ఎండలు....ఎండలు....ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలుసుకున్నా ఇదే మాట....ఎండలు తెచ్చే కష్టాలనేకం..నీటి కొరత, వడ దెబ్బలు, సూర్యుడు మన మీద మండిపడుతున్నాడు. నిప్పులు కక్కుతున్నాడు... ఎందుకిలా అని మనమూ సూర్యుడి మీద మండి పడుతున్నాం. ఎండలను తిట్టిపోస్తున్నాం. కానీ కర్ణుని చావుకి కారణాలనేకం అన్నట్టు, ఈ మండుతున్న ఎండలకు మానవ తప్పిదాలైన అడవుల నరికివేత, ఇష్టా రాజ్యంగా నీటి వనరుల దుర్వినియోగం, పరిమితుల్లేని కాలుష్యం ఇవన్నీ కారణమని ఎంతమందికి తెలుసు? ఇంకుడు గుంతల తవ్వకం లాంటి ప్రయత్నాలు ఇప్పట్నుంచే ముమ్మరం చేసి, రాబోయే వర్షపు చుక్కలను ఒడిసి పట్టడానికి చేసే ముందు జాగ్రత్తలే వచ్చే వేసవికి మనను నీటి కొరత నుండి కాపాడగలవని ఎంత మంది ఆలోచించగలుగుతున్నారు? వాతావరణ కాలుష్యంతో ఓజోన్ పొరకు తూట్లు పొడవడమే సూర్యుని అతి నీల లోహిత కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయని రాబోయే తరాన్ని ఎంత మంది అప్రమత్తం చేయగలుగుతున్నారు?
వార పత్రికల చరిత్రలో లేని సరికొత్త ప్రయోగానికి గోతెలుగు శ్రీకారం చుట్టబోతోంది....పండగలకూ, జన్మ దినాలకూ మాత్రమే ప్రత్యేక సంచికలని వెలువరించే పాత సంప్రదాయానికి స్వస్తి పలికింది...ఒక సామాజిక ప్రయోజనానికి పాఠకులను పునరంకితం చేసే దిశగా ప్రకృతి ప్రకోపంపై అలోచింపజేసే దిశగా ఒకే నెలలో నాలుగు ప్రత్యేక సంచికలను వెలువరించబోతోంది......కార్టూనిస్టులనూ..కథా రచయితలనూ...కాలమిస్టులనూ ఈ ప్రత్యేక సంచికలను రూపుదిద్దడానికి ఆహ్వానం పలుకుతోంది....
వివరాల్లోకి వెళితే, మే నెలలో 6, 13, 20, 27 తేదీలలో వెలువడే నాలుగు సంచికలు సమ్మర్ స్పెషల్ గా రాబోతున్నాయి...అందులోని కథలూ, వ్యాసాలూ, కార్టూన్లూ అన్నీ వేసవికి సంబంధించినవే ఉంటాయి...
కార్టూనిస్టులకూ, కాలమిస్టులకూ, కథా రచయితలకూ మా సూచన ఏమిటంటే, సూర్యుడు, ఎండ, నీటి కొరత, ఇంకుడు గుంతలు, కాలుష్యం, అడవులు, చెట్ల నరికి వేత, నీటి దుర్వినియోగం....ఇలా విస్తృతమైన మీ భావ పరిధితో గోతెలుగుని సుసంపన్నం చేయండి....పాఠకులను ఆలోచింప జేయండి....ఆలస్యమెందుకు...