వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

                                                                                         ఎల్లో స్టోన్ నేషనల్ పార్కు  2

బ్రింక్ ఆఫ్ అప్పర్ ఫాల్స్ నుంచి వెళ్తూ వేలీ వ్యూ దగ్గర ఆగాము.  అక్కడ ఎత్తుగా కట్టిన వ్యూ పాయింట్ కి వెళ్తే కొండల నడుమ వంపులు తిరిగి వయ్యారంగా ప్రవహిస్తున్న ఎల్లో స్టోన్ నదిని చూడవచ్చు.  ఎంత అందంగా వుందో  మీరు కూడా ఫోటోలో చూసెయ్యండి ప్రస్తుతానికి.

 

పెట్రిఫైడ్ ట్రీస్

 

చెట్లు రాళ్ళల్లాగా మారటం ఇక్కడ చూడవచ్చు.  ఈ మార్పుకి ప్రకృతిలో కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది.   అలా మారుతున్న చెట్టును ఒక కొండ మొదలులో చూశాము. మీ కోసం ఫోటో తెచ్చేశాను లెండి. ఇంకా వున్నాయన్నారు కానీ మేము నడవలేక పోయాము. 

 

45 పేరలల్ ఆఫ్ లేటిట్యూడ్

ఈక్వేటర్ కి నార్త్ పోల్ కి మధ్యన వుండే లేటిట్యూడ్ బోర్డు చూశాంకదా.  మరి ఫోటో కూడా...

ఇది భూమధ్య రేఖకి 45 డిగ్రీలు ఉత్తరంగా వుండే లేటిట్యూడ్.  ఇది యూరప్, ఏషియా, పసిఫిక్ ఓషన్, నార్త్ అమెరికా, అట్లాంటిక్ ఓషన్ ల మీదుగా వుంటుంది.  ఆ లైన్ క్రాస్ చేసే చోట గుర్తులు పెడతారు. (ఆ లైను మనక్కనబడదని మీకూ తెలుసుగా).    అక్కడ మనలాంటి వాళ్ళు ఫోటోలు తీయించుకుంటారు.  అదన్నమాట సంగతి. 

 

మేమత్ హాట్ స్ప్రింగ్స్

వీటిని అప్పర్ టెర్రెస్, లోయర్ టెర్రెస్ అని రెండు భాగాలుగా విభజించారు.  ఇక్కడ చాలాకాలం క్రితం అగ్ని పర్వతాలు వుండేవి.  ఇప్పటికీ వాటినుంచి వేడి పొగలు, వేడి నీరు వస్తూనే వుంటాయి.  అంతే కాదు.  అక్కడ నేలంతా  కెమికల్ రీయాక్షన్స్ వల్ల అద్భుతమైన రంగులతో వుంటుంది.  లోయర్ టెర్రెస్ అంతా ఎత్తు పల్లాలు, మెట్లు వుంటాయి.

అప్పర్ టెర్రెస్ అంతా చదునైన భూమి.  ఈ రెండు చోట్లా భూమి ఎన్ని రంగులతో కనువిందు చేస్తుందో.. అంతకు ముందు ఆ అగ్ని పర్వతాల పీడనకి ఎంత కష్టపడి నేల తల్లి ఇన్ని రంగులని వెదజల్లిందా అనిపిస్తుంది. 

 

ఇక్కడ కొన్ని గీజర్లు ఎప్పుడూ కాస్తో కూస్తో వేడి నీటిని వదులుతూనే వుంటాయి.  కొన్ని వుండుండి ఒక్కసారి సందర్శకులను సంభ్రమాశ్చర్యాలు పరుస్తూ చాలా ఎత్తుగా ఆకాశాన్నంటుకోవటానికి పందాలు వేశాయా అన్నట్లు వస్తాయి.  కొన్ని అక్కడ వున్న ఖనిజాలవల్ల రక రకాల రంగులు సంతరించుకుని వేడి నీటి బుగ్గల్లో కూడా ఇన్ని అందాలా అని ఆశ్చర్య పరుస్తాయి.  వీటన్నింటినీ గురించి చెప్పటానికి మన మాటలు సరిపోవు.  మేము చూసిన వాటిలో కొన్నింటిని గురించి వివరిస్తాను.

 

 

లిబర్టీ కేప్

ఇదివరకు ఇదీ హాట్ స్ప్రింగే.  ప్రస్తుతం దీనిలోంచి నీరు రావటంలేదు.  కానీ ఆ రసాయనాలన్నీ చేరి ఒక సిలిండర్ లాగా తయారయింది.  విశాల మైదానంలో ఆ సిలిండర్ లాంటి ఆకారం చూడ చక్కగా వుంది కదూ.  (ఫోటో)

 

ఆరెంజ్ స్ప్రింగ్ మౌండ్

భూమి లోపల వున్న నీరు అగ్ని పర్వతాల వేడివల్ల వేడెక్కుతుంది.  ఈ మరుగుతున్న నీరు అత్యధిక పీడనం వల్ల అక్కడ వున్న సున్నపు రాతి పొరలలోంచి కేల్షియమ్ కార్బొనైట్ ని కరిగిస్తూ పైకి ఉబికి వస్తుంది.  ఉపరితలానికి వచ్చిన వేడి నీరు చల్లబడి ఆవిరి అవుతుంది.  ఈ చర్య వల్ల నీటి ఒత్తిడి తగ్గి వాయువులు బయట పడతాయి.  ఈ ఆరెంజ్ స్ప్రింగ్ మౌండ్ అలా ఏర్పడినదే.   ఇప్పటికీ జరుగుతున్న ఈ చర్యలన్నింటివల్లా దీని మీద ఇంకా కేల్షియమ్ కార్బొనైట్ పేరుకుంటుండటంతో ఈ మౌండ్ ఇంకా పెరుగుతోంది.

 

ఎమరాల్డ్ స్ప్రింగ్

సాధారణంగా హాట్ స్ప్రింగ్స్ అక్కడ వున్న ఖనిజాలని తెలియడేస్తాయి.  ఎమరాల్డ్ స్ప్రింగ్.....  8 మీటర్ల లోతు వుంటుందీ నీటి గుంట.  నిర్మలంగా వున్న నీటిలోని నీరు సూర్య రశ్మి నుంచి వచ్చే అన్ని రంగులనీ తనలో లీనం చేసుకున్నా, నీలం రంగు మాత్రం రిఫ్లెక్టయ్యి మన కళ్ళని తాకుతుంది.  ఇక్కడ పసుపు పచ్చని సల్ఫర్ డిపాజిట్లతో ఈ నీలం రంగు కలిసి ఈ హాట్ స్ప్రింగ్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ లో కనబడుతుంది.

 

ఇలా ఎన్ని రంగులో!  ఎన్ని వింతలో!!   అన్నీ చూడాలంటే ఎంత సమయం కావాలో!!!   అన్నింటికన్నా ముఖ్యమైన ఇంకొక్క గీజర్ గురించి మాత్రం చెబుతాను.

 

ఓల్డ్ ఫైత్ ఫుల్ గీజర్

 

ఓల్డ్ ఫైత్ ఫుల్  గీజర్ అప్పర్ బేసిన్ లో వుంది.  ఇది మేము చివ్వరికి చూశాము.  ఇక్కడ వున్న గీజర్లల్లో ముఖ్యమైనది ఓల్డ్ ఫైత్ ఫుల్.  నిర్ణీత సమయానికి టంచన్ గా వేడి నీటి ఫౌంటెన్లోలాగా భూమిలోంచి ఒక్కసారి పెల్లుబుకుతుంది.  ఈ ఫౌంటెన్లు చూడటానికి సందర్శకులు గంటల తరబడి అక్కడ వేచి వుంటారు.  ఈ ఫౌంటెన్ తర్వాత వచ్చే సమయం విజిటింగ్ సెంటర్ దగ్గర సమాచారం డిస్ప్లే చేస్తారు.  ఇది ఒకటే టైమ్ కి వస్తుందిగనుక దీని గురించి మాత్రమే డిస్ప్లే చేస్తారు.  మిగతా వాటికోసం సుమారు టైము చెప్పినా, మన అదృష్టం ..  వేచి చూడాల్సిందే.  ఇక్కడ ఈ ఒక్క ఫౌంటెనే కాదు.  చిన్నా పెద్దా అనేకం వుంటాయి.  కొన్నింటినుంచీ చిన్నగా నీరు ఎప్పుడూ ఉబుకుతూనే వుంటుంది.  దాన్లోంచి వస్తోంది, దీన్లోంచి వస్తోంది అని అక్కడ చేరిన వారంతా ఆత్రంగా ఎదురు చూస్తూ వుంటారు,

 

ఈ గీజర్ చూసి వస్తుంటే అనుకోకుండా అక్కడ ఇంకొక స్ప్రింగ్ చాలా హఠాత్తుగా, చాలా ఎత్తుగా రెండు నిముషాల దాకా వచ్చింది.  ఆ సంతోషంలో వుండగానే అక్కడ చేరిన ఆ దేశానికి చెందిన ఒక కుటుంబంలో పిల్లలు నా బొట్టు గురించి ఆసక్తి చూపించారు.  వాళ్ళ తల్లి వాళ్ళ సందేహం నన్ను అడగవచ్చా అని, తమకి ఇండియా అంటే ఇష్టమని ముందు నా పర్మిషన్ తీసుకుని మరీ వాళ్ళ సందేహాలు అడగటానికి పిల్లలని ప్రోత్సహించింది.  అంతకు ముందు వేరే చోట ఒక చిన్న పాపకీ నా బొట్టు నచ్చి అది తీసి తనకిమ్మని అడిగింది.  అప్పుడు నాదగ్గర వేరేవి లేక పోవటం వల్ల ఆ పాపకి మన కస్టమ్స్ గురించి చెప్పటానికి ప్రయత్నించానేగానీ, అది తీసి ఇయ్యలేక పోయాను.  అప్పుడు మా అమ్మాయి సలహా ఇచ్చింది.  ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బేగ్ లో రెండు టిక్లీ పేకెట్లు పెట్టుకుంటూ వుండు.  ఇక్కడ కొందరికి అవంటే ఇష్టం.  ఆసక్తి చూపిస్తే ఇవ్వచ్చు అని.  ఆ సలహా ఇప్పుడు పని చేసింది.  బేగ్ లోంచి టిక్లీ పేకెట్ తీసిస్తే ఎంత సంతోషించారో.  కొంచెం సేపు నాతో ఆడుకుని మరీ వెళ్ళారు.  ఆల్ హేపీస్ కదా.

 

ఈ హేపీనెస్ తో దోవలో, సిజరిన్ స్ప్రింగ్, స్టీమ్ బోట్ గీజర్, ఎనస్ వగైరా ఇంకా ఎన్నో స్ప్రింగ్స్ చూసుకుంటూ (సమయం లేక అవి వచ్చేదాకా ఆగలేదు.  బోర్డులు చూసుకుంటా వచ్చేశాము) ఎల్లో స్టోన్ పార్కులో ప్రవేశించిన దోవకాక వేరే దోవలో  సురేష్ (మా అక్కయ్య రమాదేవిగారబ్బాయి) ఇంటికి, డెన్వర్ దోవ పట్టాము.

..

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి