రాజస్థాను అందాలు చూద్దాం రారండి ( పది+ అయిదవ భాగం )
బికనేరు --1
కిందట సంచికలో ఒంటెల ఫార్మ్ గురించి తెలుసుకున్నాం కదా !
అక్కడ నుంచి బికనేరు చేరుకొన్నాం , అవేళ డిసెంబరు 31 కావడంతో రాత్రి కొత్త సంవత్సర వేడుకలు హొటల్ వాళ్లు యేర్పాటు చేసేరు . బోన్ ఫైర్ , బఫే డిన్నరు , పాటలు , రాజస్థానీ డేన్సులు రాత్రి ఒంటిగంట వరకు యేవోవో తినడానికి వేడి వేడి గా సర్వ్ చేస్తూనే వున్నారు . ఆ కార్యక్రమం రాత్రి రెండు వరకు జరుగుతూనే వుంది .
హొటలు సిబ్బంది ముందురోజు అలసి పోయారు కాబట్టి మాకు లేటుగా అంటే పది దాటేక బ్రేక్ ఫాస్ట్ యిచ్చేరు . ఆ రోజు మేము ' జునాఘడ్ ' చూడదలుచుకున్నాం . పూర్వం మధ్య ఆసియా నుంచి గుజరాత్ కు థార్ యెడారి మీదుగా గుజరాత్ కి వాణిజ్య దారి లో వున్న ఒయాసిస్సు ప్రాంతం యిది . నెహర్ ఝాట్ తెగల పుట్టిన ప్రదేశం . వ్యాపారులు దీన్ని ' జంగిల్ దేశ్ ' అని పిలిచేవారు . రావు జోధా మొదటి సంతానమైన ' రావు బిక ' వంశపారంపర్య సింహాసనాన్ని వదులుకొని 1478 లో సొంత సామ్రాజ్య స్థాపనకై సరియైన ప్రదేశాన్ని వెదకుతూ అప్పట్లో అడవి రాజ్యం ( జంగిల్ దేశ్ ) గా గుర్తింపబడ్డ ఈ ప్రాంతానికి వచ్చి కోట నిర్మాణానికి కావలసిన భూమి కొరకు అప్పటి ఆప్రాంతపు స్థానిక ఆటవిక జాతి ' నెహర్ ఝాట్ ' ముఖ్యులతో చర్చించగా వారు నిర్మింప బోయే వూరికి తమ జాతి పేరును కలపాలనే షరతుపై రావు బిక కు భూమిని యివ్వడానికి సమ్మతిస్తారు . అందుకని రావు బిక చే నిర్మింప బడ్డ వూరు ' బికనేర్ ' గా మారింది . రావు బిక అక్కడ కోట నిర్మించుకున్నాడు .
రావు బిక సంతతికి చెందిన ఆరవ వంశస్థుడు రాయ్ సింగ్ కాలంలో అంటే సుమారు వంద సంవత్సరాల అనంతరం అక్బరు పాదుషా ప్రాపకంలో రాయ్ సింగ్ కి ఉన్నతపదవులు దక్కటం తో బికనేర్ ఒక్కసారిగా ప్రాముఖ్యత సంతరించుకుంది . రాయ్ సింగ్ అక్బరు సైన్యం లో కీలకమైన పదవులలో నియుక్తుడై ' మేవాఢ్ ' రాజులను ఓడించడంలో చక్రవర్తికి సహకరించడంతో బహుమతిగా జాగీర్లు , ధనం కానుకలు గా పొందేడు . ఆ ధనంతో బికనేరు వూరి మధ్యలో సుమారు 5.5 హెక్టార్లలో 1589 లో ' చింతామణి ' కోటనిర్మాణాన్ని చేపట్టి 1594 లో పూర్తి చేసాడు . చింతామణి కోట జునాఘడ్ గా పేరుపొందింది . అతని తర్వాత రాజులు వారికి కావలసిన మార్పులు చేస్తూ వచ్చేరు . మొత్తం కోట చాలా కొత్తగా మేము చూసిన అన్ని కోటల కంటె కొత్తగా వుంది . లోపల శిల్పకళ పనితనం చూడవలసిందే కాని వర్ణించ లేము . ఎర్రరాయ , పాలరాయల మిశ్రమం . ఎడారి లోని ఒయాసిస్సు దగ్గర యేర్పడ్డ నగరం . నగరానికి యే వైపు వెళ్లినా యెడారే . కాబట్టి నవ్వంబరు నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకలకు అనువైన కాలం . యీ కోట లో రాజస్థాన్ , మొఘల్ శిల్పకళలతో పాటు యూరోపియన్ శిల్పకళ కూడా కనబడుతుంది . 1818 లో రాజ సూరత్ సింగ్ కాలంలో ఆంగ్లేయుల పాలనలోకి వెళ్లింది . ఆ సమయం లో కట్టించిన భవనాలలో యూరోపియన్ శిల్పకళ ప్రభావం కనబడుతుంది .
బికనీరు సింహాసనాన్ని అధిరోహించిన ప్రతి రాజు అంతకు ముందు తమ తండ్రులు నివసించిన భవనాలలో నివసించేందుకు యిఛ్చగించక వేరే నివాస స్థానాలు గదులు నిర్మించుకోవడంతో యీ కోటలో అనేక గదులు భవనాలు వున్నాయి . హిందూ , జైన మందిరాలు వున్నాయి . ఈ కోట లోనికి ప్రవేశించడానికి యేడు ద్వారాలు వున్నాయి . ప్రస్తుతం వుపయోగిస్తున్న ద్వారం సూరజ్ పోల్ , బంగారు యిసుకరాయి నిర్మాణం సూర్యునికి ప్రతీకగా నిర్మించేరు . కరణ్ పోల్ , దౌలత్ పోల్ , చాంద్ పోల్ , ఫతేపోల్ , ట్రిపోలియా మొదలయినవి వున్నాయి .
1887 లో రాజా డుంగర్ సింగ్ నిర్మించిన ' బాదల్ మహల్ ' ప్రజలను ఆకట్టుకొంది . ఇందులో చిత్రకారుడు మేఘాలు , వర్షం పడుతున్న దృశ్యం చిత్రీకరించేడు , యిక్కడి ప్రజలకు అది అపురూపమైన దృశ్యం యెందుకంటె థార్ యెడారిలో వున్న బికనీరు లో వర్షాలు పడేవికావు .
ఈ కోటలో యెర్ర యిసుకరాతి చెక్కడాలు పాలరాతి చెక్కడాలు చూడ్డానికి రెండుకళ్లు చాలవు .
ఇందులో ముఖ్యంగా చూడవలసినవి దివానీ ఖాస్ , దివానీ ఆమ్ లతో పాటు బాదల్ మహల్ , జనానా , గంగా మహల్ , దర్బార్ హాల్ , గంగా నివాస్ పేలస్ , చంద్ర మహల్ , కరన్ మహల్ , లాల్ ఘర్ పేలస్ , లాల్ ఘర్ పేలస్ హెరిటేజ్ హొటల్స్ వారి ఆధ్వర్యంలో వుంది . ప్రస్తుతపు రాజపరివారం యీ హోటల్లో వుంటున్నారు .
ఇందులో వున్న మ్యూజియంలో రాజపరివారపు దుస్తులు , పల్లకీలు , వుయ్యాలలు , వివిధరకాలయిన ఆయుధాలు , కవచాలు , పెయింటింగులు , యూరోప్ నుంచి తెప్పించిన దీపాల గుత్తులు వున్నాయి .
రాజస్థాన్ లో చూడదగ్గ కోటలలో యిదొకటి .
రావు బిక నిర్మించిన కోట ప్రస్తుతం శిధిలమయిపోయింది .
జునాఘడ్ చూసుకున్న తరువాత మేము బికనీరుకి 30 కిలోమీటర్ల దూరంలో వున్న కర్ణీమాత మందిరానికి వెళ్లేం . కర్ణీమాత మందిరానికి మధ్యాహ్నం వెళ్లడం లో ఓ చిన్న ట్రిక్కు వుంది అదేంటంటే మధ్యాహ్నం యెలుకలు నిద్ర పోయే సమయం కాబట్టి మన కాళ్లలో పడి భయపెట్టవు .
కర్ణీమాత మందిరము ( ఎలుకలమందిరం ) -----
బికనీరు కి 30 కిలోమీటర్ల దూరంలో ' దెస్నోకె ' అనే గ్రామంలోవుంది కర్ణీమాత మందిరం . కర్ణీమాత యమునితో పోరాడి పుతృడిని బతికించుకున్న తల్లి అని చెప్పేరు .
కర్ణీమాత దుర్గాదేవి అవతారంగా రాజస్థాన్ లో పూజలందుకుంటోంది . బికనీరు , జోధ్ పూర్ రాజులకు ఈమె కులదేవత . మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో రెండు మందిరాలువున్నాయి . ఒకటి కర్ణీమాత నివసించిన ప్రదేశం , అక్కడ వున్నమందిరం లో విగ్రహం యేమీలేదు . ఆమె పాదముద్రలు వున్నాయి . ఈమందిరం చిన్నగా , నిర్మానుష్యంగా వుంటుంది . ఇది ఆమె నివసించిన ప్రదేశమని చెప్పేరు .
రెండవది పెద్ద మందిరం , పెద్ద కోటను పోలిన ముఖద్వారంగుండా లోపలకి వెళితే విశాలమైన వరండాలు గదులు వుంటాయి . అంతా మొఘల్ శిల్పకళతో కట్టిన పాలరాతి కట్టడం . యీ మందిరంనిండా యెలుకలు పరుగెడుతూ వుంటాయి . సుమారు కాదు ఖచ్చితంగా 20 వేలయెలుకలు వున్నట్లుగా చెప్తారు . భక్తులు వీటికి పెద్ద యిత్తడి గిన్నెలోపాలుపోసి , లడ్డూలు పెడుతూ వుంటారు . అవి తిన్న తరువాతవాటిని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు . యిక్కడి యెలుకలు యేపాటి హాని జరిగినా కర్ణీమాత భక్తులు క్షమించరు. మందిరం లో కి అడుగు పెట్టడానికి ముందే హెచ్చరిస్తారు .
మధ్యాహ్నం పూట యెలుకలు నిద్రపోయే సమయం , అప్పుడైతే యెలుకలంటే భయపడే నాలాంటివారికి సులువుగా వుంటుంది . పగలు సాయంకాలం యెలుకలు మందిరమంతా పరుగులు తీస్తూవుంటాయి . భక్తుమీంచి పరుగెడుతూ వుంటాయి . ఆ సమయంలో గోనెపట్టాలు మనకాళ్లకు కట్టుకొని నడవాలి , చాలా జాగ్రత్తగాయెలుకలమద్యనుంచి నడుస్తూ గర్భగుడిలోని మాతను దర్శించుకోవాలి. గర్భగుడిలో ఒకచేత్తో కమండలం మరోచేత్తో అంకుశం ధరించినకర్ణీమాత విగ్రహం వుంటుంది . మేము దర్శనం అవగానే బయటకివచ్చేసేం . ఇక్కడ వున్న యెలుకలు యెలుకలు అనకూడదు వాటిని ' కబ్బాస్ ' లు అన్ని అంటారు .
కర్ణీమాత గురించి స్ధానికులను అడిగితే వారు యిలా చెప్పేరు .
1387 అక్టోబరు 2 వ తేదీన ' చరన్ ' తెగలో కర్ణీ జన్మించింది . ' దీపోజీ చరన్ ' ని వివాహమాడి ' సాధిక ' గ్రామానికి కాపరానికి వస్తుంది . కొద్దికాలం తరువాత సన్యాసం స్వీకరించాలనే కోరికను భర్తకు చెప్తుంది . అత్తింటివారు చిన్నపిల్ల మాటగా తీసుకొని పట్టించుకోరు . కాని ఆమెతన చెల్లెలయిన ' గులాబొ ' తో దీపోజీ వివాహం నిశ్చయించి తానుసన్యాసం స్వీకరిసుంది .
అప్పటి నుండి భక్తి మార్గాన్ని అనుసరిస్తూ తన శిష్యులతో సంచారజీవనం సాగిస్తూ భక్తిని ప్రచారం చేస్తూ వుంటుంది . ఆ క్రమంలోశిష్యులకు కొన్ని మహత్తులు చూపించేది . అలా సంచార జీవితంగడిపేటప్పుడు 1453 లో రావు జోధా ఆమె ఆశీశ్శులు పొంది అజ్మేరు , మాండోరు రాజ్యాల మీదకి దండెత్తి విజయం సాధిస్తాడు . ఆమెఅభీష్టం మేరకు బికనీరు రాజకుమారితో తన కుమారుని వివాహంజరిపిస్తాడు .
దీపోజీ చరన్ గులాబో ల కుమారుడు ఒకనాడు అక్కరకు దగ్గరా వున్న కపిల్ సరోవర లో మీరు త్రాగడానికి సరస్సులో దిగి మునిగి పోతాడు , అతని ప్రాణాలు హరించడానికి వచ్చిన యముని చూసిన కర్ణీమాత యమునకు అడ్డుగా నిలిచి యముని వొప్పించి కొడుకు ని పునఃర్జీవుని చేస్తుంది .
రావు జోధా జోధ్ పూర్ నిర్మాణం చేపట్టి నప్పుడు మొదటి రాయకు( శంకుస్థాపన ) కర్ణీమాత పూజచేసింది . అలాగే బికనీరు రాజునిర్మించిన రెండు కోటలకు శంకుస్థాపన ఈమె చేతనే చేయించేరు .
'మంథానియా ' లో కర్ణీమాత మందిరం ఆమె బ్రతికి వుండగానేనిర్మించేరు .
1538 లో అంటె ఆమె 150వ యేట జైసల్మేరు రాజు కోరిక మేరకుజైసల్మేరు వెళ్లి తిరిగి తన వూరు వచ్చేటప్పుడు ' దెస్నోకె ' దగ్గర నీళ్లుత్రాగేందుకు ఆగిన ఆమె అంతర్ధానమైంది . ఆమె అంతర్ధానమైనప్రదేశంలోనే మందిరం నిర్మించేరు .
మందిరం లో యెలుకలు వుండడం వెనుకనున్న కథ .
ఒకనాడు ' కొలాయత్ ' తాలూకాలోని ' కపిల సరోవరం ' లోనీళ్లుతాగడానికి దిగిన దీపోజీ పుతృడి ప్రాణాలను తీయడానికి వచ్చినయమునితో పోరాడి వెనుకకు పంపేస్తుంది . ఈ మందిరం లో వున్న తెల్ల యెలుకలు కర్ణీమాత ఆమె పరివారంఅని అంటారు . నల్ల యెలుకలు యుధ్దంలో మనసులనుసంహరించేందుకు యిష్టపడని సుమారుగా యిరవై వేలమందిసైనికులు యుధ్ద భూమినుండి పారిపోయింది రాగా వారికి శరణు యిచ్చివారినిరాజ దండన నుంచి కాపాడుతుంది . అప్పటి నుండి వారుకర్ణీమాత ను అంటి పట్టుకొనే వున్నారు , ఆమె అంతర్ధానమైనతరువాత సైనికులు యెలకలుగా మారి మందిరాన్ని అంటిపెట్టుకునివున్నారు . వీటి సంఖ్య యెప్పుడూ యిరవై వేలకి తగ్గదు యెక్కువఅవదూనట .
ఈ మందిరంలో తెల్ల యెలుక దర్శనం స్వయం కర్ణీమాత దర్శనంగాభావిస్తారు . యెలుకలు ఆహారం పెడితే కర్ణీమాత ప్రసన్నమౌతుందనిస్థానికులు భావిస్తారు . మన యిళ్లల్లో ఒక యెలుక వచ్చినా అదో రకమైన కంపు వస్తుందిఅక్కడ అన్ని యెలుకలు వున్నా యెటువంటి కంపులేదు . ఈ మందిరంలో చైత్రనవరాత్రులు , దేవీనవరాత్రులు భక్తి శ్రద్దలతోజరుపుకుంటారు .