పైక్స్ పీక్, కొలరాడో – 1
ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో బయల్దేరేసరికి రాత్రి 9 గం. అయింది. కొలరాడోలోని డెన్వర్ వెళ్ళేటప్పుడు చాలా మటుకు అడవి మార్గం. ఎల్లో స్టోన్ దాటగానే గ్రాండ్ టైటాన్ నేషనల్ పార్కు వచ్చింది. ఆ రోజుకి చాలా అలసిపోవటమేగాక, బాగా చీకటి కూడా పడటంతో అక్కడ ఆగలేదు. ఈ పార్కులో ఎక్కువగా పిక్నిక్ ఏరియాస్, కేంపింగ్ గ్రౌండ్స్ వుంటాయన్నారు. దాదాపు 100 మైళ్ళు ప్రయాణం చేశాక జాక్సన్ చేరుకున్నాము. అప్పటికే అర్ధరాత్రి 12 గం. అయింది. ఆ రోజుకు అక్కడ రూమ్ తీసుకుని రెస్టు తీసుకున్నాము.
మర్నాడు మధ్యాహ్నం 12-40కి తిరిగి డెన్వర్ కి ప్రయాణం కొనసాగించాము. మధ్యాహ్నం ఎగ్జిట్ 124 దగ్గర సబ్ వే లో ఆగి సబ్ తిన్నాము. సబ్ అంటే పొడవుగా వుండే బ్రెడ్ (బ్రెడ్ లో రకాలుంటాయి) మధ్య రకరకాల కూరగాయల ముక్కలు వగైరా పెట్టి ఇస్తారు. ఆ కూరగాయలు అన్నీ అక్కడ డిస్ప్లేలో వుంటాయి. మనకేవి ఎలా కావాలో చెబితే అలాగే చేసిస్తారు. బాగుంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా వున్నాయి. రాత్రి 8-50కి (ఇక్కడిదాకా మిచిగన్ టైమింగ్స్) మా అక్కయ్యగారబ్బాయి, సురేష్ వాళ్ళింటికి చేరాము. సురేష్ భార్య శైలజ, కొడుకులు దినేష్, దీపేష్ .. ఇంటికి చుట్టాలు వచ్చారని చాలా సంతోషించారు. కబుర్లు నంజుకుంటూ భోజనాలు చేసి పడుకునేసరికి రాత్రి 12 దాటింది.
మర్నాడు మధ్యాహ్నం 12 గం. లకు (ఇది కొలరాడో టైమ్) బయల్దేరి పైక్స్ పీక్ కి వెళ్ళాము. రాకీ మౌంటెన్స్ (ప్రపంచంలోనే పొడవైన కొండలుట) లో వుండే పైక్స్ పీక్ కొలరాడోలోని ఎల్ పాసో కౌంటీలో వుంది. ఈ ప్రాంతాన్నీ నేషనల్ పార్కుగా అభివృధ్ధి చేశారు .. అదే పైక్ నేషనల్ పార్కు. 14,115 అడుగుల ఎత్తయిన ఈ శిఖరాన్ని చేరుకోవాలని మొదట్లో ప్రయత్నించి సఫలం కాలేని జెబులన్ పైక్ గౌరవార్ధం ఈ శిఖరానికి పైక్స్ పీక్ అని పేరు పెట్టారు.
కొలరాడోలో కొండలు చాలా ఎక్కువ. సముద్ర మట్టానికి 13000 అడుగుల పైన వున్న కొండలు 250 వున్నాయిట. 14000 అడుగుల పైన ఎత్తు వున్న కొండలు 53 వున్నాయిట. అందులో ఇది ఒకటి. ఈ పీక్ మీద గ్రెనేట్ రాళ్ళు గులాబీ రంగులో వుంటాయి. ఇక్కడ పొటాషియం ఫెల్డ్ స్పర్ ఎక్కువగా వుండటంవల్ల ఇక్కడి రాళ్ళకి ఆ రంగు. వీటికి ప్రత్యేకంగా పైక్స్ పీక్ గ్రెనైట్ అని పేరు. భూమి లోపల 20 మైళ్ళ దాకా ఈ రాయి వ్యాపించి వుందిట.
ఇంత ఎత్తున వున్న ఈ శిఖరాన్ని చేరుకోవటానికి రోడ్డు ద్వారా వెళ్ళవచ్చు, ట్రెక్కింగ్ చెయ్యవచ్చు. అంతే కాదు. రైల్లో కూడా .. అవునండీ .. అంత ఎత్తు శిఖరం దాకా రైల్లో కూడా వెళ్ళవచ్చు. నమ్మకపోతే కొండమీద రైలు ఫోటోలు చూడండి. ఇంకా వివరాలు కూడా..
పైక్స్ పీక్ కాగ్ రైల్వే
1891లో మొదలయిన ఈ రైలు మానిటో స్ప్రింగ్స్ నుంచి పైక్స్ పీక్ దాకా సంవత్సరం మొత్తం (వాతావరణం బాగుంటే) నడుస్తుంది. ఈ రైల్లో ప్రయాణం చెయ్యాలంటే కొన్ని రోజులు ముందే బ్రాడ్ మూర్ పైక్స్ కాగ్ రైల్వే వెబ్ సైట్ లో సీట్లు రిజర్వు చేసికోవాలి. ఈ రైలు ప్రయాణం చేసే దూరం 8.9 మైళ్ళు. పట్టే సమయం 3 గంటలు. దట్టమైన అడవులు, లోయలు, జలపాతాలు, సుందర దృశ్యాలు చూస్తూ ప్రయాణం చెయ్యవచ్చు.
మేము పైదాకా కారులోనే వెళ్ళాము. అప్పుడు పూర్తిగా పక్కా రోడ్డు లేదు. 2011లో వేశారుట. 12 మైళ్ళ పొడవున్న ఈ దోవ వెడల్పు కొంచెం తక్కువే. మలుపులతో, స్టీప్ అప్ లతో వుంటుంది. డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చెయ్యాలి. పిల్లలు ఎలా చేస్తారా అని లోలోపల భయపడ్డానుగానీ వాళ్ళు ఎక్స్పర్ట్ డ్రైవర్స్ అని తెలిసింది ఈ ప్రయాణంలో.
ఈ శిఖరం మీద ఏ సమయంలోనైనా మంచు పడవచ్చు. లేక మెరుపులతో కూడిన వానలు కురవవచ్చు. ఎప్పుడో వచ్చేవాటి సంగతి మనకెందుకు. మేము వెళ్ళినప్పుడు వాతావరణం బాగుంది. మాకన్నా కిందనుంచీ ప్రయాణిస్తున్న మేఘాలని చూసి చిందులు వేశాము. లోయలు చూస్తూ పరవశించి ఫోటోలు తీసుకున్నాము. అంత ఎత్తున రైలు చూసి చిన్న పిల్లల్లా సంతోషించటమే కాదు, ఎక్కి దిగాము కూడా. అక్కడ కేంటీన్ లో ఏదో తాగాము. ఇప్పుడు గుర్తు లేదు. అక్కడ వున్న లేండ్ మార్క్ దగ్గర ఫోటోలు తీసుకున్నాము.
సముద్రమట్టానికి అంత ఎత్తులో వుంది కనుక శిఖరం పైన ఆక్సిజన్ శాతం తక్కువే వుంటుంది. దానితో కొంచెం తల దిమ్ముగా, తిరిగినట్లు అనిపించింది నాకు. గాలి వేగంగా పీల్చి వదలమన్నారు. కొంచెం సేపట్లో సర్దుకుని అన్నీ తిరిగి బాగా ఎంజాయ్ చేశాము.
రిజర్వాయర్స్
కొలరాడో స్ప్రింగ్ లో అతి తక్కువ వర్షపాతం వుంటుంది. నదులు, చెరువులు లేకపోవటంవల్లా, అతి తక్కువ వర్షపాతం వల్లా, నీటి కోసం కొండలమీదే ఆధార పడాలి. కొండలమీద చలికాలంలో పడ్డ మంచే ఇక్కడివారి నీటి ఆధారం. కొండ మీదనుంచి వచ్చే నీరుని నిలువ చేసుకోవటం 1891లో మొదలు పెట్టారు. జనాభా పెరుగుతున్న కొద్దీ దానిని అభివృధ్ధి చేసి 1935 లో 1.1 బిలియన్ గాలన్ల బ్లూ రివర్ నీటికి హక్కుదారులై, దానిని నిలువ చేసుకునే సామర్ధ్యంగల డామ్ ని నిర్మించుకున్నారు. ఈ రిజర్వాయర్స్ లో సందర్శకులు ఫిషింగా, బోటింగ్ చేయవచ్చు.
వచ్చే వారం కొలరాడోలోని వేరే విశేషాలు.