మౌంట్ ఆబు --2
4) గురు శిఖర్-----
ఆరావళీ పర్వతాలలో వున్న అతి యెత్తైన పర్వత శిఖరం యిది . దీని యెత్తు సుమారు 5676 అడుగులు . ఆబు పట్టణానికి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో వుంది . కొండమీద వరకు రోడ్డు వుంది కాబట్టి మనకి నడిచే బాధ వుండదు . గురువు దత్తాత్రేయుడు జన్మంచిన ప్రదేశమని అంటారు . కొండపైన ఆత్రిమహర్షి ఆశ్రమమం వుండేదట . ఇప్పుడు సిమెంటు తో కట్టిన చిన్న మందిరం వుంది .
గురు దత్తాత్రేయుని అవతారానికి సంభందించిన కథ యిలా చెప్తారు .
సత్య కాలం నుంచి కూడా యీ అర్బుదారణ్యం ఋషులకు మునులకు నివాసం గా వుండేది . ఆత్రిమహర్షి తన పత్ని అనసూయతో యీ ప్రాంతం లో నివాసముంటూ యజ్ఞయాగాదులు నిర్వహించుకుంటూ వుండేవాడు . అతని ధర్మపత్ని అనసూయ అథిధులకు , అభ్యాగతులకు భోజన సౌకర్యములు యేర్పాటు చేస్తూ భర్తకు చేదోడు గా వుండసాగెను . ఒకసారి కార్యార్ధియై వెళుతున్న నారద మహర్షి అనసూయ ఆథిధ్యాన్ని స్వీకరించి పరమ సంతుష్ఠుడై స్వర్గ లోకమునకు వెళ్లి అనసూయను ఆమె పాతివ్రత్యమును అనేక విధములుగా పొగడసాగెను . అతని మాటలు ఈనోటా ఆనోటా విన్న పార్వతి , లక్ష్మి , సరస్వతి తాముగూడా వినదలచి నారదుని పిలిపించి అడుగగా నారదుడు అనసూయను , ఆమె ప్రాతివత్యమును పొగడసాగెను . ఆ పొగడ్తలు విన్న త్రిమూర్తుల పత్నులు ఈర్ష్యకు లోనై , తమ పతులను అనసూయ ప్రాతివత్యమును భంగపరిచి రావలసినదిగా కోరుతారు . త్రిమూర్తులు బ్రాహ్మణ వేషధారులై , ఆత్రిమహర్షి ఆశ్రమంలో లేని సమయంలో భోజన సమయానికి వచ్చి బిక్ష అడుగుతారు .
అనసూయ బ్రాహ్మణులను భోజనమున కై పిలువగా వారు తమకు యింటి యిల్లాలు నగ్నముగా వడ్డించ వలెననే షరతు పెడతారు , అలకాని పక్షంలో తాము ఆథిధ్యము స్వీకరించలేమని చెపుతారు . అనసూయ తన పాతివ్రత్య మహిమతో వచ్చినది సామాన్య బ్రాహ్మణులు కారని , త్రిమూర్తులు స్వయంగా వచ్చేరని వారిని తన పాతివ్రత్య భంగమునకై ముగ్గురమ్మలు పంపారని తెలుసుకున్న అనసూయ వారిని పసిపాపలుగా మార్చి తన యింట పెంచసాగింది . ఎంతకాలమైనా త్రిమూర్తులు తిరిగి రాకపోయేసరికి ముగ్గురమ్మలు దివి నుంచి భువికి దిగి అనసూయ ఆశ్రమానికి వచ్చి తమ భర్తలు పసిపిల్లలుగా అనసూయ దగ్గర పెరుగుతూ వుండడం చూచి ఆమె పాతివ్రత్యానికి ప్రణమిల్లి తమను మన్నించి తమ భర్తలను తమకు అప్పజెప్పవలసినదిగా ప్రార్ధిస్తారు . అనసూయ వారిని వారించి త్రిమూర్తులు తన ముంగిట పసిబిడ్డలుగా పారాడుట తన పూర్వజన్మ సుకృతముగాని వేరొకటికాదని ముగ్గురమ్మలు పరిపరి విధాలుగా స్తుతించి త్రిమూర్తులు పసిబాలురుగా నడిపాడని ప్రదేశము జగద్విదితము కావాలనే వరం కోరి త్రిమూర్తులను వారి పత్నులకు వొప్పజెప్తుంది . సంతానము లేని అనసూయకు త్రిమూర్తుల అంశలతో పుతృడు జన్మిస్తాడు అతనికి " దత్తాత్రేయుడు " అని నామకరణములు చేసి త్రిమూర్తులు వారి వారి నివాసములకు మరలిపోతారు .
ప్రస్తుతం యిక్కడ చిన్న మందిరం వుంది . ఆ కొండ పైనుంచి మౌంటు ఆబు నగరాన్ని తిలకించడం మాటలలో చెప్పలేని అనుభూతినిస్తుంది
ఈ కొండపైన వున్న మరో ఆకర్షణ " మౌంటు ఆబు అబ్జర్వేటరీ " యిందులో 1.2 ం లంఫ్ర రెద్ టెలిస్కోపు వుంది . దీనికి అనుబంధంగా వున్న ఫ్య్సిచల్ రెసేర్చ్ లబ్ కూడా వుంది .ఇక్కడ గ్రహాల అధ్యయనానికి సంభందించిన అన్ని వివరాలు అందుబాటులో వుంచేరు .
5) మధుబన్ --------
మధ్యాహ్నం భోజనం ముగించుకొని మేము మధుబన్ వెళ్లేం . బ్రహ్మకుమూరి ల ముఖ్యకార్యాలయాన్ని ' మదుబన్ ' అని వ్యవహరిస్తారు . ముందుగా వచ్చే కార్యాలయంలో మా పేర్లు వివరాలు నింపి యిచ్చి ముందుకు సాగేము . ముందుగా ఒక షెడ్డులో మమ్మలని చాలా మర్యాద పూర్వకంగా ఆహ్వానించి కూర్చోబెట్టేరు . మాలాంటి పర్యాటకులు పాతిక ముప్పై మంది అయేక తెల్లని వస్త్రధారణలో వున్న ఒకాయన ' జీవి అంటే యేమిటి ? ' అని వివరించి తరువాత యుగాంతం లో వచ్చే ప్రళయంలో యెంతమంది బతుకుతారో అనేది ఒక సంఖ్య చెప్పి , బహ్మకుమారీలు మాత్రమే బతుకుతారు , వారు చెప్పిన సంఖ్యకు చాలా తక్కువ మంది మిగిలేరు కాబట్టి ఆలస్యం చేయకుండా యెవరు బ్రహ్మకుమారీలు గా మారుతారో వారే బ్రతికి వుంటారని మిగతావారికి మరణం తప్పదని ముగించేడు . బ్రహ్మకుమారీలపై నమ్మకం వున్న వాళ్లని ముందుకు వెళ్లమని లేని వాళ్లని వెనక్కి పొమ్మని కూడా చెప్పేడు . నేను అంతక ముందు యెవరో అక్కడి గులాబీతోట చూసితీరాలని అంటే ఆ కుతూహలంలో వుండి ముందుకి దారి తీసాను . నావెనుకాలే మా వాళ్లుకూడా మేము మొత్తం యేడుగురం వెళ్లేం లెండి . మాతో పాటు ' జీవి ' గురించి విన్న ' తెలివైన ' ( యెందుకన్నన్నానో తరవాత మీకు తెలుస్తుంది ) కొందరు వెనక్కి వెళ్లిపోయేరు , మాలాంటి ' బకరా ' లు అక్కడి నుంచి ముందుకి బయలుదేరేం . అక్కడనుంచి మా దారి వో పెద్ద హాలులోకి దారితీసింది ఆ హాలు లో పెద్ద స్క్రీను వుంది హాలులోకి వెళ్లానే అక్కడవున్నతను రండి కూర్చోండి అని మెత్తటి కుర్చీలలో కూర్చోపెట్టి తలుపులు లాక్ చేసి స్క్రీన్ మీద రంగురంగులలో ఓమ్ కారాన్ని చూపిస్తూ బయటి ధవళ వస్త్రధారి చెప్పినదే సాగదీసి అరగంట చెప్పి వెంటనే బ్రహ్మకుమారీలుగా మారమని చెప్పి వెనుక తలుపులు మూసేవుంచి ముందు తలుపులు తీసేరు . అక్కడ నుంచి వెళ్లేదారి మరో హాలులోకి వెళుతోంది . అక్కడ వున్న ధవళవస్త్రధారిని ' భయ్యా యిక్కడ గులాబితోట యెక్కడ ' అని అడిగితే కాస్త దూరంలో వున్న మరో గది వైపు చూపెట్టేడు , అందులోకి వెళితే మళ్లా అలాంటి కథే తలుపులు వేసి సుత్తిబాదుడు , అలా మరో నాలుగు గదులు అయేక పెద్ద భవనం లోకి చేరేం , లోపలకి వెళ్లే దారేగాని బయటకి వెళ్లే గేట్లకి పెద్ద తాళాలు వేసి కనిపిస్తున్నాయి . విసుగొచ్చి బయటకి వదులుతారా లేదా ? అని గొడవ పెడితే మరో నాలుగు గదులు చూడడం అయేక బయటకి వదిలేరు . అన్ని గదులలోనూ తేడా యేమాత్రం లేకుండా చెప్పిందే చెప్పి వీరభద్రుడు బాదేరు .
రాజయోగ ' అభ్యాసం అంటారు మరేదో అంటారు కాని వాటిగురించి ఒక్క ముక్క పరిచయం చెయ్యలేదు . మాతో వచ్చిన మా ఆడపడుచులు వారి భర్తలు పట్టువదలని విక్రమార్కులవలె అన్ని గదులకు వెళ్లి మరో రెండుగంటలు యిదే బాదుడు భరించి వచ్చేరు . కాని వారికి కూడా బ్రహ్మకుమారి సంస్థ యెందుకు , యెప్పుడు స్థాపించబడిందో , యే ప్రయోజనం కోసం అన్నవి యెవ్వరూ చెప్పలేదు . కాని వీరి ఆధ్వైర్యంలో చాలా విద్యాసంస్థలు , ఆరోగ్యసంస్థలు నడపబడుతున్నట్లు తెలుసుకున్నాం .
120 పడకలు గల అత్యాధునికమైన ' హోలిస్టిక్ ' ఆరోగ్య కేంద్రం , 1600 మంది ఒకే సారి కూచోగలిగినట్టి హాల్ , ' ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హైయర్ లెర్నింగు ' , 15 సెమినార్ రూములు ఒక్కొక్కటి 75 నుంచి 150 మంది దాక కూర్చోగలిగినవి వీరి ఆధ్వైర్యంలో వున్న కొన్ని . వీరికి దేశవిదేశాలనుంచి లక్షల సంఖ్యలో శిష్యులు వున్నారు . ఇంత పెద్ద సంస్థల నడుపుతున్నారు అంటే యేదో శక్తి వున్నట్లే , మనకి యెదురైన వాలంటీర్ల సమర్ధతని సంస్థకు ఆపాదించకూడదు కదా !
ఏ సంస్థ అయినా మత ప్రచారం అయినా యోగా కేంద్రమయినా యిలా చితక్కొట్టి బాధ పెట్టకోడదు . వారి వుద్దేశ్యాలు నచ్చి సభ్యులు స్వచ్చందంగా చేరాలిగాని , యిలా బలవంతంగా చావు భయం పెట్టి సభ్యులని పెంచుకునే సంస్థలు దేశానికి గాని ప్రజలకు గాని యేం వుపయోగపడతాయో నాకర్ధం కాలేదు . ఇంతక ముందు చాలా బాబాల ఆశ్రమాలకు వెళ్లేను గాని యిలాంటి అనుభవం యెదురుకాలేదు . లోకో భిన్న రుచి , యేం చేస్తాం , యిదో అనుభవం . దీని వల్ల మేం సన్ సెట్ పాయింటుకి వెళ్లి సూర్యాస్తమయం చూడలేకపోయేం . నక్కి సరస్సు లో బోటింగు చేసే అనుభవాలు మిస్సయేము .
అందరికీ మాలాంటి అనుభవం యెదురవకపోవచ్చు , అక్కడకి వెళ్లినవాళ్లు యెవ్వరూ మాకు యెదురైన అనుభవం వాళ్లకి యెదురయినట్లు చెప్పలేదు , కాబట్టి అందరికీ మాకెదురయిన అనుభవం యెదురవుతుందని చెప్పలేము , యిది మా అనుభవము మాత్రమే .
6 ) నక్కి సరస్సు------
హిందూ పురాణాల ప్రకారం దీన్ని దేవతలు తమ నఖములతో తవ్వేరని వుంది . ఒకానొక కాలంలో దేవతలు ' బస్కలి ' అనే రాక్షసుని ఉత్పాతమును తట్టుకొనలేక దేవలోకములో వుండలేక పారిపోవుచూ అర్భుదారణ్యములో తమ నఖములతో సరస్సును తవ్వి అందులో దాగున్నారు . నఖములతో తవ్వినది కాబట్టి యీ సరస్సు నఖ్కి సరస్సుగా పిలువబడుతూ కాలక్రమేణా నక్కి సరస్సుగా పిలువబడసాగింది .
ఈ సరస్సు సుమారు ఒక కిలోమీటరు పొడవు , అర కిలోమీటరు వెడల్పు 20 నుంచి 30 అడుగుల లోతు కలిగివుంది . గుజరాత్ , రాజస్థానులలో యీ సరస్సును పుణ్య తీర్థం గా భావించి పుణ్య స్నానాలు చేసుకోడం వుంది . జాతిపిత మహాత్మా గాంధీ గారి చితాబస్మం యిక్కడ నిమజ్జనం చేసేరు . ఆ ఘాట్ కి గాంధీ ఘాట్ అని పిలుస్తారు . ఈ సరస్సుకి పడమట ఆనకట్ట వుంది . మౌంటు ఆబు లో యిది పేరుపొందిన విహారస్థలం . ఈ సరస్సులో బోటింగు సౌకర్యం వుంది . ఈ సరస్సుకి పడమటన వున్న కొండ కప్ప ఆకారాన్ని పోలి వుండడం తో ఈ కొండను ఫ్రొగ్ రొచ్క్ అని అంటారు . ఈ కొండపైకి కుర్రకారు వెళ్లి అక్కడ నుంచి సరస్సులోని డైవ్ చేస్తూ వుంటారు . ఈ సరస్సు దగ్గర జైపూర్ భవనం , రఘనాథమందిరము వున్నాయి .
మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ల నుండి తప్పించుకొని వచ్చేసరికి చీకటి పడడం తో నక్కి సరస్సులో విహారం , రఘునాధుని దర్శనం సాయంత్రపు యెండలో సరస్సు అందాలు లాంటివి చాలా మిస్సయేము . బయట నుంచే చూచి ఆనందించేము .
పురాణకథ యీ సరస్సుని గురించి పై విధంగా వుండగా మరో చరిత్ర కందిన ప్రేమ ను కథ గురించి తెలుసుకుందాం .
' రసియా బాలమ్ ' అనే శిల్పి సుమారు క్రీస్తుశకం 1031 లో మౌంటు ఆబు లో నివసించేవాడు . ఆ రోజులలో యీ ప్రాంతమంతా వర్షాలు లేక నదులు సరస్సులు యెండ పోయి పశువులు , మనుషులకు త్రాగునీరు లేక అల్లాడుతూ వుండగా ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు ' యెవరైతే ఒక రాత్రిలో పెద్ద సరస్సును తవ్వుతారో వారికి తన పుత్రిక నిచ్చి వివాహం చేస్తానని ' చాటింపు వేస్తాడు . అప్పటికే రాజకుమారిని ప్రేమించిన శిల్పి ' రసియా బాలమ్ ' యీ అవకాశాన్ని అందుకొని తనతోటివారి సహాయముతో సరస్సును తవ్వేడు , సామాన్య శిల్పి తో తన పుత్రిక వివాహం జరపడం యిష్టం లేని రాణి ప్రోద్బలం తో మహారాజు యిచ్చిన మాట తప్పుతాడు . ' రసియా బాలమ్ ' దిల్వారా మందిర నిర్మాణం లో మునిగి పోయి , బ్రహ్మచారిగానే వుండిపోతాడు . రసియా బాలమ్ కు మనసిచ్చిన రాజకుమారి కన్యగానే మిగిలిపోతుంది . వీరిద్దరి ప్రేమకథ రాజస్థాన్ గుజరాత్ లలో బాగా ప్రాచుర్యం పొందింది . దిల్వారా మందిరం వెనుక వీరిద్దరి కొరకై నిర్మింపబడ్డ మందిరాలు చూడొచ్చు .
మరునాడు పొద్దున్న మా ఉదయ పూర్ ప్రయాణం మధ్యాహ్నానికి వాయిదా వేసుకొని దిల్వారా జైన మందిరం చూడ్డానికి వెళ్లేం .
దిల్వారా జైన మందిరం ------
మౌంటు ఆబు నగరానికి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో వున్న జైనమందిర సమూహం . ఇక్కడ వున్న మందిరాలు అయిదు , ఈ అయిదు మందిరాలు వేరువేరు కాలాలలో నిర్మించి వేరు వేరు తీర్థంకరులకు సమర్పించ బడినవి . జైనుల పవిత్ర పుణ్యస్థలాలలో దీనిని కూడా లెక్కిస్తారు . ఈ మందిర సముదాయం దట్టమైన అడవి మధ్యలో పటిష్ఠమైన ప్రహారీ గోడ మధ్య కట్టబడ్డాయి . రాజస్థాన్ లో యెన్నో జైనమందిరాలు వున్నాయి వాటిలో మూడొంతులు యివే పురాతనమయినవి కావొచ్చు కాని యివాళ కూడా అతి కొత్తగా మిగతా మందిరాలకన్నా శిల్ప కళలో నాలుగడుగులు ముందు వుండే కోవెల యిది అని చెప్పక తప్పదు . రాజస్థాన్ లోని జైనమందిరాల లోని శిల్పుల పనితనం చూస్తే ఆగ్రా లోని తాజమహల్ లో వున్న శిల్ప కళ యేమీ కాదు అనే భావన కలిగింది .
విమల వసహి మందిరం------
1031 వ సం।। లో నిర్మింప బడ్డ యీ మందిరం జైన మొదటి తీర్థంకరడైన వృషభ దేవునికి సమర్పించబడింది . పెద్ద పెద్ద మండపాలు , వరండాలతో పాలరాతి స్థంబాలతో నిర్మించబడింది . ఈ స్థంబాలపై జైన తీర్థంకరుల జీవిత గాథలను అతి చక్కగా చిత్రీకరించేరు . యే వొక్క స్థంభము పైని శిల్పకళ మరో స్థంబం మీద కనిపించదు . అలాగే మందిర పై భాగం ( సీలింగు ) ఒకదానిని పోలి మరొకటి వుండదు . దేని కదే సాటి కళ్లు తిప్పుకోనివ్వవు . తామరకొల నైతేనేమి , కల్పవృక్షం , వాయిద్యకారులు ఒకటనేమిటి , యీ అద్భుతమైన మందిరాలను చెక్కిన శిల్పులకు , తలపెట్టి ధనసహాయం అందించి వారికి చేతులెత్తి దండం పెట్టడం మినహా మనమేమీ చెయ్యలేము . స్థంబాల పైన జైన పురాణ గాథలు చెక్కబడి వుంటాయి . రంగమండపం లో 12 పాలరాతి స్థంబాలతో శిల్ప తోరణాలతో నిండి వుంటుంది . వీటిలో వనితా వాద్య బృందం , పదహారు రూపాలలో వున్న జ్ఞానదేవి విగ్రహాలు చూడతగ్గవి . లోపల వున్న ' నవచౌకి ' , చతురశ్రాకారంలో వున్న తొమ్మిది పైకప్పులు ( సీలింగు) ఒకదానిని మించి వొకటి వుంటాయి . శిల్ప తోరణాలు వర్ణించడానికి నాలాంటి వారికి పదాలు దొరకవు . కవులో మహానుభావులలో తప్ప వర్ణించలేరు . అక్కడనుంచి ' గుడ్ ' మండపం లో అడుగు పెట్టగానే సున్నితమైన , చక్కని పనితనం గల పెద్ద శిలా ద్వారం మనలని ఆకట్టుకొంటుంది . దానివెనుకనున్న నిలువెత్తు ఆదినాథుని విగ్రహం మనలని మంత్రముగ్ధులను చేస్తుంది . ఆదినాథుని వృషభదేవుడు అని కూడా పిలుస్తారు .
విమల్ షా తరువాత నియక్తుడైన పృద్విపాలుడు 1147 లో పాలరాతితో యేనుగుల సముదాయాన్ని నిర్మించేడు . దీనిని " హస్తిశాల " అని అంటారు .
లూన వాసహి-----
ఈ మందిరాన్ని గుజరాత్ రాజులైన ' విర్ధావల్ ' , ' వఘేలా ' ల దగ్గర మంతృలుగా పనిచేసిన ' వాస్తుపాల్ ' , ' తేజపాల్ ' అనే అన్నదమ్ములు ' లూన ' అనే వారి గతించిన అన్నగారి జ్ఞాపకార్ధం 1230 లో నిర్మించి ' నేమినాథు ' నికి సమర్పించేరు . రంగ మండపం మధ్య నున్న పై కప్పు ఒక అద్భతం . పై కప్పు నుంచి వ్రేలాడుతూ వుండేటట్టుగా రాయతో వృత్తాలుగా మలిచేరు మొదటి వృత్తంలో 72 తీర్థంకరులని , ఆ పై వృత్తంలో 360 జైన సన్యాసుల విగ్రహాలు చూడ ముచ్చటగా వుంటాయి . మొత్తం అంతా ఏక శిల నిర్మితం , అతుకులు యెక్కడా వుండవు . ' నవచౌకి ' , ' గుఢ్ మండపం పైన వున్న అన్ని శిల్పాలు వస్తు , వస్ర్తాలను చెక్కడం లో శిల్పి పనితనం కనబడుతూ వుంటుంది . 'గుఢ్ ' మండపం లో నల్లరాతి తో నిర్మించిన 22 వ తీర్ధంకరుడైన ' నేమినాథు ' ని విగ్రహం కనువిందు చేస్తుంది . ఇక్కడి హస్తిశాల లో పది పాలరాతి యేనుగుల సజీవమైనవేమో అనే భ్రాంతిని కలిగిస్తూ వుంటాయి .
మహారాణా కుంభ్ చే నిర్మించ బడ్డ నల్లరాతి ' కీర్తి స్థంబం ' ఈ మందిరం లో చూడొచ్చు .
పిత్తలహర మందిరం -------
' భమషా ' అనే వ్యాపారి నిర్మించిన మందిరం . ఇందులో కూడా రంగ మండపం , నవచౌకి లు వున్నాయి , కాని యివన్నీ అసంపూర్తిగా వుండిపోయేయి . రాణా ప్రతాపు మొగలులతో హల్దీఘాటీ యుధ్దాలు చేసినపుడు రాజధనాగారం వరుస యుధ్దాలతో ఖాళీ అయిపోతే ' భమషా ' లెక్కలేనంత ధనసహాయం అందించేడట , ఆ సమయంలో మందిర నిర్మాణం అసంపూర్తిగా వుండిపోయినట్లు చరిత్ర చెప్తోంది . ' గుఢ్ ' మండపంలో పంచలోహాలతో నిర్మించిన యెనిమిది అడుగుల ఆదినాథుని విగ్రహం మొత్తం 4 టన్నుల ( 4,000 కె..జి ) బరువు కలిగినది చూడొచ్చు . పంచలోహాలతో తయారయినా చూడ్డానికి యిత్తడి విగ్రహం లా కనబడడం తో దీనిని ' పిత్తలహర ' మందిరంగా పిలువసాగేరు . ఇదే మండపంలో పాలరాతి తో చెక్కిన ఆదినాథుని ' పంచతీర్థ ' విగ్రహం చూడొచ్చు .
పార్శ్వనాధుని మందిరం -------
క్రీస్తు శకం 1458 లో ' మండ్లిక ' వంశస్థులచే కట్టబడిన మూడంతస్తుల మందిరం . దిల్వారా లో నిర్మింపబడ్డ మందిరాలలో యెత్తైన మందిరం . గోడలమీద యిసుకరాతి తో చెక్కిన శిల్పాలు , పాలరాతితో చెక్కబడిన విగ్రహాలతోను నిర్మింప బడింది . మూడంతస్తులలోనూ పెద్ద పెద్ద మండపాలు , నవచౌకి , రంగమండపాలు శిల్పకళలో ఒక దానిని మించి మరొకటి అన్నట్టుగా వుంటాయి . ఈ కోవెలలో ముఖ్యంగా విధ్యాదేవతలు , యక్షిణులు , సాలభంజికలు చూడదగ్గవి . ఇక్కడి కొన్ని శిల్పాలను చూస్తే యీ శిల్పులపై ఖజురాహో , కోణార్కు శిల్పకళ ప్రభావం వున్నట్లు కనిపిస్తుంది .
మహావీర స్వామి------
క్రీస్తుశకం 1582 లో కట్టబడిన మందిరం మిగతా మందిరాలకంటె చిన్నది కాని శిల్పకళ లో మాత్రం యేమాత్రం తీసిపోని మందిరం . ఈ కోవెల 'మహావీరు ' నికి సమర్పించబడింది . 1764 లో ' సిరోహి ' నగరంలోని చిత్రకారులు చిత్రించిన చిత్రాలు ఈ మందిరం పై భాగం లో చూడొచ్చు .
11 వ శతాబ్దానికి చెందిన యీ మందిరాలు వాతావరణ ప్రభావానికి తట్టుకొని యిన్ని వందల యేళ్లగా చెక్కు చెదరక వున్నాయి అంటే అది కూడా యే అద్భతానికీ తక్కువ కాదు .
పై సంచికలో సరస్సుల నగరంగా పిలువబడే ' ఉదయ పూరు ' , వీరుల రక్త ధారలతో యెర్ర బడ్డ ' హల్దీఘాటీ ' గురించి తెలుసుకుందాం , అంతవరకు శలవు .