వీక్షణం - పి.యస్.యం లక్ష్మి

 

                                                                             వయోమింగ్ స్టేట్ హై వే 16 


17-8-2009 ఉదయం 9-30 కి (అక్కడి సమయం) మౌంట్ రష్మోర్ నుంచి  ఎల్లో స్టోన్ నేషనల్ పార్కుకి బయల్దేరాము.  ఈ పార్కు వయోమింగ్ స్టేట్ లో వున్నది.  కస్టర్ నుంచి 20 మైళ్ళు దాటగానే వయోమింగ్ స్టేట్ లోకి  ప్రవేశించాము.

అమెరికాలో దోవలు కనుక్కోవటం చాలా తేలిక.  ఇక్కడిలాగా గుర్తులు, కొండ గుర్తులు అవీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు.  జి.పి.యస్. లో (ఇప్పుడు ఇక్కడా వచ్చాయనుకోండి)  మనం బయల్దేరిన ప్రదేశం, చేరవలసిన ప్రదేశం ఫీడ్ చేస్తే దోవ అదే చూపిస్తుంది.  నాకా బుజ్జి ముండ చాలా నచ్చేసిందండీ. తిరగవలసిన మలుపులు ఏమైనా వుంటే కొంచెం ముందుగానే డ్రైవర్ ని హెచ్చరిస్తూ వుంటుంది ..  ఆఫ్టర్ 500 మీటర్స్ టర్న్ రైట్ వగైరా అనుకుంటూ చివరికి మనం చేరవలసిన ప్రదేశం వచ్చేదాకా.  చేరాక .. యు హేవ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ .. అని చెబుతుంది.  ఎక్కడైనా దోవ తప్పినా మళ్ళీ వేరే దోవ దానంతటదే చూపిస్తుంది.  

కొత్తల్లో నేననుకునేదాన్ని.  ఇండియాలో అయితే చక్కగా రోడ్డు పక్కనో, మధ్యనో కారు ఆపి మరీ దోవన పోయే వాళ్ళని అడిగే వాళ్ళంకదా దోవ, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కారు ఆపటానికి లేదు, ఆపినా సమాధానం చెప్పేవారుండరు, ఎక్కడయినా దోవ తెలియక పోతే ఎలా, మాయదారి దేశం అని.  కానీ అక్కడున్న సౌకర్యాలకి ఇంకొకరి సహాయం అవసరం వుండదు ఎవరికైనా.  

బఫలోలోనే షెల్ గేస్ సెంటర్ లో గేస్ కోసం ఆగినప్పుడు దోవ గురించి మావాళ్ళు అడిగితే అక్కడివారు చెప్పారు హైవే 16 సీనిక్ బ్యూటీ రోడ్ మీదనుంచి వెళ్తే డ్రైవ్ చాలా బాగుంటుంది, అందమైన ప్రదేశాలు చూడవచ్చు అని.  సరే మనక్కావాల్సింది కూడా అదేకదా.  వాళ్ళ మాట విన్నాము.  కొంచెం దూరమైనా హైవే 16 మీదకి తిరిగాము.  

ఈ రోడ్డులో వెళ్ళేవాళ్ళు మంచి సీనరీలు కనబడిన చోట ఆగుతూ, ఇంకా అక్కడి ప్రదేశాల గురించి ముందు తెలుసుకుంటే కొన్ని చోట్ల కొంచెం లోపలకి వెళ్తే కనబడే అడవి జంతువులను చూస్తూ వెళ్ళవచ్చు.  మేము మాత్రం సాయంకాలానికి ఎల్లో స్టోన్ నేషనల్ పార్కు చేరాలని ఎక్కడా ఆగకుండా దోవలోని ప్రకృతి అందాలను చూస్తూ వెళ్ళాము.

ఈ దోవనే బిగ్ హార్న్ నేషనల్ ఫారెస్ట్ క్లౌడ్ పీక్ సీనిక్ బై వే అని కూడా అంటారు.  20 – 25 మైళ్ళ దాకా ఈ అందాలు కనువిందు చేస్తాయి.  కళ్ళ ముందు పరచుకున్న పొడుగాటి రోడ్డు, దూరంగా మంచు కప్పిన ప్రదేశాలు, అనేక ఆకారాలలో కనిపించే పర్వతాలు, ఒహ్ .. మాటలలో ఆ అందాలు చెప్పలేను.  అందుకే కొన్ని ఫోటోలు మీకోసం.  ఆ దోవ దాటటానికి 40 నిముషాలు పట్టింది.  ఆ 40 నిముషాలు మేమంతా చాలా బిజీ...ప్రకృతి అందాలు తిలకించటంలో, ఆ కొండలు ఫలానా షేప్ లో వున్నాయని చెప్పుకోవటంలో, ఫోటోలు తీసుకోవటంలో.  ఎంత బాగుందో!!

అది దాటాక దోవంతా ఎడారిలాగా వుంది.  దగ్గర దగ్గర 50 మైళ్ళు కొండలు, చౌడుమన్ను గుట్టలు వీట్ల మధ్య వెళ్ళాము.  దోవలో ఎవరూ లేరు.  కొత్త ప్రదేశం.  చుట్టుపక్కల ఎవరూ లేరు.  మరి నాలాంటివారికి కొంచెం భయమేకదా.  మా మొండి ఘటాలు ఇక్కడ అలాంటి భయాలేమీ అక్కరలేదు.   నీకేమన్నా అయితే పావుగంటలో ఎవరో ఒకరు వస్తారు.  అలాంటి ఏర్పాట్లు వుంటాయి.  అన్నీ చూస్తూ కూర్చో అన్నారు.

సరే ఇవన్నీ దాటి సాయంత్రం 5-30 (అక్కడి సమయం) కి ఎల్లో స్టోన్ నేషనల్ పార్కు చేరుకున్నాము.  పార్కులో హోటల్స్ వున్నాయి.  అక్కడ రూమ్ తీసుకుందామని వెళ్తే ఖాళీ లేదు.  మళ్ళీ పార్కు బయటకి వచ్చి పహస్కా టెపీ అనే హోటల్ లో రూమ్ తీసుకున్నాము.  రూమ్ అంటానికి లేదు దానిని.  దేనికది ఒక చిన్న ఇల్లులాగా వుంది.  రెండు పెద్ద మంచాలు.  ముందు చిన్న పోర్టికో...బాగుంది.  

బయటంతా చెట్లూ అవీ కనబడుతున్నాయని బయట చూద్దామని సరదాగా వెళ్ళానా.  మన నక్క బావగారు కనబడి హలో అని పలకరించారు.  అడవి జంతువులు తిరిగే ప్రదేశం అది మరి.  కనబడ్డవారిని ఫోటో తీయాలి కదా.  మీ కోసం కూడా ఆ ఫోటో. రిఫ్రెష్ అయి పార్కులో 17 మైళ్ళు లోపలకి వెళ్ళి వచ్చాము.  అక్కడ ఎల్లో స్టోన్ లేక్ చూశాము.  అక్కడే కొంతసేపు తిరిగి, సూర్యాస్తమయ చూసి, ఫోటోలు తీసుకుని రాత్రి 9గం. లకి తిరిగి వచ్చి రెస్ట్ తీసుకున్నాము.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి