సాహితీవనం - వనం వేంకట వరప్రసాద రావు

sahiteevanam
పాండురంగ మాహాత్మ్యము 

విరూరి వేదాద్రి మంత్రి ' పుండరీకుని చరిత్రను  తెలుపుతూ ఒక కావ్యాన్ని రచించి నాకు అంకితం  చేయవయ్యా' అని తనను అడిగిన సన్నివేశాన్ని వర్ణిస్తున్నాడు తెనాలి రామకృష్ణుడు. ఈ సన్నివేశము తెనాలి రామకృష్ణుడు 'వికటకవి' అని ముద్ర వేసి తన ప్రతిభకు తగిన గుర్తింపును యివ్వని వారికి కసిగా యిచ్చిన సందేశంలా కనిపిస్తుంది. విరూరి వేదాద్రి మంత్రి యింకా యిలా అడుగుతున్నాడు.

స్కందపురాణ నీరనిధి కౌస్తుభమై ప్రభవించు దేవకీ 
నందను సత్కథోదయము నవ్యకవిత్వకళాకలాపమన్
కుందనమున్ ఘటించి కడుఁగ్రొత్తగు సొమ్మొనరించి, విష్ణు సే
వం దిలకించు నప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా                (ఉ)

స్కందపురాణము అనే సముద్రమునందు జనించిన కౌస్తుభమువంటి 'దేవకీనందనుని చరిత్రమును' నీ నూత్నరీతుల కవిత్వము అనే బంగారముతో చేర్చి, వినూత్నమైన ఆభరణముగా తీర్చి విష్ణుసేవను తిలకించే, ప్రేమించే వైష్ణవకోటికి అలంకరింపుమా, బహూకరింపుమా అని కోరాడు, విరూరి వేదాద్రిమంత్రి. కౌస్తుభమణి నిజముగానే  సముద్రాన్ని చిలికినప్పుడు జనించింది, విష్ణువుకు ఆభరణమయ్యింది. అప్పుడు దానికి బంగారుపని ఎవరుచేశారో, ఎలా నగిషీలు చెక్కారో  తెలియదు(బహుశా విశ్వకర్మ కావొచ్చు!) యిపుడు ఆ  స్కందపురాణము అనే జలనిధిలో కౌస్తుభమణిలాంటి  దేవకీనందనుని చరిత్రను నువ్వు నీ పసిడికవిత్వముతో ఆభరణముగా తీర్చి 
దిద్దాలి, విష్ణుభక్తులకు ఒక దివ్యమైన అలంకారభూషణంగా బహూకరించాలి అని  మొత్తము దివ్యమైన రూపకాలంకారంగా  మత్కరిస్తున్నాడు రామకృష్ణుడు. 

ఉదయంబస్తనగంబు సేతువు హిమవ్యూహంబునున్ జుట్టి రా 
విదితంబైన మహిన్ మహాంధ్రకవితావిద్యాబల ప్రౌఢి నీ 
కెదురేరీ! సరసార్ధబోధఘటనాహేలాపరిష్కార! శా
రద నీ రూపము! రామకృష్ణకవిచంద్రా! సాంద్రకీర్తీశ్వరా!          (మ)

ఉదయపర్వతమునుండి అస్తాద్రివరకూ అంటే, తూర్పునుండి పడమరవరకు ఉన్న,సేతువునుండి హిమాలయపర్యంతము అంటే, దక్షిణమున రామసేతువు నుండి ఉత్తరమున హిమాలయందాకా వ్యాపించిన భారతదేశములో 'ఆంధ్రకవిత్వవిద్యాబల ప్రౌఢి'లో నీకు ఎదురెవరు? 'భా' అంటే వెలుగు, ప్రకాశము, జ్ఞానము. భారతము అంటే వెలుతురుకు, ప్రకాశానికి, జ్ఞానానికి 'మరిగిన' దేశము అని సూచించడానికే ఉదయాద్రి
మొదలుకొని అస్తాద్రివరకూ అని ఎత్తుకున్నాడు పద్యాన్ని.  సమస్తభారతదేశములో ఆంధ్రకవిత్వము చెప్పేవారిలో అనడం ఏమిటి, అంటే, 
ఆంధ్రజాతీయులు, తెలుగు మాతృభాషగా కలిగినవారు లొల్లా లక్ష్మీధర పండితునివంటి మహనీయులు అనాదిగా భరతఖండమంతా వ్యాపించి ఉన్నారు అని చెప్పడంకోసం.  లక్ష్మీధరపండితుడు రాయల  ఆ స్థానములో కూడా వెలిగాడు, అంతకుముందు గజపతుల  స్థానంలో  ఉండేవాడని చరిత్ర. శంకరాచార్యులవారి సౌందర్యలహరికి ఉన్న వ్యాఖ్యానాలలో అత్యుత్తమమైనవాటిలో లక్ష్మీధరపండితుని వ్యాఖ్య ఒకటి. లక్ష్మీధరుడు మహా మంత్రశాస్త్రవేత్త. వేదములకు సాయణుడు ఎలానో మంత్రశాస్త్రానికి లక్ష్మీధరుడు అలా అని ప్రతీతి. సరసమైన అర్ధాన్ని బోధించే సమస్యలను పరిష్కరించే నేర్పరివి! అంటే సరసమైన కథల చిక్కుముడులను విప్పగల కుశలుడివి, ఘనమైన కీర్తిగల రామకృష్ణకవిచంద్రా! శారద నీ రూపము! కనుక  నీవే  ఈ కావ్యాన్ని రచింపగలవు అన్నాడు వేదాద్రిమంత్రి. అంతే కాదు, 
గ్రంథరచన చేయడానికి స్వాగతం చెప్పి, పండిత తాంబూలమును యిచ్చాడు. ఎలాంటి తాంబూలమును ఇచ్చాడో కూడా చెబుతున్నాడు రామకృష్ణుడు. 

పలుకుందొయ్యలి మోవికాంతికెనయౌ బాగాలు, నయ్యింతి చె
క్కులఁబోలుం దెలనాకు  నయ్యువిదపల్కుల్ వంటి కప్రపుఁ బ
ల్కులతోఁ గూడిన వీడియం బొసఁగె నాకున్ బద్మనాభార్చనా 
కలనా పావన హస్తకంకణ ఝణత్కారంబు తోరంబుగన్               (మ)

పలుకులమ్మ సరస్వతీదేవి పెదవులకాంతులతో తులతూగే లేత ఎర్రనైన పోకలు,ఆమె చెక్కిళ్ళ 'లేత ఎరుపుకలిసిన తెల్లని కాంతులతో' పోటీపడుతున్న తమలపాకులు,ఆమె 'పలుకుల'వంటి పరిమళభరితమైన కర్పూరపు 'పలుకులు' కలిసిన తాంబూలాన్ని,నిరంతరమూ పద్మనాభుడైన శ్రీహరిని అర్చించే పవిత్రమైన హస్తమునకు ఉన్న కంకణముల గలగలలు చెలరేగుతుండగా, తాంబూలాన్ని యిచ్చి రచనకు ప్రారంభము చేయవలసిందిగా కోరాడు వేదాద్రి మంత్రి. పలుకులు అనే పదంలో ఎంత అందమైన శ్లేషనో పొదిగి, ఒక పలుకులు అంటే మాటలు అని, రెండవ పలుకులు కర్పూరపు పలుకులు అని చమత్కరించాడు. అమ్మ పలుకులు అంటే అమ్మను గురించిన పలుకులు, 
ఆమె స్తుతి అనీ, కవిత్వము అంటే సత్సాహిత్యము అనీ, యిక 'అమ్మ'పలికే పలుకులు అనీ, యిన్నీ 'కర్పూరపు పలుకుల'లాగా చిన్నగా, సన్నగా, అంటే  సున్నితంగా, క్లుప్తంగా, సంక్షిప్తంగా, సూటిగా, పరిమళ భరితంగా ఉంటాయని, ఉండాలని ధ్వని!

యిక కృతిపతి వంశ ప్రస్తుతికి ఉపక్రమిస్తున్నాడు. ఈ కృతిపతి వర్ణనములో కేవలము  రామకృష్ణుని కవిత్వప్రతిభకు తార్కాణముగా ఉన్న కొన్ని పద్యాలను మాత్రమే రుచిచూసి  ముందుకు సాగుదాము. 

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి