హిమగిరి సొగసులు చూద్దాం రండి ( రెండవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

 

క్రిష్టియన్ చర్చ్---

1800 లలో కట్టిన చర్చ్ యిది , ఉత్తర భారత దేశంలో వున్న రెండో పురాతనమైన చర్చ్ . రంగురంగుల అద్దాలతో నిర్మింపబడ్డ కిటికీలు తలుపులతో యెత్తుగా వుంటుంది ..



చైలీ----

మహారాజా పటియాలా బ్రిటిష్ టైములో వేసవిలో నివశించడానికి కట్టించుకున్న భవనం . దానిపక్కనే వున్న క్రికెట్టు  మైదానం ప్రపంచంలో అతి యెత్తైన క్రికెట్టు పిచ్ గా పేరుపొందింది .

జాఖూ పర్వతం ----

సిమ్లా నగరం చుట్టుపక్కల వున్న పర్వతాలలో అతి యెత్తైన పర్వతం ఈ జాఖూ పర్వతం . దీని యెత్తు సుమారు 8 వేల అడుగులు . ఈ పర్వతం పై నుంచి సిమ్లా నగర సోయగాలు చూడొచ్చు . ఈ పర్వతం పైన అతి పురాతనమైన హానుమాన్ మందిరం వుంది . 2010 లో యిక్కడ 108 అడుగుల యెత్తైన హనుమాన్ విగ్రహాన్ని 1.5 కోట్ల ఖర్చుతో నిర్మించి ప్రతిష్టించేరు . ఈ మందిరం యొక్క స్థల పురాణం గురించి యిలా చెప్తారు .

రామ రావణ యుద్ద సమయం లో మూర్ఛిల్లిన లక్షణుని కొరకై సంజీవని పర్వతం వెతుకుతూ యిక్కడ కాస్త సేపు విశ్రమించిన ప్రదేశం . అదే ప్రదేశం లో మందిరం నిర్మించేరు  . ఇక్కడ చాలా కోతులు తిరుగుతూ వుంటాయి . అవి పర్యాటకుల చేతిలో వున్న వస్తువులు లాక్కుంటూ వుంటాయి , కాబట్టి యీ మందిరానికి వెళ్లేటప్పుడు సెల్ ఫోనులు., హేండ్ బేగులు జాగ్రత్తగా చూసుకోండి . ఈ కోతులు మనదగ్గర లాక్కొన్న వస్తువలు తిండి పదార్ధాలకు బదులుగా వాపసు చెయ్యడం చాలా వింతగా అనిపించింది . చాలా యేళ్ల కిందట కోతులు కొబ్బరి ముక్కలు చెయ్యజాపి అడగడం చూసేను , యిక్కడ తిండి వస్తువలు యిస్తే మన వస్తువలు తిరిగి యివ్వడం చూసేం .

తారా దేవి మందిరం --

సిమ్లా కి సుమారు 11 కిలో మీటర్ల దూరంలో పర్వతం పైన వున్న మందిరం . పొడుగైన పైన్ చెట్ల మధ్య లో ప్రశాంతంగా వున్న ప్రాంతంలో నిర్మింపబడ్డ మందిరం . ఈ మందిర పరిసరాలు మనస్సుకు యెంతో ప్రశాంతతను యిస్తూ వుంటాయి . ఈ మందిరం తారా దేవి కి సమర్పించబడింది . ఈ పర్వతం పైన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ముఖ్య కార్యాలయం వుంది .

తత్త పాని ---

హిమాలయాలలో అనేక చోట్ల వున్నట్లే సిమ్లా కి 55 కిలో మీటర్ల దూరంలో కూడా వేడినీటి బుగ్గలు వున్నాయి . ఈ బుగ్గలు క్రింద పొరలలో వున్న గంధకం వల్ల వేడిగా వుంటాయని ఈ నీటికి చర్మ రోగాలను తగ్గించే గుణం వుంటుందని సైన్స్ చెప్తోంది . అంతటి చలిలో వేడి నీళ్లు భూమి పైకి పొంగుతూ రావడం సైన్స్ చదువుకున్న వారికి కూడా అద్భుతంగా అనిపిస్తుంది .

కుఫ్రీ ----

' కుఫ్ర ' అంటే స్థానిక భాషలో ' సరస్సు ' అని అర్దం . సరస్సు వున్న ప్రదేశంగా యీ ప్రాంతాన్ని గుర్తించడం వల్ల , సరస్సు చుట్టూ పెరిగిన పల్లెని కుఫ్రీ అనిపిలవసాగేరు . ఈ ప్రాంతాలలో వున్న సరస్సులలో యిదే యెత్తైన ప్రదేశం లో వున్నట్లుగా చెప్తారు . కుఫ్రీ ప్రాంతం సంవత్సరంలో యెక్కువ కాలం హిమపాతం జరిగే ప్రదేశం కూడా . హిమపాతం జరిగిన తరువాత బంగాళాదుంప ల పొలాలు స్కీయింగు మైదానాలుగా మారిపోతాయి .   . ఇక్కడ వున్న ' హిమాలయన్ వైల్డ్ లైఫ్ జ్యూ ' లో చలి ప్రదేశాలలో వుండే ఎలుగు బంట్లు , , దుప్పి , కొన్ని రకాలయిన పక్షులతో పాటు హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి అయిన ' మోనల్ ' ని చూడొచ్చు . రంగురంగుల యీకలతో ముద్దుగా వుంటుంది .

నారకండ ----

సిమ్లా - టిబెట్ రోడ్డుమీద సిమ్లాకి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో వుంది . సిమ్లా రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్నిచ్చే " ఆపిల్ "  తోటలు కల రాంపూర్ వెళ్లే దారి లో వుంది. . శీతాకాలంలో యిక్కడ జరిగే స్కీయింగ్ కోసం దేశ విదేశాలనుంచి పర్యాటకులు రావడం తో శీతాకాలంలో యీ ప్రదేశం రద్దీగా వుంటుంది . 70 లలో వచ్చిన చాలా బాలీవుడ్ సినిమాలలో చాలా పాటల చిత్రీకరణ యిక్కడ జరిగింది . డిసెంబరు నుంచి మార్చి వరకు యీ ప్రదేశం స్కీయింగుకి అనుకూలంగా వుంటుంది . హిమాచల్ ప్రదేశ్ లో యెక్కువ హిమపాతం జరిగే ప్రదేశం యిది . చుట్టుపక్కల వున్న కొండలు స్కీయింగుకి కావలసిన వాలుని యివ్వడంతో ప్రపంచం లో వున్న స్కీయింగ్ ప్రదేశాలలో వొకటిగా లెక్కింపు బడుతూ వింటర్ ఒలింపిక్  స్పోర్ట్స్ కి వేదికగా కూడా వుంటోంది . మంచుతో కప్పబడ్డ కొండవాలులు కనువిందుగా వుంటాయి . ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు యీ ప్రాంతం మామూలు కొండ ప్రాంతంగా కనిపిస్తుంది .

శ్యామలా దేవి మందిరం ---

ఈ అమ్మవారి పేరుమీదనే ఈ వూరికి సిమ్లా అనే పేరు వచ్చింది . 18వ శతాబ్దం లో బ్రిటిష్ అధికారి కి జాఖూ పర్వతం పైన విగ్రహానిం దొరికితే అతను ఆ  విగ్రహాన్ని అక్కడ నుంచి తీసుకు వచ్చి మందిరం నిర్మించేడు . ఈ మందిరం సిమ్లా నగరంలో బజారు వీధిలో వుంటుంది . ఈ మందిరాన్ని యిక్కడకు వచ్చే పర్యాటకులు దర్శించు కుంటూ వుంటారు . ముఖ్యంగా బెంగాలీ వారు . మందిరం బెంగాలులోని కాళీ మందిరాన్ని పోలి వుంటుంది . శరన్నవరాత్రులు , భోగి , సంక్రాంతి పండుగలలో అనేకమంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు .

కర్రతో చేసిన అమ్మవారి విగ్రహానికి కుంకుమ , పూలతో చేసిన అలంకరణ , మందిర పరిసరాలు యిచ్చే ప్రశాంతత అదనపు ఆకర్షణలు . కాలీ బాడి ( కాళి నివాసం ) అని కూడా వ్యవహరిస్తూ వుంటారు .

నలదెహ్రా ----

సిమ్లాకి 22 కిలోమీటర్ల దూరంలో వుంది యిక్కడ తొమ్మిది కన్నాల గోల్ఫ్ క్లబ్ వుంది . శలవులు గడపడానికి వచ్చేవారు గడిపే ప్రదేశాలలో యిది వొకటి . తక్కువ సమయంలో యెక్కవ ప్రదేశాలు చూద్దామనుకొనే మనలాంటి వారికి విసుగును కలిగిస్తాయి .
పై వారం కులు మనాలి పర్యటిద్దాం , అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి