హిమగిరి సొగసులు చూద్దాం రండి ( మూడవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

కులు మనాలి ---1


ఢిల్లీ నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో హిమాచల్ ప్రదేశ్ లో వున్న మరో వేసవి విడిది  కులు మనాలి .

దేశ విదేశీ పర్యాటకులకు ఆకర్షిస్తున్న ఈ వేసవి విడిదిని కులు మనాలి అని సామాన్యంగా అనెస్తున్నారు కాని యివి రెండూ రెండు పట్టణాలు . కులు జిల్లా ముఖ్య పట్టణమయిన కులు కి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో వుంది మనాలి .

హిమాచల్ లో వ్యాస ( బియాస్) నది వొడ్డున వున్న లోయ లో వున్న చిన్న పట్టణం కులు . పీర్ పంజాల్ పర్వత శ్రేణులకు హిమాలయా పర్వత శ్రేణులకు మధ్య వున్న లోయ కావడంతో చుట్టూ యెత్తైన పర్వతాలు , ఒక వైపు తెల్లని మంచుతో కప్పబడ్డ హిమాలయా పర్వతాలు ఆకాశాన్నందు కుంటున్నట్టుగా వున్న  పైను దేవదారు వృక్షాలు . గలగల లాడుతూ స్వఛ్చమైన నీటితో ప్రవహిస్తున్న వ్యాస నది ప్రశాంత మైన వాతావరణం పర్యాటకులకు ఆకర్షిస్తూ వుంటుంది .

కులు లోయ గురించి పౌరాణిక కథ కూడా వుంది . ప్రతి యుగారంభ సమయంలో మనువు యుగ ప్రారంభం కావించిన ప్రదేశం కావడంతో దీనిని " కులాంత పీఠం " అని వ్యవహరించే వారు . మనువు హిందూ ధర్మ శాస్త్రాన్ని రచించిన ప్రదేశం కూడా యిదే అని అంటారు . కాలాంతరాన యీ పేరు మార్పుచెంది కుల్లు , కులు గా మారిపోయింది . కులు లోయ ని ' దేవతల లోయ ' అని కూడా అంటారు , ఇక్కడ వున్న మందిరాలు యీ మాట నిజమేనంటున్నాయి .

కులు లోయ లో జరిగే దశరా ఉత్సవాలు కన్నులపండుగగా వుంటాయి .

రెండు మూడు రోజులు కులు , మనాలి లో గడపడానికి వచ్చేవారు ముఖ్యంగా యాపిల్ తోటలు , మాల్ రోడ్డు , వ్యాస్ నది , రోతాంగ్ పాస్  హిడింబా దేవి మందిరం , మనువు మందిరం చూస్తూ వుంటారు . ఓ వారం పదిరోజులు ప్రకృతి మధ్య గడపాలను కొనే వారి కోసం ట్రెక్కింగ్ టూర్లు  నిర్వహించే ఏజెన్సీలు వున్నాయి . మన శరీర ఆరోగ్యాలు అనుమతించే మేరకు ట్రెక్కింగ్ టూర్లు యెంచు కోవచ్చు . బౌద్ధ ఆరామాలను , చుట్టుపక్కల వున్న మందిరాలను దర్శించుకుంటూ , యాపిల్ తోటలలో వాకింగ్ చేసుకుంటూ పచ్చని ప్రకృతిలో గడిపి రీఛార్జ్ అవొచ్చు . కులు లోయ లో బౌద్ధ , హిందూ మతాలు ప్రజల సంస్కృతి లో పెనవేసుకు పోయాయి అనడం అతిశయోక్తి కాదు .
ఖీర్ గంగా ట్రెక్ , తీర్థన్ లోయ ట్రెక్ లు చెప్పుకోదగ్గవి .

ఆంగ్లేయులు యిక్కడి వాతావరణం యాపిల్ పంటకు అనుకూలంగా వుండడం తో యాపిల్ తోటలు వేసి స్థానికులకు తోటల పెంపకం లో అవగాహన కలుగజేసేరు . ఇప్పుడు ఈ రాష్ట్రం యాపిల్ పంట వల్ల సుమారు మూడువేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సంపాదిస్తోంది . సిమ్లా యాపిల్ అని వ్యవహరించినా పంట మాత్రం కులు లోయ నుంచే వస్తోంది .

ముఖ్యంగా కులు లోయలో చూడదగ్గ ప్రదేశాలు " బిజిలి మహదేవ్ మందిరం , మణికర్ణ ,  షెద్రుప్లింగ్ మోనష్ట్రీ .

బిజిలీ మహదేవ మందిరం ---

కులు పట్టణానికి సుమారు 22 కిలో మీటర్ల దూరంలో వ్యాస నదీ తీరంలో మూడు కిలో మీటర్లు నడిచి ఈ మందిరం చేరుకుంటాం . సముద్ర మట్టానికి సుమారు 2460 మీటర్ల యెత్తులో పచ్చని యెత్తైన పైను చెట్ల మధ్యలో ప్రశాంత వాతావరణం లో వున్న మందిరం .ఈ మందిర శిఖరం సూటిగా సూర్యుని కిరణాలను తాకుతున్న అనుభూతిని యిస్తుంది . 60 అడుగుల ద్వజస్థంబం , గర్భగుడిలో వున్న శివలింగ దర్శనం మనస్సుకు హాయిని కలిగిస్తుంది .

ఈ కోవెల స్థల పురాణం గురించి యిక్కడి పూజారిని అడుగగా , ఈ మందిరం లో భక్తులు కోరుకొనే కోరికలను అనుగ్రహించినపుడు ఈశ్వరుడు మెరుపుల రూపంలో తెలియజేస్తాడట , అందుకే యిక్కడ ఈశ్వరునికి ' బిజిలీ మహదేవుడు ' అనే పేరు వచ్చింది . లింగానికి వెన్న పూసి మెరుపుల బారినుండి పూజారి కాపాడుతూ వుంటాడు , లేకపోతే మెరుపుల ప్రభావానికి లింగం ముక్కలైపోతుందట .

ఈ కొండ పైనుంచి చూస్తే కులు లోయ , పార్వతీ లోయల అందాలు కనువిందు చేస్తాయి .

మణికర్ణ -----

సముద్ర మట్టానికి సుమారు 1760 మీటర్ల యెత్తులో పార్వతీ నదీ తీరాన కులు పట్టణానికి సుమారు 35 కిలో మీటర్ల దూరంలో వున్నదీ ప్రదేశం . మణికర్ణ యిక్కడ వున్న వేడినీటి బుగ్గల ( హాట్ వాటర్ స్ప్రింగ్స్ ) వల్ల ప్రసిధ్ది పొందింది . ఈ నీళ్లు యెంత వేడిగా వుంటాయంటే వందగజాల దూరం నుంచి వీటి ఆవిర్లను చూడొచ్చు . దగ్గరగా వస్తే నీళ్లు సలసల మని కాగడం కనిపిస్తుంది . యెంత వేడి అంటే అందులో మూటకట్టి బియ్యం గాని పప్పు గాని వేసి వెంటనే బయటకు తీస్తే చాలు మూటలో వున్నవి బాగా ఉడికి పోతాయి . గంధకం నిల్వలు భూమిలో వుండటం వల్ల యిలాంటి వేడినీళ్ల బుగ్గలు యేర్పడతాయని మనకి తెలుసు కాని వాటికి పక్కగా ప్రవహించే నది నీటికి ఆ వేడి యెందుకు సోకదు ? , కొన్ని అడుగుల దూరం లో ఓ పక్క వేడి ఓ పక్క చలి యెలా సంభవం ? అనే ప్రశ్న లకి జవాబులు దొరకవు .మణికర్ణ లో  రామునికి , కృష్ణునికి , విష్ణుమూర్తి మందిరాలు వున్నాయి . శిక్కుల ప్రార్ధనా స్థలమయిన ' గురుద్వారా ' వుంది . హిందువుల కన్నా శిక్కులు యెక్కువగా రావడం కనిపించింది . ఇక్కడి వేడినీటి కుండం లో స్నానం చేసుకొని గురుద్వారాలో ప్రార్ధనలు చేసుకొని , లంగరులో భోజనం చేసుకుంటున్నారు శిక్కులు . మేం కూడా మందిరాలు చూసుకొని గురుద్వారాని దర్శించుకొని లంగరులో భోజనం చేసుకొన్నాం .

మణికర్ణ హిందువులకు , సిక్కులకు కూడా పుణ్య తీర్ధం . ముందుగా ఈ ప్రదేశం హిందువులకు పుణ్యతీర్ధం యెందుకయ్యిందో తెలుసుకుందాం . 

ఈ ప్రదేశాన్ని గురించి హిందువులలో ఒక కథ ప్రచారం లో వుంది . అదేమిటంటే ఒకరోజు కైలాసవాసుడు పార్వతీ సమేతుడై ఈ ప్రదేశంలో విహరిస్తూ  వుండగా పార్వతీ దేవి కర్ణాభరణం లో వున్న మణి యెక్కడో పడిపోయిందట , యెంత వెదకినా కానరాకపోయేసరికి శివుడు కోపోద్రేకుడై తాండవ మాడసాగేడు , శివుని తాండవానికి ముల్లోకాలూ కంపించసాగేయి . దేవతలు శివుని శాంతింప జేసేందుకు ఆది శేషుని వేడుకొనగా ఆది శేషుడు పెద్దగా బుసకొట్టగా ఆ ప్రదేశం అతలాకుతలమై భూమిలోనుండి వేడి నీరు వేగంగా భూమి పైకి పొంగి వచ్చిందట , భూమిలో నుండి రకరకాలైన మణులు భూమి పైకి విరజిమ్మ బడ్డాయట , 1905 లో సంభ వించిన భూకంపం వరకు తరచుగా యిక్కడ మణులు దొరికేవట . పార్వతీ దేవి కర్ణాభరణం లోని మణి వలన ఉత్పన్న మయినది కాబట్టి ఈ వేడినీటి బుగ్గలను ' మణికర్ణ ' అని  . పక్కన ప్రవహిస్తున్న నదిని పార్వతీ నది అని పిలువసాగేరు .

శిక్కు మతంలో ప్రచారంలో వున్న కథ గురించి తెలుసుకుందాం .

1574 లో శిక్కుల మొదటి గురువయిన " నానక్ " శిష్యుడైన " మర్దాన " తో ఈ అడవులలో తిరుగుతూ యీ ప్రదేశానికి వచ్చి మధ్యాహ్న భోజనసమయం కావడంతో శిష్యుడిని భిక్ష తీసుకు రావలసినదని దగ్గరగా వున్న పల్లెకు పంపుతాడు . శిష్యుడు భిక్ష ను తీసుకొని వస్తాడు కాని వండుకొనుటకు కావలసిన నిప్పు చేయుటకు వీలులేక దిగాలుపడతాడు నానక్ అక్కడ వున్న బండను తొలగించగా వేడి నీళ్లు పైకి వురుకుతూ కనబడగా పదార్ధములను వండమని చెప్తాడు . కాని రొట్టె నీటిలో మునిగి పోతుంది . నానక్ శిష్యునకు దేవుని తలచుకొని రొట్టెను వేడి నీటిలో విడిచి పెట్టమని చెప్తాడు . శిష్యుడు నానక్ చెప్పిన విధంగా చేయగా అన్ని రొట్టెలు చక్కగా కాలి బయటికి వచ్చేయట , అప్పటి నుండి శిక్కులలో లంగరు లో భోజన పదార్ధములు దానం చేస్తే మనం పోగొట్టుకున్న వస్తువలు మనకి దొరుకుతాయనే నమ్మకం వచ్చిందట .

ఈ నీటిలో స్నానం చేస్తే చర్మరోగాలు పోతాయని అంటారు .

థాక్పో షెద్రుప్లింగ్ మోనష్ట్రీ -----

కులు బస్సు స్టాండునుంచి సుమారు 12 కిలో మీటర్ల దూరం లో వుంది . పూర్తిగా దలైలామా ని అనుసరించే బౌద్ధ ఆరామం . ఇక్కడ బౌద్ధమతానికి సంబంధించిన శిక్షణ యిస్తున్నారు . యిందులో వేలమంది టిబెట్ బౌద్ద బిక్షువులు నివాసముంటున్నారు . ఇందులో గురు శిష్యపరంపరలో విద్యాబోధన జరుగుతోంది . ఇక్కడ సుమారు వెయ్యిమంది ఒకేసారి కూర్చోగలిగే పెద్ద ప్రార్ధనా గది , పెద్ద బౌద్దవిగ్రహం వున్నాయి .

మళ్లా వారం " మనాలి " గురించి తెలుసుకుందాం అంతవరకు శలవు.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి