అవీ - ఇవీ - భమిడిపాటిఫణిబాబు



సాధారణంగా చాలామంది, ఆ టైముకి పనైపోతే చాలనే అనుకుంటారు.  రాబోయే రోజుల్లో, మనం కొన్నది  సరిపోతుందా లేదా అని చాలా తక్కువమంది ఆలోచిస్తారు. ఏ విషయం తీసికున్నా ఇదే ప్రస్పుటంగా కనిపిస్తుంది. అలాగని, పోనీ ఓ నాలుక్కాలాలపాటు  సరిపోయేటట్టుగా , చేద్దామా అనుకుంటే, పొగిడేవారికంటే, హేళన చేసేవారే ఎక్కువగా కనిపిస్తారు. ఉదాహరణకి,  గుర్తుండే ఉంటుంది, ఇదివరకటి రోజుల్లో, ఇంట్లో ఎప్పుడైనా, పిల్లలకి ఏ కొత్త బట్టలో కుట్టించేటప్పుడు, ఓ సైజు ఎక్కువగా కుట్టించేవారు. ఎలాగూ ఎదిగే వయసే కదా, పోనీ , ఓసారి వేసేసికుని, పొట్టయిందని, ఏ పాత గుడ్డల్లోనో పడేయకుండా, కనీసం ఓ ఏడాదిపాటైనా వేసికుంటారూ అనే ఉద్దేశ్యంతో. ఇప్పుడు ఈనాటి కాలమాన పరిస్థితులని బట్టి ఆలోచిస్తే, అదో తమాషాగా అనిపించొచ్చు. కానీ ఆనాటి పరిస్థితుల్లో, ఇంట్లో అంతమంది పిల్లలతో, ప్రతీ ఏడాదీ బట్టలు కుట్టించడమంటే, అంత తేలికైన పని కాదు. అలాగే, ఓ ఇల్లు కట్టినా, ఇంట్లో ఉండే ప్రతీవారినీ దృష్టిలో పెట్టుకుని, కట్టేవారు. ఇంకో రెండు మూడు తరాలవరకూ, ఉపయోగించేలా, పునాదులు కూడా గట్టిగా వేసేవారు.


కానీ ఈరోజుల్లో, దేన్ని చూసినా, అప్పటికప్పుడు పనైపోతే చాలూ అనే అభిప్రాయంతోనే ఉన్నారు. ఉద్యోగం రాగానే, ఉండడానికి ఓ ఇల్లుండాలి కాబట్టి, ఏ అప్పో సొప్పో చేసి, ఓ సింగిల్ బెడ్ రూమ్  ఫ్లాట్ తీసేసికోవడం. ఏదో మొగుడూ పెళ్ళాం ఉన్నంతకాలం ఫరవాలేదు, కానీ సంసారం అనేది పెరుగుతుందిగా, అప్పుడు ఈ కొన్న కొంప సరిపోదు. మళ్ళీ ఇంకో పెద్ద ఇంటికి ప్రయత్నాలు ప్రారంభం.. కొన్నదాని EMI  లు పూర్తవవు.  ఈరోజుల్లో కొత్తది కొనాలంటే, ఉన్నదాన్ని అమ్ముకుంటేనే తప్ప కుదరదు. అయినా సరిపోవడమా, లేదా అన్నది, మన ఆలోచనాసరళిని బట్టి ఉంటుంది. కొంతమందికి, పుట్టిపెరగడం, ఓ చిన్న ఇల్లైనా, ఈరోజుల్లో, ఎలా ఉందంటే, నాలుగైదు గదులు కూడా సరిపోవడం లేదు. అది ఓ ఇల్లనండి, ఓ వాహనం అనండి.. రానురానూ ఇరుకైపోతున్నాయి. అంతదాకా ఎందుకూ, ఎప్పుడో వేసిన రోడ్డులూ అవీ కూడా అలాగే ఉన్నాయి. ఫలానా జనసంఖ్య ఉన్నప్పుడు సరిపడే రోడ్డులాయె.  రోజురోజుకీ పెరుగుతూన్న జనాభాకీ, వాహనాలకీ, సరిపొమ్మంటే ఎలా సరిపోతాయీ?. దానితో కొత్తగా ఫ్లై ఓవర్లూ, మెట్రోలూ మొదలెట్టాల్సొస్తోంది..

ఇవన్నో ఓ ఎత్తైతే, చూడ్డానికి బావుందని, మార్కెట్ లోకి వచ్చినదేదో కొనాలనిపిస్తుంది. చేతులో పుష్కలంగా డబ్బులున్నాయీ, కొనేస్తే పోలా? డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డులున్నాయీ, మనకడ్డేమిటీ? వచ్చిన గొడవేమిటయ్యా అంటే, మనం ఆ వస్తువుని కొని, ఇంకా ఉపయోగించడమేనా మొదలెట్టలేదు, అంతలో ఇంకో కొత్త మోడల్ వచ్చేస్తుంది. పైగా  చవకలో. ఇంక నెత్తీనోరూ మొత్తుకోడం. అయ్యో ఓ నాలుగురోజులు ఆగవలసిందీ అనుకుంటూ. దీనర్ధం ఏమిటంటే, మనం అందరమూ  fickle minded  అని. దేనిమీదా ఓ స్థిరమైన అభిప్రాయం ఉండదు. కాలేజీలో చేరేముందు, పిల్లల్ని చూడండి—ఏం చదువుతావురా, అంటే రోజుకోటి చెప్తాడు. ఓసారి ఇంజనీరింగంటాడు, ఇంకోరోజు మెడిసినంటాడు ( అమ్మానాన్నలకు నచ్చుతుందని). మధ్యలో ఎక్కడో చదివో, ఎవరో చెప్పగా వినో, ఇంకోటేదో అంటాడు. ఇంకోడు అసలు చదువే మానేస్తానంటాడు. నూటికి 70 మంది, అమ్మానాన్నలు చెప్పిందే వింటారు. ఎక్కడో నూటికీ కోటికీ, ఏదో ఓ విలక్షణమైన దాన్ని ఎంచుకుంటారు. ఇంక ఈ అమ్మా నాన్నల్ని చూడండి, అక్కడికేదో తమ  కూతురో కొడుకో, ఏదో చేయరాని పని చేసినంతగా బాధ పడిపోతారు. ఎవరైనా  “ మీవాడేం చేస్తున్నాడండీ..” అని అడగడం తరవాయి, “ ఈరోజుల్లో పిల్లలు మన మాటేం వింటారండీ.. శుభ్రంగా ఏ ఇంజనీరింగులోనో, మెడిసిన్ లోనో చేరరా అంటే, అలాక్కాదూ, ఫలానా  ఫీల్డులో ప్రగతి బావుంటుందీ..  అని చెప్పి, అదేదోదాంట్లో చేరాడు, దాని పేరుకూడా నాకు నోరుతిరగదూ..”.అంటారు. అదృష్టం బావుండి, ఆ కూతురో కొడుకో తాము ఎన్నుకున్న ఫీల్డులోనే పైకి వచ్చారా, ఇంక చూసుకోండి, ఈ తల్లితండ్రులే, ప్రతీ ఇంటర్వ్యూలోనూ.. “ మావాడికి పూర్తి స్వేఛ్ఛ ఇచ్చేశాము.. తనకిష్టమైనదాంట్లోనే చేరూ.. “ అని. ఇంక ఆ ఇంటర్వ్యూ చదివిన వాళ్ళంతా “ అబ్బ ఎంత పెద్దమనసో ఆ తల్లితండ్రులదీ..” అనుకోవడం. ఈరోజుల్లో ఎక్కడ చూసినా చాలామంది అవకాశవాదులే.. గ్రేడ్ కొద్దిగా తేడా…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి