అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

మనలో చాలామందికి , అడిగితే బావుండదేమో అనే  ఓ భయం ఉంటుంది. కానీ “ అడక్కపోతే అమ్మైనా పెట్టదు “ అన్నట్టు, మనకి  కావాల్సిందేదో అడక్కపోతే అవతలివారికి ఎలా తెలుస్తుందీ? అందుచేత అడగడానికి మొహమ్మాట పడకూడదని నా అభిప్రాయం.  అలా అడిగితే, కొందరనుకోవచ్చు, -- “ అదేమిటీ వెకిలిగా.. “ అని. వాళ్ళ కర్మనుకోవడం, మన పనేదో మనం చేసికోవడం ఉత్తమం..
ఉదాహరణకి  ఏ పెళ్ళి భోజనానికో వెళ్తామనుకోండి, ఈ మధ్యన ఈ రిసెప్షన్లూ, తరువాతి పెళ్ళి కార్యక్రమాలూ, పెద్ద పెద్ద హొటళ్ళలోనో, హాల్స్ లోనే చేస్తున్నారు. ఆతావేతా ఓ మూడు నాలుగ్గంటలైనా గడపాల్సొస్తుంది. అంతసేపూ ఉగ్గపెట్టుకుని కూర్చోలేమూ, ఏ సుగరున్నవాళ్ళకో మాటిమాటికీ వెళ్ళాల్సొచ్చిరావొచ్చు. అలాటప్పుడు, పెళ్ళికంటే ముఖ్యం,  Washroom  ఎక్కడుందో తెలిసికోవడం. ఏమీ సిగ్గు పడక్కర్లేదు ఈ విషయంలో. ఎవడో నాలాటివాడు మొహమ్మాటం లేకుండా అడిగేస్తాడు.. పక్కనున్నవాళ్ళు అనుకోవచ్చు,

 

ఇదేమిటీ ఈయన పెళ్ళికొచ్చాడా లేక కాలకృత్యాలు తీర్చుకోడానికొచ్చాడా అని. చిత్రం ఏమిటంటే అలా  వ్యాఖ్యానించిన పెద్దమనిషే మనల్ని అడగడం. ఆమాత్రం ఆ నిర్వాహకులనే అడిగితే ఏం పోయిందీ? అక్కడ మళ్ళీ ఇమేజ్ లూ, స్టేటసులూనూ. అలాగే పెద్దపెద్ద స్టార్ హొటళ్ళకెళ్ళినప్పుడు,  బాత్ రూం లో వేణ్ణీలెక్కడొస్తాయో తెలిసి చావదు. రిసెప్షన్ కి ఫోను చేసి అడగడంలో తప్పేముందో నాకైతే తెలియదు.  ఏ అటెండెంటునో పంపి చూపిస్తాడు.. అడగడానికి మొహమ్మాట పడితే శీతాకాలం కూడా చన్నీళ్ళే గతి.. ఏ ఊరైనా వెళ్ళినప్పుడు, ఇదివరకటి రోజుల్లో దారి అడిగేవారు, ఏ రోడ్డుపక్కనుండే హొటల్ వాడినో, కిళ్ళీకొట్టువాడినో. వాళ్ళూ చెప్పేవారు. కానీ కొత్తగా అవేవో  GPS  లు వచ్చిన తరువాత,  ఉన్నవాళ్ళని దారడగడం నామోషీ అయిపోయింది.. ఆ GPS  ఆంటీనే అడగడం. Short cut మానేసి, ఊరంతా చూపిస్తుంది.  ఆవిడ చెప్పిందే వేదం గా మనవాళ్ళకి, అలాగే రెండు కిలోమీటర్ల దూరాన్నీ ప్రదక్షిణచేసి మరీ వెళ్తారు.

అలాగే రైలుప్రయాణాలు చేసేటప్పుడు, మనం  నాలుగు నెలలముందే రిజర్వేషను చేయించుకున్నా, తీరా ట్రైనెక్కేటప్పటికి, ఎవడో తిష్ఠ వేసుక్కూర్చుంటాడు.. లేవడూ, పైగా సద్దుక్కూర్చోండని ఓ ఉచిత సలహా కూడా ఇస్తాడు. లోకువ ఇవ్వడం వల్ల వచ్చిన కష్టాలు. అలా కాకుండా, ఏ TTE  నో పిలిచి చెప్పొచ్చుగా ఇదీ విషయం అని, అబ్బే మొహమ్మాటం. ఇరుక్కునైనా కూర్చుంటాడు కానీ, ఆ  TTE  ని మాత్రం పిలవడు. అదృష్టం బాగుంటే, ఏ చెకింగుకో వచ్చినప్పుడే సమస్య తీరుతుంది.. ఆ చేసేదేదో ముందరే చేసుంటే ఈపాటికి హాయిగా కాళ్ళు జాపుకుని మరీ నిద్రపోయేవాడుగా. 

ఇదివరకటి రోజుల్లోలాగ సామాన్లు తెచ్చుకోవడం కిరాణా కొట్లలో కాదుకదా. ప్రతీదానికీ  Malls  కి వెళ్ళడం కొత్త సదుపాయం. వారాంతాలొచ్చాయంటే అక్కడ పెద్దపెద్ద క్యూలూ. దగ్గరలోనే ఉందికదా అని, ఏ పచ్చిమిరపకాయలో, ఏ ఆక్కూరో కొనుక్కోడానికి weekend  లో ఈ మాల్ కి వెళ్ళామా , చచ్చేమన్నమాటే. కొనేది ఏ పదిరూపాయల సరుకో, కానీ డబ్బులు కట్టడానికి ఓ పెద్ద క్యూ. అందరిదగ్గరా ట్రాలీల నిండా సరుకులూ,  మన వంతు వచ్చేటప్పటికి కనీసం ఓ గంట పడుతుంది. పోనీ అలాటప్పుడు, క్యూలో ఉన్నవారిని అడిగితే నూటికి తొంభైమంది కాదనరు. కానీ అడగడానికి మొహమ్మాటం.. మహా అయితే కాదంటాడు, ఇంకో క్యూకి వెళ్ళి ప్రయత్నించడం. ఎవడో ఒకడికి జాలి కలగ్గమానదు, మనం అడిగే పధ్ధతిలో ఉంటుంది.

అలాగే సిటీ బస్సుల్లో  Senior Citizens  కి డ్రైవరు వెనక్కాల సీట్లు రిజర్వ్ చేసుంటారు. ఖాళీగా ఉందికదా అని ఏ కుర్రాడో, కుర్రదో చెవుల్లో అవేవో పెట్టుకుని పాటలు వింటూంటారు. ఎవరైనా వయసుమళ్ళినవారొచ్చినా, కొంతమందైతే వెంటనే లేచి సీటిస్తారు. ఇంకొంతమందైతే, అసలు ఈలోకంలోనే ఉండరు. వాళ్ళలోకంలో వాళ్ళుంటారు. అలాటప్పుడు, వాళ్ళని తట్టి లేపి, పైన ఉన్న బోర్డు చూపించి,  అడగడంలో మొహమ్మాటం అక్కర్లేదు.. వాడు లేవకుండా వేషాలు వేసినా, నుంచున్నవాళ్ళు, వాడిని రెక్క పట్టుకు లేపేస్తారు. అడక్కపోవడం మన తప్పు.

మన రాజ్యాంగం మనకి చాలానే హక్కులిచ్చింది. చాలామటుకు, చాలామందికి తెలియనే తెలియవు. వాటి సంగతి వదిలేసినా, కనీసం తెలిసినచోటైనా హక్కుగా అడగడానికి మొహమ్మాట పడక్కర్లేదేమో…

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి