సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam
శ్రీ పాండురంగ మాహాత్మ్యము 

తెనాలి రామకృష్ణుడు ఒక మహా ప్రబంధ  రచన చేయాలనే తన సంకల్పాన్ని యిలా  తెలియజేస్తున్నాడు.

వాక్కాంతాశ్రయు, భట్టరు 
చిక్కాచార్యుల, మహాత్ము, శ్రీగురుమూర్తిన్ 
నిక్కపు భక్తి భజించెద 
నిక్కావ్య కళాకలాపమీడేఱుటకున్  (కం)

పలుకులకన్యకు ఆశ్రయుడైన మహాత్ముడు భట్టరు చిక్కాచార్యులవారిని, నా గురుమూర్తిని, ఈ కావ్య రచన విజయవంతము కావడానికి నిక్కపు భక్తితో భజించెదను అని తనకు శ్రీవైష్ణవమార్గ గురువైన చిక్కాచార్యులవారిని ప్రార్ధిస్తున్నాడు.

ఠవణింతు నొక్క శ్రీ భా
గవత చరిత్రంబుఁ, బరమకళ్యాణ సము
ద్భవ భవనంబుఁ, జతుర్దశ 
భువనమహారత్నసూత్రముగఁ దగు సరణిన్  (కం)

ఒక పరమ కళ్యాణ గుణములకు పుట్టినిల్లు ఐన, సమస్త భువనములలోనూ శ్రేష్ఠమైన  భక్తుని చరితమును కల్పించెదను గాక! అని, విరూరి వేదాద్రి మంత్రి ఒక మహాకావ్య నిర్మాణము చేసి, తనకు అంకితముగా యిమ్మని అడగడాన్ని చెబుతున్నాడు. కవులు, పాఠకులు, ప్రధానులు, అలంకార శాస్త్రజ్ఞులు, ప్రాజ్ఞులు కొలువుదీరి, వెండి చంద్రుడు, చుక్కలవలె తెల్లనిదైన, స్వర్ణ కుంభములు గలిగిన సౌధములో తనకు  వివిధ ఆగమ, పురాణ రహస్యములైన కథలను వినిపిస్తుండగా, విరూరి వేదాద్రి మంత్రి  తనను యిలా అడిగాడు అని చెబుతున్నాడు.

నను, రామకృష్ణకవిఁ, గవి
జనసహకారావళీవసంతోత్సవ సూ
క్తినిధిఁ బిలిపించి యర్హా
సనమునఁ గూర్చుండఁ బనిచి, చతురతననియెన్   (కం)

నను, కవులమావులకు వసంతఋతువువలె, సరసపు పలుకుల ఉత్సవమును చేసే  రామకృష్ణకవిని పిలిపించి, ఉచితమైన ఆసనమునందు కూర్చుండబెట్టి, చతురతతో  యిలా అన్నాడు, విరూరి వేదాద్రిమంత్రి.

తగ సంస్కృతము దెనుంగుగఁ జేయఁ, దెనుఁగు సం
స్కృతముగఁ జేయంగఁ జతురమతివి
నలు దెఱంగుల నెన్నఁగల కావ్యధారల
ఘనుడ వాశువునందుఁ గరము మేటి 
వఖిల భూమీపాలకాస్థాన కమలాక 
రోదయ తరుణ సూర్యోదయుఁడవు
శైవ వైష్ణవ పురాణావళీ నానార్ధ
ములు నీకుఁ గరతలామలక నిభము            (సీ)

లంధ్రభూమీ కుచాగ్రహారాభమైన 
శ్రీతెనాల్యగ్రహార నిర్ణేత వగ్ర
శాఖికాకోకిలమవీవు సరసకవివి 
రమ్యగుణకృష్ణ రామయరామకృష్ణ              (తే)

సంస్కృతమునుండి తెలుగులోకి, తెలుగునుండి సంస్కృతములోకి కావ్యములను  అనువదించగల చతురుడవు. ఆశు, మధుర, చిత్ర, విస్తరములనే నాలుగువిధముల  కవిత్వమార్గములలో ఘనుడవు. ఆశుకవిత్వమునందు మేటివి. అఖిల భూమిపాలకుల  ఆస్థానములనే సరసులలో కవిత్వకమలములను వికసింపజేసే తరుణ ఉదయ భానుడవు. శైవ వైష్ణవ పురాణాల నానార్ధములు నీకు అరచేతిలోని అందుబాట్లు! ఆంధ్రభూమి కుచాగ్రములపై రత్నహారమువంటి తెనాలి అగ్రహారమును నడిపించే పాలకుడవు. కవిత్వము ప్రథమ శాఖపై మధురముగా కూసే కోకిలవు. సరసకవివి. రమ్యగుణములు గలవాడివి! రామకృష్ణా..

కౌండిన్యసగోత్రుఁడ వా
ఖండలగురునిభుఁడ వఖిల కావ్యస్ఫురణా 
కుండలికుండలుఁడవు భూ
మండలవినుతుడవు లక్ష్మమావరతనయా!     (కం)

కౌండిన్య గోత్రుడవు! దేవేంద్రుని గురువైన బృహస్పతికి సమానుడవు. 'అఖిల  కావ్యస్ఫురణా కుండలికుండలుఁడవు' (దీనికి పాఠ్యాంతరము ఉన్నది, 'అఖిల  కావ్యరససుధా మండన కుండలుడవు' అని, దీనికి అఖిలకావ్యరస సుధలు అనే  కుండలములను కలిగినవాడివి, కుండలములు చెవులకు అలంకారములు కనుక,  నీ చెవులకు అనేక కావ్యసుధలు అలంకారములుగా కలిగినవాడవు అని తాత్పర్యము) అనేక కావ్యములను నీ కర్ణభూషణములుగా కలవాడవు, బహుకావ్య పరిచయము 
ఉన్నవాడవు. అఖిల భూమండలములో పొగడబడేవాడవు, లక్ష్మమ్మ పుత్రులలో ప్రసిద్దుడవు.

యశము గలిగించు నీ మృదు 
విశదోక్తుల బౌండరీక విభుచరిత జతు
ర్దశభువన వినుతముగ శుభ 
వశమతి నాపేర నుడువు పరతత్త్వనిధీ!    (కం)

(నాకూ, నీకూ) కీర్తిని కలిగించే నీ మృదువైన, విశదమైన పలుకుతో, పదునాలుగు లోకాలూ  పొగిడేట్లు, శుభము కలిగేట్లు, పుండరీక చరిత్రమును నా పేరుతో అంకితముగా చెప్పుమయ్యా! అని తనకు అంకితముగా పుండరీక చరితమును రచింపుమని తెనాలి  మకృష్ణుడిని 
విరూరి వేదాద్రిమంత్రి అడిగినట్లుగా తన కావ్యావతరణ విధానాన్ని తెలుపుతున్నాడు రామకృష్ణుడు.  

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి