రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( పది+రెండవ భాగం) - కర్రానాగలక్ష్మి

                                                                                చిత్తోఢ్ గఢ్-1

చిత్తోర్ రాజస్థాను రాష్ట్రంలో కొత్తగా యేర్పడ్డ ప్రతాప్ గఢ్ జిల్లాలో 'బరఛ్ ' , నది వొడ్డున వున్న చిన్న పట్టణం . ఇక్కడ సిమెంటు తయారీకి పాలరాళ్లు కట్ చెయ్యడానికి పేరు బడ్డ వూరు . చిత్తోఢ్ కోట వల్ల పేరుపొందిన వూరు . చరిత్రకు అందని ఆధారాల ప్రకారం పాండవుల కాలంలో భీమసేనుడు కట్టించిన కోట అని అంటారు . పాండవులు వనవాసం లో వుండగా భీముడు. తాగడానికి నీరు దొరకక తన పిడికిలి తో  కొండని మోదితే అక్కడ జల పడి నీరు బయటకు వచ్చి సరస్సుగా మారింది . దీనిని భీమ్ లత్ కుండం అని అంటారు . ఈ కోటను భక్తికి శక్తికి ప్రతీకగా వర్ణిస్తారు . భారతదేశ చరిత్రలో యెక్కువ యుధ్దాలను , యెక్కువ ప్రాణ త్యాగాలను చూసిన కోట యిదేనేమో. చరిత్రకు అందిన ఆధారాల ప్రకారం యేడవ శతాబ్దంలో సూర్యవంశ రాజైన చిత్రాంగద మోరి , యితనిని బప్పా రావల్ అనికూడా అంటారు . అతనికి సోలంకిరాజుల రాజకుమారిని వివాహమాడిన సమయంలో కానుకగా యివ్వబడింది .

అంతకు పూర్వం యెవరు , యెందుకు ఆరావళీ ప్రాంతాలలో యీకోటను కట్టించేరో మొదలయిన వివరాలు చరిత్రలో లేవు . చిత్రాంగద మోరి మౌర్య వంశానికి చెందిన వాడని అందుకనే అతని పేరులో ' మోరి ' వుందని కొందరి అభిప్రాయం . చిత్రాంగద మోరి స్వాధీనం లోకి వచ్చిన తరవాత యీ కోటను  ' చిత్రకూట ' అని పిలిచేవారు . కాలాంతరాన యిది ' చిత్తోర్ దుర్గ్ ' గా మారింది . తరవాత మేవాడ సామ్రాజ్యం యేర్పడడం , సూర్యవంశపు రాజులను ' శిశోడియా వంశస్థులుగా గుర్తింపబడడం జరిగింది . ఈ రాజ్యం యెప్పుడూ స్వతంత్ర రాజ్యంగానే గుర్తింప బడింది . మేవాడ రాజులు విజయమో వీరస్వర్గమో తప్ప ఓటమిని అంగీకరించని వీరులుగా పేరుపొందడంతో వీరు  ' మహారాణా ' లు గా ప్రసిధ్ది కెక్కేరు . ఈ కోట 180 మీటర్ల యెత్తున నిర్మింపబడ్డ విశాలమైన కోట . 280 హెక్టార్ల లో వ్యాపించ వున్న కోట . రాజస్థాన్ లోని కోటలన్నీ మనకు మంచి వాకింగు అనుభవాన్ని యిస్తాయి . అందులో ఈ కోట మరీను . ఫిబ్రవరి మధ్యలో కూడా యెండలు యెక్కువగా వుండే ప్రదేశం అవడంతో మన సహనానికి పరీక్షగా వుంటుంది .


మొదటి ద్వారం దగ్గరనుంచి కొండ యెక్కుతున్నట్లే వుంటుంది . కోట చాలా మటికి పాడుబడి పోయి వుంటుంది . కొన్ని భవనాలు మాత్రమే మిగిలి వున్నాయి . లోనికి వెళ్లేటప్పుడు కుడివైపున భవనం ' రాణా భోజ్  ' భవనం , దాని ముందర మీరాబాయి 'కృష్ణ మందిరం ' పాడకుండా వున్నాయి . రాణా కుంభ భవనం , రాణి పద్మిని భవనం వున్నాయి . మిగతావి శిధిలావస్థలో వున్నాయి . ఈ కోటంతా యెర్రరాతి కట్టడం . వీటిని దాటి సుమారు అరకిలోమీటరు ముందుకు వెడితే రెండు వైపులా పురాతనమైన భవనాలు కొన్ని , కూలిపోయిన భవనాల అవశేషాలు వుంటాయి . ఈ కోటలో వందల సంఖ్యలో కోతులు నివాసముంటున్నాయి . మిగిలి వున్న ఒక భవనం రాణా రత్న సింగ్ ది . రాజస్థానీ శిల్పకళతో వున్న భవనం , భవనంలో చాలా భాగం కూలిపోగా కొంతభాగం మిగిలివుంది . ఆ భవనం లో పై అంతస్థులోని బాల్కనీ లోంచి చూస్తే ' బరఛ్ ' నది కోట పక్క నుంచి ప్రవహిస్తూ కనిపిస్తూ వుంటుంది . ఈ బాల్కనీకి వున్న ప్రాముఖ్యత యేమిటంటే షరతు ననుసరించి ' అల్లావుద్దీన్ ఖిల్జీ ' రాణి పద్మిని దేవి ' ప్రతిబింబాన్ని యిక్కడ నుంచి  చూస్తాడు . అక్కడ నుంచి దూరంగా రెండు విజయస్థంబాలు కనిపించేయి . అక్కడ నుంచి మా తోటి పర్యాటకులు వెళ్తున్న వైపుగా వెళ్లేం కొంచం దూరం కంకరదారిలో వెళ్లగా కొన్ని రాతి భవనాలు వచ్చేయి . అందులోకి వెళితే ఒక్కసారిగా చల్లగా అనిపించింది . రాణివాసపు స్త్రీలు యెండవేళప్పుడు విశ్రాంతి తీసుకొనే భవనాలని చెప్పేరు . భవనం మూడువేపులా నీళ్లల్లో వుంది . ఒకపక్కగా నదిచేరడానికి రాళ్ల మెట్లు వున్నాయి . మెట్లదగ్గర రాజస్థానీ వనితలు పసుపు కుంకుమలతో నది దగ్గర పూజచేసుకొని సింధూరం మాత్రం తీసుకొని మరో చిన్న గదిలోకి వెళ్లి అక్కడ గోడమీద చెక్కన శిల్పానికి బొట్టు పెట్టి నమస్కరిస్తున్నారు . ఈ శిల్పం ' రాణి పద్మిని దేవి ' ది . అయితే శిల్పం బుజాలవరకే చెక్కి వుంది . ఆ విగ్రహం వున్న గది నిజానికి గది కాదు , వెడల్పయిన నుయ్య లా వుంది , అడుగుల నీళ్లు వున్నాయి . ఆ గోడలమీద అరచేతుల ముద్రలు వున్నాయి . దానిని స్థానికులు  ' జహ్వారి బావిడి ' అని అన్నారు . జవ్హారి బావిడి అంటే రాణీ వాసపు స్త్రీల నగలు దాచుకొనే బావి అని అర్దం . రాణి వాసపు స్త్రీలు నగలు బావిలో దాచుకొనేవారా? నాకేమీ అర్దం కాలేదు . అయితే అక్కడ రాణీ పద్మిని శిల్పం యెందుకు వుంది , గోడలమీద అరచేతుల ముద్రలు యెందుకున్నాయి ? వీటికి సమాధానాలు మాకు తరవాత తెలిసేయి , కాబట్టి మీకు కూడా తరవాత చెప్తాను .

విజయస్థంబం ------

సన్నని కాలిబాటన వెళ్లి స్థంబాల దగ్గరకు చేరుకున్నాం . యెర్రరాయి , పాలరాయి లని కలిపి కట్టిన తొమ్మిదంతస్థుల కట్టడం యిది . సుమారు 37 మీటర్ల యెత్తైన కట్టడం . దీనిని 1440  లో మహారాణా కుంభ గుజరాత్ లోని మాల్వాలని , మొహమద్ ఖిల్జీని ఓడించిన దానికి చిహ్నంగా నిర్మించేడు .  పై అంతస్తు చేరడానికి 157 రాతిమెట్లమీదుగా చేరుకోవచ్చు . పై నుంచి మొత్తం చిత్తోర్ నగరాన్ని చూడొచ్చు . .ప్రతీ అంతస్తులోనూ కిటికీలు కూర్చొని చూడ్డానికి వీలుగా రాతి తో చెక్కించిన బల్లలు వుండి పై అంతస్తు చేరుకోడానికి మెట్లు , బయట నాలుగు వైపులా దేవీ దేవతల శిల్పాలతో చాలా అందంగా వుంటుంది . రాణా కుంభ యీ స్థంభాన్ని విష్ణు మూర్తికి సమర్పించేడు .

కీర్తి స్థంబం -----

కోటలో వున్న జైన మందిరానికి పక్కగా వున్నది కీర్తిస్థంబం . దీనిని దిగంబర జైన శాఖకు చెందిన బిహెర్వాల్ మహాజన్ అనే వ్యాపారి పన్నెండవ శతాబ్దం లో నిర్మించి మొదటి తీర్ధంకరుడైన వృషభదేవునికి సమర్పించేడు . యిందులో అయిదడుగుల వృషభదేవునికి విగ్రహం వుంటుంది . చిన్నచిన్న తీర్థంకరుల విగ్రహాలు కూడా వున్నాయి .

వీటికి దగ్గరగా వున్న భవనం రాణా కుంభ నివాసభవనం .ముందు కోటలోని ఒక భవనం గురించి చెప్పేను . అల్లావుద్దీను ఖిల్జీ అక్కడి బాల్కనీలోంచి రాణి పద్మిని ప్రతిబింబాన్ని చూసిన ప్రదేశంగా పేర్కొన్నానే ఆ కథ వివరిస్తాను . పదమూడవ శతాబ్దంలో రాణా రతన్ సింగ్ భార్య పద్మిని అతిలోక సౌందర్యవతి , సాంప్రదాయసిద్ద మహిళ అని పేరు పొందింది . రాణి వాసపు స్త్రీలు పరదాల లో వుండేవారు . ఆమె సౌందర్యం గురించి ఆనోటా ఆనోటా విని అంతటి సౌందర్యరాశి ని చూడాలనే తలపుతో అల్లావుద్దీను ఖిల్జీ రాణా రతన్ సింగ్ కి తన కోరిక తెలియబరుస్తాడు . హిందూ రాణులు పరాయిపురుషులకు తమ మోము చూపించరని రాణివాసపు స్త్రీలు పరదాలలోనే వుంటారని అల్లావుద్దీను ఖిల్జీ కోరికను తిరస్కరిస్తాడు . యెందరు యెంత చెప్పినా వినక అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యం తో దండెత్తి వచ్చి పద్మిని ప్రతిబింబమైనా చూపిస్తే మరలిపోతానని కబురు పెడతాడు . సరేనని రత్న సింగ్ అద్దాలలోని ప్రతిబింబాన్నే చూడాలని తలతిప్పి చూసే ప్రయత్నం చేస్తే తలనరకబడుతుందని హెచ్చరిస్తాడు . రాణి పద్మిని ప్రతిబింబాన్ని క్షణమాత్రం వీక్షించి తృప్తిపడి రతన్ సింగ్ ని కౌగలించుకొని వీడ్కోలు చెప్తాడు ఖిల్జీ . రతన్ సింగ్ మర్యాద పూర్వకంగా ఖిల్జీ ని కోట ద్వారం బయటవరకు సాగనంపడానికి వెళతాడు . ద్వారం బయట మారు వేషాలలో వున్న ఖిల్జీ అనుచరులు రతన్ సింగ్ ను బందీగా చేసుకొని  తీసుకొని వెళతారు . 

రతన్ సింగ్ ని ప్రాణాలతో విడిచి పెట్టాలంటే రాణి పద్మిని ని తనకు అప్పజెప్పవలసినదిగా షరతు పెడతాడు . రాజపుత్రులు దీనికి వొప్పుకొనరు . రాణి పద్మిని ఖిల్జీ షరతుకు వొప్పుకొని రాజలాంచనాలతో తాను వస్తున్నట్లు కబురు పెడుతుంది . రాజలాంచనాలలో భాగంగా నాలుగు వందల మేనాలు , ఒక్కొక్క మేనాను యెనమండుగురు మోసుకుంటూ వస్తారు , మేనాలోకి యెవ్వరూ చూడకోడదని షరతు పెడుతుంది . రాజాజ్ఞతో మొత్తం మేనాలు ఖిల్జీ స్థావరంలోని ప్రవేశిస్తాయి . రతన్ సింగ్ బంధవిముక్తుడై కోటచేరుతాడు . అదను చూసుకొని మేనాలో దాకున్న వీరులు , బోయీలు మేనాలో దాచిన ఆయుధాలతో ఖిల్జీ సైన్యం పై విరుచుకు పడతారు . ఈ పోరులో చిత్తోర్ యేడు వేల వీరులను పోగొట్టుకొనగా ఖిల్జీ సైన్యం యాబైవేల మందిని పోగొట్టుకుంది 

1303 లో ఖిల్జీ ఢిల్లీకి వెళ్లి రెండింతలు సైన్యం తో దండెత్తివస్తాడు . అప్పటికే వీరులందరనీ కోల్పోయి , మిగతావారు గాయపడి వుండడంతో ఓటమి తప్పదు అని తలచిన పద్మిని పిల్లలను రహస్య మార్గం ద్వారా సురక్షిత ప్రదేశాలకు పంపి , ఆమె అంతఃపురంలో చితిని యేర్పాటు చేసుకొని భర్తలు జై భవాని అని నినాదాలు  చేస్తూవుండగా స్త్రీలు  జైభవాని అని చితిలో ప్రవేశించి ఆత్మహుతి చేసుకుంటారు . ఆ చితాబస్మాన్ని నుదుట ధరించి కాషాయ వస్త్రాలు ధరించి మగవారు శతృవులతో పోరాడి వీరస్వర్గం పొందుతారు . 

రాణివాసపు స్త్రీలు స్వాతంత్ర్యం పోగొట్టుకొని దాసీలుగా శతృవుల దగ్గర బతికేకన్న చావు మేలనుకొని సతులుగా మారిన ప్రదేశం పద్మిని భవనంలో జవ్హారి గది . అక్కడే మేము రాణి పద్మిని శిల్పాన్ని చూసేం .    రాణి వాసపు స్త్రీలు ఆత్మహుతి చేసుకోడం యీ కోట చరిత్రలో యిది మొదటిసారి ఆఖరిమారు మాత్రం కాదు సుమా ! 

1336 లో యిదే రాజ వంశానికి ( సూర్యవంశానికి ) చెందిన  ' హమీర్ సింగ్ ' చిత్తోఢ్ ని గెలుచుకుని అతని జన్మస్థలం అయిన 'శిశోడియా ' ని యింటి పేరుగా మార్చుకొని. పరిపాలనా బాధ్యతలు చేపడతాడు .

రాణీకర్ణావతి ------

బూందీ రాజు కుమార్తె , రాణా సంగ్రామ్ సింగ్ పత్ని , ఉదయ పూర్ ని నిర్మించిన రాణా ఉదయసింగ్ తల్లి , మహారాణా ప్రతాప్ కి నాయనమ్మ . బాబరు ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించిన తరువాత 1527 లో చిత్తోర్ మీదకి దండెత్త వస్తాడు . సంగ్రామ్ సింగ్ మొత్తం హిందూరాజులందరినీ యేకం చేసి బాబరుతో ' కనువ ' దగ్గర యుధ్దం చేసి మొఘల్ సేనలను ఓడిస్తాడు . ఆ యుధ్దం లో రాణా గాయపడి కొద్ది కాలానికి మరణిస్తాడు . రాణి కర్ణావతి పెద్దకొడుకైన రాణా విక్రమసింగ్ కి పట్టం కట్టి అతని పేరున తాను కార్యకలాపాలు సాగిస్తూ వుంటుంది . 

సంగ్రామ్ సింగ్ మొదటి సంతానమైన ' రాణా భోజ్ ' యువరాజుగా పట్టాభిషిక్తుడై తండ్రి కన్నా ముందు మరణించడంతో , అతనికి సంతానం లేకపోవడం వల్ల అతని తరవాతి సంతానమైన రాణా విక్రమసింగ్ కి వారసత్వం గా రాజ్యం లభిస్తుంది . చిత్తోఢ్ గఢ్ చరిత్రలో అతి బలహీనమైనరాజుగా రాణా విక్రమసింగ్ గుర్తింప బడ్డాడు . కర్ణావతి బాబరు తరువాత రాజ్యానికి వచ్చిన హుమయూనుకు రాఖీ పంపి అతనిని అన్నదమ్మునిగా భావిస్తుంది . 

గుజరాత్ ని పరిపాలించే బహద్దూర్ షా చిత్తోఢ్ బలహీన పడడం గ్రహించి 1535 లో తన సేనలతో దండెత్తి వస్తాడు . రాణా సంగ్రామ్ సింగ్ తరవాత రాజ పుతృలు రాజ్యకాంక్షతో యెవరి వ్యూహం వారు పన్నుతూ వుంటారు . అంతఃకలహాలను పసికట్టిన రాణి కర్ణావతి విక్రమసింగ్ , ఉదయసింగ్ లని సురక్షితంగా కోటదాటించమని నమ్మకస్తులకు వప్పగిస్తుంది . దాయాదులు విక్రమసింగ్ ని హతమారుస్తారు , ప్రమాదం పసికట్టిన ఉదయసింగ్ దాయి ' పన్నా ' అదే వయసున్న తన పుతృడి దుస్తులు రాజకుమారునికి తొడిగి , రాజకుమారుని దుస్తులు తన కుమారునికి వేసి తన కుమారుని కళ్ల యెదుటి హతమార్చినా కిమ్మనకుండా యువరాజుని గుప్తమార్గం గుండా సురక్షిత ప్రాంతమైన ఏకలింగజీ కి తరలించి సామాన్యుని వలె అతనిని సాకుతుంది . నేటికి కూడా స్వామిభక్తి కి వుదాహరణగా చరిత్రలో ' పన్నాదాయి ' పేరు నిలచి పోయింది . కర్ణావతి హిందూరాజుల సహాయం అర్ధిస్తూ సమాచారం పంపుతుంది , యెవ్వరూ ముందుకు రారు . రాఖీ కట్టిన హుమయూనుకు రక్షింప మని వర్తమానం పంపుతుంది . హుమయూను బెంగాలులో చెలరేగిన తిరుగుబాటును అణచివేయుటకు అక్కడ నివాసం వుంటాడు , అతనికి కర్ణావతి వర్తమానం చేరడం ఆలస్యమౌతుంది . బహద్దూర్ షా తన అఖండ సేనతో కోటను చుట్టుముట్టుతాడు , కర్ణావతి అనుయాయులకు కాని , తిరుగుబాటు దారులకు గాని బహద్దూర్ షా తో గెలిచే ఆశ అడుగంటుతుంది .

పిల్లలని గుప్తమార్గం గుండా పంపివేసి ' జహ్వార్ బావిడి ' దగ్గర రాణి పద్మిని లానే అంతఃపుర స్త్రీలు రాణి కర్ణావతిని అనుసరించి ఆత్మహుతి చేసుకుంటారు . మగవారు ' జైభవాని నినాదాలతో చితా భస్మాన్ని నుదుట ధరించి కత్తి పట్టి శతృవులతో మరణంవరకు పోరాడుతారు . చిత్తోఢ్ కోట బహద్దూర్ షా వశమౌతుంది . అది ఒక్కరోజు కోసమే . మరునాడు హుమయూను చిత్తోఢ్ చేరుకుంటాడు , జరిగింది తెలుసుకొని బహద్దూర్ షా సేనలను ఓడించి తిరిగి చిత్తోఢ్ ను రాణాలకు అప్పజెప్పుతాడు . రాఖీ యొక్క గొప్పతనం చెప్పేటప్పుడు హుమయూన్ కర్ణావతిన ల కథను వుదాహరణగా పేర్కొనడం మన దేశం లో యిప్పటికీ ఆనవాయితీ గా వస్తోంది .  

మీరాబాయి ---

అంతఃకలహాలతోనూ , శతృరాజుల ఆక్రమణలతోనూ చిత్తోఢ్ రాజ్యం అల్లకల్లోలంగా వుండగా యిహంతో సంబంధం లేకుండా తన సఖుడైన కృష్ణుని భక్తిపారవశ్యం లో మునిగిపోయిన పరమభక్తరాలు మీరాబాయి .      1498 లో గుజరాత్ లోని పాలి ప్రాంతంలో గల కుర్కి సంస్థానాన్ని పరిపాలిస్తున్న రతన్ సింగ్ రాథోఢ్ యేకైక సంతానంగా జన్మించి , అతి చిన్నవయసులోనే తల్లిని పోగొట్టుకొని , చిన్నప్పటినుండి కృష్ణుడే తన సఖుడని గాఢంగా విశ్వసిస్తుంది . 1516 రాణా సంగ్రామ్ సింగ్ ప్రధమ పుతృడైన రాణా   భోజ్ ని వివాహమాడి చిత్తోఢ్ రాజ్యానికి కాబోయే రాణిగా అడుగుపెడుతుంది . ఆమెలోని కృష్ణ భక్తికి అడ్డుచెప్పని రాణా భోజ్ ఆమెకి అంతఃపురం లోనే మందిరం కట్టిస్తాడు . ఆమె ఆ మందిరం లోనే కృష్ణ భక్తులతో భజనలు చేస్తూ కాలం గడుపుతూ వుంటుంది . పరదా పాఠించే అంతపురకాంతలకు మీరాబాయి ప్రవర్తన నచ్చక ఆమెకు నచ్చజెప్పజూస్తారు . ఫలితం లేకపోవడంతో , ఆమెభర్త ఆమె చర్యలను ఖండించక పోవడంతో వూరుకుంటారు . 1518 లో బాబరుతో జరిగిన యుధ్దం లో రాణా భోజ్ గాయపడి 1521 లో మరణిస్తాడు . రాజపుత్ర స్త్రీలు భర్త చితిలో పాటు సతులయే ఆచారం పాఠించేవారు . ఇవేమీ పట్టని మీరాబాయి కృష్ణ భక్తి లో మునిగిపోతుంది . అది నచ్చని సంగ్రామ్ సింగ్ ఆమెకు విషం పంపి ఆమెచేత తాగిస్తాడు కాని ఆమె మరణించదు , అలాగే మరోమారు పూల బుట్టలో విషనాగుని పంపితే అది పూలదండగా మారిపోయిందని ఆమె భక్తిని గురించిన కథలు నేటికి ప్రచారంలో వున్నాయి . 1535 లో కర్ణావతి నేతృత్వం లో జరిగిన ఆత్మాహుతిలో ఆమె పాల్గొనలేదు . బహద్దూర్ షా సేనలు మీరాబాయికి యేవిధమైన హాని చేసిన దాఖలాలు చరిత్రలో లేవు . కొంతకాలానికి మీరాబాయి కృష్ణభక్తులతో ద్వారక వెళ్లిపోయినట్టుగా చరిత్రకారుల అంచనా . తిరిగి చిత్తోఢ్ కోట చరిత్రలోకి వస్తే రాణా ఉదయసింగ్ పెద్దవాడైన తరువాత సైన్యాన్ని కూడగట్టుకొని కుంభాల్ గఢ్ ని వశపరచుకొని తిరిగి ఒక్కక్కటిగా మేవాఢ్ రాజ్యాన్ని గెలుచుకొంటాడు . 1553 లో వరుస ఆక్రమణకు గరౌతున్న రాజ్యరాజధానిని మార్చే వుద్దేశ్యంలో వున్న ఉదయ సింగ్ ఉదయపూర్ నిర్మాణం చేస్తాడు . అక్బరు రాజపుత్ర రాజులను ఓడించేందుకు యెన్నో యుధ్దాలు చేస్తాడు . కొన్నంటిలో ఓటమి పాలైనా ,  కొన్ని గెలిచినా ఆరాజులు రాణా ఉదయ సింగ్ తో చేతులు కలిపి తిరిగి తమ సామ్రాజ్యాలను గెలుచుకుంటూ వుంటారు . రాజపుతృలపై విజయం పొందాలంటే చిత్తోఢ్ ని జయించడం అనివార్యం అని తెలుసుకుంటాడు . అందుకే తరచు చిత్తోఢ్ పైకి సేనలను పంపుతాడు . యెన్ని యుధ్దాలు చేసినా విజయం వరించకపోవడంతో అక్బరు 1567 లో స్వయంగా సుమారు అరవై వేల సువిశాలమైన సైన్యాన్ని వెంటతీసుకొని వస్తాడు . చిత్తోఢ్ వాసులకు అక్బరు స్వయంగా రావడంతో యీ పోరు చాలా తీవ్రంగా జరగనున్నదని అంచనా కలుగుతుంది . కోటనుంచి ధనాన్ని , రాజపరివారాన్ని పిల్లలను వృద్దులను గుప్తమార్గాలగుండా ఉదయపూర్ కి పంపివేస్తారు . 

రోజులు గడుస్తున్నా కోట వశపరచుకొనే దారి కనబడక అక్బరు కోట గోడను బద్దలుకొట్టాలని నిర్ణయించుకొని గోడలను లక్ష్యంగా కాల్చుతాడు . ఫిరంగి దెబ్బలకు చెక్కుచెదరకపోవడంతో కోటగోడను కూల్చడానికి చేసిన ప్రయత్నాలలో చాలామంది సైనికులను పోగొట్టుకుంటాడు . చిత్తోఢ్ ను ముట్టడించిన నాలుగు నెలలకి అదీ చిత్తోఢ్ సైన్యాధికారి మరణంతో దిక్కుతోచని సైనికులు కనిపించిన మొఘల్ సైనికులను చంపుతూ సరియైన వ్యూహం లేక రాజపుత్ర సైనికులు వీరమరణం పొందుతారు . కోటలోని స్త్రీలు జవ్హార్ బావిడి దగ్గర అగ్ని ప్రవేశం చేస్తారు 

ఈ కోట చరిత్రలో సుమారు 16 వేల స్త్రీలు యిఛ్చాపూర్వకంగా అగ్ని ప్రవేశం చేసినట్లు అంచనా . అగ్ని ప్రవేశానికి ముందు వారు జవ్హారి గోడలపైన అరచేతి ముద్రలు వేసి అగ్ని ప్రవేశం చేసేవారు . ప్రతీ సంవత్సరం యిక్కడ జవ్హారీ మేలా జరుగుతుంది . దేశం నలుమూలలనుంచి రాజస్థాన్ స్త్రీలు పసుపు కుంకుమ సమర్పించి సతులైన వారికి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటారు .

అక్బరు కోట స్వాధీనపరచుకొని కోటలోనికి ప్రవేశించి నిర్మానుష్యమైన కోటను చూచి నిరాశ చెందుతాడు . పరాజయం పొందిన ఉదయ సింగ్ తిరిగి చిత్తోర్ ను వశ పరచుకొనేంత వరకు అడవులలో నే నివసించేట్టు శపధం చేసుకొని కొద్దికాలం తరవాత చిత్తోఢ్ ని స్వాధీన పరచు కొంటాడు . ఈ వారానికి యింతే మళ్లా వారం చిత్తోఢ్ చుట్టుపక్కల వున్న ప్రదేశాల గురించి తెలుసుకుందాం అంతవరకు శలవు . 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి