12-07-2013 నాటి మన 14వ, సంచికలో ‘శాంతమ్మ’ అనే కథానిక చాలా బాగుంది. దీని రచయిత శ్రీ లాస్య రామకృష్ణ గారు.
కథానికలో ముఖ్యంగా నాకు నచ్చిన అంశం కథా వస్తువు.. ‘అవయవ దానం’. నేటి విజ్ఞానశాస్త్ర యుగంలో అవయవదానం అవశ్యకం. నేడు మానవులు సైతం చిరంజీవులే.. అని అవయవదానం నిరూపిస్తుంది. దానిని రచయిత పండు ముదుసలి శాంతమ్మ పాత్ర ద్వారా లోకానికి తెలియజేయడం ఔచిత్యంగా వుంది.
మరో విషయం..
అభ్యుదయభావాలు కలిగిన కథానాయకుడు శాంతమ్మను అనుమానించడం అంటే డబ్బు ఎంత మంచి మనిషినైనా నైతిక విలువలు దిగజార్చుతుందని తెలుస్తుంది.
కథానాయకుడు పట్నంలో బదులు పల్లెలో నివిసించాలని అనుకోవడం.. పల్లె వాతావరణం ఆహ్లాదకరమని.. ఆరోగ్యకరమని ప్రబోధిస్తుంది.
పుస్తక పఠనం లోని ఆనందం కథానికలో సహేతుకంగా ఉంది.
కథానాయకుని తండ్రి గారి సమకాలీన స్నేహబంధం దాని వల్ల కలిగే ప్రయోజనం ప్రత్యక్షంగా ఇప్పటి తరానికి చెప్పడం బాగుంది.
కథానికలో చివరగా మలుపు తిరిగి ఉన్నఫళంగా కనబడిన హాస్పిటల్ సన్నివేశంతో మనం ఉత్కంఠకు లోనవుతాము. మనల్ని కదలకుండా చేస్తుంది.
రోడ్డు ప్రమాదం.. దాని వాళ్ళ కలిగే జీవన్మరణ సమస్యలు.. యువత ఉలిక్కి పడేలా వుంది.
చివరగా శాంతమ్మ పేరు మీద డబ్బు ఖర్చు చేయడమనే అంశం ప్రధానమైనది. తద్వారా అవయవ దానం ప్రాశస్త్యాన్ని లోకానికి చాటి చెప్పవచ్చు.
ముగింపు చాలా బాగుంది.
ఈ కథానిక చదివినప్పుడు దీనిని ఒక నవలగా కూడా తీర్చిదిద్దవచ్చునేమోననిపించింది.
నవలకిది సంక్షిప్తరూపమా..! అనే అనుమానం మనకు కలుగక మానదు. మొత్తానికి రచయిత నవలగా రూపొందుటకు అవకాశమున్న విషయాన్ని తీసుకొని కథానిక రూపంలో అందించడం ముదావహం.
సమగ్రంగా రాయాల్సిన దానిని సంక్షిప్తంగా రాసినప్పుడు భావుకత లోపించక పోదు.. కొంత సహజత్వమూ కోల్పోతుంది. అందుకే శాంతమ్మ ప్రాణత్యాగంలో పటుత్వం లోపించేదేమోననిపించింది.
ఈ కథానికకు చిత్రకారుని చిత్రం చాలా ఆకర్షణీయం. శాంతమ్మ చిత్తరువు ఆమె వయసును చెబుతోంది. హృదయానికి హత్తుకునే అ చిత్ర రాజాన్ని చూడగానే కథానిక చివరిదాకా చదువకుండా ఉండలేము.
శైలి విషయంలో మరింత ప్రామాణికత వహిస్తే ఇంకా చదువ సొంపుగా వుండేది. అని నా అభిప్రాయం.
-చెన్నూరి సుదర్శన్
ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు
http://www.gotelugu.com/issue14/360/telugu-stories/shanthamma-telugu-story/