వీక్షణం
కస్టర్ స్టేట్ పార్క్
సౌత్ డకోటాలోని బ్లాక్ హిల్స్ లో వున్నది ఈ కస్టర్ స్టేట్ పార్కు. ఇది సౌత్ డకోటాలోని పెద్ద పార్కు. అంతే కాదు, అక్కడి మొదటి స్టేట్ పార్కు కూడా ఇదే. ఇక్కడనుంచి మౌంట్ రష్మోర్, క్రేజీ హార్స్ మెమోరియల్, జ్యుయల్ కేవ్, విండ్ కేవ్, ఇవ్వన్నీ కూడా కారులో 30 ని. ల్లో చేరుకోవచ్చు.
71,000 ఎకరాల్లో వున్న ఈ కస్టర్ స్టేట్ పార్కులో పచ్చని చెట్లు, నిటారుగా వున్న కొండలు, కొండ గుహలు, సరస్సులు, అడవి జంతువులు, ఎన్నో ఆకర్షణలు. బైక్ రైడింగ్, కేంపింగ్, ఫిషింగ్, ట్రెక్కింగ్ .. సరదాగా గడపటానికి సమయం వుండాలేగానీ, అక్కడ ఎన్నో సదుపాయాలు వున్నాయి.
అన్నట్లు ఆ నిటారు కొండల పైకెక్కి కేంపింగ్ చేస్తున్న వాళ్ళని చూశాము. వాళ్ళు ఎలా ఎక్కగలిగారా అని ఆశ్చర్యపోయాను. వాళ్ళ పధ్ధతులు వాళ్ళకి వుంటాయిగా, నోరెళ్ళబెట్టటానికి నా పధ్ధతి నాకున్నట్లే. (ఒక ఫోటోలో నిటారుగా వున్న కొండలున్నాయి. మధ్యదానిమీద నీలం షర్టు మనిషి కనబడతాడు చూడండి).
ఈ పార్కులో అందమైన దృశ్యాలతో నిండిన అనేక దోవలు .. అవేనండీ సీనిక్ డ్రైవ్స్ వున్నాయి. నిజం చెప్పద్దూ. దేనికదే జనాన్ని ఆకర్షించేటట్లు వున్నాయి. నీడిల్స్ ఐ (మా అమ్మాయి, నేను వున్న ఫోటోలోది) .. ఒక కొండ శిఖరం సూదిలో దారం గుచ్చే రంధ్రం ఆకారంలో వుండటంవల్ల దానికా పేరు. సూది మొనలాంటి శిఖరాలతో నిటారుగా వుండే గ్రెనైట్ కొండలు, పచ్చని చెట్లు, విండ్ కేవ్, జ్యుయల్ కేవ్ లాంటి గుహలు ... అన్నట్లు మనం మన రోడ్లమీద వాహనంలో వెళ్తుంటే గేదెలు వగైరా అడ్డు వస్తే, అవి మన మీదకెక్కడ వస్తాయోనని జాగ్రత్తగా వుంటాంకదా. మరి మన వాహనానికి అడ్డంగా బైసన్ లు మందలుగా సాగుతుంటే ఎంత ధ్రిల్లింగ్ గా వుంటుంది. పైగా వాటిని మనమే ఫోటోలు తీస్తుంటే....భలే కదా.
ఏదో చదువుతున్నాంకదా అని పోజులు కొట్టకండి బైసన్లు అడ్డు రావటమేమిటి మీరు ఫోటోలు తియ్యటం ఏమిటి అంటున్నారు కదూ. ఫోటోలు చూడండి. నేనే కాదు. అక్కడికెళ్ళిన ఎవరైనా ఈ ఫోటోలు తీసుకోవచ్చు. ఇంకా, ఈ పార్కు అఫిషియల్ లోగో బైసన్. అన్నట్లు ఈ పార్కులో మిగతా అడవి జంతువులతోపాటు 1500 దాకా బైసన్లు వున్నాయిట. ఇంకో విషయం తెలుసా అక్కడ మనకన్నా ఎక్కువ స్వేఛ్ఛ వాటికే వుంటుంది. అవి దోవకడ్డంగా వెళ్తుంటే మనం కారు ఆపుకుని, అవి రోడ్డు దాటేదాకా కూర్చోవాల్సిందే.ఈ పార్కులోని 18 మైళ్ళ వైల్డ్ లైఫ్ లూప్ రోడ్ లో వెళ్తుంటే ఇవి మందలు మందలుగా కనబడతాయి. ఒక్కో బైసన్ 2000 పౌండ్ల బరువు వుంటుందిట. ఒక చోట వందలకొద్దీ బైసన్లు చాలా లేజీగా పడుకున్నాయి. ఇవి వైల్డ్ యానిమల్స్. చాలా ప్రమాదకరంట. చూట్టానికి కదలలేనట్లు, అతి నెమ్మదిగా నడుస్తున్నాయి గానీ వేగంగా పరిగెత్తగలవు. పైగా దోవకడ్డంగా కూడా వస్తున్నాయి. బైసన్లే కాకుండా ఇంకా ఇక్కడ కనిపించే అడవి జంతువులు ఏంటీ లోప్, మౌంటెన్ గోట్స్, బైగాన్ షీప్, డీర్, ఎర్క్, వైల్డ్ టర్కూలు, బెగ్గింగ్ బర్రోస్ వగైరా.
ఇక్కడ వున్న ప్రైరీ డాగ్స్ చాలా తమాషాగా వున్నాయి. ఉడత కన్నా కొంచెం పెద్దగా (ఫోటో చూడండి) వున్నాయి. చిటికెలో కనబడతాయి, కనబడినంత వేగంగా అదృశ్యమయిపోతాయి.
ఒక చోట దూరంగా ఏవో జంతువులునవ్నాయి. అంతా నడిచి వెళ్ళి చూసొస్తుంటే, మా పిల్లల్నీ వెళ్ళమంటే వెళ్ళొచ్చారు. మావాళ్ళు వెళ్ళొచ్చి పడీ పడీ నవ్వటం మొదలు పెట్టారు. అవి గాడిదలుట. అక్కడి వాళ్ళు వాటినీ వింతగా చూస్తూ, వాటికేవో తినిపిస్తున్నారుట. మన దేశంలో గాడిదల సంఖ్య ఎక్కువగానీ, అక్కడ తక్కువేమో, అందుకే వింతగా చూస్తున్నారులే అన్నాను కానీ తర్వాత తెలుసుకున్నదేమిటంటే .. అవి గాడిదలేగానీ, అక్కడివారు వాటిని బెగ్గింగ్ బర్రోస్ అంటారు. అవి దోవన పోయే కార్లల్లో వీలయితే తలలు పెట్టి మరీ తినే వస్తువుల కోసం చూస్తాయట. అందుకే వీటికా పేరు. పైగా అక్కడికొచ్చేవారు వీటికోసం ప్రత్యేకంగా ఆహారం తీసుకొచ్చి తినిపిస్తారుట. ఇవ్వన్నీ కలిపి 50 దాకా వున్నాయి. వాటిలో చాలామటుకు అలవాటుగా పార్కులో ఒక ప్రదేశంలో వుంటాయి. అంతా అక్కడికి తినుబండారాలు తీసుకెళ్ళి తినిపించి వస్తున్నారు. అడవి జంతువులకు ఆహారం ఇవ్వద్దు అన్న సూత్రం వీటికి వర్తించదేమో!
హార్నీ పీక్ (Harney Peak) ఆ రాతి కొండల మధ్య వున్న ఎత్తయిన కొండ. దాని ఎత్తు 7,242 అడుగులు. అది ఎక్కితే దూరంగా వున్న ప్రదేశాలు కూడా కనబడతాయని బయల్దేరాము. కారు కొండ మీదకి వెళ్తుందిగానీ, చాలా స్టీప్ గా వుండే రోడ్, చిన్న చిన్న మలుపులు. పైకి చేరుకుంటే వ్యూ పాయింట్ నుంచి దూరంగా వున్న క్రేజీ హార్స్, నీడిల్ రాక్స్, మౌంట్ రష్మోర్, బేడ్ లేండ్స్ వగైరా ప్రదేశాలు చూడవచ్చు. (వాతావరణం నిర్మలంగా వుండాలి మరి.)
ఈ ప్రాంతానికి మొదట వచ్చిన వాడు జార్జి ఎ. కస్టర్. ఆయన 1874లో బ్లాక్ హిల్స్ పరిశోధనలకి వచ్చాడు. అప్పుడు వాళ్ళ టీమ్ వాళ్ళు అక్కడ బంగారాన్ని కనుకొన్నారుట. కస్టర్ కి బంగారంకన్నా ఆ పరిసరాల ప్రకృతి అందం చాలా నచ్చినా, మిగతా వాళ్ళుమాత్రం బంగారం కోసం అక్కడికి వచ్చి చేరుకోవటం మొదలు పెట్టారు. దానితో అంతకాలం ఎక్కువగా ఎవరికీ తెలియని కస్టర్ ప్రాంతం అందరి దృష్టినీ ఆకర్షించింది. తర్వాత ఆ ప్రదేశాన్ని స్టేట్ పార్కుగా అభివృధ్ధి చేసి 71,000 ఎకరాలకి విస్తరించటం, దానికి కస్టర్ పేరు పెట్టటం, అనేక అడవి జంతువులకు నెలవుగా చెయ్యటం, ఆ ప్రదేశాన్ని అనేకమందితోపాటు మేముకూడా చూడటం, మీకు చెప్పటం, ఇవ్వన్నీ అన్నమాట.
ఇక్కడివారిని ఆకర్షించే ఇంకొక ముఖ్య విషయం, ఏన్యుయల్ రౌండ్ అప్ ఆఫ్ బఫెలోస్. ఇది ప్రతి సంవత్సరం సాధారణంగా సెప్టెంబర్ లో జరుగుతుంది. ఆ సమయంలో అక్కడ వున్న బైసన్స్ అన్నింటినీ ఒక చోట చేర్చి, వాటిలో మళ్ళీ వాళ్ళ రూల్స్ ప్రకారం కొన్నింటిని వేరుచేసి, వేలం వేస్తారుట. వీటిని ఒక చోట చేర్చటానికి పార్కు సిబ్బందితో సహా ఇంకా అనేకమంది కౌ బాయ్స్, కౌ గర్ల్స్, గుఱ్ఱాల మీద తిరుగుతూ ప్రయత్నిస్తారు. ఈ వేలానికి 10,000 మంది దాకా హాజరవుతారుట. కొన్ని వందల బైసన్లు అమ్ముడుపోతాయట. 1965లో మొదలైన ఈ రౌండ్ అప్ ద్వారా పార్కులో వాటి సంఖ్య మరీ ఎక్కువ అయి వాటి ఆహారానికి ఇబ్బంది లేకుండా చూడటం, వగైరా కారణాలు.
హమ్మయ్య. ఈ పార్కు గురించి నాకు తెలిసినవన్నీ చెప్పేశాను. వచ్చే వారం విండ్ కేవ్ చూద్దాం..