వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

              

                                                                                               క్రేజీ హార్స్

క్రేజీ హార్స్ అంటే నేనేదో గుఱ్ఱాన్ని గురించి చెప్పబోతున్నాననుకుంటున్నారా   కాదండీ.  క్రేజీ హార్స్ ఒక ధీరోదాత్తుడైన అమెరికన్ ఇండియన్ పేరు.  ఏ దేశంలోనైనా, ఏ జాతిలోనైనా స్ధానిక ప్రజల హక్కులు భంగపరచే దుర్మార్గులు, వాటికోసం పోరాడి తమ జీవితాన్నే పణంగా పెట్టిన ధీరోదాత్తులూ వుంటారు.  అలాంటి ధీరోదాత్తుల చరిత్రలు తెలుసుకుంటే, ఆ జాతి ప్రజలు వారికెంత ఋణపడి వున్నారో తెలుస్తుంది. 

అలాంటి మహా పురుషులని ప్రతి వారూ తమకి వీలైన రీతిలో గౌరవించి వారి పేరు చిరస్ధాయి చేయటానికి ప్రయత్నిస్తారు.  క్రేజీ హార్స్ తన జీవితాంతం తనవారు స్వేఛ్ఛగా వేటాడేందుకు భూములకోసం పోరాడాడు.    అందుకే లకోటా ప్రజలు  ఆయన కోసం కనీ వినీ ఎరుగని అత్యంత అద్భుతమైన మెమోరియల్ కట్టిస్తున్నారు.  ఒక కొండలో ఆయన రూపాన్ని మలుస్తున్నారు.  వివరాలలోకెళ్తే.....

 

క్రేజీ హార్స్ 1843 లో ధండర్ హెడ్ మౌంట్ కి 40 మైళ్ళ దూరంలో వున్నరేపిడ్ క్రీక్ లోని టెటాన్ సియాక్స్ ట్రైబ్   (Teton Sioux tribe) లో జన్మించాడు.  ఈయన బాల్యం గురించి ఎక్కువగా తెలియదు.  కొండలలో, అరణ్యాలలో నివసించేవారి పిల్లలకిమల్లే ఈయన చిన్నతనం గడిచి వుండవచ్చు.  సాధారణంగా అడవులలో, కొండకోనలలో బతికేవారికి  అవసరాలు అన్ని విద్యలూ నేర్పుతాయి, ప్రకృతే ధైర్య సాహసాలని ప్రసాదిస్తుంది.

 

క్రేజీ హార్స్ అసలు పేరు కర్లీ.  పోరాటంలో తన శక్తి సామర్ధ్యాలు నిరూపించుకున్న తర్వాత ఆయనకి తండ్రి పేరు టాసంకా విట్కో (Tasunka Witco (Crasy Horse) వచ్చిందంటారు.  ఆయన సహచరులద్వారా తెలిసిన విషయాలేమిటంటే ఆయన స్ధానిక అమెరికన్లకన్నా తెల్లగా వుండేవాడనీ, ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడేవాడని.  ఈయనకి 4 సం. వయసులోనే తల్లి మరణించింది.  సవతి తల్లి, తండ్రీ పెంపకంలో పెరిగిన ఈయనకి 12 సం. వయసులో ఇంకొక విషాదకరసంఘటన జరిగింది.  లెఫ్టినెంట్ గ్రాటన్ అనే ఆయనకీ ఒక తండాకీ మధ్య జరిగిన   అతి సాధారణమైన చిన్న అపార్ధంగా మొదలైన ఒక విషయం  చినికి చినికి గాలివానయినట్లు 23 ఏళ్ళపాటు లకోటా ప్రజలని యుధ్ధ వాతావరణంలో బతికేటట్లు చేసింది.

 

 

 

అంతకు ముందు యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంటు ఒక ట్రీటీమీద సంతకం పెట్టారు.  అందులో ఏమున్నదంటే మనవారి పూర్వకాలం శపధాలలాగా ..  నదులు ప్రవహిస్తున్నంతమటుకూ, గడ్డి మొలుస్తున్నంతమటుకూ బ్లాక్ హిల్స్ అమెరికన్ ఇండియన్ల సొంతమని.  ఇంకా ఆ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం వీరికి జీవనావసరాలయిన ఆహారం, బట్టలు, టెంట్లు వగైరా సప్లై చేస్తుందని.  కానీ 1868లో ఈ ఒప్పందం విఫలమయింది. ప్రభుత్వం వీరికి ఇస్తానన్న భూములు, ఇతర జీవనాధారాలు ఇవ్వకపోగా వారికి కాపలాలు పెట్టి ఒక స్ధావరంలో నిలవకుండా తరిమి తరిమి వారు తమకి లొంగిపోయేటట్లు చేసింది.  క్రేజీ హార్స్ మిత్రుడు కాన్కరింగ్ బేర్ చంపబడ్డాడు.   అప్పటినుంచే క్రేజీ హార్స్ తన ప్రజలకి న్యాయం చేయాలని, వారు ప్రశాంత వాతావరణంలో జీవించాలనీ తన పోరాటం మొదలు పెట్టాడు.

 

తనవారి భూములకోసం, తమ హక్కుల కోసం  తన చివరి క్షణందాకా పోరాడిన క్రేజీ హార్స్  1877లో ఫోర్ట్ రాబిన్ సన్ లో వున్న యు.యస్. మిలటరీ అధికారులతో చర్చలకోసం  వెళ్ళాడు.  ఆ సమయంలో అక్కడవున్నవారు చెప్పినదాని ప్రకారం ట్రాన్స్ లేటర్ క్రేజీ హార్స్ చెప్పిన మాటలు తప్పుగా చెప్పటంవల్ల ఆ చర్చలు విఫలమయి, ఆయనని బందీ చేయబోయారు.  అది గమనించిన క్రేజీ హార్స్  తనని విడిపించుకోబోగా ఒక అమెరికన్ ఇండియన్ సైనికుడు క్రేజీ హార్స్ ని పొడవటం వల్ల ఆయన చనిపోయాడు.  ఎంత విచిత్రమో చూడండి!  తమ జాతివారి చేతిలోనే ఆయన మరణం!! అప్పటికి ఆయనకి 34 ఏళ్ళే.

 

ఇంతకీ ఆయన కావాలనుకున్నది ఏమిటి.  తమ భూములలో తాము ఏ తెల్లవారి దొరతనానికీ లొంగి వుండకుండా స్వేఛ్ఛగా వుండటం.  ఆయన బతికి వుండగా ఎవరికీ అణిగి మణిగి వుండలేదు.  ఆయన చదువుకోలేదు.  అయినా స్వాతంత్ర్యం ఆయన ఊపిరిగా బతికాడు.  ఆయనకి కావలసినది శాంతి.  తమ భూముల్లో తాము ఏ తెల్లదొరతనానికీ లోబడకుండా బతకటం.  ఒకసారి ఎవరో అడిగిన ప్రశ్న ..  మీ భూములు ఎక్కడ వున్నాయి ..  అన్నదానికి చేయి జాపి చూపిస్తూ ఆయన ఇచ్చిన సమాధానం ..  చనిపోయిన నావారిని పూడ్చిన భూములు అని.  ఆయన సమాధానాన్ని, ఆయన పోరాటాన్ని, ఆయన స్పూర్తిని అనుక్షణం స్మరించుకోవటానికే మెమోరియల్ కూడా గుఱ్ఱం మీద ఎక్కిన క్రేజీ హార్స్ చేయిజాపి వేలుతో చూపిస్తున్నట్లు వుంటుంది. క్రేజీ హార్స్ ఎప్పుడూ తన ఫోటో తీయనివ్వలేదు.  దానివల్ల తన  శక్తిలో కొంత భాగం కోల్పోయి త్వరగా చనిపోతాడనే నమ్మకం ఆయనకి వుందిట.   ఒక్క ఫోటో కానీ, చిత్రంకానీ లేని క్రేజీ హార్స్ ని మన కళ్ళముందు వుంచటానికి శిల్పి ఎన్నుకున్న దృశ్యం కూడా ఇదే.

 

 

ఇంక మెమోరియల్ విషయానికొస్తే...

 

క్రేజీ హార్స్ మెమోరియల్ ఫౌండేషన్ ముఖ్యోద్దేశం నార్త్ అమెరికన్ ఇండియన్ల ఆచార వ్యవహారాలు, వారి జీవన పధ్ధతులు సంరక్షించటం.  వీటికోసం  లకోటా ప్రజా నాయకుడైన క్రేజీ హార్స్ శిల్పాన్ని చెక్కించాలనుకున్నది.   ప్రపంచంలోనే పెద్దదైన ఈ శిల్పాన్ని చెక్కించటంద్వారా తమ జాతీయతను చాటి చెప్తున్నది.  మ్యూజియంలు ఏర్పాటు చేసి తమ విలువలు చాటి చెప్తున్నది.  అంతేకాదు విద్యారంగంలోనూ అద్భుతంగా కృషి చేస్తున్నది. 

 

లకోటా ఛీఫ్ హెన్రీ స్టేండింగ్ బేర్  ఈ మెమోరియల్ రూపొందించే కార్యక్రమాన్ని కోర్ చాక్ జ్యూయల్ కఫ్ స్కి అనే శిల్పికి అప్పజెప్పారు. వీరిరువురూ కలిసే ఈ మెమోరియల్ కి సరియైన కొండని ఎన్నుకున్నారు.  ఈ మెమోరియల్ గురించి కొన్ని విశేషాలు....

  • బ్లాక్ హిల్స్ లో వున్న ఈ మెమోరియల్ చెక్కబడే పెగ్మటైట్ గ్రెనేట్ కొండ ఎత్తు 6,532 అడుగులు.  సౌత్ డకోటాలో ఇది 27వ పెద్ద పర్వతం.
  • దీనిలో చెక్కబడే శిల్పం పొడవు 641 అడుగులు,, ఎత్తు 563 అడుగులు
  • ఇది ప్రపంచంలోనే పెద్దదయిన కొనసాగుతున్న నిర్మాణం.

 

  • ఈ శిల్పి తన 40వ ఏటనుంచీ ఇక్కడే వుండి పని కొనసాగిస్తున్నారు.
  • ఏ సౌకర్యాలు లేని ఈ ప్రదేశంలోనే అతను భార్యా, పిల్లలతో నివసించాడు.  పిల్లలంతా ఇక్కడే పుట్టారు.  అక్కడ స్కూలు లేకపోవటంతో  పిల్లలకి తామే స్వయంగా విద్యా బుధ్ధులతోబాటు కొండని చెక్కటం కూడా నేర్పించారు.
  • చిన్నప్పటినుంచీ వీరి పిల్లలంతా కూడా ఈ మెమోరియల్ పనులు చేస్తూనే పెరిగారు.

 

  • కఫ్ స్కి, ఆయన భార్య రూత్ తమ జీవిత ముఖ్యోద్దేశ్యం ఈ నిర్మాణమేనన్నంతగా అంకితమయి పని చేశారు. 10 మంది పిల్లలు, 23 మనవళ్ళు, మనవరాళ్ళు.  కఫ్ స్కి, రూత్ లకి ఈ మెమోరియల్ పట్ల వున్న అంకిత భావం పిల్లలకి కూడా వచ్చింది.  వారికి బయటకి వెళ్ళే స్వేఛ్ఛ వున్నా, 6గురు పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళల్లో చాలామంది కూడా అంకిత భావంతో ఈ మహాన్నత కార్యక్రమంలో పని చేస్తున్నారు.
  • కఫ్ స్కి అక్టోబర్ 20, 1982 న చనిపోయారు.  అయినా ఆయన అమెరికన్ ఇండియన్లకి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చటానికి ఆయన భార్య, పిల్లలు, కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లు కలిసి అహర్నిశలూ కృషి చేస్తున్నారు.  కఫ్ స్కి చనిపోయిన తర్వాత ఆయన భార్య రూత్ చెప్పిన మాటలు ..  ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించటానికి కావాల్సినవన్నీ ఆయన సమకూర్చారు.  మేము దీనిని పూర్తి చేయటానికి అంకితమవుతాము.  ఈ శిల్పం పూర్తి చెయ్యటం ద్వారా సాధించే మానవతా విలువలు పూర్తి చెయ్యలేకపోతే ఆయన జీవితమే వ్యర్ధం.
  • శిల్ప నిర్మాణం ముందు గుఱ్ఱం తలతో మొదలయింది.  రూత్ శిల్ప నిర్మాణాన్ని పరిశీలించి, పరిశోధించిన తర్వాత గుఱ్ఱం తల కాకుండా క్రేజీ హార్స్ ముఖం చెక్కించారు.  పని చాలా నెమ్మదిగా సాగుతున్నట్లున్నదన్న వ్యాఖ్యకి ఆవిడ ఇచ్చిన సమాధానం ..    కఫ్ స్కి వుంటే ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాము.  ఆ నిర్మాణం సరిగ్గా పూర్తి కావటానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాకే పని సాగుతూంటుంది. కొండ చెక్కటంలో ఎలాంటి పొరపాటు దొర్లకుండా చూడాలి.
  • 1947 లో మొదలైన ఈ బృహత్ కార్యక్రమం నేటి వరకూ ఒక్క రోజుకూడా ఆగకుండా కొనసాగుతూనే వున్నా ప్రస్తుతానికి పూర్తయింది క్రేజీ హార్స్ ముఖం మాత్రమే.
  • 21-5-2014న రూత్ కూడా చనిపోయింది.  కానీ వారి పిల్లలు, మనవళ్ళూ, మనవరాళ్ళతోకూడిన కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ క్రేజీ హార్స్ యొక్క అందమైన, న్యాయమైన కల పూర్తి చెయ్యటానికి  పాటుపడుతున్నారు.
  • ఈ మెమోరియల్ సంవత్సరంలో అన్ని రోజులలోనూ దర్శించవచ్చు.  పని కూడా అన్ని రోజులలోనూ జరుగుతూ వుంటుంది.
  • దీనికి ప్రవేశ రుసుము వుంది.  ఈ మెమోరియల్ నిర్మాణానికి అయ్యే ఖర్చంతా ఈ ప్రవేశ రుసుమునుంచి, వ్యక్తులు ఇచ్చిన విరాళాలనుంచి వచ్చే సొమ్మునే వాడతారుగానీ ప్రభుత్వంనుంచీ ఎటువంటి ఆర్ధిక సహాయం అంగీకరించరు.
  • సంవత్సరానికి ఒక మిలియన్ పైన సందర్శకులు ఈ మెమోరియల్ ని సందర్శిస్తూ వుంటారు.
  • పార్కింగ్ ఉచితం.
  • ప్రవేశ రుసుముద్వారా వసూలయ్యే ధనాన్ని ఈ మోమోరియల్ నిర్మాణాన్ని కొనసాగించటానికి, మ్యూజియంని, ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ అమెరికాని అభివృధ్ధి చెయ్యటానికి, ఉపయోగిస్తారు.
  • నార్త్ ఇండియన్ అమెరికన్ల గురించి తెలుసుకోవటానికి, ఒక శిల్పి కుటుంబ సభ్యులతో సహా అంకిత భావంతో అహర్నిశలూ పనిచేసి తరతరాలుగా రూపొందిస్తున్న అద్భుత శిల్పాన్ని చూడటానికి, కొండనే శిల్పంగా తీర్చి దిద్దే అద్భుతాన్ని చూడటానికి, చూసేందుకు టికెట్ కొనుక్కోవటంద్వారా ఈ నిర్మాణంలో మనమూ భాగస్వామ్యులం కావటానికి, అవకాశం వున్నవారు తప్పక దర్శించాల్సిన ప్రదేశం ఇది. 
  • ఈ టికెట్ కొనుక్కోవటం ద్వారా మనం క్రేజీ హార్స్ శిల్పం చెక్కబడుతున్న కొండని, ఇండియన్ మ్యూజియమ్ ఆఫ్ నార్త్ అమెరికా, మౌంటెన్ కార్వింగ్ రూమ్, శిల్పి స్టుడియో, వర్క షాప్స్ వగైరాలతోబాటు కొన్ని సీజన్లల్లో ఏర్పాటు చెయ్యబడే లేజర్ షోనికూడా చూడవచ్చు.
  • మేము వెళ్ళేసరికి చీకటి పడింది.  లేజర్ షో చూడగలిగాం.
  • బస్ లో 4 డాలర్లు చెల్లించి వెళ్తే కొండకి దగ్గరగా వెళ్ళి చూడవచ్చు.

 

పూర్తయిన తర్వాత ఇది మరొక ప్రపంచ వింత అవుతుందేమో!!

 

 

 

 

   

 

 

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి