రోజు ఉదయాన్నే నిద్రలేచి సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చే ఉద్యోగినులకు సౌందర్యసాధన మీద దృష్టిపెట్టేందుకు తగిన సమయమే ఉండదు. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని సౌందర్య చిట్కాలను పాటిస్తే సరి. ముఖపర్చస్సు తేజోవంతంగా కనిపించేందుకు వీటిని ఒకసారి ట్రై చేయండి..
జీలకర్ర, క్యాబేజీ జీర్ణశక్తికే కాదు. మేని మెరుపుకు తోడ్పడతాయి. ఈ రెండింటినీ నీటిలో వేసి కాసేపు ఉడికించాలి. ఆ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక.. ముఖాన్ని కడుక్కోవాలి.
పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని రాత్రి పూట పచ్చిపాలలో నానబెట్టి రుబ్బాలి. ఇందులో చిటికెడు కుంకుమపువ్వు, పసుపు కలిపి రాసుకోవాలి.
చర్మానికి మంచి చేసే గుణం నిమ్మలో పుష్కలం. 'విటమిన్ సి'తో పాటు చర్మం మీద పేరుకున్న మురికిని తొలగిస్తుంది. అందుకని కాస్త చక్కెర, నిమ్మరసం కలిపి ముఖానికి, శరీరానికి రుద్దాలి. చక్కెర కరిగే వరకు ఇలా చేస్తే మంచి ఫలితం వస్తుంది.
కోడిగుడ్డులోని తెల్లసొన పోషకాలగని. దానికి తేనే జత చేస్తే ముఖానికి మంచి ఫేస్‌ప్యాక్ తయారవుతుంది. తెల్లసొన, తేనే కలిపిన ఈ ప్యాక్ వేసుకుని ఇరవై నిమిషాలు ఉంటే ముఖం మెరుస్తుంది.
ఆలు, టమోటో రసాన్ని పొద్దున్నే ముఖానికి రాసుకుంటే నిగనిగలాడటం ఖాయం.
మీగడలో బ్రెడ్‌ముక్కల్ని కలిపి రాసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది...