సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

పాండురంగమాహాత్మ్యము 

అగస్త్యమహర్షి దక్షిణదేశయాత్ర చేస్తున్నాడు.  జగజ్జనని 'కొల్హాపూరు'శ్రీమహాలక్ష్మి ఆజ్ఞమేరకు  స్వామిమలను సందర్శించుకున్నాడు. అక్కడి  షణ్ముఖుని దర్శించి, ఆయనను కీర్తించి, ఆయన రచించిన మహాస్కందపురాణమును ఆయన  నోటితోనే విన్నాడు. ఆ ఆనంద సంరంభంలో  కాశీ పట్టణాన్ని విడిచిపెట్టిన విషాదాన్ని  మరిచిపోయాడు.

మిన్నేడి పాటియుఁ బెన్న యున్నతియు, వి 
పాశ వాసియుఁ జంద్రభాగ చేగ 
యును, శరావతి భూతియును, వేత్రవతి చరి 
త్రము, బాహుద యుదారతయును, గృష్ణ 
వేణియగణ్యాభివృద్ధియుఁ గావేరి 
ఠీవియు గపిశలీలా విభవము,
వంజీర మంజువార్వైభవంబును, భవ 
నాశనీక్లేశ నిర్నామకృతియుఁ                                                   (సీ)

దుంగభద్ర ప్రసంగ, ముత్తుంగభద్ర 
రాజి రాజిల్లు గౌతమీయోజ, మఱియు 
వార్తకెక్కిన తీర్థప్రవర్తనములు 
స్వామీ వినిపించె వింధ్య సంస్తంభయితకు             (తే)

'సాహితీవనం' శీర్షికలో యిదివరకు మనుచరిత్రమును, ఆముక్తమాల్యదను మనం   తెలుసుకున్నాము. వాటిలోనూ, మరి వేటిలోనూ లేనివి పాండురంగమాహాత్మ్యంలో  ఉన్నవి క్షుణ్ణమైన భౌగోళికవివరాలు. యిక్కడ రాయలనాటికి ఉన్న ప్రధానమైన  నదుల, వాహినుల వివరాలను చెబుతున్నాడు రామకృష్ణుడు. మిన్నేటి గొప్పదనాన్ని, పెన్నానది ఉన్నతిని, విపాశానది ప్రాశస్త్యాన్ని, చంద్రభాగానది సత్తాను, శరావతీనది మహత్తును, వేత్రవతీనది చరిత్రను, బాహుదానది ఔదార్యాన్ని, కృష్ణవేణి పెంపును, కావేరీనదీ ఠీవిని, కపిశానది లీలావైభవాన్ని, మంజీరానది జలకళను, పేరు కూడా లేకుండా క్లేశాలను హరించే భవనాశనీనది మాహాత్మ్యాన్ని, తుంగభద్రానదీ  ప్రస్తావనను, అధికమైన శుభములను ప్రసాదించే గోదావరీనది తీరు తెన్నులను, యింకా  యితరములైన తీర్థాల వివరాలను కుమారస్వామి అగస్త్యమహర్షికి వినిపించాడు! అప్పట్లో  యిలా యిసుక దందాలు, కలప మలపలు, రియల్ ఎస్టేట్ రింగులు లేకపోవడంవలన, అంతగా అవి ఊళ్లమీదకు వచ్చేవి కావేమో బహుశా, అందుకే అన్నీ శుభప్రదాతలే అంటున్నాడు రామకృష్ణుడు!

ఆ కుంభజుతో మఱియుం 
గేకిధ్వజుడనియె 'మౌనికేసరి! వినుమిం
కే కథ వినియెదు? సకలము 
నీకెఱిఁగించితినెకా ధునీచరితంబుల్'               (కం)

మరలా తానే ' ఓ మునిసింహమా! యింకా ఏ కథ వింటావో చెప్పవయ్యా! నదీ ప్రవాహాల  చరిత్రలు అన్నీ నీకు వినిపించాను కదా' అని అగస్త్యునితో అన్నాడు కుమారస్వామి. యింకా యిలా  అన్నాడు. ఈ గంగాదిక తీర్థము 

లీఁగంగానీవు దమ సమిద్దాంబువులన్ 
దోఁగెడువారల గనగనఁ 
గ్రాఁగెడు నంగారసింధుకల్లోలములన్                 (కం)

ఈ గంగాది తీర్థాలు, అంటే గంగాసమానములైన ఈ తీర్థాలు తమ తమ జలములలో  స్నానమాడినవారిని కనకన కాగే నరకలోకపు అగ్నిమయమైన నదిలో స్నానం చేయనియ్యవు, అంటే ఈ తీర్థాలలో స్నానం చేసినవారి పాపరాశి నశించిపోతుంది. వారు నరకానికి వెళ్లరు అన్నాడు కుమారస్వామి.

వివిధ క్షేత్రచరిత్రలు 
వివిధ సుపర్వానుభావ విలసనములుఁ దీ
ర్థవిశేషశ్రవణము తఱిఁ            
జెవికిం జవియొసఁగెనే విశిష్టాచారా?

ఈ వివిధ క్షేత్ర చరిత్రలు, వివధ దేవతా సంబంధమైన కథలు, వివిధ తీర్థవిశేషములు  వినడం నీ చెవులకు రుచి కలిగించిందా మహానుభావా? అని అడిగాడు కుమారస్వామి. అప్పుడు అగస్త్యులవారు యిలా  అడిగారు. అనుడు నగస్త్యుఁడిట్లనియె హైమవతీసుతుతోడఁ దోడి స న్మునులలరంగ 'నోయనఘమూర్తి! సమస్తముఁ గ్రిందుచేసి మించిన బలువేల్పుఁ దీర్థమును క్షేత్రము నొక్కెడఁ గూడియుండెనే

 
ని నిరుపమాదృతిం దెలిపి నీవు మముం గరుణింపఁగాఁ దగున్'    (చం)
'ఓ పవిత్రమూర్తీ! మిగిలినవాటిని అన్నిటినీ త్రోసేసి, మహా వేలుపు, తీర్థము, క్షేత్రము 

ఒకే చోట కలిసి ఉన్న స్థలం ఏదైనా వుంటే అసమానమైన ఆదరంతో, ప్రేమతో మాకు చెప్పి మమ్ములను కరుణించుమయ్యా!' అన్నాడు అగస్త్యులవారు, మిగిలిన ఋషులు,  మునులు అందరికీ సంతోషం కలిగేలా. ఆ ప్రశ్నకు ఆలోచనలోపడిన కుమారస్వామికి అలా దైవము, క్షేత్రము, తీర్థము అత్యున్నతములుగా ఒకేచోట ఉన్న స్థలం ఏదీ తోచక, ముహూర్తకాలంపాటు, అంటే  దాదాపు ముప్పావుగంట (48 నిముషాలు) ఆలోచించి, యిలా అన్నాడు, యిక్కడ తెనాలి  రామకృష్ణుని చమత్కారం కనిపిస్తుంది.

ఏతత్త్రితయము నొకచో
భూతలమున మేళవించి పొగడొందుట మ
చ్చేతోగతిఁ దోపదు సము
పేతావృతి ముకురకుక్షి  నిభమును బోలెన్             (కం)

ముకురము అంటే అద్దము. సముపేత ఆవృతి అంటే మూతతో మూయబడినది. అంటే మూయబడిన  అద్దము. మూయబడిన అద్దములో పెద్ద ఏనుగు (ముకుర కుక్షిన్ యిభము) కాదు కదా చిన్ని చీమ కూడా కనిపించదు. అద్దము తెరిచి వుంటే ఎంత చిన్నదైనా, పెద్దదైనా కనిపిస్తుంది. మూసిన అద్దంలో ఏనుగులాగా గొప్పవేలుపు-గొప్పతీర్థము-గొప్పక్షేత్రము ఒకేచోట కలిసి ఉన్న స్థలం భూమి మీద ఎక్కడా కనిపించడంలేదు నాకు అన్నాడు కుమారస్వామి.

చిత్తమాశ్చర్యరసమున జొత్తిలంగఁ 
జేయునీప్రశ్నమక్షికౌక్షేయుచేత,
నిందుధరుచేత, హరుచేత నెఱుఁగవలయు  
రండు పోదాము మునులార రజతగిరికి                    (తే)

కౌక్షేయము అంటే కత్తి, అంటే ఆయుధం. అక్షి కౌక్షేయుడు కన్నును ఆయుధంగా కలవాడు.మూడవ కన్ను అనే ఆయుధాన్ని కలిగిన, చంద్రశేఖరుడైన, శివునిచేత, చిత్తమును ఆశ్చర్యరసంలో ముంచెత్తే ఈ ప్రశ్నకు సమాధాన్ని తెలుసుకోవాలి, వేరెవరూ దీనికి  సమాధానాన్ని యివ్వలేరు, వెండికొండకు వెళ్దాం పదండి అని కుమారస్వామి అందరినీ  కైలాసానికి బయల్దేరదీశాడు. 

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి