సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావ్

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం

దక్షిణదేశ యాత్రకు బయలుదేరిన అగస్త్యుడు 
వింధ్య పర్వతాన్ని అణిచివేసి, కొల్హాపూరులో  శ్రీమహాలక్ష్మిని సేవించుకున్నాడు. ఆమె ఆజ్ఞ  మేరకు 'స్వామిమల'ను దర్శించడానికి వెళ్ళాడు. దారిలో మతంగముని ఆశ్రమాన్ని, పంపానదిని  దర్శించి, ఆ స్థలవర్ణన, ఆ తీర్థవర్ణన చేస్తున్నాడు. తెనాలి రామకృష్ణుని లోకజ్ఞానానికి, పర్యాటనా  అనుభవానికి, వర్ణనావైదుష్యానికి ఈ ఘట్టం చక్కని  ఉదాహరణ. అగస్త్యులవారు కొనసాగిస్తున్నారు.

భూరితరాభ్రవిభ్రమమము, పుష్కరరమ్యకరంబు, దానల
క్ష్మీరుచిరంబు, సత్త్వగుణకీర్తియు, వాలిసాల సం
హార కారణమునౌ రఘుకుంజరభర్త మున్ను సం
చారమొనర్చె నీయచల సానుతలంబున నంబుజాననా!                (ఉ)

'ఓ పద్మనేత్రీ! ఈ మాల్యవంతపర్వత వైభవాన్ని విను' అంటూ తన భార్య ఐన  లోపాముద్రతో యిలా అంటున్నాడు. (అభ్రవిభ్రమము)ఆకాశంలో తిరిగే గాఢమైన  మబ్బువంటి నల్లని శరీరకాంతి కలిగిన రఘురాముడు అనే యేనుగు విహరించిన  స్థలం యిది. తామరతూడువంటి దీర్ఘమైన, నాజూకైన, తొండమువంటి చేతులు కలిగిన  రఘురాముడు అనే యేనుగు విహరించిన స్థలం యిది. దానగుణం అనే లక్ష్మిచేత  ప్రకాశించే, మదజలప్రవాహ సంపన్నమైన రఘురాముడు అనే యేనుగు విహరించిన  స్థలం యిది. వాలిని, సాలవృక్షాలను కూల్చిన రఘురాముడు అనే యేనుగు విహరించిన  స్థలం యిది. రఘురాముడు అనే యేనుగు అని పోలిక కనుక యేనుగులకు  సహజంగా  ఉండే లక్షణాలను ఆరోపించి శ్రీరాముని వర్ణన చేస్తున్నాడు రామకృష్ణుడు.

పద్మినీపత్రాతపత్రంబు శిథిలప / త్రాగ్రమై రాయంచ యాశ్రయించె
దాలు స్రవత్ఫేనజాలంబుతో ఘోణి / పంచల రొంపి గలంచియాడె
దూరోద్గమద్దావధూమ మంబుదబుద్ధి / నెమ్మి లోపొదనుండి నిక్కి చూచె 
జఠరస్థజలము నాసానాళమునఁ బీల్చి / సామజంబిరుప్రక్కఁ జల్లుకొనియె          (సీ)

సరసిపైనీరు సలసలఁ దెరలె విపిన 
సకలవీథులు నిర్మృగోచ్చరములయ్యె
మట్టమధ్యాహ్నమిది సుథామధురవాణి!
యర్హమిచ్చోఁ బథశ్రమమపనయింప                         (తే)

ఎగిరీ ఎగిరీ రెక్కలు శిథిలమైన రాయంచ తామరపుష్పం అనే గొడుగు క్రింద చేరి సేద  తీరుతున్నది. ఎండకు వగరుస్తూ దవుడలనుండి కారుతున్న నురగతో(చొంగతో)అడవిపంది  ఆ ప్రక్కన బురదను గెలికి అందులో చేరి చల్లబడుతున్నది. దూరాన ఆకాశానికి అంటుతున్న 
పొగను చూసి మేఘము అనే భ్రమతో నెమలి పొదలోనుండి నిక్కిచూస్తున్నది. సరసులోని  నీటిని ముక్కు అనే గొట్టంతో(!) పీల్చి యేనుగు ఒకటి అటూ యిటూ చల్లుకుంటున్నది, చల్లబరుచుకుంటున్నది తన శరీరాన్ని. సరసుపైన నీరు వేడెక్కి సలసలా తెరలుతున్నది. జంతువులు తిరుగక పోవడంతో అడవిదారులన్నీ నిర్జంతువులైనాయి(!) నగరాలలో, పల్లెల్లో వీథులు నిర్మానుష్యాలు ఐనట్టు! మిట్టమధ్యాహ్నసమయము అయింది. ఓ  అమృతమధురభాషిణీ! లోపాముద్రా! యిక్కడ, ఈ చల్లని స్థలం మార్గాయాసం తీర్చుకోడానికి 
అనువైన స్థలం అన్నారు అగస్త్యులవారు తన భార్యను చూస్తూ. అలా పలుకుతూ కొద్దిగా  ముందుకు సాగి తుంగభద్రానదిని చూశారు.

నటనోద్భటుఁడైన మహా 
నటునిజటాజూట మురిలినన్ దొరఁగు మరుత్ 
కటకనది యిది యనుచుఁ జని
యటఁ గనియెన్ తుంగభద్ర నఘముఖముద్రన్               (కం)

తాండవకేళీదురంధరుడైన పరమశివుని జటాజూటము ఆ తాండవకారణంగా విడిపోయి, అక్కడ ఉన్న ఆకాశగంగ యిలా పారింది సుమా అంటూ పాపములకు తాళంవేసే, పాపముల  నాశనంచేసే తుంగభద్రానదిని చూశారు అగస్త్యులవారు. ఆనందంగా యిలా కీర్తిస్తున్నాడు 
తుంగభద్రానదిని. ఆంధ్రసాహిత్యంలోని సుప్రసిద్ధపద్యాలలో ఇదొకటి.

గంగాసంగమ మిచ్చగించునె, మదిన్ గావేరి దేవేరిగా 
నంగీకారమొనర్చునే, యమునతో నానందముం బొందునే 
రంగత్తుంగతరంగహస్తముల నా రత్నాకరేంద్రుండు నీ 
యంగంబంటి సుఖించునేని, గుణభద్రా! తుంగభద్రానదీ!           (శా)

ఓ భద్రగుణముల, మంగళగుణముల తుంగభద్రానదీ! ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు  అనే చేతులతో నీ శరీరాన్ని పెనవేసుకుని సుఖపడినట్లైతే ఆ సముద్రుడు(రత్నాకరుడు,  రత్నములకు నెలవు ఐనవాడు) గంగా సంగమాన్ని యిష్టపడతాడా? కావేరిని దేవేరిగా 
అంగీకరిస్తాడా? యమునతో ఆనందిస్తాడా? లేదు! అనేక చమత్కారాలకు నిలయమైన  రసగుళిక ఈ పద్యం.

గంగానది నిలకడలేకుండా మూడులోకాల్లో తిరిగింది, శివుడి నెత్తిన కూర్చున్నది, ఆయన  ప్రియురాలిగా వ్యవహరింపబడుతుంది, కనుక ఆమె నీతో పోల్చదగింది కాదు అంటున్నాడు.  కావేరి రంగనాథుని సేవలో ఉన్నది, కావేరీభర్త అని  ఆయనకు పేరు, కనుక ఆమె కూడా 
వేరేవాడికి చెందినదే మొదలు. యిక యమున భూలోకానికి రాకముందు తన సోదరుడినే  కామించింది, భూలోకంలోకి వచ్చినతర్వాత కృష్ణుడి ప్రేయసి అయ్యింది, ఆయన చుట్టూ  తిరిగి ఆయనను సేవించింది. యివన్నీ కాక ఈ నదులన్నీ సముద్రంలో చేరేవే. గంగతో 
ప్రయాగలో కలిసినతర్వాత యమునానది చీలి, వందలాది మైళ్ళు ప్రయాణించి సముద్రంలో  కలుస్తుంది. కావేరి కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది. యివన్నీ నేరుగా ఎలాగూ సముద్రంలో  కలిసేవే దాదాపూ. తుంగభద్రానదిమాత్రం కర్ణాటకలో తుంగ, భద్ర అనే రెండు నదుల కలయికతో ఏర్పడి, తెలుగు రాష్ట్రాలలో ప్రవహించి, కృష్ణానదితో కలుస్తుంది. కృష్ణకు ఉపనదిగా పేరుగన్నది.  కనుక నేరుగా సముద్రాన్ని ఎలాగూ చేరదు. మిగిలినవన్నీ ఎలాగూ సముద్రుడిని చేరేవే నేరుగా.  అంతే కాదు. 'తుంగభద్రాపతి' అని  ఎవరూ కీర్తింపబడలేదు. తుంగభద్ర తిరిగేది అంతా యోగులూ,  సన్యాసులూ, జ్ఞానులు, మఠాలచుట్టూనే. ఏ దేవుడికీ ప్రేయసిగా, సేవకురాలిగా ఆమెకు పేరులేదు.

శృంగేరి, హంపి, మంత్రాలయం, ఆలంపూరు(జోగులాంబ) యివీ ఆమె విహారక్షేత్రాలు. కనుక నీ  సుఖాన్ని కనుక పొంది ఉంటేనా, ఆ సముద్రుడు గంగనూ, యముననూ, కావేరినీ అసలు కన్నెత్తైనా  చూసేవాడు కాదు అంటున్నాడు జ్ఞాని, విజ్ఞాని, లోకజ్ఞానీ ఐన 'రసరమ్యకవితాచమత్కారచక్రవర్తి'  తెనాలి రామకృష్ణుడు!

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు   

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి