ఐదవ భాగం) - కర్రానాగలక్ష్మి

పుష్కర్ నుంచి మా ప్రయాణం అక్కడకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న అజ్మేరు నగరం వైపు సాగింది . రాజస్థాన్ లో అయిదు పెద్ద నగరమైన అజ్మేరు అజయమేరుగా ( జయింపలేని పర్వతము ) పిలువబడేది . ఈ నగరం 7 వ శతాబ్ధం లో అజయ్ రాజ్ సింగ్ చౌహాన్ పరిపాలనలో  అతని జ్ఞాపకార్థం ఆ నగరానికి అజయమేరుగా మార్చేరు . కాల క్రమేణా అజ్మేరు గా మారింది .



1149 నుంచి 1192 వరకు పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీ సింహాసనాన్ని గెలుచుకున్నప్పుడు అజ్మేరు అతని పాలనలోకి వచ్చింది . పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీ ని అజ్మేరును ముఖ్య పట్టణాలుగా చేసుకొని తన సామ్రాజ్యాన్ని పరిపాలించేడు . 15 వ శతాబ్దం లో మేవాడ్  రాజులకు మార్వార్ రాజులకు అజ్మేరు సింహాసనమున కొరకై యుధ్దాలు జరిగేవి . 1553 లో ఢిల్లీ సింహాసనాన్ని గెలుచుకున్న హేమూ చక్రవర్తి పరిపాలనలోకి వచ్చింది యీనగరం . 1556 లో రెండవ పానిపట్టు యుధ్దంలో హేమూ చక్రవర్తి మరణంతో ఈ సింహాసనం అక్బరు చేతుల్లోకి మారింది . 17 వ శతాబ్దం లో మరాఠాల పరిపాలనలో వుండి 1818 లో మార్వారు , అజ్మేరు బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్లిన యీనగరం 1956 నవ్వంబరు ఒకటో తేదీన రాజస్థాన్ రాష్ట్రం యేర్పరచి అందులో అజ్మేరు నగరాన్ని వినీలం చేసేరు .    యెన్నో యధ్దాలు యెన్నెన్నో రాజవంశస్థులను చూసిన నగరం యిది . 

ఆరావళీ పర్వతాలలో వున్న " తారాఘర్ " అనే పర్వతాన్ని ఆనుకొని కట్టబడిన నగరం .  ఈ నగరాన్ని నాగపథ్తర్ పర్వత శ్రేణులు " థార్ " యెడారి నుంచి వేరు చేస్తున్నాయి . ఈ నగరానికి ఉత్తరం వైపున " అనసాగర్ " అనే మానవనిర్మితమైన సరస్సు వుంది . 

2013 లో " కిషన్ ఘర్ " విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు కాని యింతవరకు నిర్మాణం పూర్తి కాలేదు . ఈ సంవత్సరం అజ్మేరు విమానాశ్రయాన్ని జాతికి సమర్పిస్తారు .

 ఈ నగరంలో చాలా చారిత్రాత్మక స్థలాలు వున్నా ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాలు---

 1) తారాఘర్ కోట
 2) అనసాగర్ సరస్సు 
 3) అజ్మేర్ షరీఫ్ దర్గా 
 4)  అఢైదిన్ కా ఝోప్డా

 5) సోనీ జీ కీ నసియా
 6) నరేలీ జైన మందిరం

1) తారాఘర్ కోట-----

 అజ్మేర్ నగరానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో " నాగ పహాడ్ " కొండవాలులో కట్టబడిన కోట . షరీఫ్ దర్గా కి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో వుంది . చారిత్రిక ఆధారాల ప్రకారం యీ కోట 1354 సం.. లో కట్టబడింది . ఈ కోట వున్న ప్రాంతాన్ని"  బూంది " పట్టణం అని కూడా వ్యవహరిస్తారు . ఈ కోటలోపలకి వెళ్లడానికి మూడు ప్రధాన ద్వారాలు వున్నాయి . వీటిని లక్ష్మీ పోల్ , ఫుత దర్వాజా , గాగుడి కి ఫాటక్ అని అంటారు . బాగా పాడుబడిపోయిన  యీ కోట సొరంగ మార్గాలకు ప్రసిధ్ది , యీ కోట నుంచి కొండలలోకి అనేక సొరంగ మార్గాలు వున్నట్లు , సరియైన మేపులు తీసు కొని వెళ్లక పోతే సొరంగమార్గాలలో తప్పిపోయే ప్రమాదం వున్నట్లు స్థానికులు చెప్తారు . బూందీ పట్టణానికి నీటి సరఫరా " చౌహాన్ బేసిన్స్ " రిజర్వాయర్ నుంచి వచ్చేట్టుగా నిర్మించేరు . ఈ కోటలో రాణీ వాసపు స్త్రీలు నివసించడానికి కట్టిన రాణీ మహలు చాలా మటికి పాడుబడినా అప్పట్లో కిటికీలకు వాడిన  రంగు రంగుల అద్దాలు , రంగు వెలసిన గోడలు పూర్వపు వైభవాన్ని చెప్పకనే చెబుతాయి . పదహారవ శతాబ్దానికి చెందిన విజయచిహ్నం " భీమ్ బృజ్ "  యిప్పటికీ చెక్కుచెదరక వుండడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది . ఈ భీమ్ బృజ్ " పైన " గర్భ గుంజ్ " అని పిలువబడే అతి పెద్ద ఫిరంగు వుండేదట , యుధ్దసమయంలో దానిని పేలుస్తే వచ్చే శబ్ధం క్రోసుల దూరాలలో వున్న వారిలో కూడా ప్రకంపనలు కలుగ జేసేదట . ఈ పాడు బడ్డ కోటలో మిరాన్ సాహెబ్ కా దర్గా వుంది ,  యుధ్ద సమయంలో కోటరక్షణ లో ప్రాణాలను విడిచిన యితనికి కోటలో సమాధి కట్టి రాజవంశస్థులు ఋణం తీర్చుకున్నారు .

2) అనసాగర్ సరస్సు ----

ఇది మానవ నిర్మితమైన పెద్ద సరస్సు . పృధ్విరాజ్ చౌహాన్ తాత అనంగపాల్ తోమర్ (1135-1150) చే నిర్మింపబడిన పదమూడు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన సరస్సు . చుట్టూరా రాజస్థానీ మరియు మొఘల్ సాంప్రదాయ శిల్పకళతో కట్టిన వరండాలు , విశ్రాంతి గదులు కలిగిన పాలరాతి కట్టడాలు యీ సరస్సు చుట్టూ వున్నాయి . దౌలత్ గార్డెన్ రకరకాలైన పూల మొక్కలతో కళకళ వాడుతూ వుంటుంది . సరస్సు మధ్యలో చిన్న ద్వీపంలాంటిది వుంది అక్కడకు వెళ్లడానికి సరస్సులో విహరించడానికి బోటు సర్వీసులు వున్నాయి . ఈ సరస్సు లోతు సుమారు 4.4 మీటర్లు . దౌలత్ గార్డెన్ ను అక్బరు కుమారుడు జహంగీరు గా మారిన సలీం కట్టించేడు . సరస్సు చుట్టూరా వున్న వరండాలు , కట్టడాలు అతని పుతృడైన షాజహాను కట్టించేడు . ఈ సరస్సు చుట్టూ యెడా పెడా కట్టెస్తున్న కట్టడాలను హైకోర్టు నోటీసుద్వారా నిరోధించి రాజస్థాన్ గవర్నమెంటు యీ సరస్సును కలుషితం కాకుండా కాపాడుతోంది .

3) అజ్మేర్ షరీఫ్ దర్గా---

 మొయినుద్దీన్ ఛిస్థి 1141-1236) గరీబ్ నవాజ్ గాపిలువబడే యీ సూఫీ సన్యాసి ని గురించిన అనేకమైన కథలు ప్రచారంలో వున్నాయి . దక్షిణ ఆసియాకి చెందిన యిమామ్ , ఇస్లామిక్ పండితుడు , మతబోధకుడు మొయినుద్దీన్ ఛిస్థి కి మొఘల్ చక్రవర్తులతో పాటు చాలామంది శిష్యులు వుండేవారు . ఈ మతగురువులో అనేకమైన మంత్ర శక్తులు వుండేవని సమయం వచ్చినప్పుడు వాటిని వుపయోగించేవాడని అంటారు .

ఒకసారి అనసాగర్ పక్కగా శిష్యులతో వెళుతూ త్రాగేందుకు నీళ్లుకావాలని అక్కడవారిని అడుగగా అంతా నిరాకరిస్తారు .  మొయినుద్దీన్ అనాసారగ్లోని నీటిని చిన్న పాత్రలో తీసుకొని త్రాగనారంభిస్తాడు . అందరూ చూస్తూవుండగా అనసాగర్లోని నీరు తగ్గిపోతూ వచ్చి ఖాళీ అయిపోతుంది . విషయం చూసిన వూరి పెద్దలు అతనిని ప్రార్ధించగా తిరిగి నీటిని విడిచి పెట్టేడు . 

మొయినుద్దీన్ ఛిస్థి మరణానంతరము అతని సమాధిపై కట్టిన యీ కట్టడం ముస్లిం లలోనే కాక అన్ని మతాలవారూ దర్శించు కొనే ప్రదేశం గా మారింది . యిక్కడ తమ కోరికలు విన్నవించుకోడం , కోరికలు తీరిన వెంటనే " చాదర్ " సమర్పించడం ఆనవాయితీ .

ఈ దర్గా కి సన్నని దారిగుండా నడచి వెళ్లాలి . రెండువైపుల దర్గాలో సమర్పించే వస్తువలే కాక వారి మతానికి సంభందించిన వివిధ వస్తువలు అమ్మకానికి పెట్టిన చిన్న చిన్న దుకాణాలు వందల సంఖ్యలో కనిపిస్తాయి . పూర్తిగా మొఘల్ సాంప్రదాయక శిల్ప కళతో కట్టిన దర్గా , ముస్లిమ్ లే కాక అన్య మతస్థులు కూడా యిక్కడ సమాధికి ప్రదక్షిణ చేస్తూనో , ' ధాగా ' కడుతూనో , " చాదర్ " కప్పుతూనో కనిపిస్తారు .

అందరి తోనూ మేము కూడా లోపలకి వెళ్లేం . దర్గా దగ్గర వున్న వాళ్లు బలవంతంగా ముణుకుల పైన కూర్చొని ప్రార్ధన చేసుకోమని బలవంతం చెయ్యడం నచ్చక బయటకి వచ్చేం .

4)  అఢైదిన్ కా ఝోప్డా----

అఢైదిన్ అంటే రెండున్నర రోజులు , ఈ కట్టడాన్ని రెండున్నర రోజులలో కట్టేరుట , లోపలకి పోయి చూస్తే పెద్ద హిందూ దేవాలయాన్ని దర్గా గా మార్చినట్లుగా కనిపిస్తుంది . వెలుపల వున్న కట్టడాలపై ఖురాను లిఖించి వుండగా లోపల వున్న కట్టడం పై అంతా హిందూ మతానికి సంభందించిన రాతలు స్పష్టంగా కనిపిస్తాయి . ఢిల్లీ లోని కుతుబ్ మీనారుని చూసినప్పుడు కూడా యిదే పరిస్థితి , యిదే అనుభూతి కలిగింది . ఒకరి రాతలను కాపీ కొట్టి వారి పేరుమీదుగా చలామణి చేసుకొనేవారిని ' భావచోరులు ' అంటున్నాం , ఇలా ఓ మతానికి చెందిన శిల్ప సంపదను , కళన , భక్తిని పరిపాలకులు మనవారని బలవంతంగా లాక్కొని మరో మతానికి చెందినదిగా చలామణి చేస్తున్న యీ చర్యకు యే పేరు పెట్టాలి . ఈ కట్టడం చూసిన తరువాత మేము ఆ మతానికి చెందిన మరే కట్టడాన్ని యెంత గొప్పదైనా చూడకోడదని నిర్ణయించుకున్నాం .

