అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

ఈ మధ్యన ఓ వేలం వెర్రి ఒకటి మొదలయింది.. అర్ధం అయిందిగా నేను వ్రాసేది దేనిగురించో.. ఎవరికైనా ఫర్నిష్ చేసిన ఎపార్టుమెంటు అద్దెకివ్వాలంటే భయం, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఎప్పుడు ఎవడికి అమ్మేస్తాడో అనే భయం. ఇక్కడ మహారాష్ట్రలో అయితే యజమానీ, అద్దెకుండేవాడూ ఓ ఎగ్రిమెంటైనా రాసుకుంటారు, ఏదో కొంత ఎమౌంటు డిపాజిట్ గా తీసికునే సౌలభ్యమైనా ఉంది. మహా అయితే ఖాళీ చేసినప్పుడు, ఏ సామానైనా అమ్మేసినా, కొంతలో కొంత నష్టం భర్తీ చేసికోవచ్చు, కానీ మన ప్రాంతాల్లో మాటెమిటీ? ఏదో మూడు నెలల అద్దె ఎడ్వాన్సు తీసికుంటారు, ఎగ్రీమెంట్లూ వగైరా ఉంటాయనుకోను.ఈమధ్యన ఓ ప్రకటనలో అత్తగారూ, కోడలూ ఆఫీసునుండి కొడుకొచ్చే లోపల, ఇంట్లో ఉండే పాతసామాన్లు ఫొటోలుతీసి, ఆ మాయదారి క్విక్కర్ లో పెట్టి, అమ్మేయడం. దీనితో అందరూ అలా చేస్తే కొత్తవస్తువులు తెచ్చేసికోవచ్చుననే ప్రలోభంలో పడ్డం.

ఈ use and throw పధ్ధతి పశ్చిమదేశాలనుండి దిగుమతి చేసికున్నదనుకుంటా. కానీ మనదేశంలో సామాన్య మానవుల ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రమే కదా. ఇప్పుడంటే, అనుకున్న మరుక్షణం ఇళ్ళల్లోకి ఏ వస్తువు కావాలంటే అది వచ్చేస్తోంది కానీ, ఇదివరకటి రోజుల్లో అలా కాదుకదా. ఇంట్లోకి ఏదైనా వస్తువు రావాలంటే, దానికో పంచవర్ష ప్రణాలిక వేసికోవాల్సొచ్చేది. ఈరోజుల్లోలాగ ఏమైనా క్రెడిట్ కార్డులూ, EMIలూనా ఏమిటీ? పోస్టాఫీసులో ఓ ఎకౌంటూ , నెలనెలా కొంత డబ్బు దాచుకుని, ఏదో మొత్తానికి అయిదేళ్ళకి తేగలిగేవారు. 80 వ దశకం వచ్చేసరికి కొన్ని కంపెనీలవాళ్ళు వాయిదా పధ్ధతి మొదలెట్టడంతో ఇంట్లోకి ఉపయోగకరంగా ఉంటుందని ఓ కుట్టుమిషనో( దానితో ఇస్త్రీ పెట్టి ఫ్రీ ), ఓ టెబుల్ ఫాన్నో, చివరకి రేడియో కూడా అలాగే కొనాల్సొచ్చేది. నాగరికత పెరిగేకొద్దీ ఇళ్ళు ఎపార్టుమెంట్లలా మారిపోయేటప్పటికి ఇంట్లోకి డైనింగు టేబిళ్ళూ, డబుల్ కాట్లూ అవసరం వచ్చాయి. అవి కూడా వాయిదా పధ్ధతిలోనే. ఇంట్లోకి ఓ వస్తువు తేవాలంటే ఇంటియజమాని ఎంత కష్టపడుంటాడో ఊహించుకోవచ్చు. పైగా ఉద్యోగం చేసేది సాధారణంగా మొగాడు మాత్రమే. అలాగని ఆడవారు చదువురానివారుకాదు, వాళ్ళూ కనీసం ఏ స్కూలుఫైనల్ దాకానో, డిగ్రీదాకానో చదువుకున్నవారే. అయినా ఇంటిపట్టున ఉండి సంసార బాధ్యతలు తీసికుని, పిల్లల్ని పెంచి విద్యావంతులుగా తయారుచేయడంలోనే , బిజీగా ఉండేవారు. దానితో ఇంటి యజమానికి వాటిగురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు.

ఎలాగోలాగ తన కుటుంబానికి ఉపయోగపడే వస్తువులు సమకూర్చడానికే నానా అవస్థలూ పడేవాడు. ఓ కొత్తవస్తువు ఇంటికి వచ్చినప్పుడు, తన భార్యా పిల్లల కళ్ళల్లో కనిపించే, సంతోషంతోనే ఈయనగారికి కడుపు నిండిపోయేది.ఒక్కో వస్తువు ఇంటికి వచ్చినప్పుడల్లా, భర్త పడ్డ అవస్థలు భార్యకి మాత్రమే తెలిసేవి. అందువలన ఆ తెచ్చిన వస్తువుతో ఒక అనుబంధం ఏర్పడిపోయేది. ఇంట్లోకి ఓ వస్తువొచ్చిందంటే, దాని బాగోగులన్నీ భార్యే చూసుకోడం. పైగా ఆ వస్తువుల మన్నిక కూడా అలాగే ఉండేది. ఈరోజుల్లోలాగ వచ్చేప్రాణం పోయే ప్రాణం కాదు. గుర్తుందా కొన్ని సంవత్సరాలక్రితం ఒక ప్రకటన వచ్చేది అదేదో "కాలిన్" అనుకుంటా, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ప్రతీరోజూ ఆ కాలిన్ తో తుడిచేటప్పటికి, ఆ వస్తువు నిత్యనూతనంగానే కనిపించేది. నా ఉద్దేశ్యం ఏమిటంటే కొత్తగా తెచ్చిన వస్తువు ఎంత జాగ్రత్తగా చూసుకునేవారో అని చెప్పడానికి. అందుకే 30, 40 ఏళ్ళైనా అప్పుడు కొన్న వస్తువులు ఓ డబుల్ కాట్టనండి, డైనింగు టేబుల్ అనండి, ఇప్పటికీ గుండ్రాయిల్లాగ ఉన్నాయి. కానీ "కొత్త ఒక వింత..పాత రోత " గా మారిపోయిన ఈరోజుల్లో వారికి ఇంట్లో ఉన్న వస్తువులతో, ఆ ఇంటి పెద్దలకుండే bonding అర్ధం అవదుగా. ప్రతీదీ అడ్డమే. ఇంట్లో ఉన్నది పాత ఫాషనైపోయింది ఇదమ్మేసో, ఎవడికో ఇచ్చేసో కొత్తది తెచ్చేయడం. పోనీ అదైనా ఉంచుకుంటారా అంటే , మళ్ళీ ఏడాది ఇంకో కొత్త మోడలొస్తుంది. దీనికి అంతనేదే ఉండదు. వీళ్ళకి చాన్సొస్తే ఇళ్ళలో ఉండే పెద్దవారినికూడా ఏ "క్విక్కర్" లోనో, "ఓలెక్స్ " లోనో అమ్మేయగల సమర్ధులు ! ఈ జాడ్యానికి ముఖ్యకారణం Easy availability- చేతినిండా డబ్బూ, డబ్బుల్లేకపోతే క్రెడిట్ కార్డులూ, ఊరినిండా మాల్సూ, పైగా ఒక్కో బ్రాండుకి విడిగా షోరూమ్ములూ, కొట్లకి వెళ్ళగానే ఊరించే డిస్కౌంట్లూ, ఇవికాకుండా ఆన్ లైన్ స్టోర్సులూ ఒకటేమిటి అడక్కండి. ఓ వస్తువు కొనడానికి ఏతావేతా ఏదైనా శ్రమ పడితేనే కదా ఆ వస్తువు విలువ తెలిసేదీ? ఉఫ్ మంటే ఇంట్లోకి కొత్తవస్తువొచ్చేస్తుంటే దానీ బతుకూ అలాగే ఉంటుంది.

ఎంతో అవసరం అయితేనేకానీ ఓ వస్తువు అమ్మకానికి పెట్టేవారు కాదు ఆరోజుల్లో..కానీ ఇప్పుడో ఇంట్లో ఉండే పాతవస్తువులు ఎంత తొందరగా వదిలించుకుందామా అనే ఆలోచన .మళ్ళీ ఏ ఇంటర్నెట్ లోనో చూస్తారు.. ఫలానా వస్తువుకి ఎంతో antique వాల్యూ ఉందని ఏ తలమాసినవాడో చెప్పడం తరవాయి, ఫేస్ బుక్కులోనో ట్విట్టర్ర్ లోనో సందేశాలూ 'ఫలానా వస్తువుందా.." అంటూ. ఎంత ఖరీదైనా కొనుక్కుని అందరికీ చూపించుకోడం.

పైగా ఈరోజుల్లో అంతా పోటీ ప్రపంచమాయే. ఏ ఇద్దరు కలుసుకున్నా నా దగ్గర లేటెస్ట్ మోడల్ ఫలానాది ఉందీ అనేవాడే. వాడిదగ్గరున్నదో అంతకంటే లేటెస్టో మనదగ్గరకొచ్చేదాకా నిద్ర పట్టదు. ఉన్నదాని వదుల్చుకోవాలంటే క్విక్కర్ ఎలాగూ ఉంది...

సర్వేజనా సుఖినోభవంతూ...
 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి