ఈ సంచిక నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని పర్యాటక స్థలాల గురించి తెలుసుకుందాం . ఈ రాష్ట్రం విహారయాత్రలకు , తీర్థయాత్రలకు కూడా ప్రసిధ్ది చెందింది .
భారత దేశంలో ఉత్తరాన హిమాలయాలకు దగ్గరగా వున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి . పేరులోనే హిమాలయా పర్వతాలను కలిగివున్న రాష్ట్రం , హిమాలయాలకు దగ్గరగా వుండడం తో వాతావరణం అహ్లాదకరంగా వుండి , యెత్తైన పర్వతాలు , లోతైనలోయలు , పైను , దేవదారు , ఓక్ వృక్షాలతో కూడిన దట్టమైన అడవులతో వుండే అందమైన రాష్ట్రం .
ముందుగా మనం ఈ రాష్ట్ర రాజధాని ' సిమ్లా ' ని సందర్శిద్దాం .
మేము ఢిల్లీ లో వుండేవాళ్లం . అందుకని ఢిల్లీ నుంచి వెళ్లేం . ఢిల్లీకి సుమారు 360 కిలో మీటర్లు , మేం కారులో వెళ్లేం , ఢిల్లీ నుంచి ఛండీ గఢ్ వరకు ప్రయాణం విశాలమైన NH--1 మీద సోనీపథ్ , కురుక్షేత్ర , అంబాలా మీదుగా సుమారు 240 కిలో మీటర్లు ప్రయాణం చేసి ఛండీగఢ్ చేరుకున్నాం . ఛండీ గఢ్ లో ఒకరోజు వుండి చుట్టుపక్కల వుండే ప్రదేశాలు చూసేం , కాని వాటిని గురించి యిక్కడ ప్రస్తావించడం లేదు . ఈ సంచికలో హిమాచల్ ప్రదేశ్ లోని ప్రదేశాల గురించి మాత్రమే ప్రస్తావించ దలచు కున్నాను . సిమ్లా నుంచి ఓ క్రమంలో యిక్కడ ప్రదేశాలను పరిచయం చేస్తాను .
ఛండీగఢ్ వరకు మైదానాలలో సాగిన మా ప్రయాణం ఛండీగఢ్ తరువాత కొండలమీద సాగింది . యెత్తైన కొండలు , కనుచూపుమేర వరకు పరుచుకున్న పచ్చని నేల , స్వఛ్చమైన నీటితో గలగల మని ప్రవహిస్తున్న సెలయేళ్లు అహ్లాదకరంగా మారిన వాతావరణం లో ప్రయాణం సాగుతుంది . సిమ్లా దారిలో వచ్చే ఓ మోస్తరు పట్టణం ' మండి ' .
ఈ నగరానికి యిక్కడ వున్న శ్యామలాదేవి అమ్మవారి పేరు మీదన ' సిమ్లా ' అనే పేరు వచ్చింది .
1806 లో నేపాలీ రాజైన భీమసేన్ థాపా సిమ్లా ప్రాంతంపై ఆధిపత్యం సాధించేడు . 1817 లో ఆంగ్లో - నేపాలీ యుధ్దానంతరము చేసుకున్న వప్పందం ప్రకారం ఈ ప్రదేశం బ్రిటిష్ వారి చేతులలోకి వెళ్లింది . ఈ అడవులలో అక్కడక్కడ కొండజాతీయులు నివసిస్తూ వుండేవారు . కలకత్తాని రాజధానిగా చేసుకున్న బ్రిటిష్ వారు సిమ్లాని వేసవి విడిదిగా చేసుకొని పెద్ద అధికారులు శలవులు సిమ్లా లో గడపసాగేరు . 1830 లో చుట్టుపక్కల నివసిస్తున్న స్థానికులనుంచి భూములు కొనుక్కొని సుమారు 30 యిళ్లు నిర్మించు కున్నారు . రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందాన అధికారుల రాకపోకలు గాను విశాల మైన రోడ్ల నిర్మాణం జరిగింది . అప్పట్లోనే ఉన్నత ప్రమాణాలు కలిగిన విధ్యాసంస్థలు నిర్మించబడ్డాయి . బ్రిటిష్ రాజ్ లోని ఉన్నతాధికారుల పిల్లలు , సంస్థానాధీశుల పిల్లలు వీటిలో విధ్యనభ్యసించసాగేరు . భారత్- టిబెట్ కి సిమ్లా మీదుగా 1851 - 52 లలో 560 అడుగుల సొరంగ మార్గంతో రోడ్డు నిర్మాణం చేపట్ట బడింది . దీనిని యిప్పుడు ' ధల్లి ' సొరంగం గా పిలువబడుతోంది . 1860 లలో అప్పటి వైస్రాయి ' జాన్ లారెన్స్ ' సిమ్లాని వేసవి రాజధానిగా ప్రకటించేడు . అప్పటి నుంచి సంత్సరానికి రెండుసార్లు కలకత్తా నుంచి సిమ్లా కి , సిమ్లానుంచి కలకత్తా కి రాజధానిని మారుస్తూ పరిపాలన సాగించసాగేరు . ఆ సమయంలోనే అధికారుల మనోరంజనార్దం థియేటర్లు , బారులు , క్లబ్ ల నిర్మాణం జరిగింది . వైజ్ రీగల్ లాడ్జ్ నిర్మాణం కూడా అప్పుడే జరిగింది .
సిమ్లా అడవులలో అగ్నిప్రమాదం వల్ల ఆయా ప్రాంతాలలో నివసించే స్థానికులు సిమ్లా నగరంలో నివసించ సాగేరు , ఈ ప్రాంతాన్ని అప్పర్ బజారు అని అంటారు . 1905 లో లోవర్ బజార్ , 120 అడుగుల ' ఎలిసియమ్ సొరంగం నిర్మింప బడ్డాయి . 1906 లో కాల్కా సిమ్లా నేరోగేజ్ రైల్వే లైన్లు నిర్మాణం జరిగింది . ఇంజనీర్ల అద్భుతానికి ప్రతీకగా 806 వంతెనలు , 103 సొరంగాలతో నిర్మింపబడ్డ ఈ రైల్వేను ' బ్రిటిష్ జ్యూయల్ ఆఫ్ ద ఓరియంట్ ' గా ప్రసిధ్ది పొందింది . 2008 లో UNESCO వారి ద్వారా దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడింది . 1970 వరకు విభజన జరగని పంజాబు కి ముఖ్యపట్టణం గా వుండేది . హిమాచల ప్రదేశ్ రాష్ట్రావతరణ జరిగేక హిమాచల్ ప్రదేశ్ కి ముఖ్యపట్టణం గా చేయబడింది . కాల్కా నుంచి సిమ్లా ట్రైను యాత్ర చాలా నెమ్మదిగా సాగుతుంది కాని యెంతో ఆహ్లాదంగా వుంటుంది . రానూపోనూ ట్రైనులో వెళ్లడానికి సమయం లేకపోతే ఒకవైపన్నా ప్రయాణం చెయ్యమని నా సలహా . ఆ అనుభవం అనుభవించి తీరాలి .
బ్రిటిష్ కాలం నుంచి కూడా సిమ్లా పర్యాటకులకు యిష్టమైన వేసవి విడిదిగా పేరు పొందింది . ఎండాకాలంలో వేసవి తాపం నుంచి తెప్పించు కొనేందుకు , శీతాకాలంలో స్నోఫాల్ చూడడానికి వచ్చే పర్యాటకులతో యేడాది పొడవునా కళకళ లాడుతూ వుంటుంది . సిమ్లా పట్టణం లో చూడ్డానికి పెద్దగా యేమో లేదు . ప్రకృతి సౌందర్యం తప్ప . సాధారణంగా డిసెంబరు ఆఖరివారం లో గాని జనవరి మొదటి వారం లో గాని వాతావరణం బాగుంటే స్నోఫాల్ అవుతుంది . ఆకాశం నుంచి పడే మంచు తునకలు పలుచని దూది పింజలు రాలుతున్నట్లుగా వుండి అహ్లాదాన్ని కలిగిస్తాయి .
ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ---
సిమ్లా పట్టణం లో మాల్ రోడ్డు , నేచురల్ ఐస్ స్కేటింగ్ రింక్ , కుఫ్రీ , నారకండ .
మాల్ రోడ్డు ----
ఉత్తర భారతదేశంలో వున్న ప్రతీ వేసవి విడిది లోనూ ఓ మాల్ రోడ్డు వుంటుంది . తెలుగులో మనం బజారు వీధి అని అనుకోవచ్చు . ఇక్కడ స్థానిక ఉత్పాదనలతో పాటు స్థానికుల అవసరాలకు కావలసిన వస్తువులు దొరికే స్థలం . ఇక్కడ స్థానిక కళాత్మక చేతి తయారీలు అమ్మకానికి వుంటాయి . సిమ్లా గోనె పట్టామీద ధారాలతో చేసిన వాల్ హేంగింగ్స్ కి ప్రసిధ్ది .
నేచురల్ ఐస్ స్కేటింగ్ రింక్ --
సిమ్లా ' నేచురల్ ఐస్ స్కేటింగ్ రింక్ ' కి దేశ విదేశాలలో ప్రసిద్ది పొందింది . ఇది యిక్కడ వున్న పెద్ద సరస్సు గడ్డకట్టడం వల్ల యేర్పడ్డ స్కేటింగ్ రింక్ . ఇక్కడ దేశ , దేశాంతర స్కేటింగ్ పోటీలు నిర్వహించబడుతూ వుండేవి . కాని ఈ మధ్యకాలంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సరస్సు స్కేటింగ్ చెయ్యడానికి కావలసినంత గడ్డకట్టడం మానేయడంతో స్కేటింగ్ పోటీలు జరగటంలేదు .
మళ్లావారం యాపిల్ తోటలను , మిగతా ప్రదేశాలను దర్శించుకుందాం అంతవరకు శలవు .