కథ: కనువిప్పు!
రచయిత్రి: కల్పన
సమీక్షకుడు: ప్రతాప వెంకట సుబ్బారాయుడు
గోతెలుగు 60 వ సంచిక!
కథలు ఎందుకు చదువుతాం? కేవలం కాలక్షేపానికి మాత్రం కాదు. కథలు సామాజిక బాధ్యతతో, చక్కటి సందేశం ఇవ్వగలిగితే, అదీ ఆచరణీయమైనదయితే పాఠకులు సాహిత్య సంతృప్తినొందుతారు. ఆ కోవకు చెందినదే కల్పనగారి కనువిప్పు కథ.
కథ విషయానికి వస్తే నమ్రత కేన్సర్ హాస్పిటల్ లో డాక్టరయిన విశేష్ తన కొడుక్కి ఐ ఐ టీ పరీక్షలో ర్యాంక్ రాకపోతే తనకు తలవొంపులనీ, నాలుగొందల కి.మీ.దూరంలో గవర్నమెంట్ ఉద్యోగం చేసే భార్యని తన ఊళ్లోకి బదిలీ చేయించుకోవాలని, ఎమ్మెస్ కోసం విదేశాలకు వెళ్లబోతున్న కూతురుకి లోన్లు, ష్యూరిటీలు సిద్ధం చేసుకోవాలనీ, అసలు ఆమె సెలెక్టు అవుతుందో లేదో, వృద్ధాశ్రమంలో ఉన్న తండ్రికి ఒంట్లో బాగాలేదని తెలియజేసినా వెళ్లలేకపోవడం లాంటి సమస్యలతో తలమునకలవుతుంటాడు.
అయితే అదే ఆసుపత్రిలో కేన్సర్తో బాధ పడుతుంటుంది పదకొండేళ్ల చిన్న పేషెంట్ జ్యోతి. ఆమెకి తండ్రిలేడు. బ్యాంకు ఉద్యోగి అయిన తల్లి కూతురి బాధను గుండెల్లో భరిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూంటుంది.
నొప్పి భరించలేక జ్యోతి పడే బాధ. సెడెటివ్ మత్తులో ఆమెకి డాక్టర్ ఉపశమనం కలిగించడం, ఆ పిల్లను చూడడానికి ఫ్రెండ్స్ రావడం, ఆ కాసేపు బాధను మర్చిపోవడం, మళ్లీ నొప్పి తిరగబెట్టడం..డాక్టర్ సెడెషన్ ఇవ్వడానికి సిద్ధపడితే-
“అవునంకుల్ , వారం నించి చూస్తున్నా. నెప్పి ఎక్కువవ్వగానే ఇంజెక్షన్ ఇస్తున్నారు. దాంతో నేను మత్తు లోకి వెళ్లిపోతున్నా. తెలివి రాగానే కాసేపు బాగుంటోంది. మళ్ళా కాసేపటికి నెప్పి మొదలు. ఈ మధ్య నెప్పి పెరిగి పోవడంతో ఇంజెక్షన్ డోస్ పెంచేశారు. అటు చూడండి మా అమ్మ .. తన గురించి ఆలోచించకుండా నామీదే ప్రాణం పెట్టుకొని, రాత్రనకా, పగలనకా నాకు సేవలు చేస్తోంది. ఇకపోతే వీలు దొరికినపుడల్లా ఏవేవో పట్టుకొచ్చి నన్ను సంతోష పెట్టాలని చూసే నా ఫ్రెండ్స్.
వీళ్లతో గడపడానికి లేకుండా మీరలా మత్తు ఇచ్చేస్తే ఎలా? నాకు తెలుస్తోంది అంకుల్ నేనింక ఎన్నాళ్ళో బతకను ఈ నెప్పితో అని. ఈ కొద్ది రోజులూ మగతలో గడిపేస్తే తర్వాత అమ్మని చూడాలని ఉన్నా చూడలేను కదా!.. ఇంకొన్ని రోజుల్లో ఇంజెక్షన్ అవసరం లేకుండానే నిద్ర లోకి వెళ్లిపోతాను. దయచేసి ఇప్పుడు మాత్రం నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకండి ప్లీజ్. నా కళ్లని తెరిచే ఉండనివ్వండి.” వేడుకుంది బాధని పళ్లబిగువున భరిస్తూ. చలించి పోయారంతా ఆమె మాటలకి.
తల్లితో జ్యోతి- “వద్దమ్మా. నాకు నువ్వు చాలా ప్రాణం. చిన్నప్పటి నించి నన్నుఎంత ప్రేమగా పెంచావో ? అనుక్షణం నా కింద ఎన్ని సేవలు చేస్తున్నావో? ఇప్పుడు కూడా నా పొట్ట రాస్తూ, కాళ్ళు నొక్కుతూ ..నా గురించి తల్లడిల్లుతున్నావు. నేను నీకేమి చేయలేకపోతున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే నేను నీకు తల్లిగా పుట్టాలని కోరుకుంటున్నా. కనీసం చనిపోయే లోపు ఎంత వీలయితే అంత సేపు నిన్ను చూస్తూ ఉండాలని ఉందమ్మా. అందుకే ఇంజెక్షన్ వద్దంటున్నా. దయచేసి నన్ను అర్ధం చేసుకోండి."
పై పదాలు రచయిత్రి కల్పన కలం నుంచి కరుణరసాత్మకంగా జాలువారాయి. చదివిన పాఠకుల కళ్లు చెమ్మగిల్లుతాయి.
అప్పటిదాకా తన సమస్యలే పెద్దవనుకున్న డాక్టర్ విశేష్, జ్యోతి సమస్యతో పోలిస్తే తనదేమంత పెద్దది కాదనుకోవడం. చిన్న వయసులో ఏమీ అనుభవించకుండానే, తల్లిని ఒంటరిచేసి వెళ్లిపోవల్సి రావడం.. ఆమెకి గర్భ శోకాన్ని మిగల్చడం. మృత్యువు కంటె పెద్ద భయం, సమస్య ఇంకేం ఉంటుంది? అనుకోవడం.
ఇక రెండవది ఆ పిల్లకున్న మానవత్వం,కృతజ్ఞత.. తను ఎంత బాధల్లో ఉన్నా తన వాళ్ళకి ఏదో చేసి సంతోషపెట్టాలన్న తపన. తనేం చేశాడు? పాతికేళ్లు నిర్విరామంగా తన అభ్యున్నతి కోసం పాటుపడి, సమాజం లో మంచి స్థాయి కి తెచ్చిన తన తండ్రిని అమ్మ మరణించిన కొన్నాళ్లకే ఏవో సాకులతో వృద్ధాశ్రమం పాలు చేసాడు. కొన్నాళ్ల పాటు వారానికోసారి ఫోన్ చేస్తూ, రెన్నెల్ల కోసారి చూడ్డానికి వెళ్ళేవాడు. ఇప్పుడు నెలకోసారి ఫోన్ ..అంతే!నాన్నకి తనని, తన భార్యా పిల్లల్ని చూడాలని, తమతో గడపాలనీ ఎంతో ఆశ. కానీ కొడుకుగా తనేం చేస్తున్నాడు? పూర్తిగా లోకం చూడని జ్యోతి డెత్ బెడ్ మీద ఉండి తల్లికి ఎలా కృతజ్ఞత చూపించుకోగలనా అని ఆరాటపడుతోంటే తాను పాతికేళ్లపాటు తండ్రి సేవల్ని, ఆస్తుల్ని యధేచ్ఛగా అనుభవించి అవసరం తీరగానే వృద్ధాశ్రమం లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాడు. తన తప్పులు ఎదురు తిరిగి ప్రశ్నిస్తోంటే ఆరిపోతున్న “జ్యోతి” వెలుగుల్లో పశ్చాత్తాపం తో దహించుకు పోతూ తండ్రిని క్షమాపణ కోరుకుని ఇంటికి తీసుకు రావడానికి సన్నద్ధ మయ్యాడు డాక్టర్ విశేష్. అన్నది కథకు ఆర్ధ్రతతోకూడిన చక్కని ముగింపు.
డాక్టర్ ఆలోచనల్లో జ్యోతిని అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్ ఆదిత్య రచయిత్రితో పాటూ అభినందనీయుడు. నా వరకు నాకు కథ చదువరులకు కనెక్ట్ కావడానికి కారణం- మనకున్న సమస్యలు పెద్దవనుకుంటాం, కానీ ఎవరన్నా మరో పెద్ద సమస్యతో ఎదురైతే మనది చిన్న గీతయిపోతుంది. పీలికమయిపోతుంది. మళ్లీ ధైర్యంతో ముందడుగేస్తాం.
ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు http://www.gotelugu.com/issue60/1648/telugu-stories/kanuvippu/