శ్రీ పాండురంగ మాహాత్మ్యము
తెలుగులో అత్యంత ఉన్నతమైనవి అని నిర్ణయింపబడిన ఐదు కావ్యాలలో ఒకటి ఐన పాండురంగ మాహాత్మ్యాన్ని విరూరి వేదాద్రి మంత్రికి అంకితం చేస్తూ ప్రథమ పద్యములో శ్రీకృష్ణస్తుతి చేశాడు తెనాలి రామకృష్ణుడు. రెండవ పద్యములో శ్రీమహాలక్ష్మిని ప్రస్తుతి చేస్తున్నాడు.
సీ.
అవతారమందె నే యఖిలైక జనయిత్రి / కలశరత్నకర గర్భసీమ
దోబుట్టువయ్యె నే తులితకాంచనవర్ణ / వెలది వెన్నెల గాయు వేల్పునకును
బాయకయుండు నే పరమపావనమూర్తి / చక్రి బాహామధ్య సౌధ వీథి
నభిషేకమాడు నే యభివర్ణితాచార / దిగ్గజానీతమౌ తేటనీట
తే.
నవనిధానంబు లేదేవి జవణి సరకు
లమ్మహాదేవి శ్రీదేవి యాదిలక్ష్మి
సరసశుభద్రుష్టి రామానుజయ్యసుతుని
నాదరించు విరూరి వేదాద్రినాథు
శ్రీమహాలక్ష్మి పాలసముద్రములో పుట్టిన సకలలోక జనని. వెన్నెల కాసే వేల్పు ఐన చంద్రునికి తోబుట్టువు. ఆమె తులిత కాంచనవర్ణ, అంటే కాల్చిన బంగారంలా మెరిసే శరీర కాంతిని కలిగినది, 'హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం..హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ' అన్న శ్రీసూక్తపు పలుకులను ధ్వనిస్తున్నాడు కవి. చక్రి బాహువులమధ్యన ఉన్న సౌధవీధిలో, అంటే అయన వక్షస్థలం మీద 'పాయక' వీడక నివసించే తల్లి ఆమె. దిగ్గజములు తమ తొండములచేత తేట నీటితో అభిషేకము చేస్తుంటే స్నానమాడే ఆచారము కలదిగా అభివర్ణితమైన తల్లి ఆమె. ప్రశంసింపబడిన ఆచారము కలది అని మహానుభావులు ఐన పూర్వుల వ్యాఖ్య, కానీ ఈ వ్యాసకర్త దృష్టిలో అభివర్ణితాచార అనడం శ్రీమహాలక్ష్మీ ఉపాసనామార్గంలోని రహస్యం. దిగ్గజములు తమ తొండములతో కలశములలోని నీటితో అభిషేకిస్తున్న మహాలక్ష్మీస్వరూపాన్ని ఉపాసన చేయడం లక్ష్మీ ఉపాసనామార్గంలో శ్రేష్ఠమైనది అనే సూచనను చేస్తున్నాడు కవి. నవనిధులు ఆతల్లి సేవయనే అంగడి సరుకులు! ఆమెను సేవించడమంటే ఆ సరుకులను తేలిగ్గా పొందడమే. పద్మం, మహాపద్మం, శంఖం
ఉ.
మాద్రికిమీరునంచ వెలిమాపుపయిన్ మురువైన జోదుచే,
భద్రమయాత్ముచే భువనపాలనఖేలనుచే సరస్వతీ
ముద్రితవక్త్రుచేత నలుమోములవేలుపుచే విరూరి వే
దాద్రిచమూవిభుండు గను నాయువు శ్రీయు నిరంతరాయమున్
ఇతర కవులందరికీ విభిన్నమైన రామకృష్ణుని శైలికి ఆయన వాడే వినూత్నమైన పదాలు ఉదాహరణలు. అనేక పదములు ఆయన సృష్టించినవి కూడా, దానికి యిది ఒక ఉదాహరణ. 'మాదిరి' అంటే నమూనా, ఉదాహరణ, దాన్ని 'మాద్రి' అన్నాడు, అంటే మాదిరి ప్రశ్నాపత్రం అని మనం అంటుంటామే, అదన్నమాట! అలా నమూనాకు, ఉదాహరణకు మించిన, అంటే సాటిలేని తెల్లని వర్ణముకలిగిన హంసవాహనముపై ఉండే 'సుకుమారుడైన యోధుడు', కళ్యాణమయుడైన, భువనములను పాలించడం క్రీడగా కలిగినవాడు, సరస్వతీదేవి ముద్రింపబడిన ముఖములను నాలుగింటిని కలిగినవాడు ఐన బ్రహ్మదేవునిచే ఎల్లపుడూ కొనసాగే, నిరంతరాయమైన ఆయువును, సౌభాగ్యాన్ని కలిగినవానిగా వేదాద్రి మంత్రి చూడబడుగాక! సరస్వతీదేవి వేదస్వరూపిణి, వేదము బ్రహ్మముఖమునందు ఉంటుంది!
శా.
కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబినీ చంద్రికా
జిద్రూపాంచిత, పద్మగర్భముఖ రాజీవావళీహంసి, వ
ర్ణద్రాక్షాఫలకీరి, శారద కృపన్ రామానుజామాత్యు వే
దాద్రిస్వామికి నిచ్చు నిచ్చలును విద్యాబుద్ధివాక్సిద్దులన్
కద్రుజములు అంటే పాములు. అంగదములు అంటే భుజకీర్తులు, భుజాలకు పెట్టుకునే అలంకారాలు. సర్పములను భుజకీర్తులుగా కలిగినవాడు పరమశివుడు. ఆయనకు తోబుట్టువైన సరస్వతీ దేవి అనడం, బ్రహ్మ కన్న సంతానము శివుడు, సరస్వతి అని పురాణం రహస్యం. శరత్కాలమేఘములను, వెన్నెలను ధిక్కరించే తెల్లని శరీరకాంతిని కలిగినది సరస్వతీదేవి. పద్మములమధ్య విహరించే హంసలాగా పద్మగర్భుడైన బ్రహ్మగారి నాలుగు ముఖపద్మములయందు విహరించే హంసవంటిది సరస్వతీదేవి. వర్ణములు అంటే 'అ' నుండి 'క్ష' వరకు ఉన్న వర్ణములు, అంటే అక్షరములు, అంటే అక్షరమాల.అక్షరమాల అనే ద్రాక్షాఫలములకు చిలుకవంటిది సరస్వతీదేవి. అంటే అక్షరములను సాహిత్యాన్ని ఆస్వాదించే చిలుకవంటిది సరస్వతీదేవి. అటువంటి సరస్వతీదేవి వేదాద్రి మంతికి అభీష్టములను, విద్యనూ, బుద్ధిని, వాక్సిద్ధిని యిచ్చి కరుణించుగాక.
ఉ.
ఈ చివురాకు, నీ ప్రసవ, మీపువుదేనియ ఎంత యొప్పెడిన్
జూచితిరే యటంచు దనచుట్టు శుకాదులు గొల్వగా గప
ర్దాచిత చంద్ర గాంగజలమైన శివాహ్వయకల్పశాఖి వే
దాచల మంత్రికీర్తికలశాబ్ధిని వెన్నెలచూడ్కి జూచుతన్
యిది శివుడిని వర్ణించిన మనోహరమైన దృశ్యబంధం. శివునిచుట్టూ చేరి శుకమహర్షి మొదలైనవారు సేవిస్తున్నారు. శివుడు కాదు సుమా, శివుడు అనే పేరు కలిగిన కల్పవృక్షము అది! ఆ కల్పవృక్షమునకు జటలున్నాయి, మర్రిచెట్టుకు ఊడలున్నట్టు.ఆ జటలచే కప్పబడిన చంద్రుడు అమృతపు వాహినులను, గంగ జలవాహినులను జటలనుండి ఊటగా వెలువరిస్తున్నారు. ఆ కల్పవృక్షము చుట్టూ చేరిన శుకములు మొదలైనవి, అంటే చిలుకలు మొదలైనవి, శుకమహర్షి మొదలైనవారు కూడా ' ఆహా! ఈ చిగురాకున ఈ పూవు, ఈపూవుయొక్క తేనియ ఎంత అద్భుతంగా ఉన్నాయి!'అని పొగుడుతున్నారు. బాగానే ఉన్నది, కానీ, శివుడు-కల్పవృక్షము అనే శ్లేష అని భావించినప్పుడు, శివుని పరంగా చిగురాకు, పూవు, పూవుతేనియ ఏమిటి అనిపిస్తుంది.కానీ ఈ పద్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా, 'ఇష్ట'పడి పరికిస్తే అన్వయం ఏమిటి అని 'కష్ట'పడాల్సిన అవసరము ఉండదు. శివుని వామాంకమున ఉన్న చివురాకు పార్వతి.జాబిల్లి పూవు. వెన్నెల తేనె, అని వ్యాసకర్త అభిప్రాయము. శివునితో పార్వతిని, రామునితో సీతను, నారాయణునితో శ్రీమహాలక్ష్మిని, బ్రహ్మతో సరస్వతిని అభిన్నులుగా ఉపాసించేవారికే తప్ప, శివుడైనా, రాముడైనా, నారాయణుడైనా, బ్రహ్మయైనాకల్పవృక్షములుగా కోరికలను తీర్చడం జరగదు. కనుక ఆకులను కూడా తినకుండా అయ్యకోసం భీష్మించుకుని కూర్చున్న అమ్మను 'చివురాకు' అన్నాడు కవి, అలా పోల్చిచెప్పడం కవిసంప్రదాయమే! జాబిల్లి చెండు అని జాబిలిని పూవుతో పోల్చడం కూడా కవిలోకంలో ఉన్నదే. అటువంటి కల్పవృక్షమైన పరమశివుడు వేదాద్రిమంత్రియొక్క కీర్తి అనే సముద్రాన్ని వెన్నెలలాగా మరింత శోభించేట్లు చేయుగాక, కరుణతో చూచుగాక!
ఉ.
చిద్రసవేదియౌ కొదమచిల్కకు విష్ణుసహస్రనామముల్
ముద్రతి మోము మోవినిడి మున్కుచు, గోరున మేనుదువ్వుచున్
భద్రనిధానమై వెలయు పర్వతకన్య విరూరిమంత్రి వే
దాద్రికి విష్ణుభక్తి మహిమాతిశయంబు నయంబు నీవుతన్
చిదానంద సారాన్ని తెలిసిన పెంపుడు చిలుకకు విష్ణుసహస్రనామ రహస్యాలను,మహిమను చెబుతున్నది పార్వతీదేవి, ఆమెకు ఆమె భర్త శివుడు తెలిపాడు! 'ముద్రతి' అంటే ముదముతో కూడిన రతి, అంటే సంతోషముతోకూడిన ప్రేమతో, సంబరంగా, దాని ముక్కుకు తన ముక్కును, మూతికి మూతిని గారాముగా రాస్తూ రహస్యంగా ఆ నామాలను పలుకుతున్నది, రహస్యనామాలు కనుక! ఉపదేశము చేస్తున్నది కనుక! దాని శరీరాన్ని మృదువుగా తన గోళ్ళతో దువ్వుతూ లాలిస్తూ నేర్పుతున్నది. అటువంటి మంగళములకు ఆకరమైన 'సర్వమంగళాదేవి', పార్వతీదేవి, వేదాద్రి మంత్రికి, విష్ణుభక్తికి ఫలముగా లభించే ఐహిక, ఆముష్మిక ఫలితములను ప్రేమగా యిచ్చునుగాక!
సీ.
సూత్రవతీదేవి సొబగు పాలిండ్లపై / మలుపచ్చి గందంపు వలపుతోడ
శిరసులు వంచు నిర్జరకోటి బనిగొను / తపనీయవేత్రహస్తంబుతోడ
బనియేమి యని విన్నపముసేయు చేతనా / ధరములౌ దివ్యాయుధములతోడ
బ్రహ్మాండకోటుల పారుపత్తెములెల్ల / గనియున్న నిద్దంపు మనసుతోడ
తే.
శార్ఙ్గి రెండవమూర్తియై జగములేలు
మునిమనోహారి, శ్రీ సేన ముదలియారి,
చేయుపనులెల్ల సఫలముల్ చేయుగాత
మలరి రామానుజయ్య వేదాద్రిపతికి
యిప్పుడు విష్వక్సేనులవారి స్తుతి. గణపతి శైవమార్గంలో ఎలానో, విష్వక్సేనుడు వైష్ణవమార్గంలో అలా విఘ్ననాయకుడు, శ్రీవారి సేనానాయకుడు. ఆయన భార్య సూత్రవతీదేవి. ఆయనకు సూత్రవతీదేవి సొగసైన పాలిండ్లపైనున్న కొద్దిగా పచ్చిగా ఉన్న, పూర్తిగా తడియారని గంధము అంటే తెగని వలపు. ఎల్లపుడూ బంగారు వేత్రదండం అదుపులోపెట్టే బెత్తముంటుంది చేతిలో, ఆయనముందు శిరసులనువంచే దేవతల పని పడుతుంది, చక్కబెడుతుంది, క్రమశిక్షణలో ఉంచుతుంది. ఆయన చేతులలోనున్న దివ్యాయుధాలకు 'చేతన'ఉన్నది, జీవమున్నది, ఏమిటి పని? మేమేం చేయాలి, మమ్మల్ని ఆజ్ఞాపించండి ప్రభూ! అని విన్నపములు చేస్తుంటాయి అవి. అఖిలబ్రహ్మాండములపై తనకున్న అధికారాలను చక్కబెట్టడంలో మనసు మమత ఉంటాయి ఆయనకెప్పుడూ. శ్రీమహావిష్ణువుకు రెండవ రూపమైనవాడు, ఆయనతర్వాత అంతటివాడు ఐన, సేనాపతి ఐన విష్వక్సేన ప్రథముడు, మొదలియార్, వేదాద్రిపతి చేసే పనులన్నిటినీ నిర్విఘ్నములుగా సఫలములుగా చేయుగాక, కరుణించుగాక!
శా.
మీదం దారధరాధరంబు గల యామేరున్నగంజాలి త
త్తాద్రుక్తుండరుచిన్ దలిర్చు ఖగయూధస్వామి, హేమప్రభా
ప్రాదుర్భావ శుభప్రభుండు మనుచున్ రామానుజామాత్యు, శ్రీ
వేదాద్రీశు, విరూరిమందిరు, జగద్విఖ్యాత కీర్తీశ్వరున్
తన మూపు మేరుపర్వతాన్ని ధిక్కరించి, పరిహసించే ఉన్నతమైనదిగా గలవాడు, తన ముక్కుయొక్క శౌర్యముతో ప్రకాశించే పక్షిరాజైన గరుత్మంతుడు, శుభప్రదమైన బంగారు కాంతిని గలిగినవాడు, జగద్విఖ్యాత కీర్తిని కలిగినవానిగా వేదాద్రి మంత్రిని మన్నించుగాక!
సీ.
ధరణీభారము దాల్చు తనచేవ యంతయు / భుజపరిఘంబుల బొంకపఱిచి
మునుమిన్కుగనియైన తన ప్రజ్ఞ యంతయు / మతివిశేషమునందు మస్తరించి,
దైత్యారివశమైన తనచిత్తమంతయు / నియమగౌరవమున నివ్వటించి,
తనుపువెన్నెల గాయు తనమూర్తి యంతయు / గీర్తివైభవమున గీలుకొలిపి,
తే.
శేషుడఖిలప్రపంచ విశేష శాలి,
నిత్యముక్తులకాద్యుడై నిలుచు మేటి,
చారుచారిత్రు రామానుజయ్యపుత్రు
గరుణ వేదాద్రి మంత్రిశేఖరుని మనుచు.
ఇక శేషుని సన్నుతి. ఆ ఆదిశేషుడు భూమిని మొత్తాన్ని భరించే తన బలాన్ని వేదాద్రిమంత్రి భుజాలు అనే పరిఘలలో ఉంచునుగాక, అంతటి బలాన్ని యిచ్చునుగాక. వేదములకు ఉనికి ఐన తన ప్రజ్ఞ అంతటినీ వేదాద్రి మంత్రి మేథస్సులో ఉంచునుగాక. శ్రీహరియందే లగ్నమైన తన చిత్తమును వేదాద్రిమంత్రికి నియమమైన గౌరవమును ప్రసాదించడంలో ఉంచునుగాక.వెన్నెలలవంటి తన తెల్లని కాంతులను వేదాద్రిమంత్రియొక్క మచ్చలేని తెల్లని కీర్తులలో లగ్నము చేయుగాక. శ్వేతశేషుడు అంటున్నాడు, తెల్లని సర్పములు దేవతాసర్పములు అని ఐతిహ్యము, ఆదిశేషుడిని తెల్లని వర్ణము కలిగినవానిగా చెప్పడం బహుశా యిక్కడనే కనిపిస్తుంది. అటువంటి ఆదిశేషుడు, విశేషుడు, నిత్యముక్తులు, నిత్యసూరులు అనబడే విష్ణుపరివారములోప్రథముడిగా నిలిచే మేటి(ఎందుకంటే ఆదిశేషుడు ఎన్నడూ శ్రీహరిని వీడి ఉండలేదు, ఆయన విష్ణువుగా ఉన్నపుడు పానుపుగా అంటిపెట్టుకుని ఉన్నాడు, రాముడైనప్పుడు లక్ష్మణుడు అయినాడు, కృష్ణుడు ఐనప్పుడు బలరాముడు అయినాడు, కనుక ఉత్తములైన నిత్యులలో అత్యుత్తముడు ఆదిశేషుడు అంటున్నాడు చమత్కారముగా. గరుడుడు, విష్వక్సేనుడు,చక్రము మొదలైన ఆయుధాలు 'ఎల్లపుడూ' శ్రీహరివెంట అంటిపెట్టుకుని లేవు!) సచ్చరిత్రుడైన వేదాద్రిమంత్రిని మన్నించి కరుణించుగాక! అని యిష్టదేవతాప్రార్థనను వైష్ణవమార్గంలో చేశాడు తెనాలి రామకృష్ణుడు.
(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు