పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టు, మన దేశంలో దొరికే వస్తువైనా సరే, దాని గురించి ఏ విదేశీయుడొ చెప్తే చాలు, “ ఆహా.. ఓహో..” అంటూ దాని వెనక్కాలే పడడం. చిన్నప్పటినుంచీ, మనింట్లో పెద్దల ద్వారా వినే ఉంటాము, అయినా సరే, వీళ్ళేమిటి, చెప్పడమేమిటీ అనే కానీ, ఓసారి చూద్దామేమిటీ అని మాత్రం అనుకోరు… ఉదాహరణకి “ పసుపు “ తీసికోండి. ఆరోజుల్లో ఇళ్ళల్లో ఉండే ఆడవారు, వంటినిండా శుభ్రంగా పసుపు రాసుకుని మరీ స్నానం చేసేవారు.. అలాగే ఏ దెబ్బైనా తగిలితే, రక్తం కట్టడానికీ, సెప్టిక్ అవకుండా ఉండడానికీ వెంటనే ఆ గాయం మీద పసుపు అద్దేవారు. కానీ, ఛ.. అసయ్యంగా పసుపేమిటీ అనుకుని, ఆ పసుపు కాస్తా పక్కకు పెట్టేశారు. కానీ బహుళజాతీయ కంపెనీలు , అదే పసుపుని, అదేదో టర్మరిక్ క్రీమ్ అనగానే మాత్రం, ట్యూబ్బులకి ట్యూబ్బులు కొనేసికోడం. అలాగే ఆరోజుల్లో కాలవలకి వెళ్ళి స్నానం చేసి, ఒండ్రు మట్టితో హాయిగా వళ్ళంతా రుద్దుకునేవారు. ఇప్పుడు ఆ కాలవలూ లేవు, ఆ ఒండ్రుమట్టీ లేదు. ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయాయి.. కానీ అదే ఒండ్రు మట్టిని, అదేదో “ ముల్తానీ మట్టో, మశానమో అంటే మాత్రం ఎగబడుతూ కొనేసికోవడం.
ఇంక దంతధావనానికి సంబంధించిన “పందుం పుల్లలు “ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? మొదట ఆ పుల్లని, శుభ్రంగా నమలగానే, ఆ వేపరసం అంతా లోపలికి వెళ్ళి, క్రిమికీటకాలని చంపి, ఆ తరువాత ఓ కుచ్చు లా తయారయిన, ఆ పందుంపుల్లతో పళ్ళు తోముకుంటే, ఏళ్ళ తరబడీ గట్టిగా ఉండేవి. ఈరోజుల్లో, చిన్న పిల్లల దగ్గరనుండీ , పళ్ళల్లో కావిటీలూ, రూట్ కెనాలింగులూ, సింగినాదాలూ….. ఆరోజుల్లో ఇళ్ళల్లో గృహిణులు, స్వయంగా చేదతో నీళ్ళు తోడేరంటే, వాళ్ళకి , పనిమనిషిని పెట్టుకునే స్థోమత లేక కాదు, చేతులు ఓ అరగంట సేపు పైకీ, కిందకీ లాగడంతో ఇంక వ్యాయామం అవసరం ఉండేది కాదు. అలాగే రోకలితో, ఏ పప్పులైనా రోట్లో దంచడమో, లేదా రుబ్బురోలుతో ఏ పప్పో, పచ్చడో రుబ్బడమో కూడా, వారు దృఢంగా, ఏ రోగమూ రొచ్చూ లేకుండా హాయిగా ఉండేవారు. దీనికి సాయం ఓ పధ్ధతిలో తిండీ, నిద్రా ఉండేవి.
ఈ రోజుల్లోనో, చేతిలో డబ్బులున్నాయి కదా అని ఏ జిమ్ములోనో చేరడం, అక్కడ వాడుచెప్పేదానికీ, ఆరోజుల్లో మన పెద్దలు చేసేదానికీ, వీసమెత్తు తేడాలేదు. అయినా సరే వాడు చెప్పేదే వేదం. ఇవన్నీకాకుండా ఇళ్ళల్లో అవేవో ట్రెడ్ మిల్లులూ అవీ పెట్టుకుని, ఆ మెషీనుమీద పరుగులెత్తడం, ఏమైనా అంటే “ టైముండడం లేదండీ ..” అంటూ కుంటిసాకులు చెప్పడం. తల్లితండ్రుల్లాగే పిల్లలూనూ. ఆరోజుల్లో ఉద్యోగంనుండి రిటైరయ్యే రోజుల్లో వచ్చే బీపీ, డయాబెటీసూ ఈరోజుల్లో, ఉద్యోగంలో చేరే సమయానికే వచ్చేయడం. ఇంకో విషయమేమిటంటే, ఈరోజుల్లో పెద్దవారినెవరినైనా చూసినా, ఓ ప్లాస్టిక్ సంచీనిండా, రకరకాల రంగుల్లో మాత్రలు. పొద్దుటే ఏ కాఫీయో తాగడం, ఓ గుప్పెడు మాత్రలు మింగడం.. చూస్తే జాలేస్తుంది. అందులో ఏరోజైనా పడాల్సిన డోసు పడకపోతే, మరుసటిరోజు మంచం పట్టాడే. పైగా ఏదో కొద్దిగా నలతగా ఉందని, ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా, కర్మ కాలి వెళ్ళామా, నానా టెస్టులూ చేసి, అవేవో “ స్టెమ్ములు” వేస్తేనే కానీ వదలరు.. అర్ధం అయిందా, ఆ ప్లాస్టిక్ సంచీనిండా మాత్రలెందుకో, కొడుకో కోడలో, ఈ పెద్దాయననో., పెద్దావిడనో . యాన్యువల్ చెక్ అప్ కోసం ఏ పెద్దాసుపత్రికో తీసికెళ్ళినట్టన్నమాట… అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసికోవద్దని కాదు, చేసికోవాలే, కానీ తమకి నమ్మకమున్న ఫామిలీ డాక్టరు చాలు. ఎంతైనా, గత నలభై ఏళ్ళనుండీ, మన శరీరం గురించి పూర్తి అవగాహన ఉన్న మనిషాయె, మరీ మనకి అవసరంలేని పరీక్షలతో హింసించడు. కానీ వినేదెవరు? ఆ మెడికల్ చెక్ అప్ ఖర్చూ, అక్కడ వాళ్ళిచ్చిన చేంతాడంత మందుల జాబితా ఖర్చూ, కంపెనీవాడో, ఇన్సూరెన్స్ కంపెనీవాడో పెట్టుకుంటాడు, మింగడానికి ఇంట్లో తల్లో తండ్రో, అత్తగారో, మామగారో ఎలాగూ ఉన్నారు. ఇంకేముందీ.. “ నిత్యకల్యాణం మందుల తోరణం “… ఈరోజుల్లో ఏ ఇంటికి వెళ్ళినా “ సుగరాండీ..” అనేవారే. లేదు మొర్రో అన్నాసరే , ముందుజాగ్రత్తకోసం అని పేరుచెప్పి, కాఫీయో చాయో ఇస్తారు. దాన్ని ఔషధంలా తీసికోవడం. … ఎందుకొచ్చిన బతుకులూ, హాయిగా నోటికి హితవుగా ఉండే వాటిని తాగలేకా, తినలేకా ఎవరిని ఉధ్ధరించడానికీ….
సర్వేజనా సుఖినోభవంతూ…