5) సోనీ జీ కీ నసియా----

 సుమారు 1865 లో మొదలు పెట్టి యిరవైఅయిదు సంవత్సరాలలోపూర్తి చేసి మొదటి జైన  తీర్ధంకరుడైన వృషభ దేవునికి సమర్పించిన మందిరం .  ' సోనీ ' వంశానికి చెందిన ' సేట్ మూల్ చంద్ సోనీ ' చే ప్రారంభించిన  జైన మందిరం . జైనమందిరాలు అన్నీ అద్భత శిల్పకళ ను కలిగి వుంటాయి . పాలరాతితో చెక్కిన మకరతోరణాలు , కలువ పువ్వులు , గులాబీ పువ్వులు ,  అంతస్తులలో చెక్కిన పైకప్పు , స్ధంభాల పైన చెక్కిన 3డ్ లో జైన తీర్ధంకరుల జీవిత చరిత్రలు , యిలా యెన్నో శిల్పాలు అదీ జీవకళ నిండిన శిల్పాలను చూస్తే మన దేశంలో వున్న శిల్పులకు దక్క వలసిన కీర్తి ప్రతిష్టలు దొరకలేదేమో అనిపించక మానదు . ఒక స్థంభానికి మరో దానికి పోలిక వుండదు . అలాగే అక్కడ వున్న పై కప్పులు ఒకదానిని పోలి మరొకటి వుండదు . మందిరంలో వున్న మధ్య మంటపాన్ని " స్వర్ణనగరి " అని అంటారు . కర్రతో చెక్కిన శిల్పాలపై బంగారురేకులతో తాపడం చేసేరు . ఈ మందిరం దిగంబర జైనులకు చెందింది . ' స్వర్ణనగరికి వెనుకవైపున మ్యూజియం వుంది .ఇది కూడా ' సోనీ ' వంశస్థులకు చెందినదే . దీనిని ' సిధ్దకూట చైతన్యాలయం ' అనికూడా అంటారు . 2005 లో లోపలి భాగం లో  జైన తీర్థంకరుల మూర్తులను పునః ప్రతిష్టించేరు . ఈ భాగం లోనికి జైన మతస్థులకు తప్ప అన్యమతస్థులకు ప్రవేశం లేదు . సంవత్సరంలో 365 రోజులూ జైనతీర్థంకరుల జీవిత చరిత్ర కు సంభందించిన ప్రదర్శనలు విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు , ఈ ప్రదర్శనకు అన్ని మతస్థులకు ప్రవేశం వుంది . ఈ మందిరం లో ముఖ్యమైన ఆకర్షణ యేమిటంటే అక్కడ వున్న 82 అడుగుల యెత్తున్న మహా స్థంభం , దీనిపైన చెక్కిన జైన తీర్ధంకరుల శిల్పాలు .

 అజ్మేరు వెళ్లేవారు తప్పకుండా దర్శించదగ్గ ప్రదేశం .

) నరేలీ జైన మందిరం----

 అజ్మేరు కి యేడు కిలోమీటర్ల దూరంలో ణ్-8 కి దగ్గరగా  ఋ.ఖ్ మార్బుల్స్ సంస్థ కు చెందిన ' అశోకపత్ని ' కట్టించిన మందిరం . సమయం అనుమతిస్తే తప్పక చూడదగ్గ జైనమందిరం . ఈ మందిరాన్ని చూడవలసినది తప్ప వర్ణించలేనిది . అంతే అంతకన్నా వర్ణించడానికి నేను కవిని కాను .

అజ్మేరు లో పట్టణంలో వున్న హోటల్స్ కన్నా కాస్త దూరంగా వున్న హోటల్స్ అయితే మంచి సదుపాయాలతో వున్నవి అందుబాటు ధరలకు లభ్యమౌతున్నాయి . అక్కడ రాత్రి వుండదల్చుకున్నవారు నెట్ లో కూడా హోటల్స్ బుక్ చేరుకోవచ్చు .

పై వారం జోధ్ పూర్ వెళదాం అంతవరకు శలవు  

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు