మాట్లాడేటప్పుడు ఊతగా... అంటే...ఆసరాకోసం మాట్లాడతారో - లేక...అలంకారం అనుకుంటారోగాని కొందరు అస్తమానం ' ఊతపదాల' ను వాడుతుంటారు. అది వాళ్ళ అలవాట్లలో ఒకటై ఉంటుంది . వినేవాళ్ళకి తమాషాగానూ, సరదాగానూ అన్పిస్తుంది. రెండు -మూడు పంక్తుల మాటలు పూర్తిఅయేలోగా....ఒకటి,రెండు సార్లైనా " అదన్నమాట" అనే మాట చేరుస్తుంటారు. ఏదైనా అవసరమై - మన సహాయం అడగబోతూ " మీకు పుణ్యం ఉంటుంది" అని... అంటూఉంటారు.
అంత సులభంగా మనకి 'పుణ్యం' ఆపాదించేస్తూంటారు. మనం మాములుగా మాట్లాడుతున్నాసరే...వాళ్ళు వినటంలేదనుకుంటామేమోనని అకారణంగా - ఆశ్చర్యపోతూ "ఔనా...? నిజమేనంటారా...?అంటూంతారు మరికొందరు! " ఔనా...నిజంగానేనా?" అనే మాటని "నువ్వు నిజంగానే చెప్తున్నావా...? అబద్ధం చెప్తున్నావా...?" అనే అభిప్రాయంతో వాళ్ళామాటలు అనరు పాపం! అది వాళ్ళ 'ఊతపదం'...అంతే! ఆలోచిస్తే -అసలు మనమాటలు నిజంగా వింటున్నారా?... వినకుందానే ఏదో ఒకటి(వింటున్నట్లు) మాట్లాడేస్తారో అన్పిస్తుంది ఈ " ఊతపదాలు" వాడేవాళ్లని చూస్తే! మనం వాళ్ళతోమాట్లాడినదానికీ - ప్రతిగా వాళ్ళు అంటున్న 'ఊతపదాలకీ' అసలు సంబంధమే ఉండదు ఒక్కొక్కసారి. కొందరు ప్రతీమాటకీ ' బా..గా..నే ఉంది' అనీ - 'సంతోషం' అనీ అనేస్తుంటారు. ఏదైనా మంచిసంగతి చెప్పినప్పుడు ఆ పదాలు...బాగానే ఉంటాయి! కాని... ఒక్కో సారి ఎదుటిమనిషి తనకు జరిగిన 'కీడు - బాధ -దుఃఖం' లను చెప్పుకుంటూ ఉంటే " బాగానే ఉంది - సంతోషం" అంటూ అతిమాములుగా అనేస్తుంటే...ఆ చెప్పుకునే ఎదుటి మనిషి కి ఎలా ఉంటుంది??ఇంతలో తాము మాట్లాడిన 'ఊతపదం' గుర్తొచ్చి...నాలుకకరుచుకుని...తడబడి సర్దుకుని ' ఏమనుకోకండి సుమా!' అంటారు .
ఎదుటి మనిషి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా...తామే మాట్లాడేస్తూ ఉంటారు కొందరు. మనంకూడా మాట్లాడేయటం మొదలేట్టే శామేమోనని ... దానికి జవాబు చెప్పాలనుకుంటారో - ఏమో... దానికి జవాబులాగ - మధ్యలో కొంచెం ఆగి " మహ బాగాచెప్పారు" అనేసి వాళ్ళ ధోరణిలో మాటలు పొడిగించుకుంటూ పోతారు. మరి...మనం మహబాగా ఏంచెప్పామో మనకి అర్ధం కాదు! ఏ కారణంగానైనా వాళ్ళు మాటలాపితే...మనం మాట్లాడదామని ప్రారంభించేలోగానే " ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే" అనిగాని, "చెప్పకపోవటమేం?" అనిగాని కోనసాగిస్తుంటారు. మా స్నేహితురాలొకామె అస్తమానం " ఆసి నీఇల్లు బంగారంగానూ" అంటూ ఉంటుంది... నేను "నీదీవన నిజమైతే - ఆ బంగారపు ఇంట్లో ఒక పెద్ద కిటికీ పీకించి నీకిస్తాన్లే"అంటూఉంటాను! కొన్ని ఊతపదాలు మరీ మోటుగా ఉంటాయి. " ఓరి నీమొహం ఈడ్చా!" అనీ, నీమొహం మండా!" అనీ, నీ దుంపతెగా! అనేవి చిరాకు తెప్పిస్తే...నీ కడుపుడకా! ఆనీ, నీ శార్ధంపెట్టా! అనేవి చాలా కోపమూ తెప్పిస్తాయిగదా మరి? మనం ఎవరినైనా చూడటానికి వెళ్లి, వాళ్ళతో సమానంగా క్రింద కుచున్నామనుకోండి " ఆసి నీ మొహమాటం నాశనంగానూ...కింద కూచున్నావేమిటే... కుర్చీతెస్తానుండు" అంటారెంతో ఆప్యాయంగా!! ఆ ఆప్యాయం వరదలై పారే మాటలమధ్యలో " మచ్చల్లాంటి" ఊతపదాల్లో ఉన్న తిట్లు వాళ్ళ దృష్టికే రావు! మా దూరపు బంధువు ఒకాయన ఉండేవాడు.
ఆయన మరీ ఘోరమనిపించే ఊతపదాలు వాడుతుండేవాడు. ఆయన వస్తున్నాడంటే...అందరూ చిరాకు పడిపోయేవారు. ఆయన " నీ పిండం పిల్లులకెట్టా!" అనేవాడు....ఆయన దుర్మార్గుడు కాడు. కాని ఆయనకి ఆశ్చర్యంవేసినప్పుడు...అవతలవాళ్ళని ముచ్చటగా మెచ్చుకునే పధ్ధతి అది! అంతే...! "నీ ఇల్లు వల్లకాదు గానూ...చెప్పింది చెయ్యవయ్యా!!" అనేసేవాడు గబుక్కున. " నీ ఇల్లు బంగారంగాను " అనే ఊతపదాన్ని సర్డుకున్నట్లు - ఈ" నీ ఇల్లు వల్లకాడుగాను" అనే ఊతపదాన్ని సర్దుకోలేంగదా? ఎంత ఆయన తత్త్వం మనకు తెలిసినా మనస్సు చివుక్కుమనక మానదు. ఈ ఘోర ఊతపదాలు ఏ చెడుఅభిప్రాయంతోనో, కక్షతోనో అనరు వాళ్ళు1 ఊరికే...సాధారణంగా...అలవాటుగా అనేస్తారంతే! " నీ ఇల్లు చల్లగుండా...! అంటూంతారు కొందరు. ఈ ఊతపదం - చూడండి! మనసుకి ఎంత హాయిగా ఉంటుందో!! ఈ చెడు ఊతపదాలవల్లనే - ఎంతెంతటి స్నేహాలూ విచ్ఛిన్నమైపోవటానికి కారణం ఐనా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఈ ఊతపదాల్లో సామాన్యమైనవి, మంచివి...పర్వాలేదుగాని...చెడు అర్దాలోచ్చేవి, మనస్సుని కష్టపెట్టి - బాధించేవీ ఐతే - గట్టి ప్రయత్నం చేసైనా మాన్పుకోవటం ఉత్తమోత్తమం! ఎదుటి వ్యక్తి మనస్సు వ్యధ చెందుతుందని గ్రహించి,మన తప్పుని మనమే సరిదిద్దుకోవటం, అందరియందు మృదువుగా వ్యవహరించటం ఉభయత్రా శ్రేయస్కరం!