సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

పాండురంగ మాహాత్మ్యము

పాండురంగ మాహాత్మ్యములో కాశీపట్టణ  వర్ణనలో  భాగంగా అక్కడి చతుర్వర్ణాల వారి వర్ణన అద్భుతంగా చేశాడు తెనాలి రామకృష్ణుడు. యిక ఆ  పట్టణ చతురంగ బలాల  వర్ణన చేస్తున్నాడు. ఈ పద్యాలు రామకృష్ణుని పౌరాణిక జ్ఞానానికి, ఆయన చమత్క్రుతికీ అత్యుత్తమ ఉదాహరణలు.ఏదీ మరొకదానికి తీసిపోని వర్ణన!

భూమియు నాకసంబుఁ దమపొంకమునన్ బిగియించు తత్పురీ
సామజకోటియున్నతికి, సర్వజగంబులఁ గల్గునున్నతుల్
భూమము డింది  వామనతఁ బూనగఁ దక్షిణదిక్కునేనుఁగున్
వామనమంచు నాడఁదగవా? తగవాడరుగాక భూజనుల్              (ఉ)

అక్కడి  సామజకోటి అంటే లెక్కకు మించిన ఏనుగులు భూమిని,  ఆకాశాన్ని తమ పొంకముతో, బలముతో, వైశాల్యముతో కట్టిపడేస్తాయి, అంటే గెలుస్తాయి. సకల జగములలో వాటికి ఔన్నత్యము, ఉత్తమ స్థానము ఉన్నది. అలాంటిది, దాని  ఉన్నతిని  తగ్గించి, చులకనజేసి, దక్షిణదిక్కున  ఉన్న  ఏనుగును ఒక్క దానినే 'వామనము' అని పిలవడం తగునా? భూజనులు  న్యాయము పలుకరు కదా! భూమిని మోస్తూ ఎనిమిది మగ ఏనుగులు, ఎనిమిది  ఆడ ఏనుగులు ఉంటాయి అని భారతీయుల సంప్రదాయము. ఎనిమిది దిక్కులలో ఎనిమిది ఏనుగుల జంటలు ఉంటాయి. ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము అనేవి మగ ఏనుగులు. తూర్పు దిక్కుతో మొదలై, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయవ్యము, ఉత్తరము, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కులలో ఈ  ఎనిమిది మగ ఏనుగులు, అభ్రమువు, కపిలము, పింగళము, అనుపము, తామ్రపర్ణి, శుభదంతి, అంగన, అంజనావతి అనే ఎనిమిది ఆడ ఏనుగులు జంటలుగా ఉండి సంసారాన్ని అంటే ప్రపంచాన్ని, అంటే భూమిని జంటలు జంటలుగా మోస్తూ ఉంటాయి. అంటే ప్రపంచమనే సంసారాన్నైనా, కుటుంబము అనే సంసారాన్నైనా ఆడ, మగ కలిసే మోస్తాయి, మోయాలి, మోయగలవు అని చమత్కారపు ప్రతీక. కనుక, దక్షిణ దిక్కున ఉన్న ఏనుగు పేరు వామనము. వామనము అంటే పొట్టిది, కురచది, చిన్నది, అల్పమైనది అని అర్థాలు కనుక, దక్షిణ దిక్కున ఉన్న ఏనుగును ఒక్కదాన్నే వామనము అనడం అన్యాయం, నిజానికి ప్రపంచములో ఉన్న ఎనుగులన్నీ వామనములే, కాశీ పట్టణములోని ఏనుగులతో పోలిస్తే. కానీ  అన్యాయముగా దాన్ని ఒక్కదాన్నే వామనము అని పిలుస్తారు జనులు, న్యాయము చెప్పరు కదా  అని చమత్కరిస్తున్నాడు రామకృష్ణుడు.

కెరలక క్రమ్మరింప నడుగెంటనె నిల్చు, నొకింత నూఁకినన్
శరనిధులేడుదాఁటు మెయిచాఁచి చివుక్కున, నుక్కుమీరి సం
గరమున గాయమైనపతిఁగాచుఁ జలింపక, తత్పురీహరుల్
హరిహయుమావు మున్ దిగిన యంబుధిరేవున వచ్చెనో సుమీ!      (చం)

తిరగకుండా మళ్లిస్తే, అడుగు వెంటనే నిలుస్తాయి అక్కడి గుర్రాలు. రౌతు ఎలా  తిప్పితే అలా తిరిగి, నిలుమంటే నిలుస్తాయి. ఒకింత 'ముందుకు నెడితే' (నూకితే) చాలు, శరీరాన్ని చాచి, సాగదీసి, ఏడుసముద్రాలను చివుక్కున, చిటికెలో దాటేస్తాయి, దూకేస్తాయి. యుద్ధరంగములో తమ యజమానికి, రౌతుకు గాయమైతే ఏమాత్రమూ  చలించకుండా, కాపాడుతాయి, యుద్ధరంగానికి దూరంగా తీసుకుపోయి. ఉత్తమజాతి  గుర్రాలకు, రౌతుకు శరీరానికి ఆత్మకు ఉన్న సంబంధము ఉంటుంది. ఏమాత్రము తన యజమానికి ఆపద వచ్చినా అవి యుద్ధరంగమునుండి దూరంగా వెళ్ళిపోతాయి, యజమాని శత్రువులకు చిక్కకుండా కాపాడుతాయి. సుప్రసిద్ధ వీరుడు, భారతమాత ముద్దుబిడ్డ, రాణాప్రతాప్ గుఱ్ఱము పేరు 'చేతక్', అది అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్న 'రాణాప్రతాప్ సింగ్'ను, దానికి ప్రాణాంతకమైన గాయాలు తగిలినప్పటికీ, స్పృహ కోల్పోయి రక్తధారలు వెలువరిస్తున్న 'రాణాప్రతాప్'ను  యుద్ధరంగము నుండి దూరంగా తీసుకెళ్ళి, శత్రువులు వెంటబడి తరుముతుంటే ఒక  పెద్ద కొండశిఖరమునుండి, మరొక శిఖరము మీదికి నదిమీదుగా దూకి, ఆ తాకిడికి  దాని  శక్తి హరించుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది, కానీ రాణాప్రతాప్ ప్రాణాలు  దక్కాయి. కన్నబిడ్డను పోగొట్టుకున్నట్టు విలపించి, దానికి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాడు రాణాప్రతాప్. ఆ గుర్రం పేరునే బజాజ్ సంస్థ తన 'స్కూటర్' కి,
ద్విచక్రవాహనానికి పెట్టింది, 'బజాజ్ చేతక్' అని!  అలా యజమానిని కాపాడుతాయి కాశీ పట్టణములోని గుర్రాలు. యింద్రుడి గుఱ్ఱము  ఐన ఉచ్చైశ్రవము మరలా, తను పుట్టిన సముద్రతీరానికి వచ్చిందో ఏమిటో అన్నట్టు ఉంటుంది ప్రతి గుఱ్ఱమూ.

సారథి ఛాందసుండు; బడి సాగదు చక్రయుగంబు; ప్రాత పం
చారపు గుఱ్ఱముల్; రథియు శౌర్యమునందరమాని; సాత్మవి
స్తారము ఖండఖండములు; తాఁనట మాసరి! యంచు దత్పురిన్
దేరులు నవ్వు శంకరునితేరిని గేతనకింకిణీధ్వనిన్                                (ఉ)

యిక అక్కడి రథాలు శివునికూడా పరిహసిస్తుంటాయి. శివుని సారథి ఛాందసుడైన పాతకాలపు బ్రహ్మ. చక్రాలు ఒకదాని తర్వాత ఒకటి తిరిగే సూర్యుడు, చంద్రుడు, రెండూ ఒకేసారి కలిసి తిరగవు. యిక గుర్రాలు చూద్దామా అంటే ఎప్పటివో తెలియని పాతబడిన వేదాలు. యిక రథికుడు శౌర్యమునందు సగమే మగాడు, సగము ఆడుది, శివుడు, అర్ధనారీశ్వరుడు! ఆ రథమో భూమి, ఖండ ఖండాలుగా ఉంటుంది, ముక్కలు  చెక్కలై ఉంటుంది. 'ఆ రథమా మాతో సరి?' అని కాశీ పట్టణములోని రథాలు, తమ జెండాలకున్న మువ్వలు మ్రోగేలా నిలువెల్లా కదిలిపోయేట్టు నవ్వుతుంటాయి! ఎంతటి చమత్కారపు వర్ణన!

వేటారుతునియలుగ నరి
పాటనమొనరించు బాహుపాటవగరిమన్
మేటులగు పోటుమగ ల
వ్వీటన్ విహరింతురుగ్రవిక్రములగుచున్               (కం)

బాహుబలంతో వేటుకు ఆరుముక్కలుగా శత్రువులను నరికిపారేస్తూ, ఆ పట్టణంలో మేటి పోటుమగాళ్ళు ఉగ్రమైన పరాక్రమంతో విహరిస్తుంటారు. ఇలాంటి ప్రశస్తమైన గజ, తురగ, రథ, పదాతిదళాలు అనే చతురంగ బలాలు ఉన్నాయి కాశీపట్టణంలో.

(కొనసాగింపు వచ్చేవారం)
వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి