అధ్యాత్మికతతో ముడిపడిన అవతారాలన్నీ మనిషి మనసులో కేవలం భక్తిని ప్రేరేపిస్తే, రాముని అవతారం మాత్రం ప్రతి మనసులో గుడి కట్టుకుని, ఆ వ్యక్తి వ్యక్తిత్వవికాసానికి దోహదం చేస్తుంది. ముందు ముందు సంఘంలో మానవ మనస్తత్వ చిత్రణ శీరామునిలా ఉండాలని, తద్వారా సంఘం ఉత్తమంగా రూపుదిద్దుకోవాలన్న సంకల్పంతో బహుశా శ్రీవాల్మీకి రామాయణ రచన చేశాడేమో?
ఒక వ్యక్తి సుగుణాలతో శోభిల్లితే సంఘంలో అతనికి గౌరవ మర్యాదలుంటాయి. ధర్మం కొలువై ఉంటుంది. "రామో విగ్రవాన్ ధర్మః" పోతపోసిన ధర్మ విగ్రహం శ్రీరాముడు.
రాముడు "స్మితపూర్వభాషి" అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడడం చిరునవ్వుతో ప్రారంభిస్తాడు. నవ్వు మనసులను, మనుషులను దగ్గర చేస్తుంది. కాగల కార్యం నెరవేరుస్తుంది. ఇప్పటి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెప్పేదదే!
వాల్మీకి రాముడి గుణ వర్ణన చేస్తూ "పితృశుశౄషణే రతః"అంటాడు. అంటే పితృ సేవ అనేది అతని సహజ లక్షణం. తండ్రి మాట వేదం. జవదాటడు. అనుభవంతో తలపండిన తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి మాటలను శిరసా వహిస్తే, అవే అందరకు ఆశీర్వచనాలు. అభివృద్ధి సోపానాలు. వాటి విలువ తెలిస్తే ఈ రోజున పెద్దవాళ్లు వృద్ధశరణాయల్లో ఉండరు. పిల్లల అభ్యున్నతిని కాంక్షిస్తూ, వారి అభివృద్ధిని చూసి పొంగిపోతూ, వాళ్ల మధ్యనే ఉంటారు.
రాముడిలోని మరో లక్షణం స్థిరచిత్తం. తన తండ్రి మాట నెరవేర్చడంలోనూ, ‘రాజ్యపాలనకు అంగీకరించమ’న్న భరతుని అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించడంలోనూ, సీతాపరిత్యాగంలోనూ, ఏకపత్నీవ్రతంలోనూ, సుగ్రీవునకు మాటిచ్చి వాలిని హతమార్చడంలోనూ, రావణుడిని యుద్ధంలో సంహరించి సీతను తిరిగి తెచ్చుకోవడమనే సందర్భాల్లో రాముని స్థిరచిత్తం స్పష్టంగా గోచరమవుతుంది. మనసు డోలాయమానమవ్వకుండా అంకితభావంతో అనుకున్నది నెరవేర్చుకోవడమే లక్ష్యసాధన. దానికి త్రేతాయుగ కాలంలోనే అంకురార్పణ జరిగింది.
హనుమంతుడు రాముని గుణగణాలను సీతకు వర్ణించి చెబుతూ ‘తన నడవడికను తనే సమీక్షించుకునేవాడు’ అంటాడు. అంటే తనలోని లోటుపాట్లను తెలుసుకుని చక్కదిద్దుకుంటాడట శ్రీరాముడు. ఎంత గొప్ప వ్యక్తిత్వం? మన లోపాలు మనకు తెలిసుండి కూడా ఆభిజాత్యంతో సంస్కరించుకోకుండా ఉండే మనబోటి వాళ్లకు ఆయన వ్యక్తిత్వం ఓ పాఠం.
ఎంత అవసరమో అంతే మాట్లాడడం, ఎలాంటి కష్టతర పరిస్థితుల్లోనూ అప్రియంగా మాట్లాడకపోవడం, రాక్షసులైనా.. స్త్రీలపట్ల (తాటకి)ఉన్నత భావాలు కలిగి ఉండడం, శత్రుశిబిరం నుంచి వచ్చినా (విభీషణుడు)నమ్మి ఆదరించడం, సముద్రుడి మీద కోపంతో బ్రహ్మాస్త్రం ఎక్కుబెట్టినా, కోపం తగ్గాక మరో వైపు ప్రయోగించడం, తనకు అన్యాయం చేసినా.. కైకను ఒక్క పరుషపు మాట అనకుండా గౌరవించడం ఇవన్నీ రామచంద్రుడి సహజాభరణాలు.
సదా ప్రశాంతమైన మోముతో విశ్వామిత్రుడంతటి వాడిని లోబరుచుకుని అస్త్రశస్త్రములు బహుమతిగా పొందాడు. సీతమ్మవారితో కల్యాణం జరిపించుకున్నాడు. భ్రాతృప్రేమను రుచి చూపి లక్ష్మణున్ని సహవాసిగా చేసుకున్నాడు. గుణ సంపదతో హనుమను ఆకట్టుకుని భృత్యుడిని చేసుకున్నాడు.
శ్రీరాముడు నేల విడిచి సాము చేయలేదు. మహిమలు, మహత్యాలు చూపలేదు. కేవలం మానవమాత్రుడిగా మనలో ఒకడిగా కార్య నిర్వహణ చేశాడు. మనిషిగానే సాధించాడు. అందుకే ఆయనకు దేవుడని పట్టంగట్టి ఒదిలెయ్యం. మనలో ఒకడిగా చూసుకుంటాం. అందుకే వీధికో గుడి ఉంటుంది. సంవత్సారానికోసారి అందరం పెద్దలమై శ్రీ సీతారామకల్యాణం జరిపించి మురిసి..తరించిపోతాం.
శ్రీరాముడి గుణసంపదలోంచి మనం కొన్ని గుణాలు అలవర్చుకున్నా, వ్యక్తిత్వ శోభతో సమాజంలో వెలుగొందుతాం. ఇదే సమస్త మానవ కల్యాణానికి శ్రీరాముడు చూపిన మార్గం.