ఎండాకాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత అధికమవుతుంది. గాలి అమిత వేడిగా మారుతుంది. వేసవిలోని ఎండ తీవ్రత వల్ల చర్మాన్ని చల్లబరచటానికి చెమటలు పడ్తాయి. అలాగే ఎండలో తలకు వేడి సోకినట్లయితే తల చర్మానికి కూడా చెమటలు పట్టి తలకు రాసిన నూనెతో వెంట్రుకలు జిడ్డుగా మారుతాయి. దాంతో గాల్లో ఉన్న దుమ్ము..దూళి వెంట్రుకల్లో చేరి వెంట్రుకలు రాలిపోవడం, చుండ్రు, వెంట్రుకలు దుర్వాసన మొదలగు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వేసవి కేశాల మీ కొంచెం జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే కేశాలు పదిలంగా ఉంటాయి.
1. వేసవిలో ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తలకు ఆచ్చాదనగా టోపిని లేదా గొడుగును ఉపయోగించాలి.
2. తల అపరిశుభ్రమయితే మాడుమీద బాక్టీరియా పెరిగి, జుట్టుకు ఇన్ ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే తలలో నూనె గ్రంథుల చర్యను, చెమటను నివారించలేము కనుక వారానికి కనీసం మూడు సార్లు తలస్నానం చేయాలి. జిడ్డును, మురికి తొలగేలా జుట్టు శుభ్రపరచడమెంతో అవసరం.
3. వేసవిలో జుట్టుకు వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే స్వల్పంగా నూనెను రాయాలి.
4. కమలా, నిమ్మతొక్కలను తలస్నానం చేసే నీటిలో ఉంచి, తలస్నానం చేస్తే జుట్టు సువాసనగానూ, ఆరోగ్యంగానూ ఉంటుంది. తలస్నానం చేసే నీటిలో నిమ్మరసం కలిపితే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
5. రసాయనాలతో కూడిన షాంపూలను వాడేకంటే తలస్నానానికి సీకాయ, కుంకుడు కాయలను వాడటమే మంచిది.
6. తలస్నానానికి ఉపయోగించే నీరు, తల తుడుచుకునే తువ్వాలు, తలకు ధరించే టోపీ, తలదువ్వుకునే దువ్వెన, బ్రెష్ లు అన్నీ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.