వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి


కొలరాడో – 3

రెడ్ రాక్స్ పార్క్ మరియు యాంఫీ ధియేటర్


కొన్ని ఏళ్ళ క్రితం ప్రపంచంలోని ఏడు వింతలలో ఈ యాంఫీ ధియేటర్ ఒకటి.  ఇప్పటికీ ఈ స్టేజ్ మీద ఒక్కసారి ప్రదర్శన ఇచ్చినా తమ జన్మ ధన్యమైనట్లు భావించే కళాకారులు ఎందరో.  కొలరాడోలోని మారిసన్ లో వున్నది రెడ్ రాక్స్ పార్క్, దానిలో ఈ యాంఫీ ధియేటర్.  పేరుకు తగ్గట్లే ఎఱ్ఱటి కొండలు, గుహలు.  పార్కులోకి వెళ్ళక ముందే కనిపించిన కొండలు మమ్మల్ని చాలా ఆకర్షించాయి.  ఎత్తుగా వున్న ఆ కొండ రాళ్ళు ఎక్కి, గుహలలోకి వెళ్తేగానీ మనసు నిలవ లేదు.  మిమ్మల్ని ఇంకా ఉడికించను లెండి.  ముందుకెళ్తున్నా.

సముద్ర మట్టానికి 6450 అడుగుల ఎత్తున, 868 ఎకరాల్లో వున్న రెడ్ రాక్స్ పార్కు ఎలాంటి వారికైనా ఆహ్లాదం ఇచ్చే ప్రదేశం.  సమాయాభావం వల్ల డ్రైవ్ చేసుకుంటూ చూసెళ్ళి పోదామనుకునేవారికి, కుటుంబంతో కొంత సమయం గడుపుదామనుకునేవారికి, ప్రకృతి సౌందర్యారాధకులకు, ట్రైక్కర్స్ కీ సంగీత ప్రియులకీ, ఇలా అన్ని రకాల వారికీ నచ్చుతుంది.

ఇందులో నేను ముఖ్యంగా చెప్పదల్చుకున్నది యాంఫీ ధియేటర్ గురించి.  మేము వెళ్ళేసరికి వీనులకి విందుగా హాయిగా సంగీతం వినబడుతోంది. స్టేజ్ మీద ఒకతను నుంచుని ఏదో వాయిద్యం వాయిస్తున్నాడు.  ఆశ్చర్యం, ప్రేక్షకులు 4, 5 కన్నా ఎక్కువ లేరు.  ఎక్కడా మైకులుగానీ, వాటిని టెస్ట్ చేసేవారుగానీ, మధ్య మధ్యలో వాటిని సర్దేవారుగానీ, గొంతు చించుకుని అరిచే స్పీకర్లుగానీ కనబడలేదు.  కిందెక్కడో స్టేజి వుంది.  ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా అనేక మెట్లులాగా కట్టారు.  దాదాపు పది వేల మంది కూర్చోవచ్చు.  ఓపెన్ ఎయిర్.  చల్లని సాయంకాలం అలా ఆరు బయట కూర్చుని మంద్ర స్ధాయిలో సంగీతం వింటుంటే ....  మంద్ర స్ధాయి అంటే మళ్ళీ గుర్తొచ్చింది.  ఎక్కడా మైకులు, స్పీకర్లు లేకుండా అంత దూరంలో వున్నతను వాయిస్తున్న వాయిద్యం ఇక్కడి వారికి అంత స్పష్టంగా ఎలా వినిపిస్తున్నది.  ఇది వేరే మ్యూజిక్ ఏమన్నానా, లేకపోతే స్పీకర్లు వగైరాలు కనబడకుండా ఎక్కడన్నా పెట్టారా వాటి కోసం వెతుకుతూనే అడిగాను.  సమాధానం తెలుసా!?

ఇది ప్రకృతి నిర్మించిన స్టేజ్.  దీని వెనుకనున్న పెద్ద పెద్ద కొండ రాళ్ళవల్ల ఈ స్టేజ్ మీద చెయ్యబడ్డ శబ్దం ప్రతి ధ్వనించి,  చాలా దూరం వరకు వినిపిస్తుంది.  మన గోల్కొండ కోటలో కూడా కింద చప్పట్లు కొడితే పైనెక్కడో వినబడ్డట్లు.  అయితే ఇక్కడ చప్పట్లు మాత్రమే, అక్కడ ప్రతి చిన్న శబ్దం అత్యంత స్పష్టంగా వినబడుతుంది.  250 మిలియన్ల సంవత్సరాల క్రితంనుంచీ జరుగుతున్న ప్రకృతి మార్పులు ఇప్పుడు ఇలా అద్భుతంగా నిలిచాయి.  ప్రకృతి చేసిన ఏర్పాట్లని అలాగే వుంచి, మిగతా ధియేటర్ ని పూర్తి చేసిన ఆర్కిటెక్ట్ బర్న్ హామ్ హోయట్.  1947 నుంచి ఇక్కడ పూర్తి స్ధాయిలో ప్రదర్శనలు జరుగుతున్నాయి.  ప్రదర్శన వున్న సమయంలో టికెట్లు వుంటాయి.  లేనప్పుడు ఎవరైనా సందర్శించవచ్చు.  ఇటువంటి రంగస్ధలం ప్రపంచంలో ఇంకెక్కడా లేదంటారు.

మేము వెళ్ళినప్పుడు ఎవరూ లేరు.  సో,  ప్రేక్షకులమూ మేమే, ప్రదర్శకులమూ మేమే.  ఆఫీసులో కాస్తో కూస్తో రంగస్ధలానుభవం వున్నది కదా.  అందుకని, ఎవరూ లేకపోయినా, ఆ స్టేజ్ మీదకి వెళ్ళటమే నా అదృష్టంగా భావించి, మన పధ్ధతిలో దానికి నమస్కారం చేసి మరీ స్టేజీ ఎక్కి, అక్కడ కొంచెం సేపు తిరిగి, నా నాటకాలని గుర్తు తెచ్చుకుని నేను కూడా ఆ రంగస్ధలం మీద నటించేశాననుకుని సంతోష పడి పోయాను.

ఇక్కడ ఒక మ్యూజియమ్ కూడా వున్నది.   దానిలో అక్కడ కన్సర్ట్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు, ఫోటోలు పెట్టారు. 

ఇవాళ్టితో  ఎనిమిది రోజుల రోడ్ ట్రిప్ అయిపోయింది.   మా వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుని తిరిగి లేన్సింగ్ బయల్దేరాము.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి