వీక్షణం - పి. యస్. యమ్. లక్ష్మి

 

ఫోర్డ్ మ్యూజియమ్ 

అమెరికాలో మ్యూజియమ్స్ కూడా అతి విశాల ఆవరణలో, చాలా పెద్దవి వున్నాయి.  వీటిలో మేము కొన్ని చూడగలిగాము.


ఫోర్డ్ మ్యూజియమ్, డీర్ బన్

ఇది అమెరికాలో అతి పెద్ద ఇండోర్ మరియు అవుట్ డోర్ మ్యూజియమ్ కాంప్లెక్స్.  ఆటోమొబైల్స్ ఇండస్ట్రియలిస్ట్ హెన్రీ ఫోర్డ్ తమ చరిత్రని, సంస్కృతిని భావి తరాలకి అందించాలనే ఉద్దేశ్యంతో చేసిన కృషికి ఫలితమే ఈ మ్యూజియమ్.  12 ఎకరాల స్ధలంలో వున్న ఈ మ్యూజియంలో అనేక రకాల పురాతన యంత్రాలు, టర్బైన్లు, 1601 నాటి రైల్ ఇంజన్, రైట్ బ్రదర్స్ ఎగరవేసిన విమానం, మొదటి ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్, అబ్రహాం లింకన్ ని కాల్చినప్పుడు ఆయన కూర్చున్న రాకింగ్ ఛైర్, వ్యవసాయ పనిముట్లు, ఆటోమొబైల్స్ ఇలా అనేక రకాల వస్తువులు ప్రదర్శింపబడుతున్నాయి.

 


దీనికి అనుసంధానించి గ్రీన్ ఫీల్డ్ విలేజ్, ఫోర్డ్ ఫేక్టరీ విజిట్ వున్నాయి.  వీటికి వాళ్ళ బస్ లలోనే తీసుకు వెళ్ళి తీసుకు వస్తారు.  మొత్తం 240 ఎకరాల స్ధలంలో వున్న ఈ విలేజ్ లో కేవలం 90 ఎకరాలు మాత్రమే ప్రదర్శన కోసం వాడగా, మిగతా స్ధలం చెట్లు, నది, అక్కడి జంతువులకు మేత కోసం వదిలేశారు.

అమెరికా చరిత్రలో ప్రాధాన్యతను సంతరించుకున్న భవనాలు అనేకం వున్నాయి.  అందరూ అన్ని చోట్లకీ వెళ్ళి వాటినన్నింటినీ చూడలేరు.  అందుకే, గ్రీన్ ఫీల్డ్ విలేజ్ లో దాదాపు వంద చారిత్రక ప్రాధాన్యత వున్న భవనాలని కొని, అవి వున్న ప్రదేశాలనుంచి తీసుకు వచ్చి ఇక్కడ యధాతధంగా పునర్నిర్మించారు.  వాటిలో రైట్ బ్రదర్స్ బైసికల్ షాప్, ఇల్లు, హెన్రీ ఫోర్డ్ జన్మ స్ధలం, గేరేజ్, వగైరాలు అనేకం వున్నాయి.

ఇక్కడ గ్లాస్ తో రక రకాల వస్తువులు, పువ్వులు తయారు చెయ్యటం ప్రదర్శిస్తున్నారు.  పురాతన కాలంలో వారు వేసుకున్న డ్రెస్ లు, వాడిన వాహనాలు ప్రదర్శిస్తూ కొందరు తిరుగుతున్నారు.  ఇన్ని ఎకరాలు మనం తిరగలేము కదండీ.  అందుకే రైలు కూడా వున్నది. ఇంచక్కా దానిలో ఎక్కి ఒక రౌండ్ వేసి రావచ్చు.  ఓపిక వుంటే మధ్యలో దిగి చూడదల్చుకున్నవి చూడచ్చు.

ఫోర్డ్ ఫేక్టరీ

దీనికి కూడా వాళ్ళ బస్ లో తీసుకెళ్ళి తీసుకొస్తారు.  వీటన్నింటికీ ఎంట్రీ ఫీజులు వున్నా, ఈ బస్ రైడ్స్ ఉచితమే.  ఫేక్టరీలో కార్ల తయారీలో కొంత భాగం చూపిస్తారు.  అంతేకాదు, అక్కడ వున్న ధియేటర్ లో వాటి తయారీ, టెస్టింగ్ వగైరా విషయాల గురించి 3D ఫిల్మ్ చూపిస్తారు. మొత్తానికి ఇవ్వన్నీ ఆసక్తిగా చూడటానికి ఒక రోజు సరిపోదు.

వీటన్నింటికీ ప్రవేశ రుసుము వుంటుంది.  మ్యూజియమ్, ఫేక్టరీ, విలేజ్ లకి వేరు వేరుగా టికెట్లు వున్నా, అన్నీ కలిపి కొనుక్కుంటే కొంత రాయితీ వుంటుంది.  అంతే కాదు, అమెరికాలో ఎక్కడ టికెట్లు కొనాల్సి వచ్చినా వారిచ్చే రాయితీల గురించి ముందు కనుక్కోండి.  పిల్లలకే కాదు సీనియర్ సిటిజన్లకి (వేరే దేశాలనుంచి వెళ్ళినా) రాయితీలు వుంటాయి.  

మ్యూజియమ్ వగైరాలకి ఏడాదిలో రెండు రోజులు మాత్రమే సెలవ వుంటుంది.  ధేంక్స్ గివింగ్ డే మరియు క్రిస్ మస్ డే.  మిగతా అన్ని రోజుల్లో ఉదయం 9-30 నుంచి సాయంత్రం 5 గం. ల దాకా సందర్శకులను అనుమతిస్తారు. 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి