మౌంట్ ఆబు
జోధ్ పూర్ నుంచి మా ప్రయాణం మౌంటు ఆబు వైపు సాగింది . మొత్తం 270 కిలోమీటర్ల దూరం కొంత NH 65 , NH 12 ల మీదుగా సాగుతుంది . రాజస్థాన్ చాలా భాగం యెడారి కాబట్టి మనకి ప్రయాణం అంతా ముళ్లపొదలు , తుమ్మ చెట్లు తప్ప వేరే యేరకమైన చెట్లు కనబడవు . అక్కడక్కడ తుమ్ము చిగురులు తింటూ కృష్ణజింకలు కనిపించి ప్రయాణాన్ని కాస్త యింట్రష్టింగ్ గా మారుస్తాయి . కనుచూపుమేర వరకు యిసుక , ముళ్లతుప్పలు , గాలితో పాటు యెగురుతున్న యిసుక రేణువులు , యీ నాలుగయిదు గంటల ప్రయాణం యిలాగే సాగుతుంది .
అప్పుడప్పుడు మొహమంతా ముసుగువేసుకొని యెక్కడినుంచో నీటి బిందెలు మూడుకి తక్కువలేకుండా ఒకదానిమీద వొకటి పెట్టుకొని వెడుతూ రాజస్థానీ వనితలు కనిపిస్తారు .
రాజస్థానీ మహిళలు ముసుగులు వేసుకోడానికి " ఘోషా " ఒక కారణమయితే మరో కారణం యీ యెడారిలో యిసుక కళ్లల్లో పడకుండా వుండడం అనేది మరో కారణం అయివుంటుంది అని నాకనిపిస్తూ వుంటుంది .
" మౌంటు ఆబు " లో రూమ్స్ బుక్ చేసుకోడం వల్ల ముందుగా " ఆబు రోడ్డు " కి దగ్గరగా వున్న వాటిని చూసుకుందాం అని నిర్ణయించుకున్నాం .
ఆబు రోడ్డుకి దగ్గరగా శక్తి పీఠం వుందని వినడంతో ముందుగానే ఆమందిరం గురించి వివరాలు సేకరించేం . దాని ప్రకారం ఆబు రోడ్డుకి యిరవై కిలోమీటర్లదూరంలో గుజరాత్ రాజస్థాన్ బోర్డరులో గుజరాత్ కి చెందిన అంబాజీ నగరంలో వుందని తెలిసింది . ఈ శక్తిపీఠాన్ని ' అంబాజీ మాత ' , అరశూలి అంబాజీ ' అని పిలుస్తారు . దక్షయజ్ఞ సమయంలో యోగాగ్నిలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి శరీరం భజానవేసుకొని రుద్రతాండవమాడుతున్న పరమేశ్వరుని కార్యోన్ముఖుని చేసేందుకు సర్వదేవతల సమ్మతితో విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగావిస్తాడు . సతీదేవి శరీరభాగాలు పడ్డ ప్రదేశాలు శక్తి పీఠాలుగా వుద్భవించేయి . ఈ ప్రదేశం లో సతీదేవి యొక్క హృదయ భాగం పడినట్లుగా చెప్తారు . ఈ విషయం ' తంత్ర చౌదామిని ' గ్రంథంలో చెప్పబడింది . మేము కోవెల దగ్గరకు చేరేసరికి స్థానికులు శక్తిపీఠమందిరం అదికాదని యెదురుగా వున్న కొండమీద వున్న కోవెలని చెప్పేరు ఆ కోవెల సాయంత్రం అయిదు గంటలకి మూసేస్తారు కాబట్టి ముందుగా ఆ మందిరాన్ని దర్శించుకోమని సలహా కూడా యిచ్చేరు . మేము వారు చెప్పినట్లుగా ముందుగా ఆ కొండ వైపుగా వెళ్లేం .
ఆ కొండని ' గబ్బర్ ' కొండ అంటారు . గబ్బర్ కొండ దిగువున సరస్వతి నది ప్రవహిస్తూ వుంటుంది . ఈ మందిరం నాలుగవ శతాబ్దానికి చెందిన వల్లభ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సూర్యవంశ చక్రవర్తి ' అరుణ సేనుడి ' ద్వారా నిర్మింపబడింది .ఈ కోవెల సముద్ర మట్టానికి సుమారు 500 మీటర్ల యెత్తులో వుంది . ఈ కొండపైకి చేరుకోడానికి మొత్తం 999 మెట్లు యెక్కి గాని లేదా ' రోప్ వే ' ద్వారా గాని మాత్రమే చేరుకోగలం . మేము రోప్ వే లో కొండపైకి వెళ్లేం . గుజరాత్ , రాజస్థాన్ లో వుండే అంబాజీ భక్తులు ఈ గబ్బర్ కొండకు కాలినడకన ప్రదక్షిణ చేస్తారు . దారి లో యాత్రీకులు సేద తీరేందుకు సదుపాయాలతోపాటు అమ్మవారి యొక్క 51 పీఠాల అసలు మందిరాల నమూనాల తో నిర్మించిన 51 శక్తి పీఠాలు వున్నాయి . గబ్బర్ పర్వత పరిక్రమ చేసుకుంటే మొత్తం భారతదేశంలో వున్న 51 శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని స్థానికుల నమ్మకం . మేము గబ్బర్ పర్వత పరిక్రమ చెయ్యలేదు .
కొండ మీద చిన్న కోవెల అందులో చిన్న అమ్మవారి విగ్రహం వున్నాయి . అక్కడ చిన్న వుద్యానవనం పెంచాడనికి యేర్పాటు జరుగుతున్నాయి .యిది మేము 2005 లో వెళ్లినప్పటి మాట . ఒక ప్రక్క కొండ వాలులో చిన్న రాతి రధం వుంది . పార్వతిని వివాహమాడిన తరువాత పరమేశ్వరుడు పార్వతీ దేవితో ఈ శక్తి పీఠాన్ని దర్శించుకొనేందుకు వచ్చేనని , దానికి గుర్తుగా రధం విడిచి పెట్టేడని స్థానికంగా వున్న పూజారి చెప్పేడు . ఓ పక్కగా చిన్న పిల్లలకి పుట్టుజుత్తులు సమర్పిస్తున్నారు . అక్కడ వుంగరాల జుత్తులో వున్న కృష్ణుని విగ్రహం వుంది . కృష్ణునికి యిక్కడ పుట్టు జుత్తులు తీసేరని చెప్పేరు . ఇక్కడ ముఖ్యంగా అఖండదీపాన్ని దర్శించుకోవాలి . సత్యయుగం నుంచి అన్ని కాలాలలోనూ వెలుగుతూనే వుంటుంది . ప్రాకృతికంగా యేర్పడ్డ దేవతల విగ్రహాలు , గుహలు చూడదగ్గవి . ఈ పర్వతం మీంచి అస్తమిస్తున్న సూర్యుడిని చూడడం ఒకగొప్ప అనుభవం అని చెప్పక తప్పదు . మొత్తం యివన్నీ ఓ అరగంటసమయంలో దర్శించుకోవచ్చు . రోప్ వే లో కూర్చొని కిందన ప్రవహిస్తున్న సరస్వతి నదిని , ఆరావళీ పర్వతశ్రేణులని , దట్టమైన అడవిని చూస్తూ సాగే మనప్రయాణం అహ్లాదకరంగా వుంటుంది .
గబ్బర్ కొండ దిగువున ఒక కిలోమీటరు దూరంలో వున్న కామాక్షి మందిరం చూడదగ్గది .యిక్కడకూడా 51 శక్తి పీఠాలను అసలు మందిర నమూనాలు నిర్మించి విగ్రహాలను ప్రతిషించడం నచ్చింది . 51 శక్తి పీఠాలను దర్శించుకున్న అనుభూతి కలిగింది .
అక్కడకి దగ్గరవున్న వున్న ' కుంభారియా ' జైనమందిరానికి వెళ్లేం .
కుంభారియా జైనమందిరం------
కుంభారియా జైనమందిరం ' 11 వ శతాబ్దానికి చెందినది . చతురశ్రాకారంలో నిర్మింపబడ్డ ముఖ్యమందిరం మనలను మంత్రముగ్ధులను చేస్తుంది . ఆ స్థంభాలు , తోరణాలు , పై కప్పుకున్న నగషీలు కళ్లు తిప్పుకోనివ్వవు . ఒకే రకంగా వున్న అయిదు మందిరాలు జైన తీర్ధంకరులవి . మహావీరుడు , పార్శ్వనాథుడు , నేమినాథుడు , శాంతినాథుడు , సంభవనాథుడు మూర్తులను ప్రతిష్టించేరు . మరి మిగతా తీర్థంకరులు ముఖ్యమైనవాళ్లుకారా అనే సందేహనివృత్తి కై అక్కడి వారిని అడిగితే ఈ కథను చెప్పేరు .
దానిప్రకారం 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ' సోలంకిరాజుల ' మంత్రి ' విమల షా ' కి అంబాజీ మాత కలలో కనిపించి జైన మతగురువులకి 360 కోవెలలను కట్టించమని ఆదేశించిందట , మాత ఆదేశానుసారం 360 మందిరాలు నిర్మించిన విమల్ షా అమ్మవారిని విస్మరించెనట , అందుకు ఆగ్రహించిన అమ్మవారు జైనమందిరాలను కూలిపోయేట్టు చేసిందట , పటిష్ఠంగా కట్టిన మందిరాలు కూలిపోవడంతో అంబాజీ మాతకు తాను చేసిన అపరాధం తెలిసి వచ్చిందని తనను క్షమించమని వేడుకొని మిగిలిన అయిదు మందిరాలలో శ్రీచక్రాన్ని ప్రతిష్టంచెనట . ఈ అయిదు మందిరాలలోనూ శ్రీచక్రం వుండటం చూస్తాము .
ఈ జైనమందిరం దిల్వారా జైనమందిరానికి పోలి వుంటుంది .
అంబాజీ మందిరం-------
అక్కడి నుంచి అంబాజీ మందిరాన్ని దర్శించు కొనేందుకు అంబాజీ వచ్చేం. ఈ మందిరం మొత్తం పాలరాతితో అతి చక్కని రాజస్థానీ , గుజరాతీ శిల్పకళతో నిర్మింపబడిన బహు చక్కని మందిరం . అయితే యిక్కడ అంబాజీ విగ్రహరూపంలో వుండదు . తాబేలు ఆకారం మీద రాతి పై చెక్కబడిన శ్రీవిషయంత్రం . ఆ చక్రాన్ని మానవులు దర్శించుకోరాదని దానిపై బంగారు రేకు తాపడం చేసేరు . ఈ శ్రీచక్రాన్ని మీద 51 బీజాక్షరాలు కూడా చెక్కబడి వుంటాయి . నిత్యపూజలు నిర్వహించే పూజారులుకూడా కళ్లకు బట్ట కట్టుకొని పూజలు నిర్వహిస్తారు . పూజానంతరం బంగారు రేకుతో యంత్రాన్ని మూసివేస్తారు . ప్రతి పున్నమికి యిక్కడ విశేషపూజలు నిర్వహిస్తారు . ఆ రోజు భక్తులు వేలసంఖ్యలో వస్తారు . భద్రత పూర్ణిమ , దేవీ నవరాత్రులలో విశేష పూజలు నిర్వహించి మందిరాన్ని రంగురంగుల దీపాలు , పూలతో అలంకరిస్తారు . ఈ రోజులలో భక్తులు వారి వారి వూర్లనుంచి కాలినడకన యిక్కడకి వచ్చి గబ్బర్ కొండకు ప్రదక్షిణ చేసుకొని అంబాజీ మాతను దర్శించుకొని కాలినడకన వారి వారి వూర్లు చేరుతారు . గుజరాతీలు దీపావళి నాడు అంబాజీ మందిరంలో దీపారాధన జరిగిన తరువాత తమతమ యిళ్లల్లో దీపాలు వెలిగిస్తారు . శక్తిపీఠాలలో భైరవ్ నాథ్ కి కోవెల వుంటుంది అమ్మవారిని దర్శించుకున్న తరువాత భైరవనాథుని కూడా దర్శించుకోవాలి అది అమ్మవారు భైరవునికి యిచ్చిన వరం . ఇక్కడ భైరవుడు బటుక్ భైరవనాథునిగా పిలువబడుతూ భక్తులచే పూజింపబడుతున్నాడు . అప్పటికే చీకటి పడుతూ వుండడం తో అవేళటికి సైట్ సీయింగు ముగించుకొని మౌంట్ ఆబు బయలుదేరేం . ఈ మందిర వెనుక భాగంలో వున్న తీరాన్ని మానససరోవరం అంటారు .
ఆబు రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి సుమారు 27 కిలో మీటర్ల దూరంలో వుంది మౌంటు ఆబు పట్టణం . మౌంటు ఆబు రాజస్ధాన్ లో శిరోహి జిల్లాలో వుంది . సముద్ర మట్టానికి 4000 అడుగుల యెత్తులో వుండడంతో వాతావరణం చాలా చల్లగా వుండి రాజస్థాన్ రాష్ట్రం లో వున్న యేకైక వేసవి విడిదిగా పేరుపొందింది . ఆబూ పర్వతం ఆరావళీ పర్వత శ్రేణులలో దట్టమైన అడవుల మధ్యన 22 కిలోమీటర్ల పొడవు 9 కిలో మీటర్ల వెడల్పు తో యేర్పడ్డ రాతి పీఠభూమి పైన నిర్మించిన నగరం . ఈ ఆరావళీ పర్వతశ్రేణులలో ఆబు పట్టణానికి దగ్గరగా వున్న ' గురుశిఖరం ' యెత్తు సుమారు 5650 అడుగులు . ఆబు పట్టణానికి ఆనుకొని ' వైల్డ్ లైఫ్ సేంచ్యురీ ' బర్డ్ సేంచ్యురీలు వున్నాయి . పర్వతాలు , సెలయేళ్లు , సరస్సులు , జలపాతాలతో మనస్సుకు అహ్లాదాన్ని యిస్తాయి . ఆబు పట్టణానికి వెళ్లే దారిలోనే మనకి చాలా పెద్ద సరస్సైన ' నక్కి ' సరస్సు కని పిస్తుంది .
మౌంటు ఆబు పట్టణం గా వ్యవహరిస్తున్న ఈ ప్రాంతం లో అతి మనోహరమైన వనం వుండేదని , బ్రహ్మఋషి గా పేరుగాంచిన వశిష్ఠుడు , విశ్వామితృని ఈర్ష కు తట్టుకోలేక కొంతకాలము ఈ వనంలో యజ్ఞయాగాదులు నిర్వహించుకుంటూ కాలంగడిపివట్లుగా పురాణాలలో వివరణ వుంది . ఈ వనాన్ని అర్భదారణ్యము అని ఈ పర్వతాన్ని అర్భుద పర్వతమని పిలిచేవారు . ఈ పర్వతానికి అర్భుదము అనే పేరు రావడానికి స్థానికుల ప్రకారం మరో పురాణ గాధ యిలా చెప్తారు . పరమేశ్వరుని వాహనమైన నంది ఈ అరణ్యంలో విహరిస్తూ వుండగా ప్రమాదవశాన్న ఈ కొండపైనుండ లోయలోకి పడిపోతూ వుండగా అర్భుదము అనే పాము నందిని కాపాడిందట , అప్పటినుంచి ఈ పర్వతానికి అర్భద పర్వతమని , చుట్టూరా వున్న అరణ్యాన్ని అర్భుదారణ్యంగాను వ్యవహరించసాగేరు . కాలక్రమంలో ' అర్భుదము ' 'ఆబు ' గా మారినట్లుగా చెప్తారు .
ధనపాలుడు రచించిన ' తిలక మంజరి ' ప్రకారము గుజరాత్ , రాజస్థాన్లో వుండే ' గుర్జర్ ' అనే కొండజాతి మౌంటు ఆబు నుంచి 6 వ శతాబ్దం లో వలస వచ్చేరని వుంది . గుజరాత్ , రాజస్థాన్ లలో కొన్ని జిల్లాలని ' గుర్జరాత్ర ' అని వ్యవహరిస్తారు . అంటే గుర్జర్ల చే రక్షింపబడినది అని అర్ధం . గుర్జరభూమి అని కూడా వ్యవహరించడం కనిపిస్తూ వుంటుంది .
రాత్రి హొటలులో విశ్రాంతి తీసుకొని పొద్దున్న యెనిమిదికి గది దాటి బయట టిఫిను చేసుకొని చూడవలసిన ప్రదేశాలను యెంచుకున్నాం . ముందుగా ప్రణాళిక వుంటే యిలాంటి ప్రదేశాలలో సమయం కలిసి వస్తుంది . అందుకే అక్కడి స్థానికులని అడిగి అక్కడ చూడదగిన ప్రదేశాలు రాసుకున్నాం .
అవి యేమిటంటే -----
1) అచల్ ఘడ్
2) అధర్ దేవి మందిరం
3) గోముఖమందిరం
4) గురు శిఖరం
5) బ్రహ్మ కుమారి ఆశ్రమం
6) నక్కి సరస్సు
మౌంటు ఆబు లో రెండు రోజులు వుండేటట్టుగా ప్లాను చేసుకున్నందువలన ముఖ్యమైన వాటినే చూడడానికి యెంచుకున్నాం . అలా యెంచుకున్నవే పై ఆరునూ .
వాటిలో అచల్ ఘడ్ , అధర్ దేవి మందిరం, గోముఖమందిరం .మొదటి రోజు , మిగతావి రెండో రోజుకి పెట్టుకున్నాం .
1) అచల్ ఘడ్--
మౌంటు ఆబు పట్టణానికి సుమారు 11 కిలో మీటర్ల దూరంలో అర్భుదారణ్యానికి దగ్గరగా వుంది . ఈ కోటని ' పరమార ' వంశానికి చెందిన రాజులు కట్టిన అతి దుర్భేధ్యమైన కోటగా చెప్తారు . ' అచల్ ' అంటే కదిలించలేనిది , పటిష్ఠ మైనది అని అర్ధం . 1452 లో మేవాడ్ ని పరిపాలించిన 'రాణా కుంభ ' దీనిన తిరిగి బాగు చేయించేడని చరిత్ర చెప్తోంది ' రాణా కుంభ ' అంటే మహరాణా ప్రతాప్ తండ్రి .
ప్రస్తుతం ఈ కోట శిధిలావస్థలో వున్నా వొకప్పటి వైభవం అడుగడుగునా కనబడుతూ వుంటుంది . యెత్తైన ప్రహారీ గోడ మధ్య నున్న కోట . కొండ మీద వుండడం వల్ల నడక కాస్త యిబ్బందిగానే వుంటుంది . కోట లోకి ప్రవేశ ద్వారాన్ని 'హనుమాను పోల్ ' అని అంటారు . అక్కడ రెండు గ్రే కలరు గ్రానైటు కట్టడాలు వుంటాయి , కాస్త పైకి వెళితే ' చంపా పోల్ ' అనే రెండో ద్వారం , అదే ముఖ్య ద్వారం కూడా అందులోంచి లోపలకి వెళితే రాజభవనాల అవశేషాలు కనిపిస్తాయి . లోపల జైనమందిరాలు వున్నాయి . కోట బయట వున్న 9 వ శతాబ్దానికి చెందిన అచలేశ్వర్ శైవమందిరం కనిపిస్తుంది . ఈ మందిరాన్ని రాజు ' ఆదిపాలుడు ' నిర్మించేడు . శివుని బొటనవేలు గుర్తుమీద నిర్మింపబడిన మందిరం . ఈ కోవెలలో శివలింగం సృష్టి కార్యానికి ప్రతీక అని బ్రహ్మాండం లోని మూలశక్తి యిక్కడ కేంద్రీకృతమై వుందని యిక్కడ పూజారి చెప్పేరు . పానువట్టం అన్ని శివ మందిరాలలో వలె కాక యోని ఆకారంలో చెక్కబడి వుంటుంది .
ఈ కోవెలలోని మరో విశేషం , శివుని వాహనమైన నంది . ఈ నందిని నాలుగు టన్నుల పంచధాతువులతో నిర్మించేరు . అదే కాకుండా యిక్కడ వున్న దేవీ దేవతా విగ్రహాలను నిర్మించిన రాయి . వీటిని క్రిష్టల్ రాయితో నిర్మించినట్లు చెబుతారు . జెమ్మాలజిస్టు గా నాకు తెలిసి స్పటికంఅని పిలువబడే క్రిస్టల్ అంటే కొన్ని వేల సంవత్సరాలు భూమిలో గడ్డకట్టుకు పోయిన మంచు . ఈ రాయి చాలా ట్రాన్సపెరెంటుగా వుంటుంది . ఇటు నుంచి చూస్తే వాటి వెనుక నున్న వాటిని మనం చాలా స్పష్టంగా చూడగలం . యీ విగ్రహాలు అలా వుండవు కాని విగ్రహం వెనుక వుంచితే దీపాన్ని మనం విగ్రహం లోంచి చూడగలం . రాయేకాని స్పటిక గుణాలు వుండడంతో స్పటికరాయి విగ్రహాలని అంటారు .
ఈ మందిరాలు దగ్గరగా వున్న సరస్సు ని మందాకిని సరస్సు అని అంటారు . దీని వొడ్డున మూడు రాతి తో నిర్మించిన గేదెల బొమ్మలు వుంటాయి . పూర్వం కొందరు రాక్షసులు యీ సరస్సులో గేదెల రూపంలో వుండి ప్రజలకు హాని కలిగిస్తూ వుండగా అప్పటి రాజులు వీటితో వీరోచితంగా పోరాడి సంహరించేరట , దానికి గుర్తుగా యీ విగ్రహాలను పెట్టినట్టుగా స్థానికుల కథనం .
2) అధర్ దేవి మందిరం-----
అధర్ దేవి మందిరం కొండగుహలో వుంటుంది . కొండ పైకి యేర్పరచిన 365 మెట్లు యెక్కి గుహ ద్వారం చేరుకుంటాం . కొండ మధ్య వున్న చిన్న చీలిక గుండా లోపలకి పాక్కుంటూ వెళితే లోపల కాస్త వెడల్పయిన ప్రదేశం చేరుకుంటాం . లోపల చాలా చల్లగా ప్రశాంతంగా వుంటుంది లోపల అమ్మవారి విగ్రహం చాలా చిన్నది ఒకటి , వో మోస్తరు వున్న రంగుల బొమ్మ వొకటి మిగతావి ఫొటోలు వున్నాయి .
ఈ ప్రదేశం లో సతీ దేవి యొక్క ' అధరం ' పడిందట , అందుకే అమ్మవారిని ' అధర్ దేవి ' అని అంటారు . అమ్మవారి విగ్రహం లేదని అంటే మరో కధ చెప్పేరు . పూర్వం యిక్కడ అమ్మవారి విగ్రహం చాలా పెద్దది వుండేదట , ఆ విగ్రహం యే ఆధారం లేకుండా గాలిలో వ్రేలాడుతూ వుండేదట అందుకని యీ దేవిని అధర్ దేవి అని పిలువసాగేరు అని . కథ యేమైనాకాని యీ చిన్న గుహలో చాలా చల్లగా ప్రశాంతంగా వుండి బయటకు రావాలని అనిపించలేదు . ఆ విగ్రహ రహస్యం తెలుసుకొనేందుకు ఆంగ్లేయులు ఆ విగ్రహాన్ని ఇంగ్లాండుకు తరలించేరుట
3) గోముఖమందిరం------
దట్టంగా వున్న అడవి మార్గం గుండా 700 రాతి మెట్టు దిగితే హనుమాన్ మందిరం వస్తుంది . ఇక్కడ యెర్రమూతి కోతులు చాలా పెద్ద సంఖ్యలో వుండటం కనిపిస్తుంది . హనుమాన్ మందిరం వున్న చోట కోతులు వుండడం యాదృఛ్చికమో , భగవత్సంకల్పమో కాని యిలా చాలా చోట్ల చూడడంతో మాకు వింతగా అనిపించింది . హనుమాన్ మందిరం నుంచి ఆ అడవిలో మరో అయిదు కిలో మీటర్లు కిందకి నడకదారిన వెడితే వశిష్ఠ ముని ఆశ్రమమం చేరుతాం . ఈ ప్రదేశానికి వర్షాకాలంలో వెళ్లరాదని మనవి , ఈ దట్టమైన అడవిలో సూర్యకిరణాలు అరుదుగా పడడంతో నేల యెప్పుడూ చితచిత లాడుతూ వుండి జారుడుగా వుంటుంది .
మామూలుగానే కాలు జారుతూ వుంటుంది . వర్షాకాలంలో మరీ జారుడుగా వుంటుంది . అంతే కాక పాములు పుట్టలలోంచి బయటకి వచ్చి చెట్లను ఆశ్రయించుకుంటాయి . వెళ్లి రావడం వెలుగుండగానే పూర్తి చేసుకుంటే మంచిది . ఇద్దరూ ముగ్గురు కాకుండా పదిమందిదాకా గ్రూపులో వెడితే మంచిది . ఇక్కడ కోతులతో పాటు చిరుతలు కూడా వుంటాయని అంటారు అందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోడం .
ఈ ప్రదేశంలో వసిష్టమహర్షి ఆశ్రమం వుండేది . మహర్షి యిక్కడ యజ్ఞయాగాదులు నిర్వహించేవాడు . త్రేతాయుగంలో బ్రహ్మర్షి తన పత్ని అరుంధతి తో యీ ప్రాంతంలో నివశించేవాడు . వశిష్ఠుని వద్ద కామధేనువు పుత్రి నందిని ధేనువు వుండేది . ఆమె మహత్యము తో ఆ ప్రదేశము లో ప్రయాణించే వారికి అతిథి సత్కారములు చేసేవారు ఋషి దంపతులు . ఆ అతిథి సత్కారములవలన వశిష్ఠుని పుణ్య ఫలము పెరుగుట చూచి అసూయకు లోనైన విశ్వామితృడు నందిని ధేనువును బలప్రయోగముతో తన ఆశ్రమమునకు తీసుకొని పోవుటకు రాగా నందిని ధేనువు తన శరీర రోమములనుండి వేనవేల సైన్యమును సృష్టించి విశ్వామితృని సైన్యమును తరిమి కొట్టెను . అందుకు కృతజ్ఞతగా వశిష్టుడు అక్కడ వుండే జలధారకి ఆమె పేరు పెట్టేడు . అక్కడ ఒక పర్వతభాగము గోవు ముఖమువలె కనిపిస్తూ అందులోంచి పడుతున్న ధార వశిష్ఠుని ఆశ్రమ ప్రదేశం లో వున్న కుండం లో పడి అక్కడ నుండి ప్రవహించి దిగువున వున్న సరస్వతీ నదిలో కలుస్తోంది . బదరీనాధ్ దగ్గర పాతాళంలోకి వెళ్లిపోయిన సరస్వతీ నది యిదే అని అంటారు . ఈ ప్రదేశంలో వశిష్ఠుడు యాగం నిర్వహించిన యోగకుండం వుంది , దీనిని ' అగ్నికుండం ' అని అంటారు . వశిష్ఠుడు యజ్ఞం చేసినపుడు ఈ అగ్ని కుండం నుంచే నాలుగు ముఖ్యమైన రాజపుత్ర వంశ పురుషులు వుద్భవించేరని రాజపుతృల నమ్మకం .
సరస్వతి నది వొడ్డున మూడు నీటి బుగ్గలు వున్నాయి . ఆ నీటితో పాటు బయటకి వచ్చే మన్ను ఒక దాంట్లో పసుపు వర్ణం లోనూ , మరోకదాంట్లో కుంకుమ వర్ణం లోనూ , మూడవదానిలో గంధం రంగులోను వుండడం తో వాటి గురించిన స్థల పురాణం వశిష్ఠుని ఆశ్రమంలో వున్న కాషాయవస్త్రధారిని అడిగేం . అరుంధతి దేవి ఓ రోజు స్నానం చెయ్యడానికి నది వొడ్డుకు వచ్చిందట , రోజూ తెచ్చుకొనే పసుపు కుంకుమలు మరచిపోయిందట , నదిలో స్నానం చేసేటప్పుడు పుణ్య స్త్రీ లు తాము పసుపు కుంకుమలు , గంధం రాసుకొని నదికి కూడా సమర్పించడం హిందూ సాంప్రదాయం . ఆ మహాపతివ్రత తపఃశక్తితో నది వొడ్డున ప్రకటితమయ్యేటట్లు చేసిందట . మేము కూడా పసుపు మట్టిని చేత్తో తీసుకొని ఒకటికి రాసుకుంటే పసుపు రంగువచ్చింది . అలాగే మిగతావి కూడా ! వీటివెనుక వున్న సైంటిఫిక్ రీజను మాకు తెలీదుగాని సామాన్యంగా ఆలోచిస్తే మాత్రం అద్భతంగానే కనిపిస్తుంది . మేము సామాన్యులమే .
మహాభారతం లోని వనఖండం లో వశిష్ఠుడు యుధిష్ఠిరునకు యీ ప్రదేశం యొక్క మహత్తును గురించి వివరించేడట దాని ప్రకారం యీ ప్రదేశం లో ఒక రాత్రి గడపిన వారికి వేయి ధేనువులను దానం చేసినంత ఫలితం దక్కుతుందట .
ఇక్కడ పాలరాతి తో నిర్మించిన గోవుముఖం , నంది వున్నాయి . వీటిలోంచి కూడా నిరంతరం నీరు పడుతూ వుంటుంది . వశిష్ఠుని విగ్రహం తో పాటు రామలక్ష్మణులు , శ్రీకృష్ణుల విగ్రహాలు వున్నాయి .
పైన హనుమాను మందిరం లోను , యిక్కడ కూడా పూజారుల కుటుంబాలు మందిరానికి ఆనుకొని వున్న మట్టి యిళ్లల్లో నివసిస్తున్నారు
పై వారం మౌంటు ఆబు లోని మిగతా ప్రదేశాలను సందర్శించుకుందాం . అంతవరకు శలవు .