మన దేశంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు, అదీ అధికార పార్టికి వ్యతిరేకంగా కానంతవరకూ, . ఆ విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసికుంటే చాలు.. అయినా ప్రజాస్వామ్యమనే చెప్పుకోవాలి. మిగిలిన కొన్ని దేశాలకంటే , మంచిదేగా. ఒకానొకప్పుడు, రాజకీయ నాయకులు మరీ ఇంత అధ్వాన్నంగా ఉండేవారు కాదు. సంవత్సరాల తరబడి, ఏదో ఒక్క పార్టీలోనే ఉండేవారు. ఆరోజుల్లో, కేంద్రం కానీయండి, రాష్ట్రం కానీయండి, మంత్రివర్గ సభ్యులవనీయండి, ఏదో రాష్ట్ర గవర్నరనండి, వారి పేర్లు అందరికీ గుర్తుండేవి, కానీ ఈరోజుల్లో ఎవడే పార్టీయో ఛస్తే తెలియదు. ఫలానా పార్టీ టిక్కెట్టు మీద గెలవడం, మన్నాడో మూడోనాడో అధికార పార్టీలోకి జంపవడం.నైతిక విలువలన్నవి అటకెక్కించేశారు. అలాటప్పుడు, తమ పిల్లలు మాత్రం సన్మార్గంలో ఎలా వెళ్తారూ?” జైసా బాప్ వైసా బేటా “ గా మారిపోయింది వాతావరణం.ఇంక వాళ్ళ పేర్లెక్కడ గుర్తుంటాయీ?
ఆ రోజుల్లో సాంఘిక శాస్త్ర పరీక్షల్లో “ బిట్” పేపరనేది ఒకటుండేది, 30 మార్కులకి, అయినా ఓ నాలుగు పేజీలుండేది. సాధారణంగా, ప్రతీరోజూ వార్తాపత్రిక చదివే అలవాటో, లేదా రేడియోలో వార్తలు వినే అలవాటో ఉన్నవారెవరైనా సరే, చులాగ్గా గట్టెక్కేసేవారు.. మరీ 30 కి 30 కాకపోయినా ఓ పాతిక మార్కులైనా తెచ్చుకునేవారు. అందుకేనేమో, ఆరోజుల్లో ప్రతీరోజూ వార్తాపత్రిక చదవడం అలవాటు చేసేవారు. ఇవేకాకుండా, మిగిలిన విషయాలమీద కూడా అవగాహన ఉండేది. అందుకనేఏమో, ఎప్పుడూ స్కూలుకీ, కాలేజీకి వెళ్ళకపోయినా, మన “ అమ్మ “ లకి, ఎన్నో విషయాలు తెలిసేవి. వారికి తెలిసినంత మేరకు, పిల్లలకి కూడా బోధించేవారు. అలాగే పుస్తక పఠనం. రామాయణ, మహాభారత గ్రంధాలూ, ఓ వ్యాసపీఠమూ లేని ఇల్లుండేదికాదంటే ఆశ్చర్యం లేదు.. చుట్టుపక్కల ఉండే, స్త్రీలు కూడా వచ్చి చదివించి, వినేవారు. ఇవికాకుండా, దేవాలయాల్లో హరికథలూ, పురాణ శ్రవణాలు సరే సరి.కాలక్రమేణా, ఆనాటి రోజులు కనుమరుగై, నవ తరం వచ్చింది. టెక్నాలజీకూడా అభివృధ్ధి చెందింది. రేడియోల స్తానంలో టీవీ లూ, టెలిఫోన్ల స్తానంలో Smart Phones వచ్చాయి. ఇంక అప్పటిదాకా పత్రికలూ, పుస్తకాలూ చదివే ఆనాటివారు కూడా, addict అయిపోయారు. ఏమైనా అంటే, “ కాలంతో పాటు మనమూ ముందుకెళ్ళాలి కదండీ “ అని సమర్ధింపోటీ.. అలాగని అంతర్జాలంలో ఉపయోగకరమైనవి లేవా అంటే, అదీ కాదూ. మనసే ఉండాలి కానీ, internet లో కూడా, ఎన్నో ఎన్నెన్నో , మనం పుట్టకపూర్వం ప్రచురించిన పుస్తకాలని digitalise చేసి పెట్టారు. కానీ చదవాలని ఆసక్తి కూడా ఉండాలిగా. ఎప్పుడు చూసినా, టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్ళతోనే కాలక్షేపం. ఓ క్రికెట్ మాచ్ వచ్చిందంటే తిండీ, నిద్రామానేయడం.. మిగిలిన ప్రాపంచిక విషయాలను గురించి పట్టించుకోపోవడం. పుస్తక పఠనం మరీ తగ్గిపోయిందనీ కాదు—అవేవో e books వచ్చేశాయి. అదేదో kindle లో చూసి చదవడం. తప్పని కాదూ, కానీ అచ్చయిన పుస్తకం చేతిలో పెట్టుకుని, వరండాలో పడక్కుర్చీ వేసికుని చదివే ఆనందం ఇక్కడుండదుగా. ఒకానొకప్పుడు ఓ కొత్త పుస్తకం తెరిచామంటే, అదో విధమైన సువాసన వచ్చేది. కానీ ఈ e books లో, అలాటివేమీ ఆస్వాదించలేముగా, ఈరోజుల్లో వచ్చే హైబ్రిడ్ కూరలూ, పళ్ళూ లాగ.
ఆ రోజుల్లో , వాతావరణం మరీ ఇప్పుడున్నంత కలుషితం అవలేదు. ఎవరికివ్వాల్సిన గౌరవం వారికిచ్చేవారు. పాత పుస్తకాలు చదివినప్పుడు తెలుస్తుంది, ఆరోజుల్లో సామాజిక వాతావరణమూ, పర్యావరణమూ ఎంత బాగుండేదో. కానీ దురదృష్టమేమంటే, అసలు వాటి ప్రసక్తే రానీయడంలేదు.. అసలు పుస్తకపఠనమనేది ఉంటేకదా విషయాలు తెలిసేదీ? బట్టీపట్టేసి పరీక్షల్లో రాసేసి , మార్కులు తెచ్చికోడమే పరమావధిగా ఉంది. విషయం కూలంకషంగా తెలిసికోవాలనే ఆసక్తే ఉండడం లేదు. ఆ క్షణానికి పనైపోతే చాలనే భావనే కనిపిస్తుంది చాలామందిలో. ఉదాహరణకి ఏదైనా వస్తువు కొన్నప్పుడు, దాని నాణ్యత విషయం కంటే, After sale Service ఉందా లేదా అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యతన్నమాట. ఈరోజుల్లో అన్నీ instant కదా. పాడైపోతే మార్చేయడం. చివరకి పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే, వందలూ, వేలూ పోసి ఏ పర్సో, ఇంకోటో జిప్పున్నది కొని, ఆ జిప్పేదో పనిచేయడం మానేస్తే, అవతలైనా పారేస్తారు కానీ, ఒక్క 5 రూపాయలిచ్చి, ఏ చెప్పులు కుట్టేవాడిదగ్గరో బాగుచేయించొచ్చని అనుకోరు. ఏ విషయం తీసికున్నా ఇదే పరిస్థితి….
సర్వే జనా సుఖినోభవంతూ….