కవిత - భమిడిపాటి స్వరాజ్య నాగరాజ రావు

kavita

వాళ్ళని చూశాక
వాళ్ళని చూశాక
జీవించటంపై విరక్తి కలిగింది,
విరక్తిపై ఆసక్తి పెరిగింది.
జీవితమంటే ఇంతేనా?
జీవితమంతా చింతేనా?
పిల్లలను కనటం,
వారిభవిష్యత్తుకై కలలు కనటం,
ప్రేమతో పెంచటం, ప్రేమను పంచటం
ఇలా వారికి దూరంగా బ్రతకటానికేనా?
బ్రతుకంతా భారంగా గడపటానికేనా?
ఇద్దరుకలిసి ఒకటై పిల్లలకు జన్మనివ్వటం
చివరకు మళ్ళీ ఏకాకుల్లా 
తామిద్దరే మిగలటానికేనా?
ఈ చేదునిజపు చితిమంటల్లో 
గుండెలు చివరివరకు రగలటానికేనా?
కన్నవారు తమ పిల్లలనుండి ఆశించే ప్రేమ
ఎండమావులేనా?
ఈ పిల్లల పుట్టుక
కన్నవారి హృదయాలలో కలకలం రేపటానికేనా?
కలవరం  కలిగించటానికేనా? 
ఈ తల్లితండ్రులున్నది
దూరమైన పిల్లల దగాకోరుతనాన్ని
భరించటానికేనా?
తీరని తమ ఆశల భారాన్ని వరించటానికేనా?
అని అనిపించింది.
దీనికన్నావంధ్యత్వమే మేలనిపించింది,
ఒంటరితనమే చాలనిపించింది. 
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.