అమెరికాలో జగన్నాధ రధ యాత్ర
జగన్నాధుడు సకల జగాలనేలే నాధుడు, ఆయనకు అమెరికా ఏమిటి ఆస్ట్రేలియా ఏమిటి అంటారా? నిజమేననిపించింది నాకూను మిచిగాన్ లోని నొవై సివిక్ సెంటర్ లో జరిగిన జగన్నాధుని రధయాత్ర చూస్తే.
మన దేశంలో పూరీ జగన్నాధ రధ యాత్ర చాలా ప్రఖ్యాతి గాంచింది. రాజుగారు బంగారు చీపురుతో రధం బయల్దేరే ముందు ఊడుస్తారని, అనేక లక్షలమంది వీక్షిస్తుండగా అత్యంత వైభవంగా శ్రీ కృష్ణ పరమాత్మ తన అన్నగారు బలరామునితో, చెల్లెలు సుభద్రతో పెద్ద పెద్ద కొయ్య రధాలలో ఊరేగుతారని ఇది వరకు కధలు కధలుగా చెబుతూంటే వినేవాళ్ళం, ఇప్పుడు టీ.వీ.లలో చూస్తున్నాము. అంత ప్రసిధ్ధి చెందిన రధ యాత్ర చూడాలని వున్నా, ఆ జన సముద్రానికి భయపడి ఉత్సవాల సమయంలో ఆ దరి దాపులకి వెళ్ళలేదు.
అయితే అనుకోకుండా అమెరికాలో రధ యాత్రలో పాల్గొనే అవకాశం వచ్చింది. జగన్నాధ రధ యాత్ర సందర్భంగా డెట్రాయిట్ లోని ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో సాగింది ఈ రధ యాత్ర. అమెరికాలో హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ ప్రారంభించి, వ్యాప్తి చేసిన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదగారి సంస్ధ (ఇస్కాన్) ఆధ్వర్యంలో అనేక కృష్ణ ఆలయాలు వెలిశాయి. వాటినే మనం వాడుకగా ఇస్కాన్ టెంపుల్స్ అంటాము.
పెద్ద చెక్క రధం మీద బలరాముడు, కృష్ణుడు, సుభద్ర విగ్రహాలతోబాటు శ్రీ ప్రభుపాదగారి విగ్రహాన్ని కూడా ఊరేగించారు. ఆ విగ్రహాన్ని మొదట చూసినప్పుడు ఆయనే అక్కడ కూర్చున్నారనుకున్నాము. అంత సజీవంగా వుంది. రధ యాత్ర సాగుతున్నంతసేపూ రధంమీద వేంచేసివున్న శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రలకు పూజలు, హారతులు, నైవేద్యాలు జరుగుతూనే వున్నాయి. రధంముందు కృష్ణ భక్తులు ఆడవారు ఒక గ్రూపుగా మగవారు ఇంకొక గ్రూపుగా మైమరచి నాట్యం చేస్తూనే వున్నారు. కృష్ణ భజనలు సాగుతూనే వున్నాయి. అంతే కాదు .. ఈ ఉత్సవంలో వందలకొద్దీ భారతీయులేకాక, అనేక మంది విదేశీయులు కూడా అత్యంత భక్తి శ్రధ్ధలతో పాల్గొన్నారు.
మన దేశంలో అయితే మాకు రధం లాగటానికి అవకాశం వస్తుందో రాదో తెలియదుగానీ, అక్కడ మాత్రం చక్కగా ఏ తొక్కిడీ లేకుండా ప్రశాంతంగా రధం లాగాము. ఎంత అదృష్టమో అని బోలెడు సంతోషించాము!
రోజు మొత్తం సాగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చక్కని ఏర్పాట్లు చేశారు. అందరికీ ప్రసాదాలు, మంచినీటి బాటిల్స్, మధ్యాహ్న భోజనాలు, ఇవే కాకుండా, రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
ఇది వరకు నేను విదేశాల్లో మనవారు మన పండగలు మిస్ అవుతున్నారని బాధ పడేదాన్ని. కానీ ఇప్పుడు మేము ఇండియాలో ఎప్పుడూ పాల్గొనని జగన్నాధ రధయాత్రలో అమెరికాలో పాల్గొన్నామనుకుంటుంటే కొంత ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా వుంది. మేమే కాదు మాలాంటి ఎందరో కనిపించారు అక్కడ. రంగు రంగుల పట్టు చీరలలో, సాంప్రదాయ దుస్తుల్లో. బహుశా ఇలాంటి ఉత్సవాలు ఇంకా చాలా చోట్ల జరిగి వుండవచ్చు, జరగాలి కూడా అనుకున్నాము.
మొత్తానికి జగన్నాధ రధ యాత్రలో పాల్గొనే అవకాశం మన దేశంలోకాకపోయినా, అమెరికాలోనైనా వచ్చినందుకు సంతోషించాము.