కెన్సింగ్టన్ పార్కు, మిచిగన్
31-05-2009 ఆదివారం..మధ్యాహ్నం 2 గం.లకి బయల్దేరి 2240 వెస్ట్ బునో రోడ్, మిల్ఫోర్డు, మిచిగన్ లో వున్న కెన్సింగ్టన్ పార్కుకు వెళ్ళాం. పార్క్ అంటే మన కాలనీలలోంటివి కాదండీ. సకల సౌకర్యాలతో అలరారే విహార స్ధలాలు. సర్వం మరచిపోయి అందరూ కలిసి ఆనందంగా సెలవు రోజులు గడిపే ఆనంద ధామాలు. ఇవ్వన్నీ చాలా పెద్దవే వుంటాయి.
కెన్సింగ్టన్ పార్కు 4,481 ఎకరాల విస్తీర్ణతతో, కెంట్ లేక్ చుట్టూ పరుచుకునివున్నది. ఈ పార్కులో సందర్శకుల ఆహ్లాదంకోసం అనేక రకాల హంగులు వున్నాయి. పిక్నిక్ ఏరియాలు, బీచ్, గోల్ఫ్ కోర్సులు, నేచర్ సెంటర్, అన్నింటికన్నా ఎక్కువగా అందర్నీ ఆకర్షించే బోటింగ్ సౌకర్యాలు, వగైరాలు ఎన్నో వున్నాయి. ఇక్కడ పార్కుల్లోనేకాదు, అనేక చోట్ల సైక్లింగ్ చేసేవాళ్ళకి ప్రత్యేక స్ధలం వుంటుంది. అందుకే చాలామంది కార్లపైన, వెనకాల సైకిళ్ళు కూడా తీసుకు వెళ్తారు. వీటన్నింటితోబాటు వేసవికాలంలో ఫిషింగ్ ఎంజాయ్ చెయ్యచ్చు. అలాగే చలికాలంలో స్కీయింగ్, స్నో ట్యూబింగ్ వగైరాలు.
ఇంక బోట్ షైరుకొస్తే పెడల్ బోట్స్ (నలుగురికి), కయాక్స్ (సన్నగా పొడుగ్గా వుంటాయి..ఒకరు కూర్చుని తెడ్లతో నడుపుతారు. ఇందులో ఇద్దరు నడిపేవికూడా వుంటాయి)..రో బోట్స్ వుంటాయి. ఇవి కాకుండా 37 మందిని ఎక్కించుకుని గంటకోసారి బోట్ షైరు చేయించే ఐలెండ్ క్వీన్-II కూడా వుంది. వీటికి రేట్లు కూడా రకరకాలుగా వుంటాయి. సెలవురోజులు కాకపోతే సీనియర్స్ కి, పిల్లలకి కన్సెషన్స్ వుంటాయి. అంతే కాదు, పార్కులకి ఎక్కువగా వెళ్ళేవాళ్ళకి ఒకే సారి టికెట్ తీసుకుంటే ఏ స్టేట్ పార్కుకయినా నిర్ణీత సమయంలో ఎన్నిసార్లన్నా వెళ్ళటానికీ, పార్కింగ్ వగైరాలలో కూడా కన్సెషన్స్ వున్నట్లున్నాయి. అక్కడివారు కనుక్కోవచ్చు.
అమెరికాలో ఇలాంటి చోట్ల ఫుడ్ కీ, వాష్ రూమ్స్ కీ ఏ విధమైన ఇబ్బందీ పడక్కరలేదు. ఇంకో విశేషమేమిటంటే అక్కడెక్కడా .. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ ఎలౌడ్ .. అనే బోర్డులు కనబడవు. కాబట్టి కావాలంటే కొనుక్కు తినండి, లేకపోతే తీసుకెళ్ళి తినండి. ఏ ఇబ్బందీ లేదు.
మేము నలుగురు ఎక్కే పెడల్ బోట్ తీసుకున్నాము. గంటకి $ 10 అద్దె. రెండు గంటలసేపు కెంట్ సరస్సులో ఆ బోట్ లో తిరిగాం. ఇండియాలో అలవాటు లేకపోయినా, ఇక్కడ మేమూ పెడలింగ్ చేశాం. అంత పెద్ద సరస్సులో ఏమీ అనుభవం లేని మేము, మా అంతట మేము పెడలింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ముందు గుండె గుబ గుబలాడిందిగానీ మా అబ్బాయి నామీద వేసే జోక్స్ తో, తర్వాత వాళ్ళు కొంచెం సేపు మా బోట్ చుట్టూతానే తిరుగుతూ వుండటంతో కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంట్లో కూర్చుంటే ఇలాంటి జోక్స్ వేస్తాడా, ఇంత సరదాగా గడిచేదా అనిపించింది. తర్వాత చాలా ధైర్యంగా, బాగా సరదాగా గడిపాము.
అయితే అక్కడ వుండేవాళ్లయితే వెళ్ళినప్పుడల్లా కొంత ప్రదేశం చూడవచ్చుగానీ, మాలా వెళ్ళినప్పుడే అంతా చూసేయాలనుకునేవాళ్ళు పూర్తిగా చూడలేరు.
సెలవు రోజు కావటంతో మన దేశస్ధులూ చాలామందే కనిపించారు. పార్కు టైమింగ్స్ ఉదయం 6 గం. ల నుంచి రాత్రి 10 గం. ల దాకా.