సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
ఆముక్తమాల్యద 

మాలదాసరికి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని  తెలియజేస్తున్నాడు బ్రహ్మరాక్షసుడు. తనకు  ఈ భయంకర రూపం ఎలా సంప్రాప్తించినదీ 
చెబుతున్నాడు. బ్రాహ్మణుడిగా చెడ్డదార్లు త్రొక్కి  సంపాదించి తన గ్రామానికి ప్రయాణం చేస్తున్నపుడు  బందిపోటు దొంగలు తమను దోచుకున్నపుడు ఒక  దొంగ తనను అందినచోటల్లా పొడిచిన సంగతి  చెప్పాడు. తన గాథను కొనసాగిస్తున్నాడు.

అంతటఁ బొంతఁ బెన్దెరువునం దరు దెంచు పిఱిందిమంది మ
త్కాంత సహోదరుండును నొకం డరుదెంచుచు సాతు పడ్డ వృ
త్తాంత మెఱింగి న న్నరసి తాఁ గని యార్తి నొకండు దా నతి
శ్రాంతుని నన్నుఁ గావట దిసంతులు గొట్టుచు మోచు కేగుచోన్ 

అంతలో దగ్గరలోనున్న ఒక రాజమార్గంలో వస్తున్న ప్రయాణీకులలో ఉన్న  నా బావమరిది ఒకడు మా గుంపును బందిపోట్లు దోచుకున్న సంగతిని విన్నాడు.వాడు వచ్చి నన్ను గమనించి బాధపడుతూ ఒక్కడే నన్ను కావడిలో ఉంచుకుని మోసుకుంటూ, నా పాపిష్టిపనులకు నన్ను నిందిస్తూ, బాధపడుతూ, వెక్కిరిస్తూ మోసుకుంటూ వెళ్ళడం ప్రారంభించాడు. సమీపములోని గ్రామాల గుండా నన్ను మంచి వైద్యుడికోసం తీసుకెళ్తున్నాడు. ఆ ఊళ్ళన్నీ దోపిడీకి గురి అయినవారితో కలకలంగా ఉన్నాయి.కొంగవా ల్నఱుకు లంగుళులఁ బట్టుక జబ్బ / లంటఁ గుట్టిడ వెజ్జు నరయువారు తలఁ బడ్డ గుదియదెబ్బలఁ బాఁత మసి యిడి / యంబలి గం జిండ్ల నడుగువారు తమనేగిఁ జెప్పుకో దయమీఱ విని చీరఁ / జించిచ్చువారి దీవించువారు నొలివడ్డ నెపమునఁ గల లేని సిరిఁ జెప్పి / చుట్టలపై దాడి వెట్టువారు 

నైన పాంథులచేతఁ గ్రం దైన యూళ్ళ 
జాడగా నిటఁ దెచ్చి యిన్నీడ డించి 
పాఱు నీ రానఁ బోవ నొ వ్వారి మగిడి 
వచ్చునాలోన నీ రూపు వచ్చె నాకు             

దోపిడీదొంగల వంకర కత్తులు దిగబడి అయిన గాయాలకు కుట్లు వేయించుకోడానికి  వైద్యులకోసం తిరుగుతున్నారు కొందరు. తలలమీద దుడ్డు కర్రలవల్ల తగిలిన దెబ్బలకు గుడ్డలను కాల్చిన మసిని పూసుకుని, అంబలి, గంజి కోసం ఆబగా అడుగుతున్నారు కొందరు. తమ బాధలను చెప్పి, గాయాలకు దయతో చీరలను చించి కట్లు కట్టుకోడానికి యిచ్చినవారిని దీవిస్తున్నారు కొందరు. దోపిడీ జరిగిన  సాకుతో ఉన్నదీ లేనిదీ కోల్పోయినట్టు చెప్పి చుట్టాలమీదికి దాడికి వెళ్ళినట్లు వెళ్లి  వేపుకు తింటున్నారు కొందరు. యిలా ఆ దోపిడీలో నష్టపోయిన ప్రయాణీకులతో నిండిన గ్రామాలగుండా నన్ను మోసుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చి, ఈ చెట్టు నీడలో నన్ను దించి సమీపంలో పారే నీటితో దాహం తీర్చుకోడానికి వెళ్ళాడు నా బావమరిది. వాడు మళ్ళీ తిరిగి వచ్చేలోపే తీవ్రమైన గాయాల బాధతో విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాను నేను. పదేపదే పొడిచి, నాకు భయాన్ని, ప్రాణాంతకమైన యాతనను,  గాయాలను కలిగించిన ఆ 'కాకశ్మశ్రువు' అనే దుర్మార్గుడి రాక్షస రూపమే నా కళ్ళలో మెదులుతుండగా ప్రాణాలు విడిచిన నాకు ఈ రూపం వచ్చింది. యిదీ నా కథ. నీవు దయచూపి నీ కైశికీ గాన ఫలితాన్ని నాకు ధార పోసి ఈ భయంకర రూపాన్ని పోగొట్టుమయ్యా అని మాలదాసరి పాదాలమీద పడిపోయాడు బ్రహ్మరాక్షసుడు. మాలదసరికి కరుణతో గుండె కరిగింది. అయినా ప్రాపంచికమైన అక్షరజ్ఞానము లేనివాడు ఐనప్పటికీ అక్షరమైన పరమాత్మ తత్త్వజ్ఞానము కలిగిన మహానుభావుడు  కనుక యిలా అన్నాడు ఆ మాలదాసరి. ' ఫలము ఏమిటో, ఎంతయో అన్నది నాకు  తెలియదు, అది తెలియకుండానే, దానిగురించి ధ్యాస లేకుండానే నేను పరమాత్ముడిని సేవించే దాసుడిని. పరమాత్ముడి ముఖోల్లాసమే ఫలం! ఆయన కరుణయే ఫలం! అది యింతా, అంతా, ఎంత అని లెక్కించే అధికారము దాసులకు  ఎక్కడిది? అలా ఫలమును లెక్కబెట్టడం, ఆశించడం పునర్జన్మ అనే బంధానికి కారణం అవుతుంది! కనుక పరమాత్ముడి కైంకర్య ఫలము 'యింత', అందులో  'ఒక యింత' నీకు ధారబోస్తాను అనడం నాకు భయాన్ని కలిగిస్తుందయ్యా!  'భగవంతుడే నిన్ను రక్షిస్తాడు' అని అంటున్న మాలదాసరి మాట పూర్తి కాకముందే  అద్భుతం జరిగింది! 

స్నిగ్ధ త్రిభాగ ముండిత శిరశ్శిఖతోడ / హిమధవళోపవీతములతోడఁ 
బుణ్యషడ్ద్వితయోర్ధ్వ పుండ్రవల్లులతోడఁ / దులసికాబ్జస్రగావళులతోడఁ 
గౌపీన కటిసూత్ర కాషాయయుగితోడ / జలపూర్ణ శుభకమండలువు తోడఁ 
బాణిస్థదివ్యప్రబంధసంపుటితోడ / నుత్తరవాక్పూర్వకోక్తితోడఁ 

బసిఁడిజిగితోడ బ్రహ్మవర్చసము వొల్చు 
భావగతలక్ష్మితో ధూమపటలినుండి 
వెడలు శిఖవోలె నమ్మేను వెడలి చూడఁ 
జాడ వైష్ణవుఁ డై నిల్చె సోమశర్మ 

పొగను చీల్చుకుని వచ్చిన అగ్నిశిఖలాగా ప్రజ్జ్వరిల్లుతున్న తేజస్సుతో ఒక దివ్య  మూర్తి ప్రత్యక్షమైనాడు. ఆతడు మూడువంతులు గుండుకొట్టి, ఒకవంతు తళతళ లాడుతున్న శిఖతోనున్న శిరస్సును కలిగినవాడు. మంచులాంటి తెల్లని యజ్ఞోపవీతములను కలిగినవాడు. పుణ్యప్రదములైన పన్నెండు ఊర్ధ్వ పుండ్రములను దేహముమీద పన్నెండు స్థానములలో కలిగినవాడు. తులసీపూసలు, తామరపూసలు దండలు దండలుగా ధరించినవాడు. కౌపీనమును, కటిసూత్రమును, రెండు కాషాయ వస్త్రములను ధరించినవాడు. జలపూర్ణమైన శుభప్రదమైన  కమండలమును కలిగినవాడు. చేతిలో ద్రవిడవేదసంపుటిని కలిగినవాడు. ద్వయమంత్రానుసంధానము చేస్తూ, చరమశ్లోకాన్ని ఉచ్చరిస్తున్న పలుకులతో కూడిన సంభాషణ కలిగినవాడు.

ఆతడు కాల్చిన బంగారంలాగా మెరిసిపోతున్నాడు.  
ఆతడు భాగవతలక్ష్మిని వొలికిస్తున్న బ్రహ్మతేజస్సును కలిగినవాడు. ఆతడు సోమశర్మ!యిలా, ఉప్పు చిట్లి రెట్టింపు ఐనట్టు(!) మహాభాగవతుని కరుణను పొందిన కారణంగా బ్రాహ్మణత్వాన్ని మాత్రమే కాక, భాగవత సిరిని కూడా పొందిన పూర్వపు సోమశర్మ ప్రత్యక్షమైనాడు! తన వైష్ణవపక్షపాతపూర్వక చమత్కారాన్ని పొదిగి, క్రమక్రమంగా వైష్ణవునిగా రూపాంతరం చెందిన వైదిక బ్రాహ్మణమూర్తిని సాక్షాత్కరింప జేశాడు వైష్ణవరాయలు! తనను కరుణించి పునర్జన్మను ప్రసాదించిన గురుడు భాగవతుడు,  వైష్ణవుడు కనుక, జన్మను పొందిన 'శిష్యుడు'(పుత్రసమానుడు) భాగవతుడు, వైష్ణవుడు వడం ఆధ్యాత్మిక, సాధనామార్గ రహస్యం! 'చూడ చూడ ..' అనే పదప్రయోగంతో క్రమ క్రమంగా బ్రాహ్మణోత్తముడు భాగవత వైష్ణవోత్తమునిగా రూపును పొందాడు అంటున్నాడు. అంటే పూర్వపు  రూపము పూర్వపు వైదిక లక్షణాలను చూపుతూ అంతలోనే వైష్ణవ లక్షణాలను సంతరించుకుంటున్నది అని సంభ్రమాత్మకమైన  స్వాప్నిక దర్శనాన్ని వర్ణిస్తున్నాడు. అంతేకాదు, మొదటినుండీ బ్రహ్మరాక్షసుడు క్రమక్రమంగా మహాభాగవతుడైన వైష్ణవుని అభిమానిగా, ఆరాధకునిగా, దాసుడిగా రూపాంతరం చెంది చివరికి ' ఆచార్య తిరువడిగళే శరణం' అని పదేపదే మాలదాసరి పాదాలమీద పడిన సంగతిని చిలిపిగా గుర్తుచేస్తున్నాడు, కనుక ' భాగవత పరిచయ ప్రభావంబున బ్రాహ్మణ్యంబె కాక భాగవత శ్రీయుం గలిగి..' అని వచనములో కూడా 
వర్ణించాడు శ్రీకృష్ణదేవరాయలు. ' శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః' అనే ద్వయ మంత్రాన్ని పలుకుతున్న క్రమంలో, తరువాతి చరమ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ తన సంభాషణను కొనసాగిస్తున్నాడు ఆ భాగవతుడైన 
సోమశర్మ! 'సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపెభ్యో మోక్షయిష్యామి మా శుచః' ( యితరములైన అన్ని ధర్మములను, మార్గములను వదిలి 'నన్నే' శరణు వేడు, నేను అన్ని పాపములనుండి నీకు విముక్తిని కలిగిస్తాను, ముక్తిని 
ప్రసాదిస్తాను, శోకింపకు అని గీతాచార్యుడు పలికిన పలుకు వైష్ణవ మార్గంలో చరమ శ్లోకంగా ఉపాసింపబడుతుంది) యిందులో అంతరార్ధం అష్టాక్షరీ మంత్ర జపము, ద్వయమంత్రానుసంధానము, చరమశ్లోక మననము చేస్తూ వైష్ణవునిగా బయటపడ్డాడు బ్రహ్మరాక్షసుడు, గురుదేవుడైన మాలదాసరి కృపాకారణంగా! యిదీ ఔచిత్యాన్ని ప్రదర్శించడం అంటే. ఖడ్గమును ధరించినవారిలో, ఘంటమును ధరించినవారిలో బహుశా, ఏ కొద్దిమంది మాత్రమే రాయలతో పోల్చదగినవారు ఉండవచ్చు సాహిత్య ప్రపంచములో, రాయలను 'మించినవారు' మాత్రము లేరు, రారు. 'మాలదాసరి కథ' సమస్త సాహిత్య కావ్యాలలో అత్యుత్తమ శ్రేణికి చెందినది, కథలో, కథనంలో, 
పాత్రపోషణంలో, చమత్కారంలో, ప్రపంచపరిశీలనలో, కవనప్రతిభలో, సందేశములో! రాయల పాదాలకు ఈ కించిన్మాత్ర ప్రజ్ఞుడైన వ్యాసకర్త శతసహస్ర ప్రణామములు, అలా 'నూతన భాగవత వైష్ణవ తేజస్సును సంతరించుకున్న పూర్వ రూపాన్ని' పొందిన
బ్రహ్మరాక్షసుడు,  వైష్ణవ సంప్రదాయానుసారంగా, తన గురుదేవుడైన మాలదాసరిని పూజించి యిలా స్తుతించాడు.

జయ దురుత్తరణ సంసరణాబ్జదళనీర / జయజయ గాయక సార్వభౌమ 
జయ శౌరిగాథారసజ్ఞ పుణ్యరసజ్ఞ / జయజయ తత్త్వసంశయలవిత్ర
జయ జనార్వాచీన జనిసంగవంచక / జయజయ దేశిక చరణశరణ 
జయ యుక్త వాక్ప్రతిష్ఠాతృణీకృతదేహ / జయజయ భగవదాజ్ఞాకృతిస్థ

జయ సకలజంతుసమచిత్త  జయదయార్ద్ర 
జయ ముకుందాన్యదేవోస్తిశాస్త్రబధిర 
జయ చతుర్ద్వయభక్తిలక్షణచితాంగ 
జయ మురారిప్రపన్నాంఘ్రిజలజమధుప 

దాటడానికి శక్యముకాని సంసారము అనే తామరాకుమీది నీటివంటివాడా,  సంసారములో ఉంటూనే, సంసార సుఖాలకు, బంధాలకు, బాధలకు చలించనివాడా నీకు జయము! గాయకసార్వభౌమా, నీకు జయము! శ్రీహరిగాథారసమును తెలిసినవాడా, పుణ్యరసమును గ్రోలినవాడా, నీకు జయము! పరమాత్మతత్త్వమును గురించిన సందేహములను ఖండించడంలో కొడవలివంటివాడా, నీకు జయము! తత్త్వము అంటే వేదాంతపరంగా పంచవింశతి తత్త్వములు అంటే, యిరవై అయిదు తత్త్వములు అని కూడా. శబ్ద, రూప, రస, స్పర్శ, గంధములు అనే పంచ తన్మాత్రలు, వాటినుండి జన్మించిన ఆకాశము, అగ్ని, జలము, వాయువు, భూమి అనే పంచ
మహాభూతములు, వాటి ద్వారా జనించిన, వాటిని గ్రహించడానికి జనించిన శ్రోత్రు, చక్షు, రసన, త్వక్, ఘ్రాణ యింద్రియములు అనే పంచ జ్ఞానేంద్రియాలు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనే పంచ కర్మేంద్రియాలు, మనస్సు-బుద్ది-చిత్తము-అహంకారము అనే అంతరంగ చతుష్టయము, ఈ యిరవై నాలుగు తత్త్వములు కలిగిన జీవుడు అనే యిరవై ఐదవ తత్త్వము, యివి పంచవింశతి తత్త్వాలు. వీటిని కలిగిన జీవికి కలిగే సంశయములను, సందేహములను పరమాత్మతత్త్వజ్ఞానము అనే కొడవలితో ఖండించిన మహానుభావా, నీకు జయము! అని వేదాంతరహస్యసార సూచన చేస్తున్నాడు రాయలవారు. నీ భాగవత మహిమతాలూకు రహస్యాన్ని మరుగునపెట్టి, సామాన్య చండాల రూపములో సంచరిస్తున్న మహాజ్ఞానీ! నీకు జయము! ఆచార్యుల, పూర్వాచార్యుల,పరమాచార్యుల చరణములశరణమును పొందినవాడా, నీకు జయము. యిచ్చిన మాటను ప్రతిష్ఠించడానికి, నిలబెట్టడానికి నీ శరీరాన్ని కూడా గడ్డిపోచలాగా విసిరిపారేయడానికి,నాకు ఆహారముగా నీ దేహమును త్యాగం చేయడానికి సిద్ధపడిన సత్యవ్రత నిష్ఠుడా,
నీకు జయము! భగవంతునికి విధేయుడైన దాసుడా, నీకు జయము!సకలజంతువులపట్ల సమచిత్తమును కలిగినవాడా, సమస్తభూతప్రేమికుడా, నీకు జయము!దయార్ద్రచిత్తమును కలిగినవాడా, నీకు జయము! ముకుండు కాకుండా, వేరే దైవము 
కూడా కలదు అని చెప్పే శాస్త్రములను వినడంలో చెవిటివాడా(!) శ్రీహరి తప్ప యితరము లేదు అని నమ్మినవాడా(ప్రహ్లాదునివలె) నీకు జయము! (చతుర్ద్వయ) ఎనిమిది భక్తి లక్షణములు పెంపొందిన శరీరము గలవాడా, నీకు జయము! భక్తి నవవిధములు అని మాత్రమే కాక, ఎనిమిది విధములు అని కూడా ప్రమాణం, విష్ణుపురాణ శ్లోకం ప్రకారం. 'మద్భక్త జనవాత్సల్యం, పూజాయాంచానుమోదనం, స్వయమభ్యర్చనం చైవ మదర్థే దంభవర్జనం, మత్కథాశ్రవణే భక్తిః సర్వనేత్రాంగ విక్రియా, మమానుస్మరణం నిత్యం చ్చ మాముపజీవతి, భక్తిరష్టవిధాహ్యేషా యస్మిన్ మ్లేచ్ఛేపి వర్తతే, స విప్రేంద్ర స్సచ శ్రీమాన్ స యతి స్స చ పండితః' నా భక్తులపట్ల వాత్సల్యము, నా పూజలకు సంతోషముగా అంగీకరించడం, స్వయముగా చేయడం, నా పట్ల, నా భక్తులపట్ల, నా పూజలపట్ల దంభమును
కపటమును విసర్జించడం, నా కథలను వినడంలో భక్తి, కనులు తదితర అవయవములతో  దేహము సర్వము నాకోసమే అని నమ్మడం( ప్రహ్లాదునివలె, కంజాక్షునకు గాని కాయంబు..)  నిత్యమూ నా నామ స్మరణము చేయడం, నామీదనే ఆధారపడి, నావల్లనే, నాకోసమే అని జీవించడం అనే ఈ ఎనిమిది విధములైన భక్తిలక్షణములను కలిగినవాడు మ్లేచ్ఛుడైనా సరే, వాడే విప్రోత్తముడు, వాడే శ్రీమంతుడు, వాడే యతిరాజు, వాడే పండితుడు అని అర్థం. అటువంటి ఎనిమిదివిధములైన లక్షణములను కలిగిన మహాభక్తుడా, నీకు జయము!

యింతేకాదు, సాత్విక భక్తి ఎనిమిది విధాలు అని సంప్రదాయం. ప్రళయము, స్తంభము,కంపము, రోమాంచము, స్వేదము, వైవర్ణ్యము, స్వర్యము, అశ్రుపాతము అనే ఎనిమిది లక్షణాలను కలిగివుంటాడు సాత్విక భక్తుడు. తన దేవుని సేవలోనూ, సేవకు దూరమైనపుడూ ప్రళయము వచ్చినట్లు సంచలించిపోతాడు. ఆ భావోద్రేకములో స్తంభించిపోతాడు. శరీరము కంపించిపోతుంది. గుర్పాటుతో మాంచితుడు అవుతాడు. చెమటలు పోస్తాయి. ముఖము,శరీరము వివర్ణమైపోతాయి, గొంతు గద్గదికము అవుతుంది. ధారగా సేవలో నందబాష్పాలు,దర్శనంకోసం దుఃఖ బాష్పాలు ప్రవహిస్తాయి.

అటువంటి ఎనిమిది సాత్వికభక్తిలక్షణాలు 
కలిగిన మహాభక్తుడా, నీకు యము ని మాలదాసరిని స్తుతించాడు బ్రహ్మరాక్షసుడు.ప్రహ్లాదునికి, ఆంజనేయునికి, తర్వాతి కాలంలో ఆదిశంకరులకు, రామానుజులకు, చైతన్య ప్రభువులకు, రామకృష్ణపరమహంసకు ఈ స్థితులన్నీ కలిగేవి, ఈ లక్షణాలు కలిగేవి! యిక మరల మరలా జన్మించి, ఇల్లు, వాకిలి, ర్య, పిల్లలు, సుఖాలు అని భ్రమించి,సంసారచక్రంలో యిరుక్కుపోకూడదు అని నిశ్చయించుకుని, తన ఆచార్యుడైన మాలదాసరికి కడసారి మస్కరించి బదరి మొదలైన పుణ్యప్రదేశాలలో నిరంతరమూ సంచరిస్తూ చివరకు దేహాన్ని చలించి మోక్షాన్ని పొందాడు ఆ సోమశర్మ.ఓ ష్ణుచిత్తా! ఈ దివ్యమైన కథను పూర్వము వరాహరూపములో ఉన్న నేను భూదేవికి చెప్పాను. నా పూజావిధానములో అత్యంత శ్రేష్ఠమైనది నకైంకర్యమే అని నేను ఉదాహరణపూర్వకంగా చెప్పిన ఈ కథను విని ఆ భూదేవియే నాకు గానకైంకర్యము చేయాలనే కోరికతో, ఆ ర్గాన్ని ఈ పంచానికి బోధించాలనే 'వాత్సల్యముతో'యిలా నీకు కుమార్తెగా జన్మించిందయ్యా! నిరంతరమూ నా విరహముతో, నా పట్ల భక్తి, మోహములతో నా కీర్తన చేస్తూ పలవరిస్తున్నది. యిదేమి తపస్సో, యిదేమి వ్రతమో అని పరిపరివిధాలుగా కలవరిస్తున్నావే, మాయకుడా! ఇంతకన్నా తపస్సు ఏదైనా ఉన్నదా అని సన్నగా నవ్వాడు చక్రధరుడు. కరములు ముకుళించి, దేహము పులకించి టున్నాడు విష్ణుచిత్తుడు. ' నీకు అంతా మేలే జరుగుతుంది. శ్రీరంగనాథుని రూపములో ఉన్న నన్ను సేవించడం కోసం నీ కుమార్తెను రంగమునకు వెంటనే తీసుకువెళ్ళు' అని శ్రీహరి అదృశ్యుడు అయినాడు. ఆ ఆజ్ఞ ప్రకారము వందలాది పరిచారికలు సేవిస్తుండగా, గవతుల మూహాలు వెంట వస్తుండగా, బంగరుపల్లకీలో తన కుమార్తెను పరమానురాగముతో శ్రీరంగమునకు తోడ్కొని వెళ్ళాడు విష్ణుచిత్తులవారు అని లదాసరి కథను ముగించాడు శ్రీకృష్ణదేవరాయలు.   

ఆముక్తమాల్యద ముగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు