సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

శ్రీ పాండురంగమాహాత్మ్యము

తెనాలి రామకృష్ణుడు ఇష్ట దేవతా  ప్రార్ధన తర్వాత కవిప్రస్తావన చేస్తూ పూర్వ మహాకవులను ప్రస్తుతి చేస్తున్నాడు. ముందుగా ఆదికవి వాల్మీకిని స్తుతిస్తున్నాడు. 

పుట్టకుఁ బుట్టెడు వేళన్ 
దిట్టపు నునుపచ్చి పుట్టతేనియ చవితోఁ 
బుట్టెననఁ నమృతముట్టెడు 
పుట్టనిసువు సత్కవిత్వములు వర్ణింతున్ (కం)

వల్మీకము అంటే పుట్ట. వల్మీకములో పుట్టాడు కనుక వాల్మీకి అయినాడు. ఆయన పుట్టలో పుట్టకమునుపు బోయవాని జీవికతో జీవించాడు, పిట్టలను, మృగాలను చంపుతూ, అడపా దడపా దారి దోపిడీలు చేస్తూ, క్రూరుడై జీవికను కొనసాగించాడు.రకరకాల కారణాలవలన లోకంలో కొన్ని అపోహలు, అపవాదులు రాజ్యం చేస్తాయి. వాల్మీకి బోయవాడు, రామదాసుకు కబీరు మంత్రోపదేశం చేశాడు.. ఇలాంటివి. అలా ప్రచారం చేయడం వలన సంఘ సంస్కర్తలు, సమానతావాదులు, సెక్యులరిస్టులు  ఐపోతారు రాత్రికి రాత్రే. అగ్రవర్ణాల దురహంకారాలను ఖండించి, బడుగు బలహీనవర్గాల  ఆశాజ్యోతులు అవుతారు, ఆదర్శవాదులు అవుతారు, కానీ అడుగడుగునా, చాటుగా  వాడు'మనోడు' వీడు 'మనోడు' అని కుహనా సమానత్వపు గోళ్ళు పెంచి, కులగజ్జిని  గోక్కుంటూ అరమోడ్పుకన్నులు పెడతారు, ఆనందంగా.కవులకు, కళాకారులకు, మంచికి, చెడుకు కులమేంటి, మతమేంటి అసలు? అవి గుర్తు చేసి విడదీస్తే తప్ప వీళ్ళు చెప్పేవాటికి ఊఁ కొట్టి అనుసరించేవాళ్ళు ఉండరు, వీళ్ళకు నాయకులయ్యే అవకాశము ఉండదు. కానీ చరిత్రను చరిత్రగా, వాస్తవాలను వాస్తవాలుగా భావితరాలకు అందించడం ఒక బాధ్యత. కనుక ఈ  ప్రస్తావన. వాల్మీకి బోయవాడు కాడు. బోయవాడు అని చెప్పడంవలన వచ్చే లాభం ఏమన్నా ఉంటే  అలా  చెప్పుకునే వాళ్ళు అలానే చెప్పుకుంటారు, ఆ కారణంగా రామాయణానికి వచ్చే మచ్చ ఏమీ లేదు, వాల్మీకికి వచ్చే అప్రదిష్టా లేదు, ఈ వ్యాసకర్తకు వచ్చిన దిగులూ లేదు, కానీ, సత్యాన్వేషణ  జరగాలి, సత్య ప్రకటన జరగాలి, కనుక చెప్పడం జరుగుతున్నది, 

వాల్మీకి జన్మరీత్యా బోయవాడు కాదు, బ్రాహ్మణుడు. ధర్మ భ్రష్టుడై, కర్మరీత్యా ఆయన  బోయవాడైనాడు, మరలా, హ్మజ్ఞానమును పొందిన తర్వాత, కర్మరీత్యా కూడా బ్రాహ్మణుడు అయినాడు. 'సఖా పరమకో విప్రో వాల్మీకి స్సుమహాయశాః / మచ్ఛందాదేవ తే బ్రహ్మన్ ప్రవృత్తేయం  సరస్వతీ' అని బ్రహ్మదేవుడు స్వయంగా వాల్మీకిని 'బ్రాహ్మణుడా!' అని పిలిచాడు. మహర్షి వేదవ్యాసుడు విరచించిన విష్ణుమహాపురాణంలో 'ఋక్షోభూద్భార్గవస్తస్మాత్ వాల్మీకిర్యోభిధీయతే' అని భార్గవవంశంలో, అంటే, భృగుమహర్షి వంశంలో, ఋక్షుడు అనే పేరుతో పుడతాడు, వాల్మీకి  అని  పిలువబడతాడు, యితర  కారణాలవలన, అని చెప్పబడ్డది. రామాయణం ఉత్తరకాండంలో కూడా 'భార్గవేణ మహాత్మనా..' అని వాల్మీకిని ప్రస్తావించడం ఉన్నది, అందులోనే మరొకచోట 'ప్రచేతసోహం దశమః పుత్రో రాఘవనందన' అని చెప్పుకుంటాడు వాల్మీకి స్వయంగా. స్కాంద మహాపురాణంలో ఉమాసంహిత'లో 'రామాయణ మహాత్మ్యం'లో బ్రహ్మదేవుడే స్వయంగా చెబుతాడు 

అసలు కారణము ఏమిటో. వరుణుడు అనే మహర్షి బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారునితో శాస్త్రచర్చ చేస్తున్నపుడు వరుణమహర్షి కుమారుడైన 'హరితుడు' తన పెంపుడు నేమలితో ఆడుకుంటూ వారి చర్చను పదేపదే భగ్నం చేస్తుంటే కోపముతో  'కిరాతుడిలాగా, బోయవాడిలాగా, నెమలిని పట్టుకుని తిరుగుతూ చిరాకు పెడుతున్నావు కనుక, భ్రుగువంశములో, ప్రచేతసుని యింట 'కిరాత ధర్మముతో' పుట్టు అని శపించాడు సనత్కుమారుడు. అలాగే ప్రచేతసునికి పదవ కుమారునిగా జన్మించాడు, ఋక్షుడు  అనే పేరుతో. ప్రాచీనబర్హి  అనే మహర్షికి, సముద్రుని కుమార్తె ఐన శతధృతికి పుట్టిన  పదిమంది కుమారులకు ప్రాచేతసులు అని పేరు. వారిలో పదవవాడు ప్రచేతుడు.  ఆతని పదవ కుమారుడు ఋక్షుడు. శాప కారణంగా భ్రష్టుడై అడవులుపట్టి, చివరికి  అదృష్టం పట్టి, రామతారకం ముట్టి, తపస్సు చేపట్టి, వల్మీకములో పుట్టి, వాల్మీకియై ఘంటము పట్టి, ఆదికవియై రామాయణాన్ని రచించాడు. 'వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదా ప్రాచేతసా దాసీత్ సాక్షాత్ రామాయణాత్మనః' అని శ్రీమద్రామాయణ మహిమను తెలిపే శ్లోకము ఒకటి ఉన్నది, సుప్రసిద్ధమే. వేదవేద్యుడైన పరుడు, పరమపురుషుడు శ్రీహరి దశరథుని కుమారునిగా జన్మించాడు. వేదమే ప్రాచేతసుని, అంటే, ప్రచేతుని కుమారుని ముఖమువెంట రామాయణమై జన్మించింది! యిదీ వాల్మీకి కథ. పుట్టకు పుట్టేప్పుడు, దిట్టమైన తాజా పుట్టతేనె రుచితో పుట్టాడేమో అన్నట్లు, కవితలు చెప్పిన వాల్మీకి అమృతము చిలికే కవితలను పొగడుతాను అని వాల్మీకిని ప్రస్తుతి చేశాడు రామకృష్ణుడు. తరువాత వేదవ్యాసుని స్తుతిస్తున్నాడు.

ఇట్టాడరాని యాగమ 
ఘట్టమునకు నడవ యచ్చుకట్టిన మునిరా
ట్పట్టాభిషిక్తుఁ దపముల 
పుట్టిన నెలవైన వ్యాసముని నుతియింతున్     (కం)

ఇట్లా అట్లా అనడానికి వీల్లేని, పలుకడానికి శక్యముగాని వేదములనే రేవుకు, వేదము అనే స్నానఘట్టమునకు దిగడానికి 'నడవ మెట్లను' గట్టినవాడు, మునిసామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు, తపస్సుకు నెలవు ఐన వ్యాసమునిని నుతిస్తాను అంటున్నాడు. దిగడానికి వీలుగాని లోతైన వేదవారాశికి దిగుడుమెట్లను నిర్మించి, వేదసారాన్ని నింపి, పంచమవేదము అని పిలువబడే మహాభారతాన్ని రచించి, వేదసారాన్ని అందరికీ అందించినవాడు వేదవ్యాసుడు అంటున్నాడు. 

వ్యాసవాల్మీకిముఖ సూక్తి వైభవముల
నేర్పు మీఱంగ నిజకావ్యదర్పణముల
సరసమానసముల నేరుపరుచు కీర్తి 
ధవుల, నన్నయభట్టాదికవుల దలతు     (తే)

వ్యాసుడు, వాల్మీకి మొదలైన మహాకవుల సూక్తులకు ప్రతిబింబములుగా తమ పలుకులను తమ కావ్యములు అనే దర్పణములలో, అజ్ఞానము అనే మురికి లేని అద్దములలో, స్పష్టముగా తెలిసేట్లు, కనిపించేట్లు వెలయించినవారు, సత్కీర్తిని ధరించినవారు ఐన నన్నయభట్టు మొదలైన కవులను 'అందరినీ' తలచెదను, స్తుతించెదను అని కొనసాగిస్తున్నాడు రామకృష్ణుడు. చాటుకవిత్వతత్త్వ

రససాగర పారగులయ్యు సత్కవుల్  

పాటిగఁబట్టి విందురొకపాటివి గాదన కన్యకావ్యముల్ 
కైటభవైరి యౌవతశిఖామణి శ్రీసతిఁ బేరురంబునన్ 
మాటియు నీటికెంపు బహుమానమునన్ బాధకంబు జేయడే?     (ఉ)

చాటుకవిత్వ రసాస్వాదన చేసేవారు, సత్కవులు కూడా యితరుల సత్కావ్యములను ఆదరముగానే వింటారు. నారీమణి, యువతీమణి, తన సతీమణి ఐన శ్రీసతీమణిని తన విశాలమైన వక్షస్థలముమీద నిలుపుకున్నప్పటికీ, కైటభాంతకుడైన శ్రీహరి పగడాన్ని (నీటికెంపు, రామకృష్ణుని విచిత్ర ప్రయోగాలకు ఉదాహరణ!) గౌరవించి, తన పతకముగా,కౌస్తుభమణిగా ధరించడా?

 
తప్పు గలిగినచోటనే రస
కవితావశోక్తుల సరణియందు 

గప్పు గలిగిన నీహారకరునియందు 
నమృతధారాప్రవాహంబులడరు గాదె!        (తే)

తప్పు ఉన్నచోటనే ఒప్పు కూడా ఉంటుంది. మంచి ఉన్నచోటనే  చెడు కూడా ఉంటుంది.చీకటి ఉన్నచోటునే వెలుతురూ, నిరాశ ఉన్నచోటునే ఆశ కూడా ఉంటాయి. మచ్చ ఉన్న చంద్రునిలోనే చల్లని వెన్నెల అనే అమృతధారాప్రవాహాలు ఉండవూ? ఈ పద్యములో  'వికటకవి' అని పేరుపడిన తనలోని సత్కావ్య కవనశక్తిని నర్మగర్భముగా చెబుతున్నాడు, తనను విమర్శించేవారికి చురక వేస్తున్నాడు తెనాలి రామకృష్ణుడు.

కాన దోషాత్ములయిన దుష్కవులకతన 
గరిమ వహియించుఁ గవిరాజకావ్యమహిమ 
బహుళపక్షంబు చీఁకటి బహుళమగుటఁ 
జాయవేన్నెల తరితీపు సేయుకరణి             (తే) 

దోషభూయిష్టమైన కవితలు చెప్పేవారు ఉంటేనే సత్కవుల కావ్యమహిమ తెలుస్తుంది  ప్రపంచానికి. చెడు ఉంటేనే మంచికి, చీకటి ఉంటేనే వెలుతురుకు, రావణుడు ఉంటేనే రాముడికి విలువ పెరుగుతుంది కదా! అమావాశ్య రోజుల చీకటి ఉంటేనే కదా వెన్నెల  రోజుల విలువ తెలిసేది అని యితర పూర్వ ప్రబంధకవులకు కొద్దిగా భిన్నముగా కుకవుల నింద చేసి ఒక మహత్తర కావ్యాన్ని రచించాలనే సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు ముందు ముందు. 

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి