సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావు

sahiteevanam
శ్రీ పాండురంగ మాహాత్మ్యము- తెనాలి రామకృష్ణకవి

సంక్షిప్త కథ

నైమిశారణ్యంలో శౌనకాదిమహామునులు 
'క్షేత్ర-దైవత- తీర్థములు' మూడూ సమానంగా ప్రభావవంతములైన పుణ్యక్షేత్రాన్ని గురించి' వివరించవలసినదిగా సూతుడిని అడిగారు. 
సూతుడు చెప్పడం ప్రారంభించాడు. పూర్వం అగస్త్యుడు వింధ్యపర్వత గర్వాన్ని అణిచి, దాన్ని తొక్కి, దక్షిణంగా ప్రయాణం చేసి, 
కొల్హాపూరులో శ్రీమహాలక్ష్మిని సేవించి, ఆమె సూచనమేరకు కుమారస్వామి కొలువైన స్వామిమల (శబరిమల)ను దర్శించుకుని, కుమారస్వామిని భక్తిగా సేవించాడు. పుణ్యక్షేత్రములను గురించి తెలుపవలసినదిగా అడిగాడు. కుమారస్వామి అగస్త్యుడికి సకల పుణ్యక్షేత్రాల గురించి తెలిపాడు. అగస్త్యుడు 'క్షేత్రము-దైవము-తీర్థము' మూడూ సమాన మహిమతో కలిసిన క్షేత్రమేదైనా 
ఉన్నదా స్వామీ అని అడిగాడు. కుమారస్వామి కొంతసేపు యోచించి తనకు తెలియక, దీనికి పరమేశ్వరుడే సమాధానము చెప్పగలడు అని, సపరివారముగా అగస్త్యునితో కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి పార్వతీదేవి కూడా అదే ప్రశ్నను భర్తను అడిగిన 
కారణంగా, ఆమెకు, అక్కడికి అదే ప్రశ్నతో వచ్చిన వీరందరికీ క్షేత్రము, దైవము, తీర్థము మూడూ సమానమైన మహిమను కలిగిన అత్యుత్తమ క్షేత్రాన్ని గురించి, శ్రీమహావిష్ణువును ప్రార్ధించి, చెప్పడం ప్రారంభించాడు పరమశివుడు. ఇది ప్రథమాశ్వాసము.
ఘర్మవీరానది, భీమనది సంగమించే స్థలంలో శ్రీమహావిష్ణువు పాండురంగని నామముతో వెలసిన క్షేత్రము అటువంటి మహాపుణ్యక్షేత్రము. ఆదికల్పములో పద్దెనిమిదవ ద్వాపర యుగంలో పుండరీకుడు అనే మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమైనాడు. 
ఆతని కోరికప్రకారం అక్కడ వెలిశాడు. ఆ మహర్షి కోరికమేరకు ఆతని పేరుతో ఆ క్షేత్రం ప్రసిద్దమయ్యేట్లు వరమిచ్చాడు అని తెలిపి, అచ్చటి వివిధ క్షేత్రములగురించి, తీర్థములరించి పరమేశ్వరుడు వివరముగా తెలిపి వారిని సంతుష్టులను చేశాడు. వారు సంతోషంతో 
వెళ్ళిపోయారు అని సూతుడు తెలియజేశాడు శౌనకాదులకు. వారు యింకా  కుతూహలంతో రీకృష్ణుని జన్మను గురించి, రాధాదేవి గురించి, భైమీ నది గురించి, విష్ణుమంత్ర మహిమ గురించీ చెప్పవలసి కోరారు. 'ఒకప్పుడు నారదుడికి పరమేశ్వరుడు ఈ వివరాలను 
చెప్పాడు, అలాగే నేను మీకు చెప్తాను అని సూతుడు మళ్ళీ అందుకున్నాడు. ' అగస్త్యుడు, 
కుమారస్వామి మొదలైనవారు తీర్థ-క్షేత్ర-దైవములగురించి తెలుసుకుని వెళ్ళిపోతుండగా అక్కడికి నారదుడు వచ్చి, వారిని చూసి, అగస్త్యాదులు, కుమారస్వామి ఏదో గొప్ప సందేహనివృత్తి కోసమే వచ్చిఉంటారు, అదేదో నాకూ తెలుపవయ్యా స్వామీ అని 
పరమేశ్వరుడిని అడిగాడు. పరమేశ్వరుడు మళ్ళీ అందుకున్నాడు. పాండురంగ క్షేత్రాన్ని 
గురించి వివరించడం మొదలుబెట్టి, అక్కడి నృసింహమూర్తి మహిమను వర్ణించే క్రమంలో 
ఒక కథను చెప్పడం మొదలెట్టాడు. యిది రెండవ ఆశ్వాసము.
 
సభాపతి అనే సద్బ్రాహ్మణునికి జన్మించిన నిగమశర్మ భ్రష్టుడై, దొంగగా, జారుడిగా 
నానా క్షుద్రక్రియలను చేసి, చివరకు ఘోరముగా మరణించాడు. యమదూతలు 
వాడిని నానా హింసలు పెడుతూ తీసుకునిపోతుండగా, వాడు నృసింహ క్షేత్రములో 
మరణించిన కారణంగా సుదర్శన చక్రం వచ్చి యమదూతలను తరిమేసింది, విష్ణు 
దూతలు వచ్చి స్వామి సన్నిధికి తీసుకుపోయారు, వాడు అక్కడ ఒక భాగవతునిగా
స్వామి సన్నిధిలో స్థానాన్ని పొందాడు అని, పుండరీక క్షేత్రములోని నృసింహస్వామి 
మహిమను వివరించి, శ్రీకృష్ణుని మహిమను, రాధాదేవి జన్మను గురించి వివరించడం 
మొదలుబెట్టాడు పరమశివుడు. యిది మూడవ ఆశ్వాసము.
 
రాధాదేవి తపస్సుకు మెచ్చి శ్రీకృష్ణుడు ఆమెకు సాక్షాత్కరించడం, పుండరీకమహర్షి
తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమై, అక్కడే వెలసిన విధానము, క్షేత్ర వర్ణన మొదలైనవి 
కొనసాగించి, సుశీలావృత్తాంతం చెప్పాడు పరమశివుడు, నారదునికి. పాండురంగని 
మురళీగానానికి పరవశించి, చేపి, పాలు కురిసింది ధేనువొకటి, ఒకప్పుడు. గాలివాటున 
ఒక బిందువు స్వామి శిరస్సుపై పడింది. దానితో ఆ ధేనువు స్వామికి క్షీరాభిషేకము చేసిన
ఫలితాన్ని పొంది, మరుజన్మలో సుశీల అనే పేరుతో ఒక విష్ణుభక్తునికి కుమార్తెగా 
జన్మించింది. ఒక లోభికి భార్యయైంది. మహాపతివ్రతయై, విష్ణు భక్తురాలైన ఆమెను 
ఒకసారి శ్రీహరి పరీక్షించి, ఆమె శీలానికి, భక్తికి మెచ్చి, ఆమెను కరుణించాడు. భర్తను
సహృదయునిగా చేశాడు. ఐదుగురు ఉత్తములైన కుమారులు కలుగుతారు అని వరమును 
యిచ్చాడు. దేహాన్ని చాలించినతర్వాత తనలోకాన్ని ప్రసాదించాడు ఆమెకు, ఆమె 
భర్తకు. మహాపుణ్య కారణంగా ఒక కాకి, ఒక హంస, ఒక చిలుక, ఒక సర్పము, ఒక తేనెటీగ 
ఆమెకు ఐదుగురు కుమారులుగా జన్మించి, మరణానంతరం మోక్షాన్ని పొందిన కథను 
చెప్పాడు పరమశివుడు నారదునికి. యిది నాలుగవ ఆశ్వాసము.
 
పుండరీక క్షేత్రములోని వివిధ స్థలముల, తీర్థముల వర్ణను చేసి, సుశీల కుమారులు
మోక్షాన్ని పొందిన సంగతిని చెప్పిన పరమశివునితో 'సంసారసుఖాలకు సంతోషించేవారికి,
గృహస్థులకు మోక్షం ఎలా వస్తుంది? గృహస్థులకు మోక్షపదవి లభించేట్లైతే యిక సన్యాసం 
ఎందుకు స్వామీ?' అని అడిగాడు నారదుడు. అందుకు పరమశివుడు నాలుగు ఆశ్రమములలో
గృహస్థాశ్రమము ఉత్తమమైనది అని తెలుపుతూ, అయుతుడు నియుతుడు అనేవారి కథను 
చెప్పాడు. శ్రీకృష్ణమంత్ర మహిమను తెలియజేసి నారదునికి ఆ మంత్రాన్ని ఉపదేశించాడు.
యితర అనేక ఉపాఖ్యానాలను వివరించి, పుండరీక క్షేత్ర మాహాత్మ్యాన్ని సంపూర్ణంగా 
నారదునికి వివరించాడు పరమశివుడు అని సూతుడు శౌనకాది మహర్షులకు తెలియజేశాడు.
ఇది ఐదవ ఆశ్వాసము. యిక రామకృష్ణుని రమ్యకవితావనవిహారం చేద్దాము, మన అవకాశాన్ని,
ప్రాప్తాన్నిబట్టి కొన్ని మేలిమి పుష్పముల తేనెలను చూరగొందాము.     
 
ప్రథమాశ్వాసము 
 
శ్రీకాంతామణిఁ గన్మొఱంగి మది ధాత్రిన్మంచినన్ దత్క్షితి 
శ్రీకాదంబిని మీఁదికుబ్బె ననఁగా శ్రీవత్సమున్ దాల్చి ము
ల్లోకంబుల్ పొదలించు కృష్ణుఁడు దయాళుండేలు శ్రీవైష్ణవ 
స్వీకారార్హు విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్       (శా) 
 
రామకృష్ణుడు ఐదు ఆశ్వాసాల తన కావ్యాన్ని వేదాద్రి మంత్రికి అంకితం చేస్తూ, 
సంప్రదాయానుసారం శార్దూల వృత్తంలో, చిన్ని చమత్కారాన్ని పొదిగి ఈ ప్రథమ 
పద్యాన్ని అందించాడు. వేదాద్రిమంత్రి పొత్తపినాడు ప్రభువైన సంగరాజు(సంగ 
భూపాలుడు) వద్ద వ్రాయసకాడు. చక్కని చేతి వ్రాత కలిగినవాడు, రాజ సందేశాలకు,
ఆదేశాలకు చక్కని రూపునిచ్చేవాడు. ఒక్క చక్కని చేతివ్రాత కారణంగా ఆంధ్ర పద్య 
కావ్య సాహిత్యములోని అత్యుత్తమకావ్యాలు ఐదింటిలో ఒకటైన కావ్యాన్ని అంకితంగా 
పుచ్చుకుని, కావ్యసాహిత్యం నిలిచి ఉన్నంతకాలం చరిత్రలో నిలిచిపోయే అదృష్టం 
పట్టింది అతనికి! ఈ సంగభూపాలుడు మొదలు శ్రీకృష్ణదేవరాయలకు, ఆయనతర్వాత 
సదాశివరాయలకు సామంతుడు. ఒక సామంతునివద్ద లేఖకుడికి అంకితం యివ్వడంలో
లౌక్యం ఉంది, బహుశా. వేదాద్రి మంత్రిద్వారా సంగభూపాలునికి, ఆయనద్వారా రాయలకు 
సన్నిహితుడైనాడు రామకృష్ణకవి, యిదేమీ తప్పుడు ఊహా కాదు, తప్పూ కాదు. మహాకవులు 
రాజాశ్రయంకోసం పాట్లుపడడం తెలిసిన చరిత్రయే. 
 
కవిగా కథకుడు రామకృష్ణుడు. కథ విష్ణుసంబంధము. ప్రథాన కథకుడు సాక్షాత్తూ 
పరమశివుడు, ఆయన శ్రీహరిని శ్రీకృష్ణ రూపములో ధ్యానించి కథాప్రారంభం చేశాడు, 
రామకృష్ణుడు కూడా అలానే శ్రీహరిని శ్రీకృష్ణ రూపంలో ప్రార్థించాడు ప్రథమ శ్లోకంలో. 
కథలో శ్రీకృష్ణభక్తులే ఎక్కువ, ఆయన  మాహత్మ్యమే ఎక్కువ కనుక తనూ అలానే చేశాడు 
రామకృష్ణుడు. అలా చేయడంలో పరమపురుషుని శృంగారలీలావిలాసాన్ని ప్రస్తుతి 
చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది, విష్ణువుగా వైకుంఠంలో ఆయనప్రక్కన ఉండేది 
శ్రీమహాలక్ష్మి ఒక్కతే, వేరెవరూ ఉండరు, కనుక శ్రీకృష్ణుడిని ప్రార్థించి చమత్కారం చేశాడు.  
 
శ్రీదేవి కన్నుగప్పి మనసులో భూదేవిని తలచుకున్నాడు, శ్రీకృష్ణుడు కనుక. ఆమెను 
మనసులో తలచుకున్న కారణంగా ఆమె హృదయముమీదకు, వక్షస్థలం మీదకు కూడా
పాకింది, పురుషుడు కోరుకున్నా, కోరకున్నా స్త్రీ తన ప్రేమను, తన బంధాన్ని బహిరంగం 
చేయాలని బలంగా కోరుకుంటుంది, లౌకికంగా చూసినా! భూదేవి అసలుపేరు మేదిని.
శుంభ నిశుంభులను శ్రీహరి సంహరించినపుడు వారి మేదస్సు (మాంసము, క్రొవ్వు) స్రవించి 
గడ్డగట్టి మేదిని అయింది అని పురాణం రహస్యం. రక్త మాంసాలు, క్రొవ్వు ఎండిన తర్వాత 
నల్లగా అవుతాయి, కనుక ఆ మేదిని, భూదేవి, నల్లని పుట్టుమచ్చగా 'శ్రీవత్సముగా' స్వామి 
వక్షస్థలం మీద సాక్షాత్కరించింది! ఆ నల్లని శ్రీవత్సలాంఛనము కలిగిన, జగములను 
పాలించే దయాళువైన శ్రీకృష్ణుడు, శ్రీవైష్ణవస్వీకార అర్హతను కలిగిన, అంటే సాత్వికభక్తి,
వినయశీల సంపద కలిగిన వేదాద్రి మంత్రిని, శ్రీవైష్ణవ మార్గ స్వీకారానికి అర్హతను కలిగిన 
వేదాద్రి మంత్రిని, శ్రీవైష్ణవులచేత అంగీకరింపబడే అర్హతను కలిగిన వేదాద్రి మంత్రిని 
పాలించుగాక, కరుణించుగాక అని కావ్యంలో తొలి పద్యాన్ని అందించాడు తెనాలి 
రామకృష్ణుడు. ఎలాగూ ముల్లోకాలను ఏలేవాడికి 'ఈయనను' ఎలుకొమ్మని ప్రత్యేకంగా
చెప్పడం మరొక చమత్కారం, ఎందుకు అంటే, ముల్లోకాలలోనూ 'ఈయన' ఒక ప్రత్యేక జీవి,
పెద్దలగురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి కదా! 
 
(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి