సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
సాహితీవనం-శ్రీ పాండురంగ మాహాత్మ్యము-పరిచయము   పాఠకుడా! మరొక కొత్తసంవత్సరం మరొక వసంత మధురోహల మారాకులు తొడుగుతున్నవేళ, శుభాకాంక్షలతో తెలుగు సాహితీవనంలోకి స్వాగతం! ఆంధ్రకవితాపితామహుడు అల్లసాని పెద్దన  ముద్దమందారాలను మురిపెంగా పరికించాము. రాయల 'రాణీ గులాబీల' రసావలోకనం చేశాము. ఇక తెనాలి రామలింగని దేవపారిజాతపుష్పాపచయం  చేద్దాము, రా! యిది నీదీ, నాదీ,  మనందరిదీ ఐన సంపద. తెలుగువాడి నాడి, వాడి, వేడి, బాణి, వాణి ప్రపంచానికి తేట తెల్లము చేసిన సంపద, ప్రపంచము ఉన్నంతకాలం నిలిచిఉండే సంపద, నిన్నూ నన్నూ నిలిపి ఉంచే సంపద. మన ఐశ్వర్యాన్ని అనుభవించడం మనహక్కు, అదృష్టము, బాధ్యత!తెలుగువారి కథలలో, జానపదుల మదులలో, నిరక్షరాస్యులకు సైతమూ చిరపరిచితమైన పేరు 'తెనాలి రామకృష్ణుడు', తెలుగువారి ముద్దుపిలుపులో 'రామలింగడు'. సాహిత్య గంధం ఎరుగానివారికి కూడా, యింతగా సుపరిచితుడైన సుప్రసిద్ధుడైన సాహితీమూర్తి బహుశా, తెలుగుసాహిత్యంలో వేరెవరూ లేరేమో! తెనాలి రామకృష్ణుని అసలు యింటిపేరు 'గార్లపాటి'వారు. ఆయన తండ్రి గార్లపాటి రామపండితుడు తెనాలిలో నివసించడంచేత వారి ఊరిపేరే ఇంటిపేరుగా మారింది.గార్లపాటి రామపండితుడికి ముగ్గురుకుమారులు, రామలింగడు, శ్రీగిరి, అన్నయ్య.మొదట శివభక్తుల కుటుంబం  వారిది. గార్లపాటి రామపండితుడు తెనాలిలో రామలింగేశ్వర దేవాలయములో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవవిగ్రహాలను చేయించి,ప్రతిష్ఠించి, అర్చన చేసినవాడు.  పండితుడు కానీ, గ్రంధకర్త అని దాఖలాలు లేవు.రామపండితుడి తమ్ముడు, రామలింగని చినతండ్రి అని సాహిత్య చరిత్రకారులు భావించే గార్లపాటి లక్ష్మణకవి 'వీరభద్రేశ విజయము' అనే గ్రంధాన్ని రచించాడని ప్రతీతి.రామలింగని తమ్ముడైన శ్రీగిరి 'శ్రీశైల మాహాత్మ్యము' అనే గ్రంధాన్ని రచించాడని ప్రతీతి.కానీ ఈ రెండు గ్రంధములూ అలభ్యములే, అక్కడక్కడ యితరులు వాటిని 
ఉదాహరించారు అని సాహిత్యచారిత్రక పరిశోధకుల పలుకులు. శ్రీగిరి కుమారుడు,మనుమలు వీరరాఘవుడు, రామభద్రుడు కూడా గొప్పకవులే అని ప్రతీతి. రామభద్రుడు 'యిందుమతీ కళ్యాణము' అనే గ్రంధాన్ని రచించాడు. అది లభ్యమే. కనుక వారిది 
కవుల, పండితుల, భక్తుల కుటుంబం అనేది నిర్వివాదాంశము.

వీరిది కాత్యాయన సూత్రానికి, శుక్ల యజుశ్శాఖకు చెందిన, కౌండిన్యస గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణ కుటుంబం. ఆదిశంకరాచార్యుని భక్తులు. అద్వైత వేదాంత ప్రేమికులు. శివభక్తులు. 14వ శతాబ్దిలో రామానుజ శ్రీవైష్ణవము, మధ్వాచార్యుల ద్వైతసిద్ధాంత వైష్ణవము ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో బలీయముగా ఉన్నప్పటికీ, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రములో అహోబిలము, తిరుపతి కేంద్రములుగా శ్రీవైష్ణవ సంప్రదాయము ఎక్కువగా ప్రచారాన్ని పొంది, వైష్ణవులుగా ఎక్కువమంది జీవికను కొనసాగించారు, ఆ క్రమంలోనే రామకృష్ణుల వంశమువారు కూడా వైష్ణవులుగా మారారు.రామలింగని గ్రంథాలు మూడు లభించాయి. అందులో మొదటిది 'ఉద్భటారాధ్య చరిత్ర' తొలినాళ్ళ రచన. అందులో శైవసాంప్రదాయ విషయాలను బట్టి ప్రారంభములో శైవునిగా ఉన్న రామలింగడు, వైష్ణవ మతాభిమానిగా మారిన తరువాతి నాళ్లలో రచించిన 'పాండురంగ మాహాత్మ్యము', 'ఘటికాచల మాహాత్మ్యము'లలో వైష్ణవమతావేశము కనిపిస్తాయి. రామలింగడు 'రామకృష్ణునిగా మారిన దశ యిది. ఘటికాచల మహాత్మ్యము మరీ తీవ్ర వైష్ణవ భక్తిపూరిత కవితావేశముగా కనిపిస్తుంది. 

ఇవేకాక 'హరిలీలావిలసము' 'కందర్పకేతువిలాసము' అనే రెండు గ్రంథములనుకూడా తెనాలి రామకృష్ణుడు రచించాడనే వాదం తెలుగు సాహిత్య ప్రపంచములో ఉన్నది,పండితుల ఎరుకలో. శ్రీనాథుని హరవిలాసము, శృంగార నైషధములను దృష్టిలో ఉంచుకుని రామకృష్ణుడు వీటిని రచించాడని పండితవాదం ఉన్నది. యిది నిజమైనా కాకున్నా ఎంతటి ఉత్కృష్ట రచననైనా, ఎవరికీ తీసిపోనట్లు, పోటీ పడగలిగేట్లు కవిత్వం చెప్పగలిగిన ప్రతిభ తెనాలి రామకృష్ణునిది అని అందరి నమ్మకము. 

పరిహాసము, వ్యంగ్యము 'వికటకవి' అనే పేరును తెచ్చిపెట్టాయి, కానీ రామకృష్ణుడు ఎవరికీ తీసిపోడు అని ఆంధ్ర సాహిత్య దిగ్గజాల భావన. రామకృష్ణునికి ఆపాదించిన అసభ్య, మొరటు చాటువులు ఆతని పరిహాస ప్రకృతికి మరొక పార్శ్వము. ఎన్నో పెద్ద, చిన్న కథల సమాహారమైన మనోహరమైన రచన పాండురంగ మాహాత్మ్యము.సామాన్య ప్రబంధాలలోని తీవ్ర శృంగార రసవిలాసాలు, వీరవిహారాలు లేని భక్తిభావ ప్రపూరితమైన ప్రబంధం, శాంతరసంలో పర్యవసించే లక్షణం కలిగిన ప్రబంధం  పాండురంగ మాహాత్మ్యము. ప్రధానంగా నిగమశర్మ కథ, సుశీల కథ, అయుతుని కథ  అనే మూడు కథలలో తెనాలి రామకృష్ణుని విశ్వరూపం కనిపిస్తుంది. నిగమశర్మ పాత్ర ఆంధ్రసాహిత్యములో శాశ్వతముగా నిలిచిపోయే పాత్రలలో ఒకటి. నిగమశర్మ పాత్రవంటి పాత్రలు 'గుణనిధి'(శ్రీనాధుని కాశీఖండము) మొదలైనవి  ఉన్నప్పటికీ అవేవీ నిగమశర్మ కథకు, ఆ పాత్రకు సాటిరావు అని దిగ్దంతుల అభిప్రాయము. 'మరలా రామకృష్ణుడే ప్రయత్నించినా  అంత గొప్పగా రాయలేడు' అని ఆరుద్ర లాంటివారు పొగిడారు.తిక్కన  తర్వాత చిన్న చిన్నకథలను అంత నేర్పుగా అల్లినవాడు రామకృష్ణుడే అని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి అభిప్రాయము. కనుకనే ఐదు గొప్ప తెలుగు పద్య ప్రబంధాలలో పాండురంగ మాహాత్మ్యము స్థానాన్ని పొందింది.   యింతటి ప్రాశస్త్యాన్ని పొందిన భక్తి సంబంధమైన కథలో కూడా, తీవ్రమైన గంభీర సన్నివేశాలలోకూడా రామకృష్ణుని సహజసిద్ధమైన వ్యంగ్య, పరిహాస ధోరణి కనిపిస్తుంది. ముఖ్యమైన సన్నివేశాలను, రామకృష్ణుని కవితావైభవ విశ్వరూపమును ముందు ముందు వివరంగా తెలుసుకుందాము.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